రివ్యూ: జెర్సీ
రేటింగ్: 3.5/5
బ్యానర్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్
తారాగణం: నాని, శ్రద్ధా శ్రీనాధ్, సత్యరాజ్, మాస్టర్ రోనిత్ కమ్రా, ప్రవీణ్, సంపత్ రాజ్, రావు రమేష్ తదితరులు
సంగీతం: అనిరుధ్ రవిచందర్
కూర్పు: నవీన్ నూలి
ఛాయాగ్రహణం: సానూ వర్గీస్
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
రచన, దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి
విడుదల తేదీ: ఏప్రిల్ 19, 2019
జెర్సీ దర్శకుడు గౌతమ్ తన టీమ్ అసెంబుల్ చేయడంలోనే సగం సక్సెస్ అయిపోయాడు. అర్జున్ పాత్ర పోషించడానికి నాని అంగీకరించడమే జెర్సీకి బిగ్గెస్ట్ ప్లస్. ఎందుకంటే ఇది ఏదో యాక్షన్ అనగానే డైరెక్షన్‌కి అనుగుణంగా నటించేసే పాత్ర కాదు. ఒక వ్యక్తి తాలూకు భావోద్వేగాలని పూర్తిగా అర్థం చేసుకుని, ఆ పరిస్థితుల్లో తనని తాను ఊహించుకుని, సదరు పాత్రని సజీవంగా తెర మీదకి తీసుకురావడం ఆషామాషీ వ్యవహారం కాదు. నాని ఉత్తమ నటుడనేది తెలిసిందే కానీ జెర్సీ అతనికి కూడా పెద్ద ఛాలెంజ్ విసిరింది. తనలోని అత్యుత్తమ నటుడిని బయటకి తీసుకురావాల్సిన అవసరం కల్పించింది.
జెర్సీ కేవలం ఒక సినిమా కాదు. దర్శకుడు గౌతమ్ తెరపై జీవితాన్ని ఆవిష్కరిస్తే… నాని 'అర్జున్'కి ప్రాణం పోసాడు. తెరపై నాని కాకుండా ఒక ఫెయిల్డ్ క్రికెటర్, కొడుకు కనీస అవసరాలు తీర్చలేకపోతున్న ఒక అసమర్ధపు తండ్రి కనిపిస్తాడు. కొడుకు కళ్లల్లో ఒక ఫెయిల్యూర్‌గా మిగిలిపోకుండా అతనికి ఎప్పటికీ హీరోలా నిలిచిపోవాలని తపించే ఒక తండ్రి కథ. షాప్‌లో దొరికే ఇండియన్ క్రికెట్ టీమ్ జెర్సీని అయిదు వందల రూపాయలు పెట్టి కొనివ్వలేని తండ్రి తన కొడుకు కోరిక తీర్చడానికి ఎంత దూరం వెళతాడు, ఏ జెర్సీని అతని చేతిలో పెడతాడు అనేది జెర్సీ ఆత్మ.
సినిమా అంటే రెండున్నర గంటల పాటు ప్రేక్షకులని ఎలా కూర్చోబెట్టాలి, ఏమి చేసి నవ్వించాలి, ఏ విధంగా వారిని ఉత్తేజ పరిచి 'పాస్' అయిపోయామని అనిపించుకోవాలి అనే ఎక్సర్‌సైజ్ అయిపోయిన దశలో అప్పట్లో కె. విశ్వనాధ్ తీసిన సహజమైన కథలు, కదిలించే భావోద్వేగాలు బహు అరుదైపోయాయి. తెరపై జీవితాన్ని ఆవిష్కరించగలిగేంత కన్విక్షన్ దర్శకుడికి వుంటే, ఆ పాత్రకి జీవం పోయగల నటుడు కెమెరా ముందు వుంటే సోకాల్డ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తోనే కాలక్షేపం అవుతుందనే భావన ఒట్టి ట్రాష్ అని నిరూపిస్తుంది జెర్సీ.
మొదలైన కాసేపటికే అర్జున్ అంతర్మధనం అర్థం చేసుకుని… అతని కొడుకు అడిగిన పుట్టినరోజు కానుక ఇవ్వడానికి అతనికో అయిదు వందలు లభిస్తే బాగుంటుందని వీక్షకుడు ఫీలయ్యేలా చేయడంలో దర్శకుడి నేర్పు. నటుడి నటనకి మచ్చుతునకగా నిలుస్తుంది. అర్జున్ పాత్రతో ఏర్పడిన ఎమోషనల్ కనక్ట్ ఏ దశలోను డిస్‌కనక్ట్ అవకుండా, ఇంకా ఇంకా బలపడుతూ అతని ప్రతి విజయాన్నీ అస్వాదించేలా చేస్తుంది. విజిల్స్ కొట్టించే మాస్ సీన్ అంటే హీరో పంచ్ డైలాగులే చెప్పాలా… లేక నలుగురి ఎత్తి కుదేయాలా? తన తండ్రి ఫోటో పేపర్లో వచ్చిందని ఫ్రెండ్ చెప్పినపుడు ఎనిమిదేళ్ల పిల్లాడు ఆ విజయ గర్వంతో ముందుకి కదిలే షాట్ చాలదూ? మాస్ సినిమాకీ, క్లాస్ సినిమాకీ మధ్య వున్న అంతరాన్ని బ్లర్ చేసి… స్ట్రయికింగ్‌గా తీసిన సీన్‌కి అటు మాసైనా, ఇటు క్లాసైనా సలామ్ కొట్టాల్సిందే అనేది చెప్పడానికి ఆ షాట్ చాలు.
సచిన్ ఫోటోకి బదులుగా తన తండ్రి పేపర్ కటింగ్‌ని పెట్టుకున్న కొడుకు దృష్టిలో హీరో అయిన తండ్రి కళ్లల్లో కనిపించే ఆ ఆనందాన్ని ఆవిష్కరించే సీన్ కంటే మాస్ అప్పీల్ ఎక్కడ వుంటుంది? దర్శకుడు గౌతమ్ కేవలం ఒక స్ట్రగులింగ్ స్పోర్ట్స్ పర్సన్ కథని మాత్రమే చూపించలేదు. అతనికి తన జీవితంలోని ముఖ్య వ్యక్తులతో వున్న అనుబంధాన్ని తెరమీదకి తీసుకొచ్చిన విధానం హృద్యంగా అనిపిస్తుంది. తండ్రి తనని కొట్టాడని చెప్పకుండా తల్లితో అబద్దం ఆడిన కొడుకుని తండ్రి అడుగుతాడు… 'నేను కొట్టానని ఎందుకు చెప్పలేదు' అని. 'అబద్దం అనుకుంటారు నాన్నా. నువ్వు నన్ను కొట్టావంటే ఎవరూ నమ్మరు నాన్నా' అన్నపుడు… తన కళ్లల్లో నీళ్లు కనిపించకుండా అటు తిరిగి ఆ తండ్రి బాధ పడే సీన్‌లాంటి హార్ట్ టచింగ్ మొమెంట్స్ జెర్సీలో కోకొల్లలు.
ముప్పయ్ అయిదు మంది ప్రాబబుల్స్‌లో తనకి స్థానం దక్కిందనే ఆనందాన్ని కోచ్‌తో పంచుకునే సీన్ కానీ, పర్సులోంచి డబ్బులు తీస్తూ భార్య ముందు దోషిగా నిలబడే సందర్భం కానీ… అన్నిటికీ మించి అర్జున్ ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని తెలియజెప్పే పతాక సన్నివేశం కానీ… దర్శకుడు గౌతమ్ తిన్ననూరి నిజంగా ఒక కావ్యాన్నే తెరకెక్కించాడనే భావన కలిగిస్తుంది. నాని ఇంతకుముందే పలుమార్లు మంచి నటుడిగా ముద్ర వేసాడు. కానీ జెర్సీతో అతను తనకి తానే ఒక బెంచ్‌మార్క్ సెట్ చేసుకున్నాడు. నిశ్శబ్ధంలోను అర్జున్ ఆత్మని చూడగలిగేంత గొప్పగా ఈ పాత్రకి జీవం పోసాడు.
పాటలకంటూ ప్రత్యేకించి సమయం తీసుకోకుండా కథలో భాగం చేసిన తీరు మెప్పిస్తుంది. నేపథ్య సంగీతంతో జెర్సీని మరో స్థాయికి తీసుకెళ్లాడు అనిరుధ్. కథలో ఎంత సహజత్వం ఉందో అదంతా తెరపై కనిపించేలా చేసాడు సినిమాటోగ్రాఫర్. కమర్షియల్ లెక్కలు చూసుకుంటే తెరకెక్కించడం అతి కష్టమైన ఈ చిత్రానికి పెట్టుబడి పెట్టిన నిర్మాతలకి హేట్సాఫ్. నాని భార్యగా శ్రద్ధ, తనయుడిగా నటించిన రోణిత్, కోచ్‌గా సత్యరాజ్, ప్రాక్టికల్ ఫ్రెండ్‌గా ప్రవీణ్ అందరూ తమ తమ పాత్రల్లో అద్భుతంగా రాణించారు.
మైనస్‌లంటూ ఏమైనా వుంటే అది క్రికెట్ మ్యాచ్‌లు తెరకెక్కించిన విధానం. మరీ వన్ డైమెన్షనల్‌గా వున్న ఆ సీన్లు సుదీర్ఘంగా వుండడం కాస్త ఇబ్బంది పెడుతుంది. అయితే భావోద్వేగాల విషయంలో దర్శకుడు అత్యుత్తమ సన్నివేశాలని రాసుకోవడం, అన్నిటికీ మించి 'జెర్సీ'కి చివర్లో ఇచ్చిన పే ఆఫ్ అద్భుతంగా పండడానికి తోడు పైన చెప్పుకున్న చాలా ప్లస్ పాయింట్స్ అన్నీ జెర్సీని మిగతా సినిమాల కంటే ఒక మెట్టుపైన వుంచుతాయి. కాలక్షేపాన్నిచ్చే సినిమాలు కోకొల్లలు వస్తుంటాయి కానీ ఇలా సంతృప్తితో బయటకి పంపించే చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. ఆర్థిక పరంగా ఎంత లబ్ధి పొందుతుందనేది అటుంచితే, ఒక గొప్ప సినిమాగా మాత్రం జెర్సీ చిరకాలం గుర్తుండిపోతుంది.
మ్యాచ్ విన్నయ్యాక చప్పట్లు కొట్టే ఫాన్స్ మామూలే. కానీ ఒక సినిమా అయ్యాక చప్పట్లు కొట్టే ప్రేక్షకులయితే మనకి తక్కువే. స్పందించడం అరుదైన ప్రేక్షకుల నుంచి హర్షధ్వానాలు అందుకోవడం జెర్సీ టీమ్ సాధించిన అతి గొప్ప అఛీవ్‌మెంట్. హేట్సాఫ్ టు ది ఎంటైర్ టీమ్!
బాటమ్ లైన్: సిక్సర్!
– గణేష్ రావూరి