ఇదిగో సినిమా.. అదిగో సినిమా.. అంటూ అభిమానుల్ని ఉత్సాహ పరిచేందుకు అడపా దడపా సినిమా డైలాగులు చెప్పడం తప్ప, సీరియస్‌గా సినిమాల గురించి ఆలోచించలేదు కేంద్ర మంత్రి చిరంజీవి, రాజకీయాల్లోకి వచ్చాక.
ప్రజారాజ్యం పార్టీ పెడుతూనే సినిమాలకు దూరమైపోయిన చిరంజీవి, తనయుడు చరణ్ నటించిన ‘మగధీర’ సినిమాలో కాస్సేపు కన్పించారంతే. అంతకుముందు ఆయన చేసిన సినిమా ‘శంకర్‌దాదా జిందాబాద్’. 150కి ఒక్కటి తక్కువలో వుండిపోయిన చిరంజీవి, ఆ 150వ సినిమా చేసేయాలని ఇప్పుడు ఉవ్విళ్ళూరుతున్నారు.
అడిగితే రాజమౌళి సైతం చిరంజీవితో సినిమాకి కాదనే పరిస్థితి లేదు. వినాయక్ ఎటూ చిరంజీవితో సినిమా చేయాలని తహతహలాడుతున్నాడు. ఈ నేపథ్యంలో చిరంజీవి, మళ్ళీ సినిమాలపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. రాజకీయాలతో సంబంధం వుండేలా సినిమా చేయాలా.? లేదంటే ఫక్తు కమర్షియల్ సినిమా చేయాలా.? అన్నదానిపై చిరంజీవి లోలోపల మదనపడ్తున్నారట.
అన్నీ కుదిరితే ఆగస్ట్‌లో చిరంజీవి సినిమాని లాంఛనంగా ప్రారంభించేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికల్లో చిరంజీవి పోటీ చేయలేదు. కేంద్రంలో కాంగ్రెస్ ఓడినా, రాజ్యసభ పదవి ఎటూ వుంటుంది. దాంతో, సినిమాలు చేసుకుంటే మంచిదన్న ఆలోచనలో వున్నారట చిరంజీవి. మరి, ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే చిరంజీవి పెదవి విప్పాల్సిందే.