చిత్రం: మైఖేల్
రేటింగ్: 2.25/5
తారాగణం: సందీప్ కిషన్, దివ్యాంశీ కౌశిక్, వరుణ్ సందేశ్, గౌతం వాసుదేవ్ మీనన్, విజయ్ సేతుపతి, అయ్యప్ప శర్మ, అనసూయ, వరలక్ష్మి తదితరులు
సంభాషణలు: కిరణ్ చక్రవర్తి
సంగీతం: శాం సి.ఎస్
కెమెరా: కిరణ్ కౌశిక్
ఎడిటింగ్: సత్యనారాయణన్
నిర్మాతలు: భరత్ చౌదరి, పుష్కర్ రాం మోహన్ రావ్,
కథ-స్క్రీన్ ప్లే- దర్శకత్వం: రంజిత్ జయకోడి
విడుదల: 3 ఫిబ్రవరి 2023
చాలా కాలం తర్వాత సందీప్ కిషన్ తెర మీదకొచ్చాడు..అది కూడా ఐదు భాషల్లో పాన్ ఇండియా లెవెల్లో.
కథ 1990ల నేపథ్యంలో మొదలౌవుతుంది, నడుస్తుంది. మైఖేల్ లక్ష్యం తన తండ్రిని చంపడం. ఆ లక్ష్యంతో చిన్నవయసులోనే గురునాథ్ అనే ఒక డాన్ దగ్గర చేరతాడు. క్రమంగా బాస్ కి రైట్ హాండైపోతాడు. అది గురునాథ్ కొడుకుకి నచ్చదు. మైఖేల్ అడ్డుని తొలగించుకోవాలనుకుంటాడు. ఇదిలా ఉండగా తీర అనే ఒకమ్మాయిని, ఆమె తండ్రిని చంపమని గురునాథ్ మైకేల్ కి పని అప్పజెప్తాడు.
ఎవరీ తీరా? ఎందుకు చంపాలి? ఇంతకీ చంపుతాడా లేదా అనేది కథ.
ఈ కథ మొదట్లో ఆకట్టుకునే విధంగానే ఉంటుంది. యాంబియెన్స్, మూడ్ బాగానే సెట్టయ్యాయి. కేజీఎఫ్ పాటర్న్ ని ఫాలో అయిపోయి తీసిన సినిమా ఇది. కానీ క్రమంగా విషయశూన్యత బయటపడుతూ వస్తుంది. అయ్యప్ప శర్మ వాయిసోవర్లో చాలా కథ నడిచిపోయినా తెర మీద చూడాల్సిన పని బాగానే పెట్టాడు దర్శకుడు. ఒక దశలో మొత్తం కథ అయ్యప్ప శర్మే టకటక చెప్పేస్తే అరగంటలో అయిపోయేది కదా అనిపిస్తుంది.
హీరోయిన్ ఒకచోట “హస్లే యార్..ఇట్స్ ఎ జోక్” అంటుంది. అది ప్రేక్షకుల్ని అన్నట్టే అనుకోవాలి. ఎందుకంటే సినిమా చిరాకుపెడుతున్నప్పుడల్లా నొసట్లు చిట్లించకుండా అది జోకని నవ్వడమో, ట్విస్టనుకుని ఆశ్చర్యపడడమో, పవర్ఫుల్ డైలాగనుకుని ఈల కొట్టడమో, సెంటిమెంటనుకుని ఏడవడమో చెయ్యాలి. సినిమా ప్రేక్షకుడి స్థాయిలో లేనప్పుడు ప్రేక్షకుడే సినిమా స్థాయికి దిగి చప్పట్లు కొట్టాలి. లేకపోతే రెండున్నర గంటలు ఓర్చుకోవడం కష్టం.
ఈ సినిమాలో ల్యాగ్ నిర్దాక్షణ్యంగా ఉంది. కొన్ని వెబ్సిరీస్ చూసి ఆ పేస్ కి అలవాటు పడి తీసాడేమో దర్శకుడు అనిపిస్తుంది. సినిమాలో ఎక్కడా కూడా హుక్ ఫ్యాక్టర్ తగలదు. దేనికోసం ఉత్కంఠగా వేచి ఉండాలో అర్థం కాదు. అంత కంగాళీగా నడుస్తుంటుంది కథనం. దర్శకత్వం చాలా బలహీనంగా ఉంది అనుకున్నప్పుడే ఒక డైలాగ్ వినిపిస్తుంది- “సందర్భాన్ని బట్టి సింహం బలహీనపడొచ్చు కానీ వేట మర్చిపోదు” అని. దానిని దర్శకుడికి అన్వయించుకుని ప్రేక్షకుడు వెయిట్ చేస్తూ కూర్చోవాలంతే.
కెమెరా పనితనం, కలర్ టోనింగ్, నేపథ్యసంగీతం కేజీఎఫ్ టైపులో పెట్టేసి అయినదానికి కానిదానికి బిల్డప్ సీన్స్ పెట్టేస్తే పాన్ ఇండియా స్టార్డం వచ్చేస్తుందని సందీప్ అనుకున్నాడేమో! కథనం మీద హోం వర్క్ చేయకుండా చాలా పొరపాటు చేసాడు.
సందీప్ నటనపరంగా చేసిందేమీ లేదు. డైలాగ్స్ లేవు, ఎక్స్ప్రెషన్స్ అంతకన్నా లేవు. సింగిల్ ఎక్స్ప్రెషన్ తో సినిమా మొత్తం లాగించేసాడు. ఎక్కడా తను చేస్తున్న పాత్ర మీద ఆసకి ఉన్నట్టుగాని, నిబద్ధత ఉత్సాహం చూపిస్తున్నట్టుగానీ లేదు. సినిమా అంతా అయ్యాక సందీప్ ఎలా చేసాడు అంటే, డల్ మొహం గుర్తొస్తుందంతే. ఇక ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పడానికి సందీప్ గట్టిగా ఒక గంట కేటాయించి ఉండొచ్చు. హీరోకి అతి తక్కువ డైలాగులున్న సినిమా ఇదే కావొచ్చు.
హీరోయిన్ దివ్యాంశి కంటికింపుగా ఉంది. పాత్ర పరంగా మాత్రం కంఫ్యూసింగ్ గా ఉంది. అన్నీ నాన్ సింక్ ఎమోషన్స్ ప్రదర్శిస్తూ ఉంటుంది. అది ఆమె లోపం కాదు. దర్శకుడి శాపం.
వరుణ్ సందేశ్ మాత్రం అసూయాపరుడైన డాన్ కొడుకుగా సరిగ్గా సరిపోయాడు.
గౌతం వాసుదేవ్ మీనన్ ఈ పాత్రకి పెద్ద మైనస్. పీల గొంతుతో అంత విలనీని ఎలా పండిద్దామనుకున్నాడో. పవర్ఫుల్ డబ్బింగ్ వాయిస్ పెట్టినా కొంత వరకు బాగుండేది.
అనసూయ కనిపించిన కాసేపూ ఎక్స్ప్రెషన్స్ పండించింది.
విజయ్ సేతుపతి, వరలక్ష్మి పాత్రలకు బిల్డప్పే తప్ప పస లేదు.
డైలాగ్స్ విషయానికొస్తే కొన్ని బాగా డెప్త్ ఉన్నట్టుగా అనిపించే కొటేషన్స్ లాంటివి ఉన్నాయి. కొన్నైతే అతి పేలవంగా ఉన్నాయి. స్పైడర్ గురించి వాసుదేవ్ మీనన్ చెప్పే డైలాగ్, అలాగే ఎదుగుతున్న మనిషిని ఎలా కంట్రోల్ చేయలేమో చెప్తూ నిప్పు-గాలి కి సంబంధించిన ఉపమానం, విశ్వాసం- గొలుసు అంటూ సాగే వన్ లైనర్ బాగున్నాయి.
టెక్నికల్ గా సినిమా చాలా రిచ్ గా ఉంది. కెమెరా వర్క్, నేపథ్య సంగీతం, ప్రొడక్షన్ వేల్యూస్ అన్నీ బాగున్నాయి. కానీ అసలు ఉండాల్సిన కథలో లోతు, కథనంలో పట్టు లేవు.
మరొక విషయమేంటంటే సినిమాలో తెరమీద ఆద్యంతం అందరూ ధూమపానమే. హాలంతా పొగచూరిపోయిందేమో అనిపిస్తుంది జరుగుతున్నది తెర మీదే అయినా. హీరోలైనా, విలన్లైనా ఏటిట్యూడ్ చూపించడానికి ధూమపానం తప్ప మరొక ఐడియాయే తట్టకపోవడం భావదారిద్ర్యమే.
ఇత్తడికి పుత్తడి రంగద్దితే అది బంగారమైపోదు. అరకొర కథకి కేజీఎఫ్ ట్రీట్మెంట్ ఇచ్చినంత మాత్రాన అది పాన్ ఇండియా సక్సెసైపోదు. ఈ సినిమా చెప్పే నీతి ఇదే.
బాటం లైన్: మై”ఖేల్” ఖతం