రాయలసీమపై టీవీ5 యాంకర్ సాంబశివరావు విషం కక్కాడు. రాయలసీమ వాసులను ముఠాకోరులుగా, భూకబ్జాదారులుగా అభివర్ణించాడు. సీమ వాసులను అసలు మనుషులే కాదన్నట్టు లక్షలాది మంది వీక్షిస్తున్న కార్యక్రమంలో అవాకులు చెవాకులు పేలాడు. అసలేం జరిగిందంటే…
‘కేపిటల్లో కేపటలిస్టులు’ శీర్షికతో టీవీ5 చానల్లో బుధవారం రాత్రి ఏడు గంటలకు చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యాంకర్‌గా సాంబశివరావు వ్యవహరించాడు. చర్చలో భాగంగా ఆయన సుదీర్ఘ ఉపోద్ఘాత ఉపన్యాసం ఇచ్చాడు.
ఈ సందర్భంగా ఆయన ‘రాయలసీమ నుంచి డబ్బుల సంచులతో ముఠాలు వచ్చి భూములు లాక్కుంటాయన్న ఆందోళన ఉత్తరాంధ్ర వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇన్నాళ్లు ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో పులివెందుల సంస్కృతి ప్రబలుతుందోమోనని సీనియర్ నేత సబ్బం హరి అభిప్రాయపడ్డాడు. అదే నిజమయ్యేలా కనిపిస్తోందని బలహీనవర్గాలు బెదిరిపోతున్నాయి. ఇంతకాలం అన్ని వర్గాలకు ఆశ్రయమిచ్చిన వైజాగ్ ఇకపై ధనిక వర్గాలు, అగ్రకులాలు, భూకబ్జాదారులు, బెదిరింపు ముఠాలకు కేంద్రంగా మారుతుందేమోనని అంతా కలిసి విశాఖ సంస్కృతిని నాశనం చేస్తారేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు’ అని ఇష్టమొచ్చినట్టు రాయలసీమ సంస్కృతి, ఆ ప్రాంత ప్రజానీకంపై యథేచ్ఛగా విషం కక్కాడు.
సాంబశివరావుకు మనుషులంటే ఎలాంటి గౌరవ భావం లేకుండా మాట్లాడడం ఇదే మొదటి సారి కాదు. గతంలో దర్శకుడు పోసానితో చర్చ సందర్భంగా సినిమా రంగంలో లం…లేరా అని నోరుజారాడు. అప్పట్లో పెద్ద వివాదమైంది. మళ్లీ ఇప్పుడు రాజధానిని అమరావతి నుంచి విశాఖకు మారుస్తారనే చర్చ నేపథ్యంలో రాయలసీమ వాసులను రాక్షసులుగా, భూబకాసురులుగా చిత్రీకరిం చేందుకు యత్నించాడు.
ఈ చర్చలో పాల్గొన్న రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్ మాకిరెడ్డి పురుషోత్తంరెడ్డి జోక్యం చేసుకుని సాంబశివరావును ఉతికి ఆరేశాడు. సాంబశివరావుపై అతను విరుచుకుపడ్డాడు.
‘కడప గూండాలు, పులివెందుల రౌడీలు విశాఖ పోయి కలుషితం చేస్తారంటున్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే జగన్ లాంటి దుర్మార్గుడు అలాంటి పుణ్య స్థలంలో ముఖ్యమంత్రిగా ఉండే బదులు రాయలసీమకు రాజధాని ఇచ్చి ఇక్కడి నుంచే పాలన సాగించవచ్చు కదా. చంద్రబాబు, పవన్‌కల్యాణ్ లాంటి పుణ్యాత్ములు అధికారంలోకి వచ్చిన తర్వాత పవిత్రమైన అమరావతి నుంచి పరిపాలన చేయమనండి. దుర్మార్గుడైన జగన్‌ను ఎందుకు పవిత్రమైన ప్రాంతంలో ముఖ్యమంత్రిగా పెట్టారో చెప్పండి. విశాఖలో ఏదో జరిగిపోతోందని దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నారు. సబ్బం హరిని, మర్రి శశిధర్‌రెడ్డిని సాంబశివరావు కోడ్ చేస్తున్నాడు. వాళ్లిద్దరు చెప్పిన మాటలను ప్రజలు విన్నారు. 2019 లో ప్రజలు వారిని రెజెక్ట్ చేశారు. ఇంకా వాళ్లు చెప్పిన మాటలకు ప్రాధాన్యం ఇవ్వడమనేది దుర్మార్గం. వాళ్లా రాష్ట్ర ప్రజలకు ప్రామాణికం. తల్లి విజయమ్మను విశాఖలో నిలబెట్టి భూకబ్జాలు చేయాల్నా. విష ప్రచారం ఆపండి? దుర్మార్గులంతా రాయలసీమ నుంచి పరిపాలిస్తారు. సన్మార్గులంతా అమరావతి నుంచి ప్రచారం చేస్తారు. ఈ విషయమై తీర్మానం చేయండి (సాంబశివరావుకు వెటకారంతో కూడిన చీవాట్లు). మా ప్రాంతంలో నిరాహార దీక్షలో కూర్చున్న వాళ్లను చంపే సంస్కృతి లేదు (ఎత్తి పొడుపు)’ అని పురుషోత్తమరెడ్డి తీవ్ర స్థాయిలో సాంబశివరావుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఈ చర్చ కొనసాగింపులో భాగంగా బీజేపీ నేత సత్యమూర్తి మాట్లాడుతూ పల్నాడులో, ఉభయగోదావరి జిల్లాలోని ఒక ఊరిలో ఫ్యాక్షన్ ఉందని, అంత మాత్రాన ఒక ప్రాంతాన్ని కించపరిచేలా మాట్లాడ్డం తగదని సాంబశివరావు చెంప చెళ్లుమనేలా హితవు పలికాడు. సహజంగా చర్చలో పాల్గొన్న రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నేతల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. కానీ టీవీ5 సాంబశివరావు అహంకారం, కండకావరం వల్ల తనే ఓ సమస్యగా తయారవుతున్నాడు.
రాయలసీమపై దుర్మార్గంగా మాట్లాడడమే కాకుండా, తప్పును సరిదిద్దుకోవాల్సింది పోయి, కప్పి పుచ్చు కునేందుకు తెరపైకి ఉదాహరణలు తీసుకురావడం అతని కుసంస్కారాన్ని, అహంభావ ధోరణిని తెలియజేస్తోందని రాయలసీమ వాసులు మండిపడుతున్నారు. రాయలసీమ సంస్కృతితో పాటు ప్రజలను ముఠాకోరులుగా, భూకబ్జాదారులుగా చిత్రీకరించే యత్నం చేసిన సాంబశివరావుపై రాయలసీమ వాసులు న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం.