cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: ప్యార్‌ మే పడిపోయానే

 సినిమా రివ్యూ: ప్యార్‌ మే పడిపోయానే

రివ్యూ: ప్యార్‌ మే పడిపోయానే...

రివ్యూ: ప్యార్‌ మే పడిపోయానే...

రేటింగ్‌: 2.5/5

బ్యానర్‌: శ్రీ సత్య సాయి ఆర్ట్స్‌

తారాగణం: ఆది, శాన్వి, కాశీ విశ్వనాథ్‌, తాగుబోతు రమేష్‌, సప్తగిరి, వెన్నెల కిషోర్‌ తదితరులు

సంగీతం: అనూప్‌ రూబెన్స్‌

కూర్పు: కృష్ణారెడ్డి

ఛాయాగ్రహణం: సురేందర్‌ రెడ్డి

నిర్మాత: కె.కె. రాధా మోహన్‌

రచన, దర్శకత్వం: రవి చావలి

విడుదల తేదీ: మే 10, 2014

దగ్గరగా దూరంగా, శ్రీమన్నారాయణ తదితర చిత్రాలతో నిరాశ పరిచిన రవి చావలి ఈసారి ‘లవ్‌లీ’ జంటతో రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ తెరకెక్కించాడు. ఆకర్షణీయమైన టైటిల్‌తో పాటు విపరీతంగా చేస్తోన్న పబ్లిసిటీ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల దృష్టిలో పడేట్టు చేసింది. మరి ఇక్కడ్నుంచి బాక్సాఫీస్‌ జర్నీని సేఫ్‌గా చేయగల కెపాసిటీ దీనికుందా?

కథేంటి?

కాలేజ్‌లోనే మ్యూజిక్‌ ట్రూప్‌ నడుపుతోన్న చంద్ర (ఆది) తొలి చూపులోనే యుక్తని (శాన్వి) ప్రేమిస్తాడు. తన ట్రూప్‌లో ఆమె సింగర్‌గా చేరిన తర్వాత ఒక ఆల్బమ్‌ చేయడానికి చంద్ర సంకల్పిస్తాడు. ఈ క్రమంలో యుక్త కూడా చంద్రని ప్రేమిస్తుంది. అయితే ఓ రోజు చంద్రకి ఓ నిజం తెలుస్తుంది. తన కారణంగా యుక్త దాచుకున్న తన తల్లి జ్ఞాపకాన్ని పోగొట్టుకుందని చంద్రకి అర్థమవుతుంది. అది తనవల్లే జరిగిందని తెలిస్తే ఆమె తనని శాశ్వతంగా క్షమించదని భయపడి దానిని కప్పి పుచ్చేందుకు చాలా వేషాలు వేస్తాడు. అయినప్పటికీ యుక్తకి చంద్ర గురించిన నిజం తెలిసిపోతుంది. తర్వాతేం జరుగుతుంది?  

కళాకారుల పనితీరు!

ఆది తనకి ఆల్రెడీ అలవాటైన క్యారెక్టర్‌లో ఈజీగా నటించాడు. ఒక సీన్‌లో తండ్రిని ఇమిటేట్‌ చేసి కామెడీ చేయాలని చూసాడు. అయితే కామెడీ సీన్స్‌లో, కాస్త ఎమోషనల్‌గా కనిపించాల్సిన సందర్భాల్లో ఆది ఇంకా మెరుగు పడాలి. సిక్స్‌ ప్యాక్‌ కోసం చేస్తున్న ప్రయత్నం అతని ఫేస్‌పై ఇప్పటికే ఎఫెక్ట్‌ చూపిస్తోంది. తనకున్న ఇమేజ్‌కి ఇలాంటివన్నీ అవసరం లేదేమో అతనోసారి ఎనలైజ్‌ చేసుకోవాలి.

శాన్వి ఫర్వాలేదనిపించింది. సెకండ్‌ హాఫ్‌లో తన క్యారెక్టర్‌ ఎమోషనల్‌గా మారుతుంది. ఆ సీన్స్‌లో ఆమె ఓకే అనిపించింది. సాంగ్స్‌లో గ్లామరస్‌గా కనిపించింది. వెన్నెల కిషోర్‌ ‘గే’ క్యారెక్టర్‌లో ఇరిటేట్‌ చేసాడు. తాగుబోతు రమేష్‌ మళ్లీ తాగుబోతు క్యారెక్టర్‌లోనే రొటీన్‌ అనిపించాడు. సప్తగిరి మాత్రం కనిపించిన కాసేపు మెప్పించాడు.

సాంకేతిక వర్గం పనితీరు:

సంగీత ప్రధాన చిత్రం కనుక పాటలు అవసరానికి మించి ఉన్నాయి. అయితే వాటిలో ఒకటి రెండు మినహా మిగతావి వినసొంపుగా లేవు. ‘ఐ లవ్యూ’ సాంగ్‌, టైటిల్‌ సాంగ్‌ చిత్రీకరణ బాగుంది. నేపథ్య సంగీతం ఎమోషనల్‌ సీన్స్‌లో ఆకట్టుకుంటుంది. చిన్న సినిమా స్టాండర్డ్స్‌కి సినిమాటోగ్రఫీ బాగుందనే చెప్పాలి. నిర్మాత రాధా మోహన్‌ ఈ చిత్రానికి ఖర్చు బాగానే పెట్టారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

రవి చావలి ఒక ఎంటర్‌టైనింగ్‌ లవ్‌స్టోరీ తీసే ప్రయత్నం చేసాడు. అయితే అటు రొమాన్స్‌ని, ఇటు ఎంటర్‌టైన్‌మెంట్‌ని దేనినీ పూర్తి స్థాయిలో పండిరచలేకపోయాడు. ప్రేమకథా చిత్రంలో హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ వర్కవుట్‌ అవడం కీలకం. ఇందులో అది పూర్తిగా లోపించింది. అలాగే కామెడీ కోసం అక్కడక్కడా కొందరు నటుల చేత చిన్న చిన్న పాత్రలు చేయించడం కంటే... ప్రతి సీన్‌లోను వీలయినంత కామెడీ పెట్టడానికి ట్రై చేసి ఉండాల్సింది. మాస్‌ సినిమాలు, కామెడీ చిత్రాల కంటే ఇప్పుడు లవ్‌స్టోరీస్‌తో మెప్పించడమే కాస్త కష్టమైన విషయం. రొటీన్‌ అనిపించకుండా కొత్తగా అనిపిస్తేనే ఇలాంటి సినిమాలు ఆదరణ పొందుతున్నాయి. కానీ రవి చావలి మాత్రం స్టార్ట్‌ టు ఎండ్‌ రొటీన్‌గానే తీసుకుంటూ పోయాడు.

హైలైట్స్‌:

- టైటిల్‌ సాంగ్‌

- కొన్ని కామెడీ సీన్స్‌

డ్రాబ్యాక్స్‌:

- కొత్తదనం లేని కథనం

- విసిగించే ప్రథమార్థం

విశ్లేషణ:

గత కొన్నేళ్లలో హిట్‌ అయిన లవ్‌స్టోరీస్‌ చాలా తక్కువ. మిగతా సినిమాల మాట ఎలా ఉన్నా కానీ రొమాంటిక్‌ సినిమాలకి వచ్చేసరికి ఎంతో కొంత ఎమోషనల్‌ ఎటాచ్‌మెంట్‌ ఏర్పడేట్టు చేయడం ఇంపార్టెంట్‌. లీడ్‌ పెయిర్‌ లవ్‌ సక్సెస్‌ కావాలని, వారికి ఎదురవుతున్న అవరోధాలు తొలగిపోవాలని అనిపించేలా.. వారితో పాటు ట్రావెల్‌ చేసేలా, వారి లవ్‌ సక్సెస్‌ అయితే ఆనందించేలా కథని నడిపించాలి. ప్రేమకథా చిత్రాల్లో ఉండాల్సిన ఫీల్‌ వర్కవుట్‌ చేయడం అందరి దర్శకుల వల్ల కాదు. వాటిని తీయడానికి కొందరు స్పెషలిస్టులున్నారు. ఒక స్టాండర్డ్‌ సెట్‌ అయిపోయిన తర్వాత దానికి ఏమాత్రం తగ్గని ప్రేమకథ తీయగలిగితేనే లవ్‌ స్టోరీస్‌ జోలికి వెళ్లడం ఉత్తమం.

రవి చావలి తన కథని, తన పాత్రల్ని చాలా తేలికగా తీసుకున్నాడు. ఇద్దరు ప్రేమలో పడడానికి బలమైన కారణాలేమీ చూపించలేదు. కనీసం వారిద్దరి మధ్య రొమాంటిక్‌ మూమెంట్స్‌తో టచ్‌ చేయడానికి ట్రై చేయలేదు. జస్ట్‌ ఒక సిల్లీ కారణమొకటి చూపించి దానినే కాన్‌ఫ్లిక్ట్‌ అనేసుకోమన్నాడు. ఆ కారణంతో ఈ ప్రేమకథ రక్తి కట్టించడం తన వల్ల కాలేదు. మధ్యమధ్యలో కొన్ని కామెడీ సీన్లు పెట్టి అలరించే ప్రయత్నమైతే జరిగింది కానీ అవేమీ కడుపుబ్బ నవ్వించలేదు. పతాక సన్నివేశాలని మరీ ఇరవై, ముప్పయ్యేళ్ల నాటి దర్శకుల మాదిరిగా తీర్చి దిద్దాడు.

ఏం జరుగుతుందనేది ముందే తెలిసినప్పుడు దానిని వీలయినంత ఆకర్షణీయంగా తీయడమే దర్శకుడికి సవాల్‌. దానికి రవి చావలి అసలు స్వీకరించలేదు సరి కదా... తోచినట్టుగా ఆ సీన్లన్నీ చుట్టి పారేసాడు. ప్రేమికులిద్దరూ కలిసిపోయారనే తృప్తి కంటే... ఇప్పటికైనా కలిసారులే అనే నిట్టూర్పులే డామినేట్‌ చేసేట్టుగా ఈ చిత్రం తెరకెక్కింది. ప్రథమార్థంతో పోలిస్తే ద్వితీయార్థం బెటర్‌ అనిపిస్తుంది. కొన్ని పాటలు, సన్నివేశాలు ఈ చిత్రం పూర్తిగా నిరాశ పరచకుండా అడ్డు పడ్డాయి. బేసిక్‌గా లవ్‌స్టోరీ కనుక హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాలకి స్కోప్‌ పెంచి... వారిద్దరూ విడిపోలేనంతగా దగ్గరయ్యాక కాన్‌ఫ్లిక్ట్‌ పెట్టి ఉంటే రక్తి కట్టేది. ఎంచుకున్న కథలో విషయమున్నా కానీ కథనం పరంగా దర్శకుడు చాలా పొరపాట్లు చేయడంతో ఈ చిత్రం యావరేజ్‌ మార్కుకి దిగువే ఉండిపోయింది.

బోటమ్‌ లైన్‌:

పడిపోయి’... మళ్లీ ‘లేవలేదు’!

- జి.కె.

హీరోలు దేవుళ్లా ఏందీ?

జగన్: దూకుడే.. ముందుచూపు ఏదీ?!