రివ్యూ: అర్జున్ రెడ్డి
రేటింగ్: 3.25/5
బ్యానర్: భద్రకాళి పిక్చర్స్
తారాగణం: దేవరకొండ విజయ్ సాయి, షాలిని పాండే, రాహుల్ రామకృష్ణ, కమల్ కామరాజు, సంజయ్ స్వరూప్, కాంచన, జియా శర్మ, ప్రియదర్శి తదితరులు
కూర్పు: శశాంక్
సంగీతం: రధన్
ఛాయాగ్రహణం: రాజు తోట
నిర్మాత: ప్రణయ్ రెడ్డి వంగా
రచన, దర్శకత్వం: సందీప్ రెడ్డి వంగా
విడుదల తేదీ: ఆగస్ట్ 25, 2017
స్టార్ ఎట్రాక్షన్స్ లేని ఒక చిన్న సినిమాకి ఎలాంటి టీజర్ కట్ చేస్తే దాని పట్ల ఆసక్తి కలుగుతుందనే దానికి దిక్సూచిగా నిలిచింది 'అర్జున్ రెడ్డి'. డైరెక్టర్ సందీప్ రెడ్డి తన టీజర్‌లో ఎలాంటి మెరుపులు, చమక్కులు చూపించలేదు. కేవలం తన హీరో పాత్ర ఎలా వుంటుంది, ఎలా మాట్లాడతాడు, ఏ విధంగా రియాక్ట్ అవుతుంటాడు అని మాత్రమే చూపించాడు. 'అర్జున్ రెడ్డి' లాంటి సినిమాకి లీడ్ క్యారెక్టర్‌తో కనక్ట్ ఏర్పడితే ఇక మిగతావన్నీ ఈజీ అయిపోతాయి. సాధారణంగా సినిమా మొదలైన కాసేపటికి ఏర్పడాల్సిన ఆ కనక్ట్ ఎప్పుడో కొన్ని నెలల క్రితమే టీజర్‌తోనే ఏర్పరచడంలో సందీప్ సక్సెస్ అయ్యాడు.
యాంగర్ మేనేజ్‌మెంట్ ఇష్యూస్ వున్న టాప్ మెడికల్ స్టూడెంట్ అర్జున్ రెడ్డి లైఫ్ ఎలా వుంటుంది, అతనేం అవుతాడనేది తెలుసుకునేందుకు ఆ కనక్ట్ ఏర్పడిన వాళ్లంతా ఎదురు చూస్తూ వచ్చారు. ఇక ట్రెయిలర్‌లో అర్జున్ రెడ్డి లవ్‌స్టోరీ ఎలా వుండబోతుంది, తను ప్రేమించే అమ్మాయి పట్ల అతని అప్రోచ్ ఏమిటి అనే హింట్ ఇచ్చి ఈ క్యారెక్టర్ పట్ల వున్న కుతూహలాన్ని ఇంకాస్త రెట్టించారు.
టీజర్, ట్రెయిలర్‌తో ఆసక్తి కలిగించడం ఒక ఎత్తు అయితే, అన్ని అంచనాలు ఏర్పరచిన తర్వాత వాటిని అందుకునేలా సినిమాని తీర్చిదిద్దడం అన్నిటికంటే మించిన పరీక్ష. ఆ పరీక్షలో దర్శకుడు ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యాడు. అర్జున్ రెడ్డి ఒక రెగ్యులర్ సినిమా కథ కాదు. ఒక వ్యక్తి జీవితంలోని అతి కీలకమైన ఒక ఫేజ్‌కి ఇచ్చిన తెర రూపం.
నూటికి ఎనభై ప్రేమకథలే రూపొందుతోన్న నేపథ్యంలో మళ్లీ ఒక ప్రేమకథని చెప్పి మెప్పించడం అందరి వల్ల అయ్యే పని కాదు. అయితే ప్రేమ అనే అంశాన్ని చాలా మంది ఒకే మాదిరిగా డీల్ చేస్తుంటారు. కానీ దానిని కాస్త రాడికల్‌గా చూపిస్తే, అన్‌కన్వెన్షనల్ అప్రోచ్‌తో లవ్‌స్టోరీకి న్యూ డైమెన్షన్ ఇస్తే ఎలా వుంటుందని సందీప్ ట్రై చేసాడు. అర్జున్ రెడ్డి సినిమా చూస్తున్నంతసేపు ఒక సినిమాలా కాకుండా, అర్జున్ రెడ్డి అనే మనిషి జీవితాన్ని తెర మీద చూస్తోన్న భావన కలుగుతుంది.
మరి ఈ కథ దర్శకుడు ఊహించి రాసుకున్నాడో లేక ఎవరినైనా చూసి స్ఫూర్తి పొందాడో తెలియదు కానీ 'అర్జున్ రెడ్డి' సగటు సినిమా హీరో క్యారెక్టర్ కాదు. అతనిలో లోపాలుంటాయి, కోపాలుంటాయి. అతను హీరోలా కనిపిస్తాడు, ఒక మామూలు మనిషిలా పతనమవుతాడు. ఎక్స్‌ట్రీమ్ ఎమోషన్స్ చూపిస్తాడు, తన ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేకపోతాడు.
అర్జున్ రెడ్డి క్యారెక్టర్‌పై ఈ రియలిస్టిక్ టేక్ ఈ చిత్రాన్ని మిగతా ప్రేమకథలకి భిన్నంగా నిలబెడుతుంది. కోపమొస్తే పచ్చిబూతులు తిట్టే అర్జున్, ప్రేమ పొంగుకొస్తే పరిసరాలని మర్చిపోతాడు, శారీరిక వాంఛ తీరక పోతే నడిరోడ్డుపై అండర్‌వేర్‌లో ఐస్ వేసేసుకుంటాడు. అలా అని అతనో బ్యాడ్ క్యారెక్టర్ కాదు. ఒక ఎక్స్‌ట్రీమ్ క్యారెక్టర్ అంతే. ఎందుకంటే డాక్టర్ అవ్వాలని కలలు కంటాడు, అందుకోసం బాగా చదువుతాడు.
తను ప్రేమించిన అమ్మాయికి కూడా చదువుని నిర్లక్ష్యం చేయవద్దని చెప్తాడు. చదువు పక్కనపెట్టి తనతో వుంటానని వచ్చేస్తూ వుంటే వద్దని వారించి బాగా చదువుకోమని ప్రోత్సహిస్తాడు. ఆడవాళ్లని ఆబ్జెక్టిఫై చేసే వాళ్లని పురుగుల్లా చూస్తాడు. శారీరికంగా, మానసికంగా పతనమవుతున్నా నైతికంగా దిగజారిపోడు. తను ప్రేమించే కెరీర్ ప్రమాదంలో పడినా విలువలకే ప్రాధాన్యమిస్తాడు.
ఒక క్యారెక్టర్‌లోని ఇన్ని భిన్న కోణాలని అధ్యయనం చేసి, దానికి తెరపై ప్రాణం పోయడం మాటలు కాదు. దర్శకుడు ఆ పాత్రలోకి ఎంతగా లీనమైపోతేనో, ఇంకెంతగా ఆ క్యారెక్టర్ తాలూకు ఎమోషన్స్‌ని అనుభవిస్తేనో తప్ప ఇది సాధ్యం కాదు. 'క్యారెక్టర్ స్టడీ'కి ఇది ఒక పాఠ్య పుస్తకంగా మిగిలిపోతుందంటే అతిశయోక్తి కాదు. అర్జున్ రెడ్డి పాత్రని రక్త మాంసాలతో ఇంత సజీవంగా తీర్చిదిద్దడం ఒక ఎత్తు అయితే, దానిలోకి పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రనే తెరపై కనిపించేలా చేయడం ఇంకా గొప్ప విషయం.
రెండు, మూడు సినిమాలకి మించి అనుభవం లేని విజయ్ సాయి 'అర్జున్ రెడ్డి'గా రూపాంతరం చెందిన విధానం, ఆ పాత్ర భావోద్వేగాలని, ఆ పాత్ర తాలూకు ఉద్ధాన పతనాలని కళ్లకి కట్టినట్టు చూపించిన వైనానికి హేట్సాఫ్ చెప్పాల్సిందే. 'పెళ్లిచూపులు'లో మనం చూసిన హీరోకి ఎలాంటి సంబంధం లేని ఇంత కాంప్లెక్స్ క్యారెక్టర్‌ని అర్థం చేసుకుని, దానిని తెర మీద జీవం పోసిన విజయ్ సాయి ఈతరం నటుల్లో ఉత్తమ శ్రేణికి చెందుతాడు.
అర్జున్ రెడ్డి లైఫ్‌లోని కొన్ని పేజీలని చదువుతున్న భావన కలిగేలా సందీప్ కథనం చక్కగా రాసుకున్నాడు. మాటలు మన స్నేహితులతో కూర్చుని మాట్లాడుతున్నట్టే వుంటాయి. ఎక్కడా సినిమాటిక్ ఎక్స్‌ప్రెషన్ వుండదు. తన గాళ్‌ఫ్రెండ్‌ని తాకరాని చోట తాకి అవమానించిన వాడిని కొట్టడానికి వెళ్లిన అర్జున్ వాడిని కొట్టేసిన తర్వాత బిగ్గరగా ఏడుస్తూ కూలబడిపోతాడు. ఆమెకి జరిగిన అవమానానికి అతడిని కొట్టడంతో అర్జున్‌కి కసి తీరదు. అది తనని ఎంతగా హర్ట్ చేసిందనేది బ్రేక్ డౌన్ అవడంతో చూపిస్తాడు. ఇంత సహజంగా ఒక సన్నివేశాన్ని తీర్చిదిద్దడం అందరి వల్ల కాదు. ఇలాంటి సహజమైన సన్నివేశాలు సినిమా అంతటా కోకొల్లలు.
ప్రేమించిన అమ్మాయిని ముద్దు పెట్టుకున్న అర్జున్‌ని చూసి ఆమె తండ్రి కొడతాడు. 'మీరు చాలా రాంగ్ యాంగిల్‌లో చూస్తున్నారు. మా ప్రేమ పవిత్రమైనది' అని నచ్చచెప్పాలని చూసినా అతను మాట వినడు. ఆ కోపంలో వస్తోన్న అర్జున్ మీదకి ఆమె టీనేజ్ తమ్ముడు కొందరిని పంపిస్తాడు. ఆ పిల్లాడిని దగ్గరకి పిలిచి 'అచ్చం మీ అక్కలాగే వున్నావ్' అంటూ ముద్దు పెట్టుకుంటాడు. 'నిన్ను కూడా ముద్దు పెట్టుకున్నానని మీ నాన్నకి చెప్పు' అని ఆ పిల్లాడికి డబ్బులిచ్చి పంపేస్తాడు. ఆ సిట్యువేషన్‌కి ఒక టీనేజ్ పిల్లాడు ఎలా రియాక్ట్ అవుతాడు, అతడిని ఒక అడల్ట్ ఏ విధంగా హ్యాండిల్ చేస్తాడనేది దర్శకుడు చూపించిన విధానానికి క్లాప్స్ కొట్టాలి.
ఈ ప్రేమకథలో కొన్ని కంప్లయింట్స్ వున్నాయి. అర్జున్ రెడ్డి ఆమెతో అంత డీప్‌గా లవ్‌లో పడిపోవడానికి కారణాలు కనిపించవు. అదే సమయంలో ఆమె ఎందుకని అతని పట్ల ఆకర్షితురాలవుతుందనే దానికి కూడా జస్టిఫికేషన్ లేదు. కాసేపు క్రితం చూసిన అమ్మాయి ఏదో తన ప్రాపర్టీ అయినట్టు అర్జున్ బిహేవ్ చేస్తాడు. అదే రోజు సాయంత్రం ఆమెని దగ్గరకి పిలిచి ఆమె ఇష్టంతో పని లేకుండా తన బుగ్గపై ముద్దు పెడతాడు. రియాక్షన్‌లెస్‌గా ఆమె వుండిపోవడం వాస్తవ విరుద్ధమనిపిస్తుంది.
అయితే ఆమెని మరొకడు ఇన్‌అప్రోప్రియేట్‌గా టచ్ చేసినపుడు అర్జున్ జెన్యూన్ రియాక్షన్ ఆమె అతడిని గాఢంగా ప్రేమించడానికి బీజం వేసినట్టు చూపించడం బాగుంది. అలాగే ద్వితీయార్ధంలో అర్జున్ క్యారెక్టర్ పెయిన్‌ని పూర్తిగా రిజిష్టర్ చేయలేదనే భావన కలుగుతుంది. ఆమెని మర్చిపోవడానికి అతను పర స్త్రీ సాంగత్యం కోరుకుంటున్నాడని చూపిస్తూ మళ్లీ వారితో అతను ఫిజికల్ ఇంటిమసీ దిశగా వెళ్లలేకపోతున్నాడని క్లారిటీ ఇవ్వడం, మోరల్ యాంగిల్‌లో క్యారెక్టర్‌ని ఎలివేట్ చేసే ప్రయత్నం అన్‌రియలిస్టిక్‌గా వుంది.
క్యారెక్టర్‌ని పరిచయం చేసినపుడు సెక్స్ అడిక్ట్ అన్నట్టుగా ఇంప్రెషన్ ఇచ్చి, ఆ తర్వాత ఈ క్లీన్ యాంగిల్ కోసం తపన పడడం అసహజమనిపిస్తుంది. అలాగే ఓ సినిమా హీరోయిన్ కూడా అర్జున్ ఫిజికల్ హెల్ప్ కావాలని అడిగితే ఊ కొట్టడం, అందుకోసం తన ఇమేజ్‌ని ఖాతరు చేయక పేపర్లకి ఎక్కడం కూడా మరీ స్ట్రెచ్ చేసిన భావన కలిగిస్తుంది. ఇక అన్నిటికీ మించి ఎండింగ్‌తో అందరూ కన్విన్స్ అవలేకపోవచ్చు.
చిన్నపాటి సమస్యలు పక్కనపెడితే సినిమాగా అర్జున్‌రెడ్డి బోల్డ్ అప్రోచ్‌తో చాలా సార్లు మైండ్ బ్లాక్ చేస్తుంది. అలాగే హీరో ఎంత ఎమోషనల్ స్ట్రెస్ అనుభవిస్తున్నా కానీ ఎంటర్‌టైన్‌మెంట్ మిస్ అవకుండా ప్రతి అయిదు నిమిషాలకో మంచి సీన్ లేదా కాన్వర్‌జేషన్‌తో అలరిస్తుంది. అర్జున్ రెడ్డి తర్వాత అతని స్నేహితుడి పాత్ర తీర్చిదిద్దిన విధానం చాలా మందికి కనక్ట్ అవుతుంది. అర్జున్ ఎంత పతనమవుతున్నా కానీ ఎప్పుడూ అతని వెన్నంటి వుండే స్నేహితుడి క్యారెక్టర్ ఈ చిత్రాన్ని కీలకమైన సమయాల్లో భుజం కాసింది. నటీనటులంతా సహజంగా అనిపించారు. సాంకేతికంగా కూడా ఏదైతే రిజిష్టర్ అవుతుందో దాని మీదే ఫోకస్ పెట్టారు. లొకేషన్స్‌తో పని లేకుండా సీన్ కంటెంట్ మీదే దృష్టి పెట్టి దానిని ఎఫెక్టివ్‌గా ప్రెజెంట్ చేసారు. నేపథ్య సంగీతం అద్భుతంగా కుదిరింది.
స్టాటిక్ కెమెరాతో ఎమోషన్స్‌ని క్యాప్చర్ చేసిన విధానం విపరీతంగా ఆకట్టుకుంటుంది. అర్జున్‌రెడ్డి మొదటిసారి తనకి నచ్చిన అమ్మాయిని చూసినపుడు ఆమెని వెంబడిస్తోన్న అతని చూపుని తెలియజేయడానికి ఆమె వెంట కెమెరా కదలదు, కనీసం పాన్ అవదు. అతని కనుపాప కదిలకపైకి జూమ్ ఇన్ అయి విషయాన్ని తెలియజెప్తుంది. అలాగే అర్జున్‌కి, తన ప్రేయసి తండ్రికీ మధ్య గొడవ జరిగి అతను ఆరు గంటల సమయం ఇచ్చి వెళ్లిపోతున్న సందర్భంలో అతడిని కామ్ చేసే ప్రయత్నంలో ఆమె పడే తపనని తెర మీదకి తెచ్చిన విధానం అబ్బురపరుస్తుంది.
నిడివి మరీ ఎక్కువ వున్న ఈ చిత్రాన్ని ఈజీగా ఒక ఇరవై, ముప్పయ్ నిమిషాల పాటు కుదించుకుని వుండొచ్చు. అన్ని వర్గాల వారికీ నచ్చే లక్షణాలు లేవు కానీ టార్గెట్ ఆడియన్స్ నుంచి ఫుల్ మార్క్స్ పడిపోతాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కి 'టూ బోల్డ్ టు డైజెస్ట్' అనిపిస్తుంది. అలాగే మాస్ మసాలా ఇష్టపడే వారికి సైతం ఇది విచిత్రంగా తోస్తుంది. ప్రధానంగా యువతని టార్గెట్ చేసిన ఈ చిత్రం వారిని మాత్రం గంగవెర్రులెత్తించి మళ్లీ మళ్లీ థియేటర్లకి తీసుకొచ్చే స్టఫ్‌తో నిండిపోయింది.
బాటమ్ లైన్: డేరింగ్ అండ్ డైనమిక్!
– గణేష్ రావూరి