పోలీస్ అంటే జనాలలో భయం ఉంటుంది. ఖాకీ దుస్తులు చూస్తేనే ఏదో తెలియని టెన్షన్ ఉంటుంది. ఇంట్లో పోలీస్ ఉన్నా ఫ్యామిలీ మెంబర్స్ కాస్తా ఆలోచించి మాట్లాడతారు. డిపార్ట్మెంట్ డ్యూటీస్ వారి ప్రోటోకాల్ అలా ఉంటాయి. ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ఎంత చెప్పినా జనాలకు పోలీసులు అయితే పూర్తిగా దగ్గర కాలేకపోతున్నారు.
జనాలకు తాము చేరువ కావడానికి పోలీసులు ఎన్నో ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ప్రజలతో పోలీసులు ఎంత దగ్గరగా ఉంటే అంత దూరంగా నేరాలు జరుగుతాయి. పోలీసులకు కూడా విచారణకు సులువు అవుతుంది. అందువల్ల ఉభయకుశలోపరిగా అటూ ఇటూ ఉండాలంటే జన సంబంధాలు పోలీసులకు అవసరం.
విశాఖపట్నం మెగా సిటీ. అన్నిందాలా ప్రత్యేకతను చాటుకుంటున్న ఈ సిటీ ఇపుడు పోలీసుల రిలేషన్స్ విషయంలో కొత్త పుంతలు తొక్కేలా వినూత్న కర్యక్రమాన్ని తీసుకొచ్చింది. డయల్ యువర్ కమిషనర్ పేరిట ఈ రోజు విశాఖ పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఇక మీదట ప్రతీ శుక్రవారం ప్రజలు నేరుగా తమ సమస్యలు పోలీస్ కమిషనర్ కి చెప్పుకోవచ్చు. ఉదయం పదకొండు నుంచి పన్నెండు గంటల మధ్య గంట పాటు సాగే ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు నేరుగా సీపీతోనే మాట్లాడవచ్చు. వినతులు చేసుకోవచ్చు. ఫిర్యాదు చేయవచ్చు. డిపార్ట్మెంట్ లో జరిగే అలసత్వం మీద కూడా వారు సీపీకి కంప్లైంట్ ఇవ్వవచ్చు.
ఇలా విశాఖ కమిషనర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం ద్వారా విశాఖ సిటీలో పాతిక లక్షల పై చిలుకు ఉన్న ప్రజలతో నేరుగా కనెక్టివిటీని పెంచాలని చూస్తున్నారు. అలాగే వారి సమస్యలకు పరిష్కారం కూడా చూపించాలని చూస్తున్నారు. అందుకోసం 08912523408 కి డయల్ చేయాల్సి ఉంటుంది.
ఈ నంబర్ కి కాల్ చేసి సమస్యలు చెప్పుకుంటే అక్కడికక్కడే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేశామని సీపీ అంటున్నారు. ఇప్పటికే వాట్సప్ ద్వారా 100 నంబర్ కి డయల్ చేయడం ద్వారా అత్యవసర ఫిర్యాదులను పోలీసులు తీసుకుంటున్నారు. డయల్ యువర్ సీపీ కార్యక్రమం సక్సెస్ అయితే విశాఖ స్మార్ట్ సిటీగా మరింతగా రాణిస్తుంది అని భావిస్తున్నారు.