విశాఖ రాజధాని కూడా కమ్మగానే…!?

రాజధాని పేరు మారుతుంది కానీ మిగిలిందంతా సేమ్ టూ  సేమ్ అంటున్నారు రాజకీయ సామాజిక విశ్లేషకులు. అమరావతిలో ఒక సామాజికవర్గం ఆధిపత్యం బాగా పెరిగిపోయిందన్న కారణం కూడా రాజధాని సైజ్ తగ్గించడానికి ప్రధాన కారణం.…

రాజధాని పేరు మారుతుంది కానీ మిగిలిందంతా సేమ్ టూ  సేమ్ అంటున్నారు రాజకీయ సామాజిక విశ్లేషకులు. అమరావతిలో ఒక సామాజికవర్గం ఆధిపత్యం బాగా పెరిగిపోయిందన్న కారణం కూడా రాజధాని సైజ్ తగ్గించడానికి ప్రధాన కారణం.

అయితే విశాఖ గత నాలుగు దశాబ్దాలుగా కమ్మవారి ఆధిపత్యంలోకి చాలానే  వెళ్ళిపోయింది. విశాఖ మూలవాసులు ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా నెగ్గి చాలా దశాబ్దాలే అవుతోంది. అంతా వలసవాదులదే రాజ్యం. వారిదే రాజకీయ ఆధిపత్యం.

విశాఖ చివరి ఎంపీగా స్థానిక నాయకుడు, ఇక్కడ ప్రాంతానికి చెందిన వారు అయిన మాజీ మంత్రి భాట్టం శ్రీరామమూర్తి 1984లో గెలిచారు. ఆయన బ్రాహ్మిణ్ సామాజివర్గానికి చెందినవారు. ఆయనకు పార్టీ పెట్టిన కొత్తల్లో టీడీపీ పొరపాటునో గ్రహపాటునో టికెట్ ఇచ్చింది.

అంతే ఆ తరువాత టీడీపీ నుంచి నాలుగు సార్లు విశాఖ ఎంపీ టికెట్ కమ్మ సామాజివర్గానికి చెందిన ఎంవీవీఎస్ మూర్తికి ఇస్తే ఆయన రెండు సార్లు గెలిచారు. రెండు సార్లు ఓడారు. ఇక ఆయన మనవడు శ్రీభరత్ కి తాజా ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఇచ్చారు. ఓ విధంగా విశాఖ ఎంపీ టికెట్ ని కమ్మ సామాజివర్గానికి టీడీపీ రిజర్వ్ చేసినట్లుగా విమర్శలు కూడా వచ్చాయి.

ఇక కాంగ్రెస్ నుంచి నెల్లూరుకు కి చెందిన సుబ్బరామిరెడ్డికి రెండు సార్లు ఇస్తే ఆయన ఒకసారి గెలిచి ఒకసారి ఓడారు. అంతకు ముందు కేరళకు చెందిన ఉమా గజపతిరాజుకు కాంగ్రెస్ రెండు సార్లు టికెట్ ఇస్తే ఆమె ఒకసారి గెలిచారు.

ఇక కాంగ్రెస్ నుంచి మాజీ సీఎం నెల్లూరుకు చెందిన నేదురుమల్లి జనార్ధనరెడ్డికి టికెట్ ఇస్తే విశాఖ ఎంపీ అయ్యారు. 2009 నాటికి కాంగ్రెస్ కూడా కమ్మ సామాజికవర్గానికి చెందిన దగ్గుబాటి పురంధేశ్వరికి టికెట్ ఇచ్చి ఎంపీని చేసింది.

అదే విధంగా 2014 నాటికి బీజేపీ కూడా ఎంపీ టికెట్ ని కమ్మ సామాజిక‌వర్గానికి చెందిన కంభంపాటి హరిబాబుకు ఇచ్చి టీడీపీ మద్దతుతో గెలిపించుకుంది. 2019 ఎన్నికల్లో సైతం ప్రధాన పార్టీల నుంచి  కమ్మ వారు ఎంపీ కోసం పోటీ పడితే వైసీపీ నుంచి కమ్మ సామాజికవర్గానికి చెందిన ఎంవీవీ సత్యనారాయణ గెలిచారు.

ఇలా సుదీర్ఘ కాలం ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా కూడా విశాఖ రాజకీయాల్లో కమ్మ వారి డామినేషన్ చూపిస్తున్నారన్న ప్రచారమైతే ఉంది.  అదే విధంగా హొటల్ రంగంతో పాటు, టూరిజం, రియల్ ఎస్టేట్, విద్యారంగంలో వారిదే ప్రధాన పాత్రగా విశాఖ జిల్లాలో ఉంది.

ఆర్ధికంగా, రాజకీయంగా, సామాజికంగా బాగా ముందువరసలో ఉన్న కమ్మ సామాజికవర్గానికి విశాఖతో పాటు ఉత్తరాంధ్రలోనూ పెద్ద ఎత్తున భూములు ఉన్నాయని కూడా ప్రచారంలో ఉంది. అందువల్ల వారి కోణం నుంచి చూస్తే రాజధాని విశాఖలో పెట్టినా కూడా ముందుగా అభివ్రుధ్ధి ఫలాలు అందుకునేది ఈ సామాజికవ‌ర్గమేనని విశ్లేషణలు ఉన్నాయి. ఈ కారణంగానే టీడీపీకి చెందిన స్థానిక నేతలు సైతం జై విశాఖ అంటున్నారని పేర్కొంటున్నారు.