మూవీ రివ్యూ: జాతి రత్నాలు

చిత్రం: జాతి రత్నాలు రేటింగ్: 2.75/5  తారాగణం: నవీన్ పోలిశెట్టి, ఫారియా అబ్దుల్లా, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, మురళీశర్మ, బ్రహ్మానందం, నరేష్, బ్రహ్మాజి, వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి, గిరిబాబు, శుభలేఖ సుధాకర్, దివ్య…

చిత్రం: జాతి రత్నాలు
రేటింగ్: 2.75/5 
తారాగణం: నవీన్ పోలిశెట్టి, ఫారియా అబ్దుల్లా, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, మురళీశర్మ, బ్రహ్మానందం, నరేష్, బ్రహ్మాజి, వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి, గిరిబాబు, శుభలేఖ సుధాకర్, దివ్య స్పందన తదితరులు
సంగీతం: రథన్
ఎడిటింగ్: అభినవ్ రెడ్డి దండ
కెమెరా: సిద్ధం మనోహర్
నిర్మాత: నాగ్ అశ్విన్
దర్శకత్వం: అనుదీప్ కె.వి
విడుదల తేదీ: 11 మార్చ్ 2021.

“ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ” తో హిట్టు కొట్టినప్పటినుంచి నవీన్ పోలిశెట్టిపై యంగ్ ఆడియన్స్ లో అంచనాలు ఆకాశాన్నంటాయి. దానికి తోడు “జాతిరత్నాలు” ట్రైలర్ ఆసక్తిగా ఉండడంతో ఈ చిత్రంపై కూడా ఆడియన్స్ చూడాల్సిన సినిమాగా కర్చీఫ్ వేసుకున్నారు. ఆ విషయాన్ని అడ్వాన్స్ బుకింగ్స్ తో రుజువుచేసారు.  నాగ్ అశ్విన్ నిర్మాత కావడం ఈ సినిమాపై అదనపు మర్యాద, ఆసక్తి పెంచాయి. ఇక ప్రొమోషన్స్ కూడా చాలా వినూత్నంగా చేసారు. ఇన్ని అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం తీరూ తెన్నూ ఎలా ఉన్నాయో చూద్దాం.

సినిమా మొదటి సీన్ ఏ ఉపోద్ఘాతమూ లేకుండా మిడ్ వే లో ఓపెన్ అవుతుంది.  శ్రీకాంత్ (నవీన్ పోలిశెట్టి) తెలంగాణాలోని జోగిపేట అనే ఊళ్లో లేడీస్ ఎంపోరియం ఓనర్ (తనికెళ్ళ భరణి) కొడుకు. అతనికిద్దరు దోస్తులు (ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ). ఆ ముగ్గురూ ఊళ్లో అల్లరి చిల్లరగా తిరుగుతుంటారు. ఎవ్వరికీ వాళ్ళంటే మంచి అభిప్రాయం ఉండదు. 

“లేడీస్ ఎంపోరియం శ్రీకాంత్” అని పిలిపించుకోవడం తనకిష్టం లేదని, హైద్రాబాద్ వెళ్లి రెండు నెలల్లో ఉద్యోగం సంపాదిస్తానని పెట్టె, బేడ సర్దుకుని ఒక పచ్చ రంగు పాత మారుతి కారులో బయలుదేరతాడు. అతనితో పాటు దోస్తులిద్దరూ కూడా హైద్రాబాద్ చేరతారు. 

అక్కడ ఏదో మతలబు చేసి ఒక ఫ్లాట్ లో దిగుతారు. పక్కింటి చిట్టి (ఫరియా అబ్దుల్లా) తో పరిచయం అవుతుంది శ్రీకాంత్ కి. అక్కడినుంచి అసలు కథ మొదలవడానికి, సమస్య లేవనెత్తడానికి చాలా సమయం తీసుకున్నాడు దర్శకుడు. 

అయితే నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణల డయాలగ్ టైమింగ్, రాసుకున్న సింగిల్ లైన్ పంచులు గ్యాప్ లేకుండా పడుతుండడం వల్ల వాటికి కనెక్ట్ అయినవాళ్ళకి పెద్దగా బోర్ కొట్టదు. లేకపోతే “ఇంతోటి సినిమాకి ఎందుకింత హడావిడి చేసారో” అనిపిస్తుంది. ఒక్కోసారి నాన్-స్టాప్ గా టిక్-టాక్ వీడియోలు, స్పూఫులు చూస్తున్న ఫీలింగ్ వస్తుంది ఆ పంచులు చూస్తుంటే. 

సినిమా మొత్తం నవీన్ పోలిశెట్టి భుజాలమీదే మోసాడు. అమాయకత్వంలోనే హీరోయిజం చూపించడం వల్ల సగటు ప్రేక్షకుడు ఆ పాత్రకి ఎమోషనల్ గా కనెక్ట్ అవడం సహజం. హీరోయిన్ ఫారియా అబ్దుల్లా నిండుగా బాగుంది. నటన పరంగా కూడా పర్వాలేదు. నవీన్ డామినేషన్లో కూడా రాహుల్ రామకృష్ణ తన ఉనికిని కాపడుకోగలిగే విధంగా నటించి మెప్పించాడు. మురళీశర్మ రొటీన్ గానే కనిపించాడు. వెన్నెల కిషోర్, బ్రహ్మానందం కూడా కాసేపు కనిపించినా నవ్వించారు. అతిథి పాత్రలో కీర్తి సురేష్ మెరుపులా మెరిసింది. 

కెమెరా పనితనం ఓకే. ఎడిటింగ్ మాత్రం చాలా పూర్ గా ఉంది. కొన్ని చోట్ల సీన్ పూర్తవకుండా మధ్యలోనే జంప్ కొట్టినట్టుగా అనిపించింది. సంగీతపరంగా ఓకే. సందర్భానికి తగ్గట్టుగా వచ్చే పాటలు బాగున్నాయి. 

కంటెంట్ పరంగా చూసుకుంటే, హడావిడి చేసినంత విషయమైతే లేదు గానీ ఏదో కాలక్షేపంలాగ సా…గింది. మరీ ముఖ్యంగా సెకండ్ హాఫ్ రెండు మూడు సార్లు టైం చూసుకునేలా చేసింది. రాసుకున్నదే పలుచని కథ. ఆ కథ నడుస్తున్న తీరులో గానీ, కాన్-ఫ్లిక్ట్ పాయింట్ గానీ, అన్నీ ప్రెడిక్టిబుల్ గా ఉంటూ ఎటువంటి సర్ప్రైజెస్ లేకుండా ఉన్నాయి. అయినా ఎక్కడా బోర్ కొట్టకపోవడం ప్రత్యేకత. 

కథ, లాజిక్ లాంటివి పట్టించుకోకుండా ఒక స్పూఫ్ సినిమాని చూస్తున్నట్టుగా చూసేస్తే బాగానే ఉంటుంది. కథ ఎలా ఉన్నా చివరిదాకా ఎనెర్జీతో కూర్చోబెట్టగల స్పార్క్ నవీన్లో ఉందని మరో సారి రుజువయింది. బాక్సాఫీసు మీదా మూకుమ్మడి దాడి చేసినట్టుగా ఓపెనింగ్స్ ఇచ్చిన ప్రేక్షకుల్లో సగం మందికి నచ్చినా మౌత్ టాక్ వల్ల ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది. అశ్లీలం లేని క్లెన్ కామెడీ కనుక కుటుంబసమేతంగా చూసినా ఇబ్బంది ఉండదు. సెకండ్ హాఫ్ క్రిస్పీగా ఉండుంటే మరో మెట్టు ఎక్కుండేది. 

బాటం లైన్: నవ్వించిన రత్నాలు