Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: కాలా

సినిమా రివ్యూ: కాలా

రివ్యూ: కాలా
రేటింగ్‌: 2.75/5
బ్యానర్‌: వండర్‌బార్‌ ఫిలింస్‌
తారాగణం: రజనికాంత్‌, నానా పటేకర్‌, హుమా ఖురేషి, ఈశ్వరి రావు, అంజలి పాటిల్‌, సముద్రఖని, సంపత్‌ రాజ్‌, పంకజ్‌ త్రిపాఠి, సయాజి షిండే, రవి కాలె తదితరులు
కూర్పు: శ్రీకర్‌ ప్రసాద్‌
సంగీతం: సంతోష్‌ నారాయణ్‌
ఛాయాగ్రహణం: మురళి జి.
నిర్మాత: ధనుష్‌
రచన, దర్శకత్వం: పా. రంజిత్‌
విడుదల తేదీ: జూన్‌ 7, 2018

'కబాలి' చిత్రంలో రజనికాంత్‌ని పక్కన పెట్టి రంజిత్‌ని మాత్రం చూపించిన దర్శకుడు, ఆ సినిమాకి వచ్చిన స్పందనతో ఈసారి కరక్ట్‌ చేసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే ఈసారి కూడా రజనికాంత్‌ సినిమా చూపించలేకపోయాడు కానీ 'రంజిత్‌-కాంత్‌' సినిమాని తీర్చిదిద్దాడు. గత రెండు దశాబ్ధాలలో రజనికాంత్‌ని జనం మెచ్చేలా ప్రెజెంట్‌ చేయగలిగింది శంకర్‌ ఒక్కడే.

రజని సూపర్‌స్టార్‌ ఇమేజ్‌ని, తను ఇవ్వాలనుకున్న సోషల్‌ మెసేజ్‌ని బ్యాలెన్స్‌ చేస్తూ శంకర్‌ మాత్రమే రజని రేంజ్‌కి తగ్గ సినిమాలు ఇవ్వగలిగాడు. మిగిలిన దర్శకులకి అంతటి స్టార్‌ని ఈ వయసులో ఎలా డీల్‌ చేయాలనేది అంతు చిక్కడం లేదు. 'కబాలి'లో రజనీ గెటప్‌ వరకు బాగా ఇమాజిన్‌ చేసుకున్న రంజిత్‌, ఆయన ఇమేజ్‌కి తగ్గ సినిమాని మాత్రం అందించలేకపోయాడు. 'కాలా' విషయంలో ఆ పొరపాట్లని కవర్‌ చేసుకునే ప్రయత్నం జరిగినా, కాసేపటికి ఆ 'కవర్‌' తొలగిపోయి మళ్లీ రంజిత్‌ 'మార్కు' బయటపడి రజనీని కబళించేసింది.

'కబాలి' తరహా కథా వస్తువుతోనే మరోసారి రజనీకాంత్‌ని ప్రెజెంట్‌ చేసిన ఈ చిత్రం చూస్తోంటే, అందులో మిస్‌ అయిన 'రజని' ఎలిమెంట్స్‌ని జోడిస్తే ఎలాగుంటుందని చూపించడానికి చేసిన ప్రయత్నంలా అనిపిస్తుంది. అందులో మిస్‌ అయిన హీరోయిజమ్‌ని క్యారెక్టర్‌ విడిచి బయటకి రాకుండానే పండించిన తీరు మెప్పిస్తుంది. మొదటి సీన్‌ నుంచి కాలా 'పంచ్‌ పవర్‌' చూపించడాన్ని డిలే చేసిన తీరు 'బాషా'ని గుర్తు చేస్తుంది.

పలుమార్లు కొట్టే వరకు తీసుకెళ్లి కూడా ఫైటు 'వాయిదా' వేసేసిన రంజిత్‌ ఇంటర్వెల్‌ ముందు సీన్లో ఫైట్‌ని ఫ్లై ఓవర్‌పై సెట్‌ చేస్తాడు. విలన్‌ని వినైల్‌ షీట్ల మీద తప్ప ఇంకెక్కడా రివీల్‌ చేయకుండా సరాసరి ఇంటర్వెల్‌ సీన్లోనే హీరోతో ముఖాముఖి పెడతాడు. చెయ్యి ఎత్తకుండా, నోరు లేపకుండా హీరోయిజమ్‌ పీక్స్‌లో పండించిన ఇంటర్వెల్‌ ఎపిసోడ్‌తో మున్ముందు జరగబోయే దానిపై ఆశలు, అంచనాలు రేకెత్తిస్తాడు.

'కుమారూ... సారు ఎవరు?' అంటూ కుర్చీ లేపి టేబుల్‌పై కొట్టే పోలీస్‌ స్టేషన్‌ సీన్లో రజనీకాంత్‌ రేంజ్‌ హీరోయిజమ్‌కి ఫాన్స్‌ పరవశించిపోతారు. ఆపై 'దెబ్బ తిన్న' కాలా 'చెయ్యేసేవుగా, చూసుకుందాం' అని సుతిమెత్తని వార్నింగ్‌ ఇస్తే 'నరసింహా' లెవల్‌ కమ్‌బ్యాక్‌ వుంటుందని ఎక్స్‌పెక్ట్‌ చేస్తారు. అయితే ఆ మరుక్షణం నుంచి 'ఇంతవరకు రజని సినిమా చూసింది చాలు... ఇక రంజిత్‌ సినిమా చూద్దురు' అన్నట్టుగా దర్శకుడు ప్లేటు తిప్పేస్తాడు. అక్కడ్నుంచీ రజనిపై నానా పై చేయి సాధిస్తూనే పోతాడు.

వరసగా ఎన్నో నష్టపోతున్నా కానీ రజని గట్టిగా తిరగబడడం కానీ, నానాకి తగిన పాఠం చెప్పడం కానీ జరగదు. అంతకుముందు ధారావిలోని ఒక కుర్రాడ్ని చంపేస్తే స్కెచ్‌ వేసి మరీ ఒకడిని ఫ్లై ఓవర్‌పై చంపేసిన కాలా తనకి పర్సనల్‌గా తీవ్రమైన లాస్‌ జరిగితే కుదురుగా వెళ్లి నానాతో ముచ్చట్లాడి వస్తాడు. 'నిన్నే చంపుదామనుకున్నా. సారీ అలా జరిగిపోయింది' అంటూ నానా స్వయంగా నేరం అంగీకరించినా కానీ మాటలు తప్ప చేతలు వుండవు.

అటుపై ఆస్తి నష్టం, అసలుకే నష్టం జరిగిపోతాయి కానీ పోలీస్‌ స్టేషన్‌లో తిన్న దెబ్బకి బదులు తీర్చుకుంటానని చెప్పి వచ్చిన హీరో నుంచి స్ట్రాంగ్‌ రిటార్ట్‌ వుండదు. అంటే ఇలాంటి వాటికి పే ఆఫ్‌ వుండాలని, హీరోదే ప్రతిసారీ పైచేయి అవ్వాలని లేదు. కాకపోతే ఒక కమర్షియల్‌ సినిమాగా తీర్చిదిద్దే ఉద్దేశం వున్నపుడు ప్లాంటింగ్స్‌ అన్నిటికీ పే ఆఫ్‌లు తప్పనిసరి. రజనికాంత్‌ని జనం జస్ట్‌ సూపర్‌స్టార్‌లానే కాదు, ఓ సూపర్‌మేన్‌లా చూస్తారు.

చాలా మంది హీరోల విషయంలో అతి అనిపించేవన్నీ రజనీ అనేసరికి అతని వల్ల ఏదైనా సాధ్యమవుతుంది అనేస్తారు. అలాంటి లార్జర్‌ దేన్‌ లైఫ్‌ వున్న హీరోని ప్రెజెంట్‌ చేసే విషయంలో కబాలిలో మిస్‌ఫైర్‌ అయిన రంజిత్‌ ఈసారి సగం ఫైర్‌ అయి, మిగతాది మరోసారి అన్నట్టు వదిలేసాడు. ఒకవేళ తనకి కమర్షియల్‌ మీటర్‌ ఫాలో అయ్యే ఆలోచన లేనపుడు కాలాకి అంత బిల్డప్‌ ఇచ్చి వుండాల్సింది కాదు. అనుకున్నది సాధించేవాడిగా విలన్‌ గెలుస్తూ పోతే, వర్కర్స్‌ స్ట్రయిక్‌కి మించి 'కాలా' ఖిల్లాలో జరిగేదేమీ వుండదు.

పతాక సన్నివేశం ఆలోచన బాగున్నా కానీ రజనీకాంత్‌ సినిమాలో యాక్సెప్ట్‌ చేయగలిగే క్లయిమాక్స్‌ కాదది. ఫైనల్‌గా 'కాలా' కథని అలా ముగించే ఆలోచన వున్నపుడు ముందు అంతగా అతడిని గ్లోరిఫై చేసి వుండకూడదు. యాక్షన్‌లోకి దిగని పవర్‌ఫుల్‌ లీడర్‌లానే చూపిస్తూ పోతే కొన్ని అనవసరమైన సవాళ్లు, తీర్చుకోలేని ప్రతీకారాలు వుండేవి కావు. పేద వర్గాన్ని అణచివేసే ధనిక వర్గాన్ని, నిమ్న జాతులపై అగ్ర వర్ణాల అధికార దుర్వినియోగాన్ని దర్శకుడు ఎఫెక్టివ్‌గా చూపించగలిగినా మధ్యలో హీరో వర్సెస్‌ విలన్‌ ఫైట్‌ హైలైట్‌ చేయడం వల్ల రజనీకాంత్‌ హీరో కావడంతో అసలు కథకంటే అదే ఎక్కువ ఫోకస్‌ అవుతుంది.

అది తను చెప్పాలనుకున్న కథ కాదు కనుక దానికి ఇవ్వాల్సిన ముగింపు కాకుండా తను రాసుకున్న కథకే ముగింపు ఇస్తానంటే కుదరదు. 'కాలా' చిత్రం గతి తప్పడానికి ఇదే కారణమయింది. 'కబాలి' చిత్రానికి నెగెటివ్‌ ఫీడ్‌బ్యాక్‌ వచ్చినపుడు హీరోయిజం కోసం సీన్లు రాసుకోనని, తను తీయాలనుకున్న విధంగానే సినిమాలు తీస్తానని చెప్పిన ఇదే దర్శకుడు ఈసారి తన కథ చెప్పకుండా జనం మెప్పు కోసం ప్రయత్నించడం, మళ్లీ అందులో పూర్తి స్థాయి సరెండర్‌ అవడం కాకుండా సగం మీకు, సగం నాకు అన్న ధోరణి కనబరచడంతో 'కాలా' అటు కమర్షియల్‌గా కాకుండా, ఇటు రియలిస్టిక్‌గా లేకుండా మధ్యలో వుండిపోయింది.

నానా పటేకర్‌ని రాముడిగా, రజనీకాంత్‌ని రావణుడిగా అభివర్ణించడంలో తమిళ కోణం చూడాలా లేక మరేదైనా కారణం వుందనుకోవాలా? రావణ లంకా దహనంతో సహా, మళ్లీ మళ్లీ పుట్టుకొచ్చే తలలు వగైరా ఊహలతో కాలాని అచ్చంగా రావణుడి ప్రతిబింబంలానే ప్రెజెంట్‌ చేయడం వెనుక ఆంతర్యమేమిటో?

'కాలా'కి తెరపై నటీనటులతో పాటు తెరవెనుక సాంకేతిక నిపుణుల నుంచి కూడా ఫుల్‌ సపోర్ట్‌ దక్కింది. రజనీకాంత్‌ 'కాలా' పాత్రలో తనకి మాత్రమే సాధ్యమయ్యే రీతిలో వృద్ధ పాత్రని కూడా స్టయిల్‌ ఐకాన్‌లా మార్చేసారు. నటుడిగా అనేక భావోద్వేగాలని పలికించే అవకాశం కల్పించిన ఈ పాత్రలో రజని బెస్ట్‌ పర్‌ఫార్మెన్స్‌ ఇచ్చారు. నానా పటేకర్‌ పాత్రలో మరొకర్ని ఊహించలేం. రజనీకాంత్‌కి సమవుజ్జీగా నానా నటన ఈ చిత్రానికి వన్‌ ఆఫ్‌ ది హైలైట్స్‌గా నిలిచింది. హుమా ఖురేషి నటన బాగుంది. ఈశ్వరిరావు నటన సహజంగా వుంది. అంజలి పాటిల్‌ ఒక కీలకమైన పాత్రలో చాలా బాగా చేసింది. తెరవెనుక నిపుణులలో అందరి పనితీరు మెప్పిస్తుంది. కళా దర్శకత్వం కానీ, ఛాయాగ్రహణం కానీ టాప్‌ క్లాస్‌ అనిపిస్తుంది. స్వరకల్పన ఆకట్టుకోలేకపోయినా నేపథ్య సంగీతం ఒళ్లు గగుర్పొడిచేట్టు చేస్తుంది.

'కాలా'లో అభిమానుల కోసం కొన్ని సన్నివేశాలున్నా, మాస్‌ ప్రేక్షకులు మెచ్చే అంశాలున్నా కీలకమైన తరుణంలో సీరియస్‌, విప్లవ సినిమా బాణీ పట్టడంతో ద్వితియార్ధం మెజారిటీ ప్రేక్షకుల నుంచి ఆమోద ముద్ర పొందే అవకాశాలు తక్కువ. ముఖ్యంగా పతాక సన్నివేశాలతో సంతృప్తి చెందే వారు, సంతోషించే వారూ తక్కువే. 'కబాలి' మాదిరిగా టోటల్‌ డిజప్పాయింట్‌మెంట్‌ కాకపోయినా కానీ 'కాలా' అటు రజని ఫాన్స్‌ని కానీ, ఇటు సినిమా లవర్స్‌ని కానీ శాటిస్‌ఫై చేస్తుందనేది అనుమానమే.

బాటమ్‌ లైన్‌: కబాలి... టేక్‌ టూ!
- గణేష్‌ రావూరి

 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?