విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ పట్టిన ఉక్కు సంకల్పానికి సరిగ్గా ఏడాది. ఒక క్యాలండర్ ఇయర్ గడచిపోయింది. ఉద్యమం అలా సాగుతూనే ఉంది. 2021 ఫిబ్రవరి 12న మొదలెట్టిన ఈపోరాటం అలుపు సొలుపూ లేకుండా అలా ఏడాది పొడవునా కొనసాగుతోంది.
విశాఖ ఉక్కుని ప్రైవేట్ చేస్తామని గత ఏడాది బడ్జెట్ సమావేశల వేళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దాంతో భగ్గుమన్నఉక్కు ఉద్యమం ఈ రోజుకూ అలా ముందుకు వెళ్తూనే ఉంది. ఈ మధ్యలో ఎన్నో సార్లు కేంద్ర పెద్దలను వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులు కలిసి వినతి చేశారు. అలాగే ప్రైవేటు వద్దు అని అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించింది. విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కోరుతూ ముఖ్యమంత్రి జగన్ స్వయంగా కేంద్రానికి లేఖలు రాశారు.
ఒక్క బీజేపీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు విశాఖ ఉక్కు పోరాటానికి పూర్తి మద్దతు ఇచ్చాయి. ఎవరికి తోచిన తీరున ఆందోళనలు కూడా నిర్వహించి తమ సంఘీభావాన్ని ప్రకటించాయి. ఇంత జరిగినా తాజా బడ్జెట్ లో సైతం ఉక్కుని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని ప్రకటన అయితే రాలేదు.
మరో వైపు చూస్తే రెండవ ఏడాదిలో అడుగుపెడుతున్న విశాఖ ఉక్కు పోరాటాన్ని మరింత వేడిగా వాడిగా నిర్మించాలని ఉద్యమ నేతలు తలపోస్తున్నారు. 365 రోజుల ఉద్యమానికి గుర్తుగా 365 జెండాలతో విశాఖలో కార్మిక సంఘాలు విశాఖలో భారీ ప్రదర్శన నిర్వహిస్తున్నాయి
దీని తరువాత ఈ నెల 13న జైల్ భరో పేరిట మొత్తం జైళ్ళకు స్వచ్చందంగా ఉక్కు ఉద్యమ నేతలు వెళ్ళి అరెస్ట్ అవుతారు. దీని తరువాత విశాఖలోని బీజేపీ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం కూడా ఉందని చెబుతున్నారు. ఆ మీదట తమ ఆందోళనను ఢిల్లీ స్థాయిలో మరింత విస్తరిస్తామని చెబుతున్నారు.
మొత్తానికి విశాఖ ఉక్కు రోదన వేదన విశాఖ సాగరం గమనించి మౌనంగానే మద్దతు ఇస్తోంది. మరి కేంద్ర పెద్దలు మాత్రం కనీసంగా కూడా సానుకూలత చూపడంలేదన్న నిర్వేదం అందరిలో ఉంది. అయినా మొక్కవోని ధైర్యంతో విశాఖ ఉక్కుని కాపాడుకుంటామని ప్రతిన చేస్తున్నారు. చూడాలి కేంద్రం తన నిర్ణయం వెనక్కు తీసుకుంటే మాత్రం విశాఖ ఉక్కు పోరాటం చరిత్రలో నిలిచిపోవడం ఖాయం.