పవన్‌ కల్యాణ్‌ షోడౌన్‌!

అయిపోయింది. సీమాంధ్ర ఎన్నికల జాతర ముగిసిపోయింది. జాతర సందర్భంగా రంగం మీదికి వచ్చిన పులివేషగాళ్లు.. ఇక వేషం తొలగించేసి.. ఎంచక్కా.. మొహం కడుక్కుని తమ రెగ్యులర్‌ కార్యకలాపాల్లో నిమగ్నం అయిపోయే రోజు వచ్చింది. ‘పవన్‌కల్యాణ్‌…

అయిపోయింది. సీమాంధ్ర ఎన్నికల జాతర ముగిసిపోయింది. జాతర సందర్భంగా రంగం మీదికి వచ్చిన పులివేషగాళ్లు.. ఇక వేషం తొలగించేసి.. ఎంచక్కా.. మొహం కడుక్కుని తమ రెగ్యులర్‌ కార్యకలాపాల్లో నిమగ్నం అయిపోయే రోజు వచ్చింది. ‘పవన్‌కల్యాణ్‌ జనసేన’ అనే టైటిల్‌ మరియు ‘అపరిపక్వ రాజకీయ ప్రస్థానం’ అనే ట్యాగ్‌లైన్‌తో ఇటీవల విడుదల అయిన సినిమా నాలుగు వారాల కలెక్షన్లతో ముగిసింది. 

ప్రచారం ముగిసిన నాటినుంచి, పోలింగ్‌ ముగిసిన తర్వాత.. కూడా క్రియాశీలంగా రాజకీయాల్లో ఉన్న ప్రతి నాయకుడు కూడా ఏదో ఒక రకంగా ప్రజల మధ్యలోనే గడుపుతూ ఉన్నారు. అయితే ఒక్క పవన్‌ కల్యాణ్‌ మాత్రం.. రంగస్థలం మీదినుంచి నిష్క్రమించిన పాత్ర లాగా.. ప్రచార పర్వం ముగిసిన గడియనుంచి మరెక్కడా కనిపించడం లేదు. వినిపించడం లేదు. 

ప్రజలు- పార్టీ- వారి సమస్యలు- తనలోని ఆవేశం- ఆ ఆవేశంలోనే పోరాటం.. ప్రజల తరఫున బాధ్యత… ప్రజలకు ఎప్పటికీ తాను ఉన్నాను.. అనే మాటలు అన్నీ పడికట్టు పదాలు అని తేలిపోబోతున్నాయి. ఈ ఎన్నికల వరకు ఒక ప్యాకేజీటూర్‌లాగా.. భాజపా- తెదేపాలకు అనుకూలంగా ప్రచారపర్వంలోకి అడుగుపెట్టిన పవన్‌కల్యాణ్‌.. టూర్‌ ముగియగానే.. తిరిగి సినీ డోర్‌ వద్దకు చేరుకున్నారు. ఆయనేదో ప్రజాజీవితంలో ఉండి .. రెండు రాష్ట్రాల ప్రజల జీవితాల్ని ఉద్ధరిస్తాడని నమ్మినవారు ఇప్పుడే ‘బేర్‌’ మంటున్నారు. 

‘ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం’అన్నట్లు, పవన్‌ కల్యాణ్‌కు రాజకీయాలతో సంబంధం లేదు. తల- మొండెము రెండూ లేని పార్టీ ఒక దానిని ఆయన స్థాపించారు. అది ఇంకా పుట్టని శిశువు. అయినా  పవన్‌కల్యాణ్‌ ముందు నామకరణం చేసేశారు. అలా వచ్చిపడింది ‘జనసేన’.

ఇలాంటి పార్టీ ముద్రతో పవన్‌ కల్యాణ్‌ తనకు సంబంధంలేని రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి.. ఎవరికో (చంద్రబాబు-మోడీలకు) లబ్ధి చేకూర్చడం కోసం.. మరెవ్వరినో (కేసీఆర్‌-జగన్‌లను) భయంకరంగా తిట్టిపోస్తూ.. తనను కూడా వారితో తిట్టించుకుంటూ.. కు నిమిత్తం లేని వ్యక్తులందరినీ విమర్శించి.. వారందరితోనూ తాను కూడా తిట్టించుకుని.. అలా ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే ఈ ప్రస్థానాన్ని అర్థంతరంగా ముగించేశారు. 

సీమాంధ్రలో ఎన్నికల ప్రచారం ముగియడంతోనే పవన్‌కల్యాణ్‌ ప్రస్థానం ముగిసిందా అనే చర్చ చాలా మందిలో నడుస్తోంది. ‘ఈ భారం దించేసుకున్నాన్రా బాబూ’ అన్నట్లుగా చంద్రబాబుతో విందుభేటీలో పవన్‌కల్యాణ్‌.. జనసేన నాయకుడిగా తన గడ్డం గెటప్‌ను క్లీన్‌గా షేవ్‌ చేసుకుని కనిపించడంతో ఆ సంకేతం కూడా స్పష్టంగానే ఇచ్చారు. 
రాజకీయ రంగస్థలం మీదకు ఆయన పాత్ర వచ్చింది వెళ్లింది.. మళ్లీ ఆ పాత్ర వస్తుందనే గ్యారంటీ లేదు. ఆ పాత్ర కాల్షీట్లు అక్కడితో అయిపోయాయి. 

ఈ నాటకం గూర్చి ముందే చెప్పిన గ్రేటాంధ్ర

పవన్‌కల్యాణ్‌ పార్టీ పెట్టబోతున్నాడంటూ.. చాలా నెలల కిందట గ్రేట్‌ఆంధ్ర వారపత్రిక ఒక బ్యానర్‌ కథనాన్ని ప్రచురించింది. కొత్త పార్టీ పుట్టే అవకాశం ఉన్నదని.. ఈనాడు అధినేత రామోజీరావుతో – పవన్‌కల్యాణ్‌, గంటా శ్రీనివాసరావులు రెండు దఫాల భేటీలు నిర్వహించారని, పార్టీ పెట్టి అయినా.. పెట్టకుండా అయినా… తెలుగుదేశానికి అనుకూలంగా వ్యవహరించాలన్నది పెద్దదిక్కుగా రామోజీరావు నడిపిన రాయబారం అని, అలా చంద్రబాబునాయుడు స్వయంగా జోక్యం చేసుకోకుండానే.. ఆయనకు అనుకూలంగా ఓ సినీ రంగ సెలబ్రిటీని, ప్రముఖ కుల సెలబ్రిటీని మచ్చిక జేసుకుని… తమ కు అనుకూలంగా పనిచేయించుకునే వ్యవహారానికి ఒక ఒప్పందం కుదరిందని- అప్పటి  ఆ కథనం సారాంశం. అప్పట్లో గబ్బర్‌సింగ్‌ విజయాన్ని అనుభూతిస్తూ.. పవన్‌కల్యాణ్‌  నగరంలోని ఓ ఏడునక్షత్రాల హోటల్లో బసచేస్తూ.. జీవితపు సరికొత్త మధురిమలను ఆస్వాదించే పనిలో బిజీగా ఉన్నారు. ఆయన ఇలాంటి యావత్తు ప్రచారాలను ఏమాత్రం పట్టించుకోలేదు. కాకపోతే.. మొత్తం కథనాలు.. పవన్‌- నాగేంద్రబాబు కలిసి పార్టీ పెడుతున్నట్లుగా ప్రచారం చేయడంతో.. నాగేంద్రబాబు మాత్రం ఖండించారు. అయితే ఆయన కాస్త చొరవతీసుకుని పవన్‌ తరఫున కూడా ఖండించేశారు. అలా అప్పట్లో గ్రేట్‌ఆంధ్ర రివీల్‌ చేయడంతో లీకైన నాటకానికి ఆ విధంగా తెరపడింది.

పురిటినొప్పుల్లేని ప్రసవం!

 ‘జనసేన’ పార్టీ పుట్టుకే చాలా అపభ్రంశంగా జరిగినదని అనుకోవాలి. ఎందుకంటే ప్రజలకోసం జరిగే ఏ పోరాటం, ఉద్యమం, పార్టీ అయినా సరే.. ఆలోచనలోంచి పుట్టాలి. కానీ పవన్‌ కల్యాణ్‌ తన పార్టీ ఆవేశంలోంచి పుట్టినదని సెలవిచ్చారు. ఆవేశంలోంచి పుట్టినది ఏదైనా.. ఆవేశం చల్లారగానే.. గిట్టితే ఎలాగ? అభిమానులు ఇంతగా ఆలోచించలేదు.. తమ వెండితెరదైవం ఏం చెప్పినా దాన్ని వేదప్రమాణంగా ఎంచి జై కొట్టారు. 

తానే ఒక నిలువెత్తు వ్యక్తిత్వ వికాస పుస్తకంలాగా.. ‘ఇజం’లు, సిద్ధాంతాలు ప్రవచిస్తూ ఉండే పవన్‌కల్యాణ్‌కు తెలియనిది కాకపోవచ్చు గానీ.. ఆయనతీరు చూస్తే భగవద్గీతలోని ఓ శ్లోకం గుర్తుకు వస్తుంది. సాంఖ్యయోగంలోనిది అది. 

క్రోధాద్భవతి సమ్మోహ: సమ్మోహాత్‌ స్మృతివిభ్రమ:।
స్మృతిభ్రంశా ద్బుద్ధినాశో బుద్ధినాశాత్‌ ప్రణశ్యతి॥

కోపం వల్ల వ్యామోహం కలుగుతుంది. దానివల్ల స్మృతి అంటే ఆలోచన దెబ్బతింటుంది. ఆలోచనలేకపోయినప్పుడు బుద్ధి పనిచేయదు. దాంతో మనిషి పతనం అవుతుంటాడు.. అని చెబుతుంది ఈ శ్లోకం. ఆవేశంలో ఏ పనీ చేయవద్దు, నిర్ణయం తీసుకోవద్దు అని గీతాసారం బోధించే సత్యానికి మూలం ఈ శ్లోకమే. కానీ పవన్‌ ఆవేశంలోనే నిర్ణయం తీసుకున్నారు. అలా పుట్టిన పార్టీ జనసేన. అందుకే దాని అస్తిత్వం, నిలకడతనం గురించి అందరిలోనూ ఒక భయం. 

కాస్త కటువుగా చెప్పదలచుకుంటే.. పవన్‌కల్యాణ్‌లోని అహంకారం ఎంత లావు అంటే.. ఆయనకు తాను కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం చంద్రబాబునాయుడుకు హితం చేకూర్చాలి. మేలు చేయాలి.. కానీ ఒక వ్యక్తిగా ఆ సాయం చేయడానికి ఆయనకు ఈగో అడ్డొచ్చింది. తాను చేసే సాయానికి ఒక వ్యవస్థీకృత ముసుగు వేసుకోవాలని అనుకున్నారు. అలా జనసేన పార్టీ పుట్టింది. 

కామెడీ ఏంటంటే.. చంద్రబాబునాయుడు స్వయంగా తన ఇంటికి అల్పాహార విందు సమావేశానికి వచ్చి బతిమాలే వరకు పవన్‌కు పాపం.. ఆయన సమర్థత గురించి తెలియదు. మోడీతో పాలమూరు బహిరంగ సభలో పాల్గొన్నప్పుడు కనీసం చంద్రబాబు పేరును కూడా ప్రస్తావించని పవన్‌కల్యాణ్‌.. ఏకంగా తన ఇంటికి వచ్చి.. ‘మాట్లాడి’ వెళ్లగానే.. అనుభజ్ఞుడిగా, నవీన హైదరాబాదును నిర్మించిన మహా నాయకుడిగా, పరిపాలనా దక్షుడిగా చంద్రబాబును కొత్త కళ్లజోడులోంచి చూడడం ప్రారంభించారు. 

ఆతర్వాతినుంచి మాత్రమే కీర్తించడం ప్రారంభించారు. దీన్నంతా ఏమంటారు? అవకాశవాదం అనరా? పవన్‌కల్యాణ్‌.. తాను చెప్పుకుంటున్నట్లు ప్రజలకోసం సినిమాల రాబడిని వదిలేసుకుని వచ్చిన ఉద్యమనాయకుడే అయితే గనుక.. రాజకీయ జ్ఞానదురంధరుడే అయితే గనుక.. చంద్రబాబు సమర్థత గురించి ముందురోజు తెలియని సంగతి.. హఠాత్తుగా ఎందుకు గుర్తుకువచ్చింది. దాని వెనుకే అసలు మతలబులు ఉన్నాయి. 

అంతా కాల్‌-షీట్‌ల వ్యవహారమే…

పవన్‌కల్యాణ్‌ రాజకీయ ప్రచారం యావత్తూ కాల్షీట్ల చీటింగ్‌ వ్యవహారమే అన్నది సర్వత్రా వినిపిస్తున్న మాట. ఈ వ్యాసం.. ఏదో కేసీఆర్‌ను- జగన్‌ను సమర్థించడానికి రాస్తున్నది కాదు. కానీ పవన్‌కల్యాణ్‌ వారిద్దరి అవినీతి గురించి.. వారిద్దరు దోచేసిన కోట్లాది రూపాయల గురించి చేసిన విమర్శలన్నీ ఏమిటి? కేవలం ‘ఆరోపణ’ల ఆధారంగా సాగినవి మాత్రమే. కేసీఆర్‌ దందాల గురించైనా, జగన్‌ అవినీతి గురించిఅయినా ఆరోపణలను మాత్రమే ఆయన ఇంతెత్తున విమర్శించారు. మంచిదే. రాజకీయాల్లో  ఎక్కడైనా అలాగే ఉంటుంది. 

అయితే అదే తరహా ఆరోపణలు పవన్‌కల్యాణ్‌ మీద కూడా ఉన్నాయి. తెలుగుదేశం, భాజపా అనుకూల ప్రచారం నిర్వహించడానికి మొత్తం టోకుగటా 500 కోట్ల రూపాయల ప్యాకేజీ మాట్లాడుకున్నట్లు ప్రత్యర్థులు ఆరోపణలు చేస్తున్నారు.(ఆధారాలు వారూ ఇంతవరకు చూపించలేదు.)  తెలుగుదేశం పార్టీ ఆ మొత్తం చెల్లించేలా ఆరోపణలున్నాయి. 

జగన్‌ అవినీతి గురించి కోర్టు నిగ్గు తేలుస్తుంది.. కేసీఆర్‌ వ్యవహారం ఇంకా అంతదూరం వెళ్లలేదు గనుక ప్రజాకోర్టు తేలుస్తుంది. మరి వారిని వేలెత్తి చూపించడానికి తగిన యోగ్యత తనకున్నదని భావించేపక్షంలో పవన్‌కల్యాణ్‌.. తాను పరిశుద్ధాత్మస్వరూపుడినని నిరూపించుకునేలా.. తన మీద 500 కోట్ల రూపాయల పెయిడ్‌ ప్రచారం గురించి కూడా ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి. కానీ ఆయన ఎన్నడూ అలాంటి ప్రయత్నం చేయలేదు.

పైగా చాలా లేకిగా.. మోడీ, చంద్రబాబులతో కలిసి పాల్గొన్న ప్రతి సభలోను.. ‘‘ఈ జనసేన పార్టీ మరియు ఎన్నికల ప్రచారం ద్వారా నాకు నయాపైసా ఆదాయం లేదు, దమ్మిడీ ఆదాయం లేదు’’ అంటూ భుజాలు తడుముకున్నట్లుగా వివరణ ఇచ్చుకోనవసరం లేదు.  అంటే ఆయన ఉద్దేశం ఏమిటి? ఈయన చంద్రబాబు, మోడీలు దమ్మిడీలు ఏరుకోవడానికి రాజకీయాల్లో ఉన్నారు గానీ.. తాను దమ్మిడీలు కోరుకోకుండా.. వారిని సమర్థిస్తున్నా అనేనా? ఇలా కూడా కొందరు వ్యాఖ్యానించవచ్చు కదా! అలా మాటిమాటికీ లాభనష్టాలు బేరీజు వేయడంలోనే ఆయన అసలు బుద్ధి తెలుస్తూనే ఉన్నదని పలువురు వ్యాఖ్యానించడం విశేషం. 

పదవులు తన కోసం కాదు!

ఈ బేరసారాలు ఎంత వరకూ నిజమో తెలియదు కానీ,  రేపు మోడీ సర్కారు వచ్చినా రాకపోయినా.. పవన్‌ కల్యాణ్‌ కోరుకుంటే ఆయనకు ఒక రాజ్యసభ సభ్యత్వం భాజపా తరఫున రిజర్వు చేసి ఉంటారనడంలో సందేహం లేదు. అయితే పవన్‌ మరీ అంత చీప్‌గా దానిని కోరుకోకపోవచ్చు. అలాచేస్తే ఇక అన్నయ్యకు తనకు తేడా ఉండదని ఆయన భావిస్తారు. అయితే ఆయన తరఫు కొసరు బేరాలు లేకుండా ఉంటాయని అనలేం. 

పవన్‌కల్యాణ్‌ చివరి క్షణాల్లో జోకొట్టి బుజ్జగించిన పొట్లూరి వరప్రసాద్‌ వంటి వారు ఖచ్చితంగా రేపు తెదేపా లేదా భాజపా తరఫున కార్పొరేట్‌ కోటాలో రాజ్యసభ ఎంపీలు అవుతారు. అలాగే రామోజీరావుతో మంతనాలు సాగిస్తున్న రోజునుంచి.. తనను నీడలా అంటిపెట్టుకుని ఈ యావత్తు డీల్‌ సాగడంలో సహకరించిన గంటా శ్రీనివాసరావుకు కాపుకోటా ఉపముఖ్యమంత్రిత్వం కూడా దక్కగలదు. (తెలుగుదేశానికి ప్రజలు అధికారం ప్రసాదించిన పక్షంలో)

‘షోడౌన్‌’ అయినట్లే!!

పవన్‌కల్యాణ్‌ ‘క్లీన్‌ షేవ్‌’ అయిపోయాక.. సారీ.. చేసేసుకున్నాక.. చంద్రబాబుతో భేటీ అయిన చిత్రాలను చూసుకుని ఆయన ఫ్యాన్స్‌ అంతా బహుశా మురిసిపోయి ఉంటారు. ఇక తమ హీరో సెట్స్‌లోకి వచ్చేస్తాడని సంబరపడుతుంటారు. కావచ్చు. ఇప్పుడు తీయబోయే వాటిలో ఏ ఒక్క సినిమా బాక్సాఫీసు వద్ద ఫెయిలైనా.. మళ్లీ పవన్‌-గిరీ మసకబారిపోతుందనడంలో సందేహం లేదు. 

ప్రస్తుతం పవన్‌ షోడౌన్‌ అయింది. ఈ షోడౌన్‌కు సంబంధించి ఆయన తన ప్రచార సమయంలోనే చాలా సంకేతాలు ఇచ్చారు. మోడీని చంద్రబాబును గెలిపించండి. వారి మంచి ప్రభుత్వాన్ని అందిస్తారు అన్నారాయన. అలా కాకుండా మోసగాళ్ల ప్రభుత్వం వస్తే.. తాను మళ్లీ జనసేన పార్టీ తరఫున ప్రశ్నించడానికి తయారవుతానంటూ ఆయన ఒక పొలికేక పెట్టారు. 

ఇప్పుడే షేవ్‌ చేసేసుకున్న ఆయన రేపు 16 వతేదీ లోగా  మళ్లీ కాస్త గడ్డం పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే.. అప్పుడు తాను చెప్పిన పార్టీలు కాకుండా.. ఇతర పార్టీలు గెలిచి అధికారం తీసుకునేట్లయితే.. ప్రశ్నించడానికి ఆయన తన జనసేనకు పునర్జన్మ ప్రసాదించాలి కదా! తెలంగాణలో జగన్‌- చంద్రబాబు ల మధ్య పోటీ ఉన్నది గనుక.. 

ఫలితం ఎటు అయినా మరలవచ్చు గానీ.. తెలంగాణలో జగన్‌ తిట్టిపోస్తున్న ‘హఠావో’ అంటూ నినదిస్తున్న కాంగ్రెస్‌, తెరాసలలో ఒకరే అధికారం దక్కించుకోబోతున్నారు. మరి పవన్‌కల్యాణ్‌.. కనీసం తెలంగాణ ప్రజల కోసం అయినా.. తను గడ్డం పెంచుకుని ప్రశ్నించే బాధ్యత ఆయనను తీసుకుంటాడా లేదా.. ఆ ప్రజలను గాలికి వదిలేస్తాడా?

సీమాంధ్రలో కూడా చంద్రబాబు వస్తే మంచిదే.. ఆయన ఎంచక్కా సినిమాలు చేసుకోవచ్చు. మరి జగన్‌ వస్తే.. ప్రశ్నించడానికి ఆయన గడ్డం పెంచుకుని తిరగాలి. కదా.. రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చిన ప్రకారం ప్రశ్నించడానికి ఆయన ‘జనసేనాని’ అవతారం ఎత్తాలి కదా!

ప్రజలతో వుంటేనే పవర్‌!

పవన్‌జీ! రాజకీయం అంటే… ప్రజలకోసం పనిచేయడం అంటే వారి కోసం పోరాడడం అంటే.. చేగువేరా బొమ్మను సోఫా వెనకల గోడకు తగిలించుకోని.. సోఫాల్లో కూచుని పెగ్గుమీద పెగ్గు విస్కీ తాగుతున్నట్లు నటిస్తూ (సినిమాల్లో). వెకిలి కామెడీ చేయడం కాదు. సినిమాల్లో చేగువేరాను గోడల మీద, ఎన్నికల ప్రచారంలో మీ నాలుకల మీద చూపిస్తే చాలదు. చేగువేరా అనే కాదు.. మీరు పూర్తిగా తెలుసుకోలేదు గానీ.. ఈ దేశంలో చేగువేరాస్ఫూర్తిగా ఉద్యమం చేస్తున్న వారు ఎందరో వున్నారు. వారితో కలిసి నడవాలి. . 

మీకు అనల్పమైన  ప్రజాదరణ ఉంది. క్రేజ్‌ ఉంది. మీరు ప్రశ్నిస్తే మీ వెంట పలకడానికి లక్షలాది గొంతుకలు ఉన్నాయి. మీరందరూ కలిసి ఒక్కసారి నినదిస్తే.. ఏ ప్రభుత్వాలకైనా పునాదులు కదులుతాయి. మీ శక్తి అనల్పం. దాని స్వచ్ఛంగా వాడండి. కల్తీ చేయొద్దు. ప్రభుత్వం ఎవరిది వచ్చినా వారి విధానాలు నిర్ణయాలు ఆధారంగా మాత్రమే మీరు పోరాటపథాన్ని ఎంచుకోండి. బేషరతుగా కొమ్ముకాయడం మానుకోండి.  మీ నిస్వార్థపరాయణత నిజమే అయితే.. మీ ద్వారా తెలుగుజాతికి అనల్పమైన హితం చేకూరుస్తుంది. 

-కపిలముని

[email protected]