మొన్నటివరకు కేవలం సిమ్ కార్డుతోనే సునామీ సృష్టించింది. ఇప్పుడు ఏకంగా 4జీ హ్యాండ్ సెట్స్ ఇచ్చేందుకు రంగం సిద్ధంచేసింది జియో. అది కూడా ఉచితంగా. నిన్న సాయంత్రం 5గంటల 30నిమిషాల నుంచి జియో 4జీ హ్యాండ్ సెట్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. దీంతో ఎయిర్ టెల్, ఐడియా లాంటి కంపెనీల గుండెలు గుభేల్ మంటున్నాయి.
బుకింగ్ ప్రారంభమైన 30నిమిషాల వరకు సైట్ జామ్ అయిందంటే దేశవ్యాప్తంగా ఈ ఉచిత హ్యాండ్ సెట్స్ కోసం జనాలు ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. కేవలం 500రూపాయలు చెల్లించి ప్రీ-బుకింగ్ ద్వారా మన హ్యాండ్ సెట్ ను బుక్ చేసుకోవచ్చు.
బుకింగ్ ఓకే అయిన తర్వాత మనకు దగ్గరలో ఉన్న రిలయన్స్ స్టోర్ లోకి స్టాక్ వచ్చినప్పుడు మనకు సమాచారం అందుకుంది. అప్పుడు మిగతా వెయ్యి రూపాయలు చెల్లించి ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు. మూడేళ్ల తర్వాత కట్టిన 1500 తిరిగి మనకే వచ్చేస్తాయనే విషయం తెలిసిందే.
ఏడాదిలో కోటి హ్యాండ్ సెట్స్ అమ్మాలనేది జియో టార్గెట్. ప్రస్తుతం కనిపిస్తున్న డిమాండ్ చూస్తుంటే 2కోట్ల హ్యాండ్ సెట్స్ అమ్ముడుపోయినాను ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు నిపుణులు. అత్యాధునిక 4జీ ఎల్టీఈ టెక్నాలజీతో వస్తున్న ఈ మొబైల్ ను చిన్న కేబుల్ ద్వారా టీవీకి కనెక్ట్ చేసి అపరిమితమంగా వీడియోలు, సినిమాలు, ఛానెల్స్ చూసుకోవచ్చు.
వీటితో పాటు 153రూపాయల నెలవారీ రీచార్జ్ తో అపరిమిత వాయిస్ కాల్స్, అపరిమిత డేటా, నెలకు 300 ఎమ్ఎమ్మెస్ లు, జియో యాప్స్ సౌకర్యం పొందవచ్చు. అంతేకాకుండా.. 18 ప్రాంతీయ భాషల్లో ఈ 4జీ ఫోన్ ను వినియోగించుకోవచ్చు.
జియో 4జీ హ్యాండ్ సెట్లకు వచ్చే ఆదరణను దృష్టిలో పెట్టుకొని మరిన్ని ఆకర్షణీయ పథకాల్ని ప్రవేశపెట్టాలని ఎయిర్ టెల్, ఐడియా నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటికే కొన్ని ఎట్రాక్టివ్స్ ప్లాన్స్ సిద్ధంచేశాయి. త్వరలోనే వాటిని అమలు చేయబోతున్నాయి.
ముఖ్యమైన అంశం ఏంటంటే.. ఇకపై వినియోగదారుడ్ని ప్రీ-పెయిడ్, పోస్ట్ పెయిడ్ విభాగాల కింద విడదీసి డిస్కౌంట్లు ఇచ్చే పద్ధతికి దాదాపు అన్ని కంపెనీలు స్వస్తి పలకబోతున్నాయి. ఈ దిశగా వోడాఫోన్ ఇప్పటికే పలు పథకాలు ప్రవేశపెట్టగా.. మిగతా కంపెనీలు కూడా అదే బాటలో ఉన్నాయి.