ఏపీకి రాజధాని లేదని ఒప్పుకున్న జగన్ ప్రభుత్వం

రాష్ట్రానికైనా, దేశానికైనా రాజధాని అనేది ఒకటి ఉంటుంది. జిల్లాలకు సైతం జిల్లా కేంద్రాలుంటాయి. దేశంలో ఎన్నో ఉమ్మడి రాష్ట్రాలు విడిపోయాయి. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాలు రాజధానులు ఏర్పాటు చేసుకున్నాయి. దేశంలో రాజధాని లేని రాష్ట్రం…

రాష్ట్రానికైనా, దేశానికైనా రాజధాని అనేది ఒకటి ఉంటుంది. జిల్లాలకు సైతం జిల్లా కేంద్రాలుంటాయి. దేశంలో ఎన్నో ఉమ్మడి రాష్ట్రాలు విడిపోయాయి. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాలు రాజధానులు ఏర్పాటు చేసుకున్నాయి. దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఏపీ రాజధాని అమరావతి అని కేంద్ర ప్రభుత్వం గతంలో చెప్పింది.

తాజాగా కూడా పార్లమెంటులో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సంబంధిత మంత్రి ఏపీ రాజధాని అమరావతి అని చెప్పాడు. ఇదివరకెప్పుడో ఇండియా మ్యాపులో ఏపీ రాజధాని అమరావతిగా చూపించింది కేంద్ర ప్రభుత్వం. కానీ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక సీన్ మారిపోయింది. ఆయన మూడు రాజధానులను తెర మీదికి తీసుకువచ్చాడు. పేరుకు మూడు రాజధానులు అన్నారు గానీ వాస్తవానికి ఒక్క రాజధానే ఉంటుంది.

కానీ ఏపీలో కోస్తా ఆంధ్రా, ఉత్తరాంధ్రా, రాయలసీమ అనే మూడు ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి అందరిని సంతృప్తి పరచడానికి మూడు రాజధానులు అన్నారు. ఆ కథ ఏమిటో అందరికీ తెలిసిందే. ఆ వివాదమూ తెలిసిందే. చివరకు ఏపీ రాజధాని ఏదీ అంటే మంత్రులు సైతం చెప్పలేని పరిస్థితి ఉంది. ఏపీకి ఒక్క రాజధాని ఏమిటి? మూడు రాజధానులు అంటున్నారు. 

వారికి నిరంతరం ఇదే స్మరణ. కొంతకాలం కిందట ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. మళ్ళీ ఎలాంటి తప్పులకు, వివాదాలకు తావు లేకుండా మూడు రాజధానులకు సంబంధించి కొత్త బిల్లు పెడతామంది. తాజాగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ ఎలాగైనా మూడు రాజధానులను  ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని ఘంటాపథంగా తెలిపారు.

ఇదే మూడు రాజధానుల విషయం గురించి వచ్చే బడ్జెట్ లో సరికొత్త బిల్లును పెడతామని చెప్పారు. చివరకు ఏపీ పరిస్థితి ఎలా తయారైందంటే రాష్ట్ర రాజధాని ఏదంటే బడి పిల్లలూ చెప్పలేరు. రాష్ట్ర రాజధాని విశాఖపట్టణమని మంత్రులు చెబుతున్నారు. కానీ అది అధికారికంగా రాజధాని కాదు కదా. అది ప్రతిపాదిత రాజధాని మాత్రమే. కాబట్టి విశాఖ పట్టణాన్ని రాజధాని అని ప్రభుత్వం చెప్పుకోలేదు.

అందుకేనేమో నాలుగో త‌ర‌గ‌తి పాఠ్య పుస్త‌కం (సెమిస్ట‌ర్ 2)లో ప్ర‌చురించిన ఇండియా మ్యాప్ లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానిని చూపించ‌లేదు. తెలుగు మాధ్య‌మానికి సంబంధించి తయారుచేసిన  ఈ పుస్త‌కంలో రాష్ట్ర రాజ‌ధాని చూపించ‌క‌పోవ‌డంతో విద్యార్థుల‌కే కాదు టీచర్లకూ అయోమయంగా ఉంది. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి ప్రచురించిన ఈ పుస్త‌కం చివ‌ర్లో భార‌త‌దేశ చిత్ర ప‌టం పొందుప‌రిచారు. 

దాంట్లో అన్ని రాష్ట్రాల రాజ‌ధానుల‌నూ విద్యార్థుల‌కు అర్థం అయ్యే విధంగా మ్యాప్ పాయింట్ ఇచ్చారు. కానీ ఏపీ ద‌గ్గ‌ర వ‌దిలేశారు. అంటే రాజధాని ఏదో ప్రభుత్వానికీ అయోమయంగా ఉన్నట్లే కదా. అసలు జగన్ టర్మ్ పూర్తయ్యేసరికైనా రాజధాని ఏదో తేలుతుందా?