Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: జంబలకిడిపంబ

సినిమా రివ్యూ: జంబలకిడిపంబ

రివ్యూ: జంబలకిడిపంబ
రేటింగ్‌: 1.5/5
బ్యానర్‌:
శివమ్‌ సెల్యులాయిడ్స్‌, మెయిన్‌లైన్‌ ప్రొడక్షన్స్‌
తారాగణం: శ్రీనివాసరెడ్డి, సిద్ధి ఇద్నాని, వెన్నెల కిషోర్‌, పోసాని కృష్ణమురళి, హరితేజ, తనికెళ్ల, సత్యం రాజేష్‌, ధన్‌రాజ్‌, రఘుబాబు తదితరులు
కూర్పు: తమ్మిరాజు
సంగీతం: గోపి సుందర్‌
ఛాయాగ్రహణం: సతీష్‌ ముత్యాల
నిర్మాతలు: రవి, జోజో జోస్‌, ఎన్‌. శ్రీనివాసరెడ్డి
రచన, దర్శకత్వం: జె.బి. మురళికృష్ణ (మను)
విడుదల తేదీ: జూన్‌ 22, 2018

'అక్కడేం జరిగిందో తెలుసుకుంటే షాక్‌ అవుతారు' లాంటి హెడ్డింగ్స్‌తో యూట్యూబ్‌లో వీడియోలుంటాయి తెలుసుగా... 'జంబలకిడిపంబ' కూడా అచ్చంగా అలాంటి బాపతే. లోపల 'విషయం' ఏమీ లేకపోయినా కానీ ఆకర్షణీయమైన టైటిల్‌తో జనం దృష్టిని ఆకట్టుకోవడానికి చేసిన ప్రయత్నమంతే. ఇవివి సత్యనారాయణ పాతికేళ్ల క్రితం తీసిన 'జంబలకిడిపంబ'ని ఎన్నిసార్లు చూసినా నవ్వు రాక మానదు. ఈ 'జంబలకిడిపంబ' ఒక్కసారి చూడడం కూడా పెద్ద పరీక్షే అనిపించకపోదు. 

మగాడు ఆడవాళ్లలా మాట్లాడుతూ, నడుస్తూ.. 'కొట్టేస్తానంతే...' అంటూ వగలు పోవడం, స్త్రీ ఏమో సిగరెట్లు కాలుస్తూ, మద్యం సేవిస్తూ.. మగాడిలా పొగరుగా వ్యవహరించడం... ఈ పాయింట్లు చాలు కింద పడి దొర్లేస్తూ నవ్వేయడానికి అనుకునేంత లో-స్టాండర్డ్‌ని మీ సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌కి సెట్‌ చేసినట్టయితే ఈ చిత్రాన్ని ఎంజాయ్‌ చేయవచ్చు. కానీ కాస్త స్టాండర్డ్‌ వున్న హ్యూమర్‌ని మాత్రమే చూస్తామనే వారికి మాత్రం ఈ చిత్రం 'పంబ' రేపుతుందనడంలో సందేహాలు అక్కర్లేదు. 

నిజానికి ఈ చిత్రాన్ని అత్యంత హాస్యభరితంగా తీర్చిదిద్దే వీలుంది. హాస్యం పుట్టించడానికి అనువైన సందర్భాలు చాలానే వస్తాయి. కానీ అక్కడ హాస్యం పండించే సత్తానే దర్శక, రచయితల్లో కరవైంది. దాంతో కాస్త కంటెంట్‌ ఇచ్చినా నవ్వించగల సత్తా వున్న నటులు కూడా అర్థం లేని సంభాషణలతో కాలక్షేపం చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు నవ్విస్తుంది, ఇక మీదట బాగుంటుంది, ఇక్కడ్నుంచి మెప్పిస్తుంది అంటూ ఎప్పటికప్పుడు 'టికెట్‌కి సరిపడా వినోదం' ఆశిస్తూ కూర్చున్న వారికి అది దొరక్కపోగా, టైటిల్స్‌ రోల్‌ అయిపోవడం చూడాల్సొస్తుంది. 

కథలోకి వెళ్తే... విడిపోదామని నిర్ణయించుకున్న భార్యాభర్తలు విడాకుల కోసం ఓ లాయర్‌ దగ్గరకి వెళతారు. అతను యాక్సిడెంట్‌లో చనిపోయి ఆత్మగా తిరిగి వస్తాడు. విడదీయాలని అనుకున్న వాడే వాళ్లిద్దరినీ కలపాలని చూస్తాడు. అది జరగదని తెలిసి ఇద్దరి శరీరాలని తారుమారు చేస్తాడు. అలాగైనా ఒకరి కష్టాలు ఒకరు తెలుసుకుంటారా, ఒకర్నొకరు మళ్లీ ఇష్టపడతారా?

లాయర్‌ ఆత్మగా వచ్చి వాళ్లని ఒక్కటి చేయాలని చూడడం, లింగాలు తారుమారు అయిపోవడం లాంటి పాయింట్స్‌తో హ్యూమర్‌కి చాలా స్కోప్‌ వుంది. కానీ కామెడీ పుట్టించడానికి వీలున్నవన్నీ వదిలేసి అవసరం లేని వాటిపై దృష్టి పెట్టి అటు టైటిల్‌ని, ఇటు కాన్సెప్ట్‌ని రెండిటినీ దర్శకుడు వృధా చేసాడు. ఫస్ట్‌ హాఫ్‌ మొత్తం 'జంబలకిడిపంబ' ఎప్పుడో అప్పుడు స్టార్ట్‌ అవుతుందనే ఆశతో, సెకండ్‌ హాఫ్‌లో ఇంకో గంట గడిస్తే ఈ కామెడీ టార్చర్‌ ముగిసిపోతుందనే నమ్మకంతో గడిచిపోతుంది. 

'బిగ్‌బాస్‌' హౌస్‌లో పది నిమిషాల సమయం వుంటేనే బోలెడంత హాస్యం పండించిన ద్వయం శ్రీనివాసరెడ్డి-వెన్నెల కిషోర్‌ సినిమా అంతటా వున్నా కానీ ఒక్కసారంటే ఒక్కసారి కూడా మనస్ఫూర్తిగా నవ్వించిన సందర్భం లేదంటే అది ఖచ్చితంగా దర్శకుడి లోపమే. ఎంత మంచి నటులు అందుబాటులో వున్నా కానీ వారు నవ్వించే సన్నివేశాలని దర్శకులే సిద్ధం చేయాలి. లేదంటే ఎంత ప్రతిభావంతులు తెరపై వున్నా ఆ టాలెంట్‌ అంతా దండగైపోతుంది. 

చక్కని టైమింగ్‌ వున్న ఆర్టిస్ట్‌ అనిపించుకున్న శ్రీనివాసరెడ్డి కథానాయక పాత్రలు పోషించే విషయంలో తన బలాన్ని నమ్ముకోకపోవడం విచిత్రం. కనీసం అతను లేడీ లక్షణాలతో కనిపించే సమయంలో అయినా హాయిగా నవ్వించిన సీన్‌ లేదు. లేడీస్‌ పొగ తాగడం, మద్యం సేవించడం అనేవి ఇటీవల చాలా సినిమాల్లో కనిపిస్తున్నాయి. వాటిని చూపించి నవ్వుకోమనడం, ఆ సన్నివేశాలతో నవ్వించాలని సిద్ధి ఇద్నాని లాంటి లిమిటెడ్‌ టాలెంట్‌ వున్న నటి నుంచి ఆశించడం అత్యాశ అనిపిస్తుంది. వెన్నెల కిషోర్‌ ఎంత తపన పడ్డా నవ్వించడానికి అనుగుణమైన సన్నివేశాలు, సంభాషణలు అతనికి ఇవ్వలేదు. పోసాని చేసే అరుపులు, ఆర్తనాదాల నటనకి లైసెన్స్‌ ఇచ్చినట్టు అతడిని ఘోస్ట్‌గా చూపించారు. సౌండ్‌ ఇంజినీర్లు కూడా 'ఎందుకు అరుస్తున్నావ్‌' అని అడిగేంత శాంతంగా ఆయన నటించాడు. తనికెళ్ల భరణి అవసరానికి మించి నటిస్తున్నారంటే ఆ సినిమాకి వాస్తు లోపాలున్నట్టే. 

గోపి సుందర్‌ పాటలన్నీ రిజెక్టెడ్‌ ట్యూన్స్‌లా వున్నాయి. సంభాషణలయితే చేతిలో రిమోట్‌ వుంటే మ్యూట్‌ ఆప్షన్‌ని విచ్చలవిడిగా వాడుకోవచ్చు అన్నట్టున్నాయి. సాంకేతికంగా ఒక్క చెప్పుకోతగ్గ లక్షణం లేని ఈ చిత్రంలో విలన్స్‌ అంటూ ప్రత్యేకంగా ఎవరూ లేరు. కానీ ప్రేక్షకుల పాలిట దర్శకుడే విలన్‌ అయ్యాడు. ఫలానా సీన్‌ బాగా తీసాడు, ఫలానా షాట్‌ బాగా పెట్టాడు అనే వీల్లేకుండా తనకి సంబంధించిన అన్ని క్రాఫ్ట్స్‌లోను ఫెయిల్‌ అయ్యాడు. పేరుకి జంబలకిడిపంబ అంటూ ఇవివి సినిమా స్ఫూర్తి అనే కలర్‌ ఇచ్చినా కానీ నిజానికి 'డేటింగ్‌ ది ఎనిమీ' అనే చిత్రం నుంచి కాపీ కొట్టాడు. 

మొత్తం మీద ఏదో ఆశించి తీస్తే ఇంకేదోలా తయారయి అంతిమంగా ప్రేక్షకుల పాలిట పరీక్షగా మారిన 'జంబలకిడిపంబ' కామెడీ సినిమాలోనే కామెడీ కోసం వెతుక్కునేలా, మొహం వాచిపోయేలా చేసింది. జెండర్‌ రివర్స్‌ చేసి కామెడీ సృష్టించాలని అనుకుంటే టోటల్‌ సీనే రివర్స్‌ అయి ట్రాజెడీగా మారింది. స్టార్‌ హీరోల సినిమాల్లో కామెడీ ట్రాకులే పగలబడి నవ్విస్తోంటే, యూట్యూబ్‌ ఓపెన్‌ చేస్తే నవ్వుకోడానికి జబర్దస్త్‌ స్టఫ్‌ టన్నుల కొద్దీ దొరుకుతోంటే ఇలాంటి నాసి రకం వినోదంతో పాస్‌ అయిపోవచ్చునని భావించడం అజ్ఞానమనిపిస్తుంది.

బాటమ్‌ లైన్‌: పంబ లకిడి జంబ!

గణేష్‌ రావూరి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?