రివ్యూ: గాలిపటం
రేటింగ్: 2.75/5
బ్యానర్: సంపత్ నంది టీమ్ వర్క్స్, లాస్ ఏంజెల్స్ టాకీస్
తారాగణం: ఆది, ఎరికా ఫెర్నాండెజ్, క్రిస్టీనా అఖీవా, రాహుల్ రవీంద్రన్, భరత్ రెడ్డి, గాయత్రి భార్గవి, తదితరులు
సంగీతం: భీమ్స్
కూర్పు: రాంబాబు
ఛాయాగ్రహణం: కె. బుజ్జి
కథ, కథనం, మాటలు: సంపత్ నంది
నిర్మాతలు: సంపత్ నంది, కిరణ్ ముప్పవరపు, విజయ్‌కుమార్ వట్టికూటి
దర్శకత్వం: నవీన్ గాంధీ
విడుదల తేదీ: ఆగస్ట్ 8, 2014
‘రచ్చ’ తర్వాత పవన్‌కళ్యాణ్‌తో ‘గబ్బర్‌సింగ్ 2’ చేయడం కోసం వెయిట్ చేస్తోన్న సంపత్ నంది ఈ గ్యాప్‌లో రాసుకున్న కథతో ‘గాలిపటం’ తెర మీదికొచ్చింది. నేటి తరం యువత మనోభావాలు, వారి ప్రేమలు, పెళ్లిళ్లు, మానవ సంబంధాలకి వారిచ్చే విలువల నేపథ్యంలో అనేక ‘యూత్’ సినిమాలు తెరకెక్కుతున్నాయీమధ్య. గాలిపటం కూడా ఆ బాపతు సినిమానే.
కథేంటి?
కార్తీ (ఆది), స్వాతి (ఎరికా) పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకుని తమ ఆఫీస్‌లో బెస్ట్ కపుల్‌గా అవార్డు కూడా అందుకుంటారు. ప్రపంచానికి చాలా అన్యోన్యంగా కనిపించే వారిద్దరూ నాలుగ్గోడల మధ్య గొడవ పడుతూనే ఉంటారు. ఇలా గొడవ పడుతూ జీవితాంతం కలిసుండే కంటే… పెళ్లికి ముందు తాము ప్రేమించిన వారితో జీవితం గడపడం మంచిదని నిర్ణయించుకుని విడిపోదామని అనుకుంటారు. కార్తి ప్రేమించిన పరిణీతి (క్రిస్టీనా), స్వాతిని ప్రేమించిన ఆరవ్ (రాహుల్) ఇంకా వీరి జ్ఞాపకాలతోనే బ్రతుకుతుంటారు. విడిపోయిన ఈ భార్యాభర్తలు తిరిగి తాము ప్రేమించిన వారిని కలుసుకుంటారా లేక ఇలాగే కలిసి బతకాలని నిర్ణయించుకుంటారా?
కళాకారుల పనితీరు:
ఆది ఇంతకుముందు లవర్‌బాయ్‌గా కనిపించినా మాస్‌కి నచ్చే యాక్షన్ క్యారెక్టర్లే ఎక్కువ చేసాడు. అయితే ఈ సినిమాలో మాత్రం పూర్తిగా సాఫ్ట్‌గా ఉండే నేటితరం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ క్యారెక్టర్ చేసాడు. ఏజ్‌కి తగ్గ క్యారెక్టర్ కావడం, లార్జర్ దేన్ లైఫ్ లక్షణాలు లేకపోవడంతో ఆది ఎలాంటి కష్టం లేకుండా హ్యాపీగా చేసుకుంటూ పోయాడు. రాహుల్ ఇంకా ‘అందాల రాక్షసి’ హ్యాంగోవర్‌లోనే ఉన్నాడో, లేక అతడిని అదే చేయమని అడిగారో కానీ అచ్చంగా అలాగే నటించాడు. ఎరికా ఫెర్నాండెజ్, క్రిస్టీనా ఇద్దరూ ఫర్వాలేదు. కొత్తవాళ్లయినా కానీ ఓకే అనిపించారు. వారి క్యారెక్టరైజేషన్లు బాగుండడం, వారికి రాసిన డైలాగులు బాగుండడం, వారికి చెప్పించిన డబ్బింగ్ బాగా కుదరడం ఇద్దరికీ కలిసొచ్చింది. భరత్ రెడ్డి ఓకే. భార్గవి ఓ సీన్‌లో కాస్త ‘ఓవర్’గా అనిపించే డైలాగుల్ని బెరుకు లేకుండా చెప్పేసింది. సప్తగిరితో పాటు జబర్దస్త్ షోకి చెందిన కొందరు కామెడీ నటులు అడపాదడపా నవ్వించారు.
సాంకేతిక వర్గం పనితీరు:
సంపత్ నంది రాసిన కథ చాలా బోల్డ్‌గా ఉంది. అతను రాసిన సంభాషణల్లో కూడా అదే బోల్డ్‌నెస్ కనిపించింది. అయితే చాలా సందర్భాల్లో సంభాషణల్లో వల్గారిటీ అవధులు దాటింది. భీమ్స్ అందించిన సంగీతం బాగుంది. పాటలు తొలిసారిగా సినిమాలోనే వింటున్నా కానీ ఆకట్టుకునేలానే ఉన్నాయి. ‘ధూమపానం’ పాట మాస్‌ని ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ కూడా ఒక చిన్న సినిమా స్థాయికి చెప్పుకోతగ్గట్టే ఉంది. ద్వితీయార్థంలో ఎడిటింగ్ అస్తవ్యస్తంగా ఉంది. కొన్ని సీన్లు అసలు సంబంధం లేకుండా వచ్చి పోతుంటాయి. నిర్మాతలు కాస్త ధైర్యంగానే ఇలాంటి పాయింట్‌ని యాక్సెప్ట్ చేసి ఇన్వెస్ట్ చేసారని చెప్పాలి. రచన మొత్తం సంపత్ నంది హ్యాండిల్ చేయడంతో దర్శకుడు నవీన్ గాంధీ పని సులువైపోయింది. అయితే ద్వితీయార్థంలో ఎమోషన్స్‌ని సరిగా డీల్ చేయలేకపోయాడు. సీరియస్ సీన్లు జరుగుతున్నప్పుడు ఆడియన్స్ ఎమోషనల్‌గా కనెక్ట్ కాలేక నిట్టూర్పులు విడిచినా, నవ్వినా కానీ డైరెక్టర్ ఫెయిలయినట్టే.
విశ్లేషణ:
‘రచ్చ’తో కమర్షియల్ డైరెక్టర్ అయిపోయిన సంపత్ నంది… ‘గబ్బర్‌సింగ్ 2’ డైరెక్ట్ చేస్తాడనే సరికి అతని తొలి సినిమా ఎవరికీ అంతగా గుర్తు రావడం లేదు కానీ.. నిజానికి సంపత్ నంది కూడా మొదటి సినిమాలో ‘మారుతి బ్రాండ్’ కంటెంట్‌నే నమ్ముకున్నాడు. మారుతి కంటే ముందే ‘ఏమైందీ ఈవేళ’ తీసిన సంపత్ అందులోనే అమీర్‌పేట హాస్టల్ అమ్మాయిల లైఫ్ స్టయిల్‌ని దారుణంగా చూపించి యువతని ఆకట్టుకున్నాడు. అయితే రచ్చతో అతను ఆ రూటు విడిచి ఇటొచ్చేసాడు కానీ ఈ సినిమా చూస్తే.. సంపత్ కనుక మరికొన్ని సినిమాలు అలాంటివే తీసి ఉంటే మారుతికి గట్టి పోటీ ఇచ్చేవాడనిపిస్తుంది. మోడ్రన్ కల్చర్, నేటి యంగ్‌స్టర్స్ లైఫ్‌స్టయిల్‌ని ఈ చిత్రంలో ఏమాత్రం జంకు లేకుండా తెరకెక్కించారు.
అయితే ఎంత ‘అడల్ట్ కామెడీ’ అయినా ‘ఏ రేటెడ్’ రొమాంటిక్ కామెడీ అయినా కానీ వాటికీ కొన్ని హద్దులుంటాయి. కొన్ని సందర్భాల్లో వాటిని దాటేసి మరీ ఓవర్‌గా చూపించారు. అబ్బాయిల్ని పిలిపించుకుని ఆంటీలు ఎంజాయ్ చేస్తారనే కాన్సెప్ట్‌ని డీటెయిల్డ్‌గా చూపించడం, దాని గురించి డిస్కస్ చేయడం… కొడుకులు తమని వదిలి వెళ్లిపోతే నిద్ర పట్టక మొత్తం బామ్మలంతా కలిసి మందు కొట్టడం… టూమచ్ అనిపిస్తాయి. అడల్ట్ జోకులతోనే ప్రథమార్థం సరదాగా సాగిపోతుంది. అయితే ద్వితీయార్థం పూర్తిగా సందేశాల వైపు వెళుతుంది. అంతవరకు మెయింటైన్ చేసిన పేస్ పడిపోయి అనర్గళమైన, అనంతమైన ఉపన్యాసంలా మారిపోతుంది. తల్లుల్ని వదిలేసి కాసుల వేటలో పడిపోయే కొడుకులకి, భార్యల్ని ఇంట్లో పడేసి వేరే వాళ్లతో జల్సాలు చేసే భర్తలకి, తల్లిదండ్రుల కోసం ప్రేమలు త్యాగం చేసేసి సర్దుకుపోయే పిల్లలకి, పిల్లల ప్రేమల్ని అర్థం చేసుకోకుండా వారికి నచ్చిన వారినిచ్చి పెళ్లి చేసేసే తల్లిదండ్రులకీ… అబ్బో.. ఒకటని కాదు… క్లాసుల మీద క్లాసులు.
సాధారణంగా ఇలాంటి సినిమాల్లో నీతి బోధల్ని చివరి రీల్స్‌కి పరిమితం చేస్తుంటారు. కానీ ఈ సినిమాలో ద్వితీయార్థం పూర్తిగా దానికే కేటాయించారు. ఈ సందేశాలని ఓపిగ్గా రిసీవ్ చేసుకోవడం కాస్త కష్టమే. కాకపోతే అనుకున్న పాయింట్‌ని జంకు లేకుండా తెరకెక్కించడం, ప్రథమార్థంలో వినోదాన్ని పంచడం, లీడ్ యాక్టర్లు బాగా సపోర్ట్ చేయడం, పాటలు ఫర్వాలేదనిపించడం ఈ చిత్రానికి సంబంధించి ప్లస్ పాయింట్స్. కమర్షియల్‌గా పాస్ అయిపోవడానికి అవకాశాలున్నాయి కానీ చూసిన వారందరితో పాస్ మార్కులు వేయించుకునే లక్షణాలైతే పూర్తిగా లేవు. ద్వితీయార్థంపై శ్రద్ధ తీసుకుని ఉంటే, అశ్లీలత పాళ్లు తగ్గించుకుని ఉంటే బెటర్ సినిమా అయి ఉండేది.
బోటమ్ లైన్: గాలిపటం దారం సగంలో తెగిపోయింది!
– జి.కె.