Advertisement

Advertisement

indiaclicks

Home > Movies - Reviews

మూవీ రివ్యూ: డి జె టిల్లు

మూవీ రివ్యూ: డి జె టిల్లు

టైటిల్: డి జె టిల్లు
రేటింగ్: 2.75/5
తారాగణం: సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి, ప్రిన్స్ సిసిల్, బ్రహ్మాజీ, ప్రగతి తదితరులు
కెమెరా: సాయి ప్రకాష్ 
ఎడిటింగ్: నవీన్ నూలి
నేపథ్య సంగీతం: తమన్
పాటల స్వరకల్పన: శ్రీ చరణ్ పాకాల, రాం మిరియాల
నిర్మాత: సూర్యదేవర నాగ వంశీ
దర్శకత్వం: విమల్ కృష్ణ
విడుదల తేదీ: 12 ఫిబ్రవరి 2022

పోస్టర్ చూస్తే కొత్త మొహాలు కనిపించడంతో దీనిని ఎవరైనా చిన్న సినిమానే అని అనుకుంటారు. కానీ టీనేజ్ మరియు ట్వంటీస్ లో ఉన్న ప్రేక్షకులకి ఇది పెద్ద సినిమానే. కారణాలు కొన్నున్నాయి. 

మొదటిది జాతిరత్నాలు జానర్లో యూత్ ఎంటర్టైనర్ కావడం. 

బ్రాండ్ ఉన్న సితార సంస్థ నిర్మించడం వల్ల కూడా ఇది పెద్ద సినిమా అయి కూర్చుంది. ఇందులో ఎంతో కొంత ప్రత్యేకత లేకపోతే ఆ సంస్థ తీయదు కదా. 

ఈ మధ్యన ఓటీటీ సినిమాల్లో పాపులర్ అయి యూత్ కి కనెక్ట్ అయిన సిద్ధు జొన్నలగడ్డ ఇందులో కథానాయకుడు కావడం మరొక విశేషం. 

వీటికి తోడు ప్రీ రిలీజ్ వేడుకలో ఒక వ్యక్తి హీరోయిన్ పుట్టుమచ్చల గురించి అడగడంతో వివాదమయ్యి ఈ సినిమా పలువురి దృష్టిలో పడడంమరొక కారణం. 

ఇంతకీ ఇందులో అసలేముందో చూద్దాం ..

చిన్న చిన్న ఫంక్షన్స్ లో డీజే గా పని చేసే టిల్లు ఒక ఈజీగోయింగ్ హైదరాబాదీ కుర్రాడు ఒకమ్మాయి ట్రాపులో పడి ఎలాంటి తిప్పలు పడ్డాడన్నది కథ. ఇంతకీ టిల్లు అంటే బాలగంగాధర తిలక్ అనే పేరులోని చివరి మూడక్షరాలకి షార్ట్ ఫాం అన్నమాట. 

అయితే సినిమా మొత్తంలో అమాయకుడిలా కనపడ్డవాడు చివరి ట్విస్టులో తెలివైనవాడుగా బయటపడతాడు. 

అన్ని సినిమాల్లోనూ చూసే సీరియస్ లవ్ గానీ, రొమాన్స్ గానీ ఇందులో లేదు. అందరూ స్వార్థపరులే. అందరికీ ఏవో లెక్కలుంటాయి ఒక్క టిల్లుకి తప్ప. ఏ పాత్రా కూడా ఉన్నతమైనదిగా ఉండదు. 

మర్డర్ క్రైం, ఇన్వెస్టిగేషన్ లాంటివి ఉన్నా అన్నీ కామెడీ రంగులోనే ఉంటాయి. 

ఎటువంటి మోరల్ సైన్స్ క్లాసూ లేకుండా కాసేపు నవ్వుకోవడానికి నేటి యూత్ ఆడియన్స్ ని మాత్రమే టార్గెట్ చేసి తీసిన సినిమా ఇది. 

ఈ సినిమాకి హైలైట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. ఆద్యంతం స్టైలిష్ గా జానర్ కి తగ్గట్టుగా ఉంది. అలాగే రాం మిరియాల, శ్రీచరణ్ పాకాల స్వరపరిచిన పాటలు కూడా లెగ్ ట్యాపింగ్ గా ఉండి బాగున్నాయి. 

డి.జె టిల్లు అనే టైటిల్ సాంగ్ సాహిత్యపరంగా కూడా సరదాగా ఉంది. 

ప్రతి రెండు నిమిషాలకి కనీసం ఒక్కసారన్నా హాలంతా గొల్లున నవ్వాలి అనే విధంగా తయారు చేసుకున్న సినిమా ఇది. చాలా చోట్ల కామెడీ పేలినా కొన్ని చోట్ల మాత్రం తేలిపోయిన సందర్భాలున్నాయి. 

హీరో హీరోయిన్ల పరిచయ సన్నివేశంలో తెర మొత్తాన్ని చీకటి చేసేసి వాళ్లని రివీల్ చేయడం కొత్తగా ఉంది. 

తెలంగాణా యాసలో చెప్పే డయలాగ్స్ కానీ టైమింగ్ కానీ నవీన్ పోలిశెట్టి తరహాని ఫాలో అయ్యాడు సిద్ధు. అయితే తనకున్న స్క్రీన్ ప్రెజెన్స్ మరియు బాడీ లాంగ్వేజ్ తో తన ఐడెంటిటిని నిలబెట్టుకున్నాడు. 

డార్క్ షేడ్ ఉన్న హీరోయిన్ పాత్రలో నేహా శెట్టి కనిపించింది. అయితే దాదాపు సినిమాలో అగ్రభాగం కథానుగుణంగా నల్లరంగు చీరలోనే కనిపించింది. 

నాటీ ఎస్సై పాత్రలో బ్రహ్మాజి, హీరోయిన్ కి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గా ప్రిన్స్ కామెడీతో కూడిన మైల్డ్ విలనీ ప్రదర్శించారు. నర్రా కూడా ఉన్నంతలో తన ఉనికిని చాటుకున్నాడు. 

జడ్జ్ గా ప్రగతి పాత్ర మాత్రం సెట్టవలేదు. కామెడీ పేరుతో వెకిలిగా, అసహజంగా ఉందా పాత్ర. జాతిరత్నాలులో బ్రహ్మానందం జడ్జ్ గా కామెడీ చేసినా హుందాగానే ఉంది. కానీ ఇక్కడలా లేదు. 

హీరో తండ్రిగా నటించిన నటుడు టైమింగుతో రెండు మూడు చోట్ల నవ్వించగలిగాడు. 

కొన్ని సినిమాలు ఆడియన్స్ కి ఎందుకు నచ్చుతాయో తెలియదు. వాటిల్లో విలువలు వెతుకుతూ రివ్యూ రాయడం కుదరదు. ఒకరకంగా చెప్పాలంటే నిర్మాణ, సాంకేతిక, కమర్షియల్ విలువలు తప్ప కంటెంట్ పరంగా వేరుగా విలువలేవీ ఉండవు ఇలాంటి చిత్రాల్లో. 

తెలంగాణ యాసలో కామెడీ సినిమాలనేవి ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్. ఇంకొన్నాళ్లు ఇవి కొనసాగొచ్చు.

వివరం, విషయం విపులంగా చెప్పకపోయినా సినిమా ఫ్లావరేమిటో ఇక్కడ చెప్పడం జరిగింది కనుక ఈ తరహా చిత్రాలని మెచ్చే ఆడియన్స్ కి నచ్చొచ్చు. జాతిరత్నాలు పూర్తి క్లీన్ ఎంటర్టైనర్. అయితే ఇది అలా కాదు. కొన్ని "ఎ" రేటెడ్ అంశాలున్నాయి. కనుక పద్ధతైన క్లీన్ సినిమాలు మాత్రమే మెచ్చేవాళ్లు దీనిని మెచ్చకపోవచ్చు. 

అన్నట్టు ఈ డి జె టిల్లు పార్ట్-2 కూడా ఉందని చివర్లో సంకేతమిస్తూ "టు బి కంటిన్యూడ్" అని వేశారు.  

బాటం లైన్: ఫుల్ డోస్ యూత్ కామెడీ

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?