మూడు రాజధానులపై మౌనం ఎందుకు జగన్!

ప్రభుత్వ బడుల్లో తెలుగు మీడియం స్థానంలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెడుతున్నామంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సందర్భంలో ఎంత రభస జరిగిందో అందరం చూశాం. తన నిర్ణయంపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నవేళ సీఎం జగన్…

ప్రభుత్వ బడుల్లో తెలుగు మీడియం స్థానంలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెడుతున్నామంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సందర్భంలో ఎంత రభస జరిగిందో అందరం చూశాం. తన నిర్ణయంపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నవేళ సీఎం జగన్ కూడా ఘాటగానే స్పందించారు. మీ పిల్లలు, మీ మనవళ్లు ఎక్కడ చదువుతున్నారు? పేదల పిల్లలు ఇంగ్లిష్ మీడియం చదువుకుంటామంటే మీకెందుకు కడుపుమంట అంటూ ప్రతి ఒక్కరికీ పేరుపేరునా చాకిరేవు పెట్టారు.

అనూహ్యంగా రాష్ట్రమంతా జగన్ వెంటే నిలిచింది. జగన్ నిర్ణయాన్నే అందరూ సమర్థించారు, మొదట్లో వ్యతిరేకించిన వారు కూడా చివరకు సమర్థించాల్సి వచ్చింది. ఇప్పుడు అదే స్థానంలో రాజధాని సమస్య వచ్చి చేరింది. మూడు రాజధానుల నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. సమర్థించేవారు కొందరు, వ్యతిరేకించేవారు ఇంకొందరు, సవరణలు సూచించేవారు మరికొందరు.

అమరావతి ప్రాంతంలో టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు జరుగుతున్నాయి. రైతుల పేరుతో చాలామంది రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు. బీజేపీ కూడా అదే పాట పాడుతోంది, జనసేన ఊగిసలాడుతోంది. అయితే ఈసారి జగన్ మాత్రం మౌనంగా ఉన్నారు. అసెంబ్లీలో మినహా మిగతా ఎక్కడా రాజధాని గురించి కానీ, జీఎన్ రావు కమిటీ నివేదిక గురించి కానీ పెదవి విప్పలేదు. ఎలాంటి స్టేట్ మెంట్లు ఇవ్వలేదు, ఎవర్నీ విమర్శించనూ లేదు.

ఈలోగా జరగాల్సిందంతా జరిగిపోతోంది. అమరావతిని సపోర్ట్ చేస్తున్నవాళ్లంతా ఆటోమేటిక్ గా మిగతా రెండు ప్రాంతాల్లో విలన్లుగా మారిపోయారు. జనసేనాని అందుకే వెనకడుగేశారు, చంద్రబాబుకి తన సామాజిక వర్గాన్ని కాపాడుకోవడంతో పాటు, తనతో పాటు భూములు కొన్నవారందరికీ భరోసాగా ఉండాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆయన ఆందోళనలకు మద్దతిస్తున్నారు. బీజేపీ, వామపక్షాల నేతల్ని వారి మాటల్ని ఎవరూ సీరియస్ గా తీసుకోరు కాబట్టి పెద్ద సమస్య లేదు.

మీడియం గోలకీ, రాజధాని రచ్చకీ మధ్య సీఎం జగన్ మాత్రం తన వ్యూహాన్ని పూర్తిగా మార్చేశారు. తనకి తానుగా ఎవర్నీ విమర్శించడంలేదు, జనం దృష్టిలో వారినే విలన్లుగా నిలబెడుతున్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నవారిని పల్లెత్తు మాట అనడంలేదు. వాళ్లకు వాళ్లే తెలుసుకుంటున్నారు. ఇలా రాజధాని విషయంలో వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు.