వెంకయ్య.. జగన్‌ను టార్గెట్ చేస్తున్నారా?

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డిని టార్గెట్ చేస్తున్నారా? రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుపడుతూ.. లోపాలు ఎంచుతున్న వెంకయ్యనాయుడు.. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండికూడా.. ఆ స్థాయికి, స్థానానికి తగని రీతిలో రాజకీయ…

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డిని టార్గెట్ చేస్తున్నారా? రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుపడుతూ.. లోపాలు ఎంచుతున్న వెంకయ్యనాయుడు.. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండికూడా.. ఆ స్థాయికి, స్థానానికి తగని రీతిలో రాజకీయ విమర్శలకు సిద్ధపడుతున్నారా? అనే అనుమానాలు ప్రజలకు కలుగుతున్నాయి. ఏపీ పర్యటనలో ఆయన మాటలను గమనిస్తున్నప్పుడు.. ఆయన తన సొంత అభిప్రాయాలనే చెబుతున్నారా? లేదా, ఇతర రాజకీయ శక్తుల ప్రభావానికి లోనవుతున్నారా? అనే అభిప్రాయం కూడా ప్రజలకు కలుగుతోంది.

వెంకయ్యనాయుడు తాజాగా ఏపీ పర్యటనకు వచ్చారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అమరావతినుంచి రాజధానిని తరలించరాదంటూ..ఆందోళన చేస్తున్న సమూహాలను కలిసి వారి వాదన విన్నారు. ఈ విషయాన్ని ఎవరి దృష్టికి తీసుకువెళ్లాలో.. వారికి చెబుతానని ‘హెచ్చరిక’ అనిపించే విధంగా మాట్లాడారు. ఆ తర్వాత విలేకర్లతో ఇష్టాగోష్టిలో ఆయన చేసిన కామెంట్లు ప్రజలకు మరిన్ని అనుమానాలు కలిగిస్తున్నాయి.

అధికార వికేంద్రీకరణ ఉద్దేశంతో రాష్ట్రానికి మూడు రాజధానుల ఆలోచనను వెంకయ్యనాయుడు తప్పు పడుతున్నారు. పరిపాలన ఒకేచోట నుంచి జరగాలి.. అభివృద్ధిని మాత్రం వికేంద్రీకరించాలి అని ఆయన సూచిస్తున్నారు. ఆ నిర్ణయాలలో మంచి చెడులు ఎలాగైనా ఉండవచ్చు గాక.. కానీ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ.. అచ్చంగా రాజకీయ నిర్ణయాలలో వేలు పెట్టినట్లుగా ఈ మాటలు ఉన్నాయనే అభిప్రాయం పలువురికి కలుగుతోంది. పైగా అమరావతి ప్రాంత రైతులు వచ్చి తనను కలిశారని, వారి కన్నీళ్లు చూసి.. తన హృదయం కలచివేసినట్లు అయిందని.. కరుణరసాత్మకంగా ఆయన మాట్లాడడం కూడా.. ఇండైరక్టుగా జగన్ మీదకు రాజకీయ విమర్శలు  సంధించినటేల ప్రజలు భావిస్తున్నారు.

పేదలందరూ హర్షిస్తున్న ఇంగ్లిషు మీడియం విషయంలోనూ వెంకయ్య పలు కామెంట్లు చేశారు. తెలుగును కాపాడడానికి మరిన్ని చర్యలు ఎలా తీసుకోవాలో చెప్పి ఉంటే చాలా బాగుండేది. కానీ, ప్రభుత్వ పాఠశాలల్లో మాతృభాషలో బోధన జరగాలనడం, తెలుగును లేకుండా చేస్తున్నారనడం అభ్యంతరకరంగా ఉన్నాయని ప్రజలు అనుకుంటున్నారు.