సినిమా రివ్యూ: మత్తు వదలరా

సమీక్ష: మత్తు వదలరా రేటింగ్‌: 3/5 బ్యానర్‌: క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, మైత్రి మూవీ మేకర్స్‌ తారాగణం: శ్రీసింహ, సత్య, అగస్త్య నరేష్‌, అతుల్య చంద్ర, వెన్నెల కిషోర్‌, బ్రహ్మాజీ, జీవా, పావలా శ్యామల తదితరులు…

సమీక్ష: మత్తు వదలరా
రేటింగ్‌: 3/5
బ్యానర్‌:
క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, మైత్రి మూవీ మేకర్స్‌
తారాగణం: శ్రీసింహ, సత్య, అగస్త్య నరేష్‌, అతుల్య చంద్ర, వెన్నెల కిషోర్‌, బ్రహ్మాజీ, జీవా, పావలా శ్యామల తదితరులు
కథనం: రితేష్‌ రాణా, తేజ .ఆర్‌
కూర్పు: కార్తీక శ్రీనివాస్‌
సంగీతం: కాలభైరవ
ఛాయాగ్రహణం: సురేష్‌ సారంగం
నిర్మాతలు: చిరంజీవి (చెర్రీ), హేమలత
రచన, దర్శకత్వం: రితేష్‌ రాణా
విడుదల తేదీ: డిసెంబర్‌ 25, 2019

'మత్తు వదలరా' ప్రమోషన్స్‌ చూస్తేనే ఇది రొటీన్‌కి భిన్నంగా వుంటుందనే భావన కలిగింది. అయితే ప్రమోషన్‌లో చూపించిన ప్రత్యేకత చాలాసార్లు సినిమాలో కనిపించదు కానీ 'మత్తు వదలరా' నిజంగానే ప్రత్యేకంగా నిలుస్తుంది. యువ దర్శకుడు రితేష్‌ రాణా, అతని బృందం ఈ 'ఓటీటీ' యుగంలో నేటితరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గ యూనివర్సల్‌ చిత్రాన్ని అందించింది. అతి తక్కువ వనరులతో, మితమయిన ఖర్చుతో ఎంత ఎఫెక్టివ్‌గా సినిమా తీయవచ్చో, ఇంకెంతగా ఎంటర్‌టైన్‌ చేయవచ్చో చూపించింది. దర్శకుడు రితేష్‌ రాణా ఆసక్తికరమయిన నేపథ్యంతో, ఆకట్టుకునే పాత్రలతో, ఆద్యంతం వినోదాన్నిచ్చే కథనంతో ఈ చిత్రాన్ని మలచిన తీరు అతని ప్రతిభకి అద్దం పడుతుంది.

సింపుల్‌ క్రైమ్‌ కథని కాంటెంపరరీ ఎలిమెంట్స్‌తో దర్శకుడు ఆసక్తికరమయిన చిత్రంగా మలచిన విధానం, ముఖ్యంగా హాస్యాన్ని జోడిస్తూ ఎంత సీరియస్‌ సీన్‌లో అయినా ఆ మూడ్‌ డిస్టర్బ్‌ అవకుండా పంచిన వినోదం ఈ చిత్రానికి హైలైట్‌గా నిలిచింది. డీమానిటైజేషన్‌కి ముందు వున్న సెటప్‌లో కొన్ని వైరల్‌ వీడియోస్‌ స్ఫూర్తిగా రాసుకున్న ఈ కథలో ప్రతి సన్నివేశం వెనుక పెట్టిన 'థాట్‌' ప్రస్ఫుటమవుతూ వుంటుంది. 'క్యాష్‌ ఆన్‌ డెలివరీ' పద్ధతిలో జరిగే చోటా స్కామ్స్‌ నేపథ్యంలో మొదలయిన కథ అనూహ్యమయిన మలుపు తిరుగుతుంది. ఒక అయిదు వందల రూపాయలు 'తస్కరించడానికి' చేసిన చిన్న తప్పు ఒక డెలివరీ బాయ్‌ని (శ్రీసింహ) పెద్ద సమస్యలో పడేస్తుంది. కళ్లు మూసి తెరిచేంతలో అసలేం జరిగిందో తెలియని అయోమయంలో, అతని జీవితం మరింత అగాధంలోకి జారిపోతుంది.

నెలంతా కష్టపడి సంపాదించిన డబ్బు కొన్ని గంటల్లో ఖర్చయిపోవడంతో ఫ్రస్ట్రేట్‌ అయిన బాబు (శ్రీసింహ) తన స్నేహితుడి (సత్య) సలహా మేరకు కస్టమర్లకి టోపీ పెట్టాలనుకుంటాడు. కానీ మొదటి ప్రయత్నమే బెడిసి కొడుతుంది. కవర్‌ అప్‌ చేద్దామనుకునేలోగా తెలియకుండా తీసుకున్న మత్తు పదార్థం మత్తులోకి పడేస్తుంది. లేచే సరికి అతడిని ఫ్రేమ్‌ చేసిన సంగతి తెలుస్తుంది. ఏమి జరిగిందో తనకే తెలియని మైకంలో ఏమి జరిగిందనేది తెలుసుకోవడం కంటే ఆ సమస్య నుంచి తాను ఎలా బయట పడాలా అంటూ స్నేహితులతో కలిసి క్రైమ్‌ సీన్‌లోకి రీఎంట్రీ ఇస్తాడు. అక్కడ్నుంచీ వాళ్లకి తారసపడే వ్యక్తులు చెప్పే వివరాలతో షాకింగ్‌ నిజాలు కనుగొంటారు.

లైన్‌గా చెప్పుకుంటే చాలా సింపుల్‌గా అనిపించే ఈ స్టోరీని దర్శకుడు రితేష్‌ ఈజీగా ఐడెంటిఫై చేసుకునే పాత్రల మధ్య సెటప్‌ చేసాడు. ఆన్‌లైన్‌ షాపింగ్‌ జమానాలో డెలివరీ బాయ్‌లు ఎలాంటి చిన్న చిన్న మోసాలకి పాల్పడతారు, ఒకసారి కక్కుర్తి పడితే వాళ్లెలాంటి కష్టాలు ఎదుర్కొంటారు అనే బ్యాక్‌డ్రాప్‌లో సిటీలో జరిగే ఇల్లీగల్‌ డ్రగ్స్‌ దందాకి ముడిపెట్టి థ్రిల్లింగ్‌ స్క్రీన్‌ప్లే రాసుకున్నాడు. ప్రిడిక్టబులిటీకి పర్యాయపదంగా మారిపోతున్న తెలుగు సినిమా పరిశ్రమ కథల మధ్య అసలు క్లూ ఇవ్వకుండా ఈ దర్శకుడు ఇచ్చే సర్‌ప్రైజ్‌లకి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఫోకస్‌ వేరే పాత్రల మీదకి మళ్లిస్తూ అసలు దొంగ వైపు దృష్టి మరలనివ్వకుండా రితేష్‌ చేసే 'బ్లఫ్‌'కి వహ్వా అనాల్సిందే.

తన కథలోని సస్పెన్స్‌ని మహ బాగా మెయింటైన్‌ చేయడమే కాకుండా కొన్ని ప్యారలల్‌ ట్రాక్స్‌తో రితేష్‌ స్క్రీన్‌ప్లేలోకి కామెడీని తెలివిగా చొప్పించిన వైనం శభాష్‌ అనిపిస్తుంది. తెలుగు టీవీ సీరియల్స్‌పై సెటైర్‌లా తీసిన 'ఓరి నా కొడకా' టీవీ సీరియల్‌ ట్రాక్‌ స్క్రీన్‌పై వచ్చిన ప్రతిసారీ నవ్విస్తుంది. 'ప్రేక్షకుల కోరిక మేరకు టీవీ ఆన్‌ చేసిన ప్రతిసారీ ఈ సీరియల్‌ ప్రసారమవుతుంది' అనే కామెంట్‌లోనే దర్శకుడి హాస్య చతురత తెలుస్తుంది. అలాగే స్పై కెమెరాలని అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్స్‌లో అమర్చే సెక్యూరిటీ వాళ్లని, ఆ కెమెరాలని కథలో భాగం చేసిన తీరుని మెచ్చుకుని తీరాలి. అలాగే మెగాస్టార్‌ చిరంజీవి పాటతో ఓపెన్‌ చేసి, చిరంజీవి 'ఖైదీ' సీన్‌తో ఇంటర్వెల్‌ ఇచ్చి, మళ్లీ లాస్ట్‌ షాట్‌ చిరంజీవిపై వేయడం ఆకట్టుకుంటుంది. ఇలాంటి చమక్కులతో పాటు కామెడీని సన్నివేశంలోకి ఎలా చొప్పించాలనే దానిపై దర్శకుడికి వున్న నేర్పు అబ్బురపరుస్తుంది. బాబు చేసిన ఒక క్రైమ్‌ని కప్పి పుచ్చుకునేందుకు చేస్తోన్న అటెంప్ట్‌ తాలూకు సన్నివేశం సుదీర్ఘంగా సాగుతుంది. అక్కడ తోడుగా స్నేహితులు లేకపోయినా కానీ అతని పరస్పర విరుద్ధమైన ఆలోచనలున్న అంతరాత్మని తన స్నేహితుల రూపంలో సీన్‌లోకి తెచ్చి చేసిన స్క్రీన్‌ప్లే మ్యాజిక్‌ సూపర్బ్‌ అనిపిస్తుంది.

దర్శకుడిగా రితేష్‌ తన ముద్రని చాటుకున్న సందర్భాలెన్నో వున్నాయి. అతనికి సాంకేతిక బృందం నుంచి మంచి సహకారం లభించింది. కాలభైరవ అందించిన నేపథ్య సంగీతం, తన తండ్రి శైలిని తలపిస్తూ చేసే ఒక రకం వింత శబ్ధం లాంటివి సన్నివేశాలని బాగా ఎలివేట్‌ చేసాయి. అలాగే కెమెరా యాంగిల్స్‌ నిజంగా ఆ గదిలో వుండి చూస్తోన్న భావన కలిగిస్తాయి. రవిబాబు సినిమాల్లో కనిపించే మినిమలిస్టిక్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌తో ఈ చిత్రాన్ని కనువిందుగా తెరకెక్కించిన తీరు మెప్పిస్తుంది.

నటీనట వర్గంలో అందరూ తమవంతు న్యాయం చేసారు. అయితే కమెడియన్‌ సత్య మాత్రం తన కెరీర్‌ బెస్ట్‌ పర్‌ఫార్మెన్స్‌ ఇచ్చాడు. ఈ చిత్రానికి అతనే హీరో అంటే అతిశయోక్తి కాదు. అంతా చాలా పకడ్బందీగా చేసుకున్న దర్శకుడు రితేష్‌ డ్రగ్స్‌ మత్తులో ఎలాంటి భావనలు కలుగుతాయి. వారి అనుభూతి ఎలాగుంటుంది అనేది కళ్లకి కట్టాలని చేసిన ప్రయత్నం వల్ల చివర్లో ఆఫ్‌ ట్రాక్‌ అయినట్టు అనిపిస్తుంది. డ్రగ్స్‌ నేపథ్యంలో జరిగే కథ అయినా కానీ అంత డీటెయిలింగ్‌ అవసరం లేదేమో అనే భావన కలుగుతుంది. అసలు విలన్‌ ఎవరనేది రివీల్‌ అయిపోయిన తర్వాత జరిగే తతంగం అంత గ్రిప్పింగ్‌గా లేకపోవడం వల్ల చివర్లో కాస్త అసంతృప్తి కలుగుతుంది.

అయితే ఇలాంటి మైనర్‌ మైనస్‌లని విస్మరిస్తే క్రియేటివిటీ పరంగా, హ్యూమర్‌ పరంగా 'మత్తు వదలరా' న్యూ ఏజ్‌ తెలుగు సినిమాని ఒక అడుగు ముందుకు తీసుకెళ్లే చిత్రమవుతుంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో మంచి సినిమాలని పరభాషలని మనం వెతుక్కుని చూస్తున్నట్టే ఇతర భాషల వారు తప్పక చూసే తెలుగు సినిమాగా ఇది నిలుస్తుంది. బాక్సాఫీస్‌ రిటర్న్స్‌ ఎలా అయినా వుండొచ్చు కానీ తక్కువ బడ్జెట్‌లో ఒక చక్కని సినిమా చూసిన అనుభూతిని ఇవ్వడంలో, చూస్తున్నంతసేపు అటెన్షన్‌ డైవర్ట్‌ కాకుండా కూర్చోపెట్టడంలో 'మత్తు వదలరా' టీమ్‌ సూపర్‌ సక్సెస్‌ అయింది.

బాటమ్‌ లైన్‌: గమ్మత్తు చేసారురా!

గణేష్‌ రావూరి