నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని మహానటుడిగా ఆయన స్నేహితుడు, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ సెటైర్ విసిరారు. ఇవాళ కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ గతంలో ఆనం వివేకానందరెడ్డి కార్పొరేషన్‌లో పోటీ చేసేందుకు సీటు ఇచ్చి గెలిపించారని, మరి ఆ సంగతి మరిచిపోయావా? అని నిలదీశారు. ఆనం వివేకాకు అనిల్ వెన్నుపోటు పొడిచినట్టుగా కోటంరెడ్డి ఆరోపించారు. అలాగే తనపై కోపం వుంటే విమర్శించాలే తప్ప, తన పిల్లలు ఏం చేశారని శపిస్తున్నావని కోటంరెడ్డి ప్రశ్నించడంపై అనిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కోటంరెడ్డికి అనిల్ దీటైన కౌంటర్ ఇచ్చారు. 12 ఏళ్లలో ఇద్దరం కలిసి రాజకీయ ప్రయాణం సాగించామన్నారు. ఎత్తుగడలు వేశామన్నారు. చిన్నచిన్న రాజకీయ కుట్రల్ని కలిసే చేశామని చెప్పుకొచ్చారు. గతంలో పలుమార్లు శ్రీధర్‌రెడ్డితో తాను నేరుగా ఓ విషయం చెప్పేవాడినన్నారు. పొరపాటున రాజకీయాల్లోకి వచ్చావని శ్రీధర్‌తో ఎన్నోసార్లు అన్నట్టు అనిల్ చెప్పారు. నువ్వు కూడా సినిమాల్లోకి వెళ్లి వుంటే ఎస్వీ రంగారావు, కోట శ్రీనివాసరావులను మైమరిపించేవాడివని శ్రీధర్‌రెడ్డితో అన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
వాళ్లందరి కంటే నువ్వు పెద్ద మహానటుడివని అనేక సార్లు శ్రీధర్‌రెడ్డితో చెప్పానని ఆయన చెప్పుకొచ్చారు. మహానటి సినిమాలో సావిత్రిని … అమ్మా నువ్వు రెండు బొట్లు కన్నీరు కార్చమని అడిగితే ఏ విధంగా నటిస్తారో, మన శ్రీధరన్న ఒక్క కన్నీటి బొట్టు కార్చమంటే కార్చే సమర్థుడని వెటకరించారు. దాన్నేదో సింపతీ పొందేందుకు… నా తమ్ముడు నా బిడ్డల్ని ఇలా అన్నాడని చెప్పడం తనను విమర్శించడం కరెక్ట్ కాదన్నారు. మీ బిడ్డల్ని ఏమీ అనలేదని కోటంరెడ్డికి బదులిచ్చారు.
భావోద్వేగమైన నటన అందరూ చూశామన్నారు. మనందరిదీ ఒకే స్కూల్ అని అనిల్ చెప్పుకొచ్చారు. 51 సెకెండ్ల వీడియోలో ఏముందో ఇవ్వమని అడిగానన్నారు. లేదంటే రాజీనామాలు చేద్దామని సవాల్ విసిరామన్నారు. అనుమానం జరిగిన చోట తాను ఉండనని కోటంరెడ్డి చెప్పారని, కానీ అనుమానం వస్తే సీఎం జగన్ ఉంచరన్నారు. ఆ విషయం తెలిసే కోటంరెడ్డి ముందే దాటుకున్నారని ఆయన అన్నారు.
మాజీ మంత్రి అనిల్ డిమాండ్ చేసిన వాటికి కోటంరెడ్డి అసలు సమాధానం ఇవ్వలేదు. 51 సెకెండ్ల వీడియోను విడుదల చేయాలని అనిల్ కోరారు. దానిపై కోటంరెడ్డి నుంచి సమాధానం లేదు. అలాగే ట్యాంపరింగ్ కాదని తానంటున్నానని, ఔనని కోటంరెడ్డి అంటున్నారని, నిగ్గు తేల్చేందుకు రాజీనామాకు సిద్ధమా అని అనిల్ విసిరిన సవాల్‌కు అటు వైపు నుంచి నో ఆన్సర్. దీంతో కోటంరెడ్డి వాదనలో పస లేదని తేలిపోయింది. కేవలం దబాయింపునకు కోటంరెడ్డి దిగారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.