విశాఖ సహా ఉత్తరాంధ్రా మీద భారత్ రాష్ట్ర సమితి దృష్టి పెట్టింది. ఈ నెల 5న మహారాష్ట్రలోని నాందేడ్ లో మీటింగ్ తరువాత విశాఖలోనే బీఆర్ఎస్ ఆవిర్భావ సభ జరుపుతారు అని అంటున్నారు. ఈ లోగా కొందరు బడా నేతలను బీఆర్ఎస్ లోకి చేర్పించాలని ఆ పార్టీ చూస్తోంది.
విశాఖకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుని కుత్బుల్లాపూర్ కి చెందిన ఎమ్మెల్యే వివేకానంద తాజాగా కలసి మంతనాలు జరపడం రాజకీయంగా చర్చనీయాంశంగా ఉంది. గంటాతో మర్యాపపూర్వక భేటీ అని చెబుతున్నా బీఆర్ఎస్ పెద్దల నుంచి రాయబారాన్ని ఆయన తీసుకుని వచ్చారని అంటున్నారు.
తాను తెలుగుదేశంలో మరోమారు యాక్టివ్ గా ఉంటానని గంటా ఈ మధ్యనే చెప్పారు. అయితే మరో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు గంటా మీద దారుణంగా విమర్శలు చేశారు. దాంతో ఆయన హర్ట్ అయ్యారు. సొంత పార్టీలో ప్రత్యర్ధుల వైఖరిని తట్టుకోలేకపోతున్నారు అని అంటున్నారు. అయితే గంటా పార్టీ మారుతారా అన్న సందేహాలు అలాగే ఉన్నాయి.
బీఆర్ఎస్ లోకి గంటా వస్తే పెద్ద పీట వేస్తారని ఒక విధంగా ఆయన చేతికే పార్టీ అన్నట్లుగా ప్రచారం అయితే ఉంది. గంటా ఏమి చెబుతారో కానీ బీఆర్ఎస్ అధినాయకత్వం గంటా కావాలని, రావాలని మనసారా కోరుకుంటోంది అని అంటున్నారు. ఈ మధ్యనే కాపునాడు కు చెందిన నాయకుడు తోట రాజీవ్ అయితే గంటా బీఆర్ఎస్ లోకి వెళ్తారు అని హింట్ ఇచ్చేశారు అంటున్నారు.
విశాఖ నుంచి మరోమారు ఎంపీగా పోటీ చేయడానికి చూస్తున్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు బీఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ నుంచి ఫోన్ వచ్చినట్లుగా ప్రచారం సాగుతోంది. జేడీ బీఆర్ఎస్ లో చేరితే విశాఖ నుంచి ఆయనే ఎంపీ అభ్యర్ధి అని అంటున్నారు. జేడీ ఈ విషయంలో మంత్రి గారికి ఏమి హామీ ఇవ్వలేదని అంటున్నా రానున్న రోజుల్లో మారే రాజకీయ పరిణామాలను బట్టే ఏ విషయం తెలుస్తుంది అని అంటున్నారు.