రాష్ట్రవిభజన రాజకీయ కారణాల చేతనే జరిగిందని అందరికీ తెలుసు. కాంగ్రెస్ ఏం లెక్కలు వేసుకుని దీన్ని తలకెత్తుకుందో, బిజెపి మరేం లెక్కలు వేసుకుని పాలుపంచుకుందో మాత్రం తెలియదు. అయితే వాళ్లకు రాజకీయలబ్ధి చేకూరిందా, చేకూరితే ఏ మేరకు, మరెవరికి లాభించింది చూదాం. మొదట కాంగ్రెసు – ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెసు పరిస్థితి ఘోరంగా వుంది కాబట్టి రాహుల్ గాంధీని ప్రధానిగా చేసే లక్ష్యంతో విడగొట్టి లాభం పొందుదామని చెప్పారు. చూడబోతే తల్లకిందులుగా తపస్సు చేసినా రాహుల్ ప్రధాని అయ్యే సీను కనబడటం లేదు. ఎన్‌డిఏకు మెజారిటీ రాని పక్షంలో, ప్రాంతీయ పార్టీల ఫ్రంట్ ఏర్పడితే దానికి మద్దతు యిచ్చి కాంగ్రెసు కొన్ని మంత్రిపదవులు తెచ్చుకుంటే యితనికీ ఒకటి దక్కవచ్చేమో! రాహుల్ కోసం రాష్ట్రం ముక్కలు చేసి వుంటే అది నెరవేరలేదనే చెప్పాలి. ఇక ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెసు పరిస్థితి ఘోరంగా వుందనే అంచనాకు ఎలా వచ్చారో తెలియదు. పంచాయితీ ఎన్నికలలో వాళ్లకే ఎక్కువ సీట్లు వచ్చాయి. స్థానిక ఎన్నికలు జరిపి, బలాబలాలు తెలుసుకుని వుంటే అది ఒక సూచికగా వుండేది.
ఆంధ్రలో వైకాపా, తెలంగాణలో తెరాస దూసుకుపోతున్నాయి కాబట్టి కాంగ్రెసును రక్షించుకోవడానికి యీ పని చేయాలని వాళ్ల సలహాదారులు చెప్పారట. వైకాపా, తెరాసల బలం యిప్పుడు తేలబోతోంది. పైకి ఏం చెప్పుకున్నా అత్తెసరు సీట్లు తెచ్చుకుని, కనాకష్టం మీద ప్రభుత్వం ఏర్పాటు చేస్తారో లేదో తెలియని పరిస్థితి వాళ్లది. మరి వాళ్ల అండ చూసుకునే కాంగ్రెసు మమ్మల్ని అన్యాయం చేసిందని ఆంధ్ర కాంగ్రెసు నాయకులు చేసి టిడిపిలోకి దూకేముందు గోలగోల చేశారు. మీడియా అలాటి కలరింగ్ యిచ్చింది మరి.
విభజన తర్వాత తెరాస, కాంగ్రెసులో విలీనం కాదు కదా, పొత్తు కూడా పెట్టుకోలేదు. కత్తులు దూసుకున్నారు. సమానస్థాయిలో సీట్లు వస్తే ప్రభుత్వ ఏర్పాటు చేయడానికై యిద్దరూ కలబడి కొట్టుకోవడం తథ్యం. మరి యిలాటి తెరాసను కాంగ్రెసు నమ్ముకుందా!? ఇక వైకాపా. కేంద్రంలో ఎవరు వచ్చినా వారికి మద్దతు యిచ్చి ఫలానా ఫలానా మంత్రిపదవులు అడుగుతానని జగన్ ఎప్పుడో చెప్పారు. తన కేసులు నీరుకార్పించుకోవడానికి అని కొందరంటారు. కారణం ఏదైనా కాంగ్రెసుకే యిచ్చి తీరతానని చెప్పలేదు.
మొదట్లో యుపిఏ3కు యిస్తానని అన్నా, యుపిఏ3 ఏర్పడే అవకాశం లేకపోతే ఎలా యిస్తాడు? మరి జగన్ మద్దతు నమ్ముకుని కాంగ్రెస్ విభజించింది అనడం కూడా వింతగానే పరిణమించింది కదా. మరి కాంగ్రెస్ ఏ కారణం చేత విభజనకు ఒడిగట్టింది? అంటే మాత్రం చెప్పలేను. చేశాక యిప్పుడు దానికి ఏం జరిగిందో చూడండి. సీమాంధ్రలో తిరుక్షవరం. త్రి డిజిట్ సీట్లలో సింగిల్ డిజిట్ తెచ్చుకునే పరిస్థితి. కేంద్రానికి ఒక్క సీమాంధ్ర ఎంపీ కూడా వెళ్లే సీను లేదు. ఈ పళ్లంరాజులు, ఝాన్సీలు, కృపారాణులు, కిశోర్ చంద్రదేవులు ఎంత బాగా వెలగబెడతారో చూడాలి. తెలంగాణకు వస్తే – వెన్నుపోట్లు జరిగాయని టి-కాం నాయకత్వమే అంటోంది. మజ్లిస్ మద్దతుతోనైనా ప్రభుత్వం ఏర్పాటు చేసి తీరుతుందని ఎవరూ గట్టిగా చెప్పలేని పరిస్థితి. మొత్తం మీద చూస్తే 2009లో ఉమ్మడి రాష్ట్రంలో గెలుచుకున్న సీట్లలో 35-40% సీట్లు తెచ్చుకుంటోందన్నమాట. కాంగ్రెస్ ఏమీ బావుకోలేదని అర్థమైంది.
తర్వాత చెప్పుకోవలసినది బిజెపి – తెలంగాణలో వారి పరిస్థితి గతంలో కంటె తప్పకుండా మెరుగుపడుతుంది. కానీ ఏ మేరకు? టు-డిజిట్ ఫిగర్ వస్తుందనుకోవచ్చా? ఏమో. దాని వలన లాభం ఏమిటి? తెరాస, కాంగ్రెస్ రెండూ ప్రభుత్వ ఏర్పాటులో బిజెపిని దగ్గరకు రానిచ్చేట్టు లేవు. మజ్లిస్ కేసి చూస్తున్నాయి, సిపిఐ కేసి చూస్తున్నాయి. మామూలుగా అయితే కిషన్‌రెడ్డిని చూసి కెసియార్ బిజెపితో భాగస్వామ్యానికి సరే అనేవారేమో కానీ, టిడిపితో పొత్తు పెట్టుకున్నందుకు కెసియార్ బిజెపి నాయకత్వాన్ని క్షమించరు. చచ్చే పార్టీకి ఊపిరి పోశారని నిందిస్తారు. బిజెపి భాగస్వామి అయిన టిడిపి తెలంగాణలో అధికారంలోకి వచ్చే సమస్యే లేదు. అందువలన వస్తే ఆ పది సీట్లతో బిజెపి ఉద్యమాలు చేస్తూ, 2019లో మాదే ప్రభుత్వం అని క్యాడర్‌ను ఊరిస్తూ గడపాలి. ఇక సీమాంధ్రలో మోదీని, పవన్‌ను తెచ్చి తప్పెట్లు, తాళాలు మోగించినా అదంతా టిడిపికి ఉపయోగపడిందంటున్నారు. బిజెపికి 2 అసెంబ్లీ, 1 పార్లమెంటు వస్తే గొప్పట. 1999లో తనను తాను అర్పించుకుని టిడిపిని నిలబెట్టిన పని బిజెపి మళ్లీ చేసినట్లా? మోదీ ప్రధాని అయ్యే సూచనలు కనబడకపోతే ప్రాంతీయ పార్టీల ఫ్రంట్‌కి కన్వీనర్‌గా వుండమని వారు అడిగితే బాబు నిరాకరిస్తారా? జగన్ చెప్పినట్లే మోదీ అయినా, మమత అయినా ఆంధ్రరాష్ట్ర ప్రయోజనాలకోసం అంటూ మరో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వానికి సూత్రధారి పాత్ర పోషిస్తారు. ఆంధ్రలో బిజెపి ఎదుగుదల ఆగిపోతుంది.
ఇక సిపిఐ – తెలంగాణ ఉద్యమంలో 'బేగానే శాదీమే అబ్దుల్లా దీవానా' అన్నట్లు రెచ్చిపోయిన పార్టీల్లో యిదొకటి. ఇదంతా నారాయణగారు ఎంపీ కావడానికే అనిపించింది. తను నెగ్గుతానని ఆయన కూడా చెప్పటం లేదు. ఓ ఎమ్మెల్యేను తెరాసకు అర్పించుకున్నారు. తెలంగాణ యిస్యూ పై భయంకరంగా పోరాడేసినందుకు 2009 కంటె ఒక్క సీటైనా ఎక్కువ వస్తుందా అంటే చెప్పలేని పరిస్థితి. సీమాంధ్రలో దాని గురించి మాట్లాడేవాడు కూడా లేడు. సిపిఎం – విభజన వలన ఏ మార్పుకూ గురి కాని పార్టీ యిదే. ఉన్న ఒక్క ఎమ్మెల్యే గెలుస్తాడో, లేక తెలంగాణ అంశం వలన ప్రభావితం అయి ఓడిపోతాడో తెలియదు. దీని పాప్యులారిటీ పెరగలేదు, తరగలేదు. వైకాపా – విభజనకు ముందు అది రాష్ట్రమంతా వ్యాపించి వున్న పార్టీ. రాష్ట్రమంతా కలిపి 135-140 సీట్లు తెచ్చుకుని మరో చిన్న పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటంత స్థాయిలో వుండింది. కానీ విభజన ప్రకటన వచ్చిన తర్వాత వైకాపా సమన్యాయం వదిలేసి సమైక్యం అనడంతో తెలంగాణ యూనిట్ ఘోరంగా దెబ్బ తినేసింది. ఇప్పుడు అన్ని సీట్లు సీమాంధ్రలో కూడా రాని పరిస్థితి. జగన్ విభజనకు సహకరించాడని టిడిపి సీమాంధ్రలో ఎంత ప్రచారం చేస్తున్నా, తెలంగాణలో అది నమ్మటం లేదు. పడే ఓట్లు వైయస్సార్‌పై అభిమానంతో పడాల్సిందే. కాంగ్రెస్, టిడిపిలకు అడ్డు కొట్టడానికి వైకాపా తెరాసకు చేరువ కావలసిన పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ ఛాయలో మజ్లిస్ వున్నట్టు, తెరాస ఛాయలో వైకాపా వుండవచ్చు. ఆ విధంగా చూస్తే వైకాపా తెలంగాణలో దెబ్బ తినడానికి విభజనే కారణం. సీమాంధ్రలో కూడా విభజనకు ముందు వైకాపాకు అనుకూలంగా వున్న పరిస్థితి వుంది. తర్వాత అనేక శక్తులతో చేతులు కలిపి వైకాపాతో సమానస్థాయిలో టిడిపి పోరాడే స్థాయికి చేరుకుంది. విభజన వలన దెబ్బ తిన్న పార్టీల్లో వైకాపా ఒకటి.
తెరాస – విభజన వలన లాభపడిన పార్టీ. ఇప్పటివరకు వేరేవారి భుజాల మీద ఎక్కి నెగ్గుతూ వచ్చిన పార్టీ సొంతంగా పోటీ చేసి తన సత్తా చూపించుకోబోతోంది. 40% సీట్లు తెచ్చుకున్నా గతంలో కంటె చాలా ఎదిగినట్లే కదా. అవసరమైతే వేరేవాళ్లను జూనియర్ పార్ట్‌నర్‌గా చేర్చుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధపడుతోందంటే చూడండి, 2009 నుండి యిప్పటికి ఎంత సాధించిందో! ఇక టిడిపి – విభజన వలన ఒకచోట బాగా నష్టపోయి, మరో చోట బాగా లాభపడిన పార్టీ యిది. తెలంగాణ ఉపయెన్నికలలో దెబ్బ తిన్నా క్యాడర్ నిలిచింది. పంచాయితీ ఎన్నికల ఫలితాలతో స్థయిర్యం వచ్చింది. కానీ ప్రకటన తర్వాత పార్టీ పూర్తిగా అడుగంటింది. మా లేఖ వలనే తెలంగాణ వచ్చింది అని చెప్పుకున్నా ఆ మాట ఆంధ్రలో నమ్మారో లేదో తెలియదు కానీ తెలంగాణలో నమ్మలేదు. ఆంధ్రా పార్టీగానే ముద్ర పడింది. బిజెపితో గీచిగీచి బేరాలాడి పార్టీ ఏం బావుకుందో తెలియదు. వాళ్ల ముఖ్యమంత్రి అభ్యర్థి గెలుపే సందేహాస్పదంగా వుంది. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక దాని వైఫల్యాలపై ఉద్యమాలు చేస్తూ యింకో ఐదేళ్లు శ్రమించాలి. అలా కష్టపడినా ఆ ఘనత ప్రధాన ప్రతిపక్షం (కాంగ్రెస్ లేదా తెరాస)కు పోతే వీళ్లకు లాభం ఏముంది? ఆంధ్రకు వస్తే – జులై ప్రకటనకు ముందు కాంగ్రెస్, టిడిపి, వైకాపా యించుమించు ఒక స్థాయిలో వుండేవి. త్రిముఖ పోటీ అనుకునేవారం. పంచాయితీ ఎన్నికలలో కూడా టిడిపి తన సత్తా చూపింది. ప్రకటన తర్వాత కాంగ్రెస్ దివాలా తీయడంతో దాని ఓటు బ్యాంకును వైకాపాతో సమానస్థాయిలో పంచుకోగలిగింది. అందుకే అనేక నియోజకవర్గాలలో పోటాపోటీగా నడుస్తోంది.
ఏ మేరకు టిడిపి లాభపడిందన్నదే చర్చనీయాంశమైంది. బాబు 120 ప్లస్ అంటున్నారు. అవతల వైకాపావారు 130 అంటున్నారు. బాబు ధీమాకు కారణం ఏమిటని టిడిపి అభిమానుల్ని అడిగితే – లగడపాటి సర్వే ఎత్తి చూపిస్తున్నారు. ఓటింగు 70% దాటితే టిడిపికే గెలుపు అని చెప్పారు కదా, మొత్తం మీద దాదాపు 78% పోలింగ్ జరిగింది కాబట్టి టిడిపి గెలుస్తుంది అని లెక్క. మహిళలు, యువత పెద్ద సంఖ్యలో ఓటేశారు. 'యువత అంతా మోదీకే. అక్కడ మోదీ, యిక్కడ బాబు వస్తేనే మాకు ఉద్యోగాలు వస్తాయి అనుకుని యితర ప్రాంతాలలో పనిచేసే వాళ్లు కూడా సొంత ఖర్చులతో వచ్చి వేశారు' అంటున్నారు. కావచ్చు. ఓటింగు శాతం పెరిగితే మధ్యతరగతి ఓట్లు కూడా పడ్డాయనీ, అది బిజెపి-టిడిపి కూటమి గెలుపుకి సంకేతమనీ భాష్యం చెపుతున్నారు. మరి యుపిలో అదే రోజున 56% ఓటింగు మాత్రమే జరిగింది. అక్కడ బిజెపికి ఓట్లు పడలేదని, సాంప్రదాయికంగా ఓట్లు గుద్దే ఎస్పీ, బియస్పీలకే గెలుపు అని ఒప్పుకుంటారా? మన దగ్గర ఓటింగు పెరిగినది గ్రామీణ ప్రాంతాలలో ఓటింగు వలన, నగరాలలో ఓటింగు పెద్దగా పెరగలేదని గ్రహించాలి. (పూర్తి వివరాలకోసం ఎదురుచూస్తున్నాను). మహిళలు బయటకు వస్తే బిజెపి-టిడిపిలకే ఓటేస్తారని ఎలా అనుకోగలం? మహిళల్లో – కనీసం గ్రామీణ మహిళల్లో – జగన్‌కు ఆదరణ వుందని అంటూ వచ్చారు. ఈ ఓట్లు జగన్‌కు వెళ్లవచ్చేమో అన్న సందేహం కూడా రావటం లేదు మనకు. రాష్ట్రాభివృద్ధి జరగాలి, తమ పిల్లలకు యిక్కడే ఉద్యోగాలు రావాలి అని మహిళల ఆశ అనుకోండి. అభివృద్ధి అనగానే బాబు ఒక్కరే గుర్తుకు వస్తారా? గతంలో వచ్చారా? హైదరాబాదుకి అంతర్జాతీయ స్థాయి సంతరింపచేసి, తమ పిల్లలను ఎన్నారైలుగా మార్చినందుకు బాబును 2004లో గెలిపించారా? జలయజ్ఞం ఎడ్వాన్సుల పేరుతో ప్రభుత్వ ఖజానా ఖాళీ చేస్తున్నారని ప్రచారం చేసినా 2009లో వైయస్‌ను దింపి బాబును ఎక్కించలేదేం? అప్పుడు అభివృద్ధి అక్కరలేకపోయిందా? అప్పుడు ఇప్పుడే కావాలనుకుంటున్నారా?
బాబు మోడల్ ఆఫ్ అభివృద్ధి ప్రజలు ఆల్‌రెడీ చూసేశారు. చూడాల్సింది జగన్ పాలనే. జగన్ యిప్పటిదాకా తన ఎడ్మినిస్ట్రేటివ్ ప్రతిభను రాజకీయాల్లో కనబరిచినది లేదు. అయినా వైయస్ పథకాల పునరుద్ధరణ అంటున్నాడు కదా, 108 మళ్లీ ఉధృతంగా వస్తుందేమో, ఓ సారి ఛాన్సిచ్చి చూదాం అనే భావనతో స్త్రీలు ఓట్లు గుద్దుతున్నారేమో! ఇక యువత – పవన్‌ను అభిమానించేవారే యువత అని నిర్వచించడం దుస్సాహసం. యువత ఓట్లు జగన్‌కు వెళ్లకూడదన్న రూలు లేదు కదా. అదనంగా వచ్చిన ఓట్లు పొందడంలో టిడిపి, వైకాపా సమానస్థాయిలో వున్నారనుకోవడంలో తప్పేమీ లేదు. అబ్బే కాదు, మూడింట రెండు వంతులు టిడిపికి, తక్కినదే వైకాపాకు అనుకున్నా టిడిపికి కేక్‌వాక్ కాదు. పొద్దున్న టీవీ చర్చల్లో విజయవాడ సీనియర్ జర్నలిస్టు తన వూహ చెప్పారు – ఏ పార్టీ గెలిచినా 100 కంటె తక్కువ వస్తాయి అని. అంటే 90 నుండి 100 లోపున వస్తాయన్నమాట. మరి ఏ పార్టీకి వస్తాయి అన్నదే తేలటం లేదు. ఎవరి అభిమానులు వాళ్లకు తగ్గట్టు చెప్పుకుంటున్నారు. తటస్థంగా వుంటుందనుకున్న ఆంధ్రభూమి టిడిపికి 90 సీట్ల వరకు యిచ్చి వైకాపాను 75-80 లోపునే ఆపేసింది. వీళ్లందరికీ ఒకటే లెక్క. మోదీ ప్రధాని కాబోతున్నాడని, ఆంధ్రకు నిధులు కావాలంటే మోదీకి ఓట్లేసి తీరాలనీ అనుకుని యువత, మహిళ టిడిపి-బిజెపి కూటమికి ఓట్లేశారు అని. మోదీ ప్రధాని అభ్యర్థిత్వం గురించి ఎంతమంది ఓటర్లకు తెలుసో నాకు తెలియదు. యుపిఏతో విసిగిపోయారు కాబట్టి కొత్త మొహం కదాని మోదీకి ఓట్లేయవచ్చు అనుకుందాం. 'కొత్తమొహం' అనే లాజిక్ ఉపయోగిస్తే ఆ ఎడ్వాంటేజి జగన్‌కు కూడా వర్తిస్తుంది. 'బాబు అభివృద్ధి మోడల్‌లో గ్రామీణ ప్రాంతాలు, హైదరాబాదు తప్ప తక్కిన పట్టణాలు దెబ్బ తిన్నాయని అనుభవించి తెలుసుకున్నాం. జగన్ విషయంలో ఛాన్సిచ్చి చూదాం' అని ఓటర్లు అనుకోవచ్చు కదా. అనుకున్నారని నేనటం లేదు. కానీ అలా కూడా ఆలోచించి చూడరేం అని నా ప్రశ్న. పైగా వీళ్లంతా టిక్కెట్టు దొరక్క కడుపుమండిన నాయకుల గురించి ఏమీ మాట్లాడడం లేదు.
కాంగ్రెస్, జెయస్పీ ఏ మేరకు ఓట్లు చీలుస్తాయో లెక్క వేయడం లేదు. అందువలన వీళ్ల అంచనాలు తప్పుతాయని నా భయం. ఏ విషయం పై వారం తెలిసిపోతుంది.
టిడిపికి అధికారం చిక్కినా, చిక్కకుండా కొద్దిలో జారిపోయి ప్రధాన ప్రతిపక్షంగా మారినా విభజన ప్రకటన కంటె ముందున్న పొజిషన్ కంటె యిప్పుడు మెరుగైన పొజిషన్‌లోకి వచ్చిందని ఒప్పుకోవాలి. కాంగ్రెస్‌ను తనలో కలిపేసుకుంది. ఎన్టీయార్ పోయిన తర్వాత టిడిపి డూప్లికేట్ కాంగ్రెస్‌గా మారిందని బాధపడేవాణ్ని. ఇప్పుడది సీమాంధ్ర వరకు చూస్తే ఒరిజినల్ కాంగ్రెస్‌గా మారిపోయింది. రాత్రికి రాత్రి పార్టీ ఫిరాయించి వచ్చినవారికి టిక్కెట్లు, ధనవంతులకే ప్రాధాన్యం, కులాల లెక్కలేసి హామీ లివ్వడం.. అంతా కాంగ్రెస్ పోకడే! కానీ ఆ పోకడే కాంగ్రెస్‌ను పదికాలాల పాటు రాజకీయాలలో వుంచుతూ వచ్చింది. ఇప్పుడు దాన్ని టిడిపి పుణికి పుచ్చుకుంది. ఎన్నికల అనంతరం తక్కిన కాంగ్రెసు వారు కూడా టిడిపిలోకి వచ్చేయవచ్చు. అధికారంలోకి వస్తే జోరుగా వస్తారు, లేకపోతే కాస్త ఆగి వస్తారు. బాబు అంటే అస్సలు పడనివారు వైకాపాలోకి వెళతారు. టిడిపి, వైకాపాల ధర్మమాని ఆంధ్రలో కాంగ్రెస్ పూర్తిగా లుప్తమైతే పోతే ఒక దరిద్రం తీరిపోతుంది. ఇక రెండు పార్టీలతోనే వేగవచ్చు. విభజన వలన ప్రజలకు కలిగిన మేలేదైనా వుందా అంటే యిదే ప్రధానమైనది అని చెప్పుకోవచ్చు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (మే 2014)