జగన్ గారూ, చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించి, అక్కడే అన్నీ పెడతానంటూంటే రాష్ట్రంలో తక్కిన ప్రాంతాల సంగతేమిటి? అంటూ నాబోటి వాళ్లం వాపోయాం. అభివృద్ధిని అన్ని ప్రాంతాలకూ పంచిపెట్టకపోతే హైదరాబాదు అనుభవం పునరావృతం అవుతుంది కదాని బాధపడ్డాం. ప్రతిపక్షంలో ఉన్న మీరు అధికారంలోకి వచ్చాక అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తానంటే సంతోషించాం. మీరంతటితో ఆగలేదు, పాలనా వికేంద్రీకరణ పేరుతో రాజధానిని కూడా మూడు ప్రాంతాలకూ పంచిపెడతానన్నారు. రాజధాని కోస్తాకు వచ్చింది కాబట్టి, హైకోర్టు రాయలసీమ కివ్వడం న్యాయం అనే సూత్రాన్ని బాబు విస్మరించినా మీరు శ్రీబాగ్ ఒడంబడికను గుర్తు చేసుకుని, హైకోర్టును కర్నూలుకి తరలిస్తామన్నారు. మంచిదే, న్యాయం జరిగిందనుకున్నాను. కానీ దానికి న్యాయ రాజధాని అని పేరు పెట్టడమేమిటి విడ్డూరంగా అనుకున్నాను. ‘కొన్ని రాష్ట్రాలలో హైకోర్టు వేరే చోట ఉంది కానీ వాళ్లెవరూ దాన్ని న్యాయరాజధానిగా వ్యవహరించరు. ఈయనేదో కొత్త పేరు పెట్టాడు’ అనుకున్నాను.
అంతటితో ఆగక, కోస్తా కిచ్చిన రాజధానిని కూడా శాసన రాజధాని, కార్యనిర్వాహక రాజధాని అంటూ రెండుగా చీలుస్తానన్నారు మీరు. అదెందుకంటే వెనకబడిన ఉత్తరాంధ్రకు న్యాయం చేయడానికి అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో వెనకబడిన ప్రాంతాల్లో అసెంబ్లీ సమావేశాల్లో ఒకటి రెండు సెషన్స్ నిర్వహిస్తారు. వాటిని రాజధాని అని పిలవరనుకోండి. అలాగే వైజాగ్‌లోనూ నిర్వహించవచ్చు. మరీ ముచ్చటగా ఉంటే దానికీ రాజధాని పేరు పెట్టుకోవచ్చు, సరేలే అని జనం ఊరుకున్నా, ప్రతిపక్షాలు ఊరుకోలేదు. మూడు రాజధానులు, మూడు ముక్కలాట అంటూ మొదలుపెట్టారు. రాష్ట్ర రాజధాని ఏది అని అడిగితే స్కూలు పిల్లలు ఏ ఆన్సర్ రాయాలో తెలియక తికమక పడిపోతున్నారంటూ వాపోయారు. ఒక్క రాజధాని కట్టడానికే దిక్కు లేదు, మూడెలా కడతాడంటూ లాజిక్ లాగారు, కోర్టుల కెళ్లారు. కేసు అక్కడ నలుగుతోంది.
అమరావతిలో యిప్పటికే బిల్డింగులున్నాయి కాబట్టి అక్కడే కార్యనిర్వాహక రాజధాని ఉండడం సబబు. హైదరాబాదు నుంచి అక్కడకు తరలి వచ్చిన ఉద్యోగులు నివాసమేర్పరుచుకున్నారు. కొన్నేళ్లగా ప్రభుత్వం అక్కడే నడుస్తోంది. మీరు పంతం పట్టి కార్యనిర్వాహక రాజధానిని వైజాగ్‌కు మారుద్దా మనడంతోనే గొడవవుతోంది. రాజధాని కట్టడానికి మా దగ్గర డబ్బు లేదు, ఉన్నా దానికై వెచ్చించడం వేస్టు అని వాదిస్తున్న మీరు వైజాగ్‌లో సెక్రటేరియట్ వగైరాలు కట్టడానికి ఎలా సిద్ధపడుతున్నారు? అమరావతిలో యిప్పుడున్న పరిస్థితుల్లోనే బండి నడుపుతూ పోవచ్చు కదా, కొత్త సెక్రటేరియట్, అక్కడికి ఉద్యోగుల తరలింపు యీ బాదరబందీ అంతా ఎందుకు? అనవసర ఖర్చెందుకు? దీనికి సరైన సమాధానం చెప్పకుండా దాటవేస్తూన్న మీరు వికేంద్రీకరణ పేరుతో మీరనునుకున్నది చేసేద్దామని చూస్తున్నా రనిపిస్తోంది.
ప్రస్తుతం వ్యవహారం కోర్టులో ఉంది కాబట్టి ఆగారు కాబోలనుకుంటూంటే, మీరు దిల్లీలో గ్లోబల్ ఇన్వెస్టర్ల సన్నాహక సదస్సులో అన్న మాటలు షాకిచ్చాయి. ‘మేం రాజధానిని వైజాగ్‌కు మారుస్తున్నాం, నేనూ కొద్ది నెలల్లో అక్కడకు వెళుతున్నా’ అన్నారు మీరు. రాజధానిలో మూడో వంతును మారుస్తున్నాం అనో, స్పెసిఫిక్‌గా ఎగ్జిక్యూటివ్ కాపిటల్‌ను మారుస్తున్నాం అనో అనకుండా ఏకంగా రాజధాని అని ఎలా అంటారు, స్వామీ? విషయం కోర్టులో ఉంది. కోర్టు సరేనన్నాక అసెంబ్లీలో దీని గురించి మాట్లాడాలి. గతంలో కార్యనిర్వాహక రాజధాని అన్నాను, యిప్పుడు మొత్తం రాజధానే మార్చేస్తున్నాను అని సభలో చెప్పి, అందరి చేతా చేతులెత్తించి, బిల్లు పాస్ చేసి అప్పుడు ప్రకటించాలి. అదేమీ లేకుండా అదే రాజధాని అని చెప్పడమేమిటి? ఏదో ప్రెస్‌మీట్‌లో నోరు జారి అన్నారనుకోవడానికి లేదు. అంత ముఖ్యమైన సమావేశంలో బాగా ప్రిపేరయ్యే వెళ్లుంటారు మీరు.
ఎందుకంటే మర్నాటి పేపర్లో మీ న్యూస్ పక్కనే సుబ్బారెడ్డిగారి ప్రకటన న్యూస్ కూడా వేశారు. ఏప్రిల్ లోపే విశాఖ నుంచి పాలన, అనేక ప్రభుత్వ భవనాలు అందుబాటులో ఉన్నాయి, అవసరమనుకుంటే ప్రయివేటు భవనాలు లీజుకి తీసుకుంటాం అని చెప్పారాయన. న్యాయపరమైన చిక్కులు తొలగిన మరుక్షణమే విశాఖ నుంచి పాలన అన్నారు. న్యాయపరమైన చిక్కులు ఏప్రిల్ లోగా తేలిపోతాయని ఆయనకు కలొచ్చిందా? మీరు ముఖ్యమంత్రి హోదాలో ‘రాజధాని’ కాబోతోంది అనడంలో ఉన్న పొరపాటును సాక్షి తెలుగు పేపరు పసిగట్టింది. అందుకని ‘విశాఖపట్టణం త్వరలో కార్యనిర్వాహక రాజధాని కాబోతోంది’ అని అన్నారని రిపోర్టు చేసింది. కానీ సాక్షి వెబ్‌సైట్ ఇంగ్లీషు వెర్షన్‌లో మాత్రం ‘హియర్ ఐ యామ్ టు ఇన్‌వైట్ యూ టు విశాఖపట్టణం విచ్ ఈజ్ గోయింగ్ టు బి అవర్ కాపిటల్’ అని రిపోర్టు చేశారు.
రాబోయే నెలల్లో నేను సైతం అక్కడకి షిఫ్ట్ కాబోతున్నానని చెప్పినది రెండు వెర్షన్లలోనూ ఉంది. ‘మీరంతా వచ్చి వైజాగ్‌లో పెట్టుబడులు పెట్టాలి’ అని మీరన్నట్లు కొందరు యూట్యూబు వ్యాఖ్యాతలు చెప్పారు. దాంతో మరీ కంగారు పడ్డాను, యితనిదీ చంద్రబాబు బాటేనా, సర్వం ఒక్కచోటేనా అని. చెక్ చూసి చూస్తే అలా అనలేదు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టండి అనే అన్నారు మీరు. అంతవరకు సంతోషం. మూడు రాజధానుల్లో న్యాయరాజధాని సంగతి చెట్టెక్కినట్టుంది. ఎందుకంటే ఒక చోట అనుమతించాక మరో చోటికి మార్చడానికి సాధారణంగా సుప్రీం కోర్డు అనుమతించదట. అందువలన రాయలసీమకు బెంచ్ మాత్రమే దక్కుతుందేమో. ఇక శాసన, కార్యనిర్వాహక రాజధానులు రెండూ వైజాగ్‌కే అని మీ ఉపన్యాసంతో స్పష్టమైంది. దీని అర్థం సెక్రటేరియట్ తరలింపు తథ్యమనా? అవసరమా యిది?
జగన్ గారూ, తమరికి అమరావతి కృష్ణ గాలి పడకపోతే వైజాగ్‌కి తరలి వెళ్లి సముద్రపు గాలి పీల్చండి. అక్కడే సిఎం క్యాంపు ఆఫీసు పెట్టుకుని రిమోట్ పాలన చేయండి. పెద్ద పెద్ద కార్పోరేట్లే అలా నడుస్తున్నాయి. ఉద్యోగులందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతికి అలవాటు పడ్డారు. మీదెలాగూ మీటల వ్యవహారమే కదా, తాడేపల్లిలో మీట నొక్కి పూరివాడి గుడిసెకు డబ్బు పంపగా లేనిది, ఫోన్ కాల్‌లో మీ సిబ్బందికి ఆదేశాలివ్వలేరా? మీరెలాగూ ఎమ్మెల్యేలను కలవరనీ, సలహాదారుల్ని నియమిస్తారు తప్ప సలహాసంప్రదింపులు చేయరనీ, నలుగురైదుగురితో సంప్రదించి, మీకు తోచినట్లే చేస్తారనీ ప్రతీతి. తక్కిన అధికారులు వైజాగ్‌లో ఉంటే ఎంత, అమరావతిలో ఉంటే ఎంత?
సెక్రటేరియట్, యితర కార్యాలయాలు, స్టాఫ్ క్వార్టర్స్‌లతో సహా రాజధాని మార్చడమంటే చచ్చేటంత ఖర్చు. కొత్త చోట భవన నిర్మాణాలు, పాత చోట భవనాల నిర్వహణ ఎంత వేస్టు చెప్పండి. అబ్బే ప్రభుత్వ భవనాలు అందుబాటులో ఉన్నాయి అంటున్నారు సుబ్బారెడ్డి గారు. అంటే అవి ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయా? ఖాళీగా వేస్ట్‌గా ఎందుకు ఉంచారు? ప్రభుత్వధనం వ్యర్థం చేసినట్లే కదా, ప్రయివేటు భవనాలు లీజుకి తీసుకుంటారట? వాళ్లుత్తినే యివ్వరుగా? వైజాగ్‌లో సరే, అమరావతిలో ఖాళీ చేసిన బిల్డింగులను ఏం చేస్తారో మరి! లీజు కిస్తారా? బొత్స గారి మాటలను నిజం చేయడానికి పాడుబెడతారా? బదిలీ అనగానే మీ ఉద్యోగుల గుండెలు గుభిల్లుమంటాయి.
ముందు ఖర్చులు పెట్టుకుని వచ్చేయండి, తర్వాత టిఎడిఎ క్లెయిమ్ చేసుకోండి అంటారు మీరు. జీతాలకే దిక్కు లేదు, టిఎడిఎ బిల్లులు పాసవుతాయా? అని హడిలిఛస్తారు ఉద్యోగులు. వైజాగ్‌లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అని నా చిన్నప్పణ్నుంచే చెప్పుకునేవారు. విద్యార్థులు, విదేశీ యాత్రికులు ఎక్కువ కావడం చేత అని కారణం చెప్పేవారు. రాజధాని అనగానే అమరావతిలో సెలూన్ల దగ్గర్నుంచి రేట్లు పెంచేశారని పేపర్లలో వచ్చింది. వైజాగ్ పరిస్థితి ఏమిటో మరి! ఖర్చు ఎక్కువౌతుందనే బెదురు, జీతం ఎప్పుడొస్తుందో తెలియని అనిశ్చితి రెండిటితో ఉద్యోగి సతమతమవ్వాలి పాపం. కాస్త వారి గురించి ఆలోచించండి పాపం.
ఐనా జగన్ గారూ, ఏడాదిలో మీ టెర్మ్ ముగియవస్తోంది. మనలో మనమాట, తర్వాత ఎవరొస్తారో ఏమో గట్టిగా చెప్పలేం కదా! పిల్లి పిల్లలను మార్చినట్లు కొత్త ముఖ్యమంత్రి రాజధానిని ఎక్కడకు పట్టుకెళతారో తెలియదు కదా. ఇన్నాళ్లూ ఎలాగో కాలక్షేపం చేశారు. ఇలాగే కానిచ్చేస్తే పోతుందిగా. ఎన్నికలకు ఆర్నెల్ల ముందు పాదయాత్ర కార్యక్రమం పెట్టుకున్నారనుకోండి, మీరెలాగూ రోడ్డు మీదే ఉంటారు, అమరావతి గాలి పీల్చనక్కరలేదు. ఇక రాజధాని ఎక్కడున్నా కోయీ ఫరక్ నహీ అల్‌బత్తా! ‘రాజధాని అమరావతి’ అనే పదబంధాన్ని వైరిసమాసంగా చూపిద్దామని మరీ అంత పట్టుదలగా ఉన్నారనుకోండి, వైజాగే ఏకైక రాజధాని అని మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికలకు వెళ్లండి. నెగ్గితే అది అమలు చేయండి. హైకోర్టు ఎలాగూ అమరావతిలోనే ఫిక్సయినట్లుంది. అందువలన అసెంబ్లీ శీతాకాల సమావేశం కర్నూలులో అని చెప్పి రాయలసీమను ఊరడించండి.
వైజాగ్‌లో కొన్ని పరిశ్రమలు యిప్పటికే ఉన్నాయి. భారీగా కేంద్ర పెట్టుబడులున్నాయి. అవి చాలు. కొన్ని పరిశ్రమలను దానికి పొరుగున ఉన్న విజయనగరం, అనకాపల్లి, అల్లూరి, జిల్లాలకు, కాస్త దూరంలోనే ఉన్న కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, శ్రీకాకుళం జిల్లాలకు సర్దవచ్చుగా. సినీ పరిశ్రమను తూర్పుగోదావరి కివ్వవచ్చు, ఐటీ కంపెనీలను అనకాపల్లి, కాకినాడలకు పంపవచ్చు. నెట్‌వర్క్ బాగా ఉండేట్లు చూస్తే చాలు, రిమోట్ నుంచే పనిచేయవచ్చు. ఇవేమీ చేయకుండా యిప్పటికే చాలా యిచ్చేసిన వైజాగ్‌కు రాజధాని కూడా కట్టబెట్టడం దేనికి? అవున్సార్, వికేంద్రీకరణ అంటే మీ దృష్టిలో ఏమిటండి? ఉన్నదున్నట్లు చెప్పాలంటే బాబుకి అమరావతిలా మీకు వైజాగ్ పిచ్చి పట్టుకుంది.
జగన్ వస్తే రాజధాని రాయలసీమలో పెడతాడు అని 2014లో అనుకున్నారు. రాయలసీమ కాకపోయినా దానికి పక్కనే ఉన్న ప్రకాశంలో పెడతాడు. దొనకొండలో భూములు యిప్పటికే కొనేశాడు కూడా అని ప్రచారం చేశారు. మీరు రాలేదు. 2019లో వచ్చాక వాళ్లందరికీ జెల్లకాయ కొట్టి రాయలసీమకు హైకోర్టు యిస్తానని చెపుతూ వైజాగ్ మీద పడ్డారు. రాయలసీమ వాళ్లు ఫీలవకుండా వాళ్లకి వైజాగ్‌ను అప్పగించారు. అసలు నాకు తెలియక అడుగుతాను, ఒంగోలాయన సుబ్బారెడ్డికి, నెల్లూరాయన విజయసాయి రెడ్డికి అక్కడేం పనండి? వైజాగ్‌లో లోకల్ లీడర్లు లేరా? పయ్యావుల కేశవ్ ఉద్దండరాయపాలెంలో భూములు కొంటే బుగ్గన గారు బుగ్గన వేలేసుకుని ఆశ్చర్యపడ్డారే! విజయసాయి రెడ్డి వర్గానికి వైజాగ్‌లో ఏ ఫుటింగ్ ఉందని అక్కడి ఆస్తులు కొంటున్నారు? అమరావతిని కమ్మరావతి చేశారని వైసిపి నాయకులు ఎద్దేవా చేశారు. వైజాగును రెడ్డి జాగీరు చేస్తున్నారని అనుకోవచ్చా?
అనేక పరిశ్రమలు పెట్టాక, యింకా పెట్టబోతున్నామని చెప్పాక రాజధాని కూడా అక్కడే పెట్టాలా? హైదరాబాదు అనుభవం తర్వాత కూడా తెలుగు ప్రజలకు బుద్ధి రాలేదని చాటిచెప్పాలా? రాజధాని రాష్ట్రం మధ్యలో ఉండనక్కరలేదు, అలాగే పరిశ్రమల మధ్యలోనూ ఉండనక్కరలేదు. ఏ మూల ఉన్నా చాలు. సామాన్యుడు ఎలాగూ సెక్రటేరియట్‌కు వెళ్లడు. డిజిటల్ యుగంలో ఎవరూ వెళ్లనక్కరలేదు. గట్టిగా మాట్లాడితే ఉద్యోగులూ ఆఫీసుకి వెళ్లనక్కరలేదు, యింటి నుంచే పని చేయవచ్చు. ఇలాటి రోజుల్లో పని గట్టుకుని రాజధాని తరలించాలా? అమరావతిలో పేద్ద రాజధాని కట్టకపోయినా, కట్టలేకపోయినా ప్రజలు అర్థం చేసుకుంటారు. భూములిచ్చిన రైతుల చిక్కుముడిని ఎలాగోలా విప్పి వారికి అన్యాయం జరగకపోతే చాలు, ప్రజలు సర్దుకుంటారు. కానీ కట్టిన సౌకర్యాలను గాలికిధూళికి వదిలేసి రాజధానిని వేరే చోటకి తరలిస్తామంటే మాత్రం నొచ్చుకుంటారు. జీతాలకూ, బిల్లు చెల్లింపులకూ, దేనికీ డబ్బు లేదనే ప్రభుత్వానికి దీనికి మాత్రం డబ్బెలా వచ్చిందని నిలదీస్తారు.
వైజాగ్‌ను రాజధానిని చేయకపోతే ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం అడుగుతామంటూ ధర్మాన చేసిన బ్లాక్‌మెయిల్ ప్రకటనను మీరు ఖండించలేదేం స్వామీ? కాంగ్రెసులో అయితే టూ మచ్ డెమోక్రసీ (తెలుగులో అరాచకం) కాబట్టి ఎవరైనా ఏదైనా మాట్లాడతారు. ప్రాంతీయ పార్టీలో అలా కుదురుతుందా? రాష్ట్ర విభజన సమయంలో టిడిపి ఆంధ్ర, తెలంగాణ శాఖలు చెరోలా మాట్లాడాయంటే దానికి కారణం, పార్టీ అధ్యక్షుడి నిర్ణయమది. వేర్వేరు పాత్రధారులకు వేర్వేరు డైలాగులు రాసిచ్చినది సూత్రధారే అని అందరికీ తెలుసు. మీదీ ప్రాంతీయ పార్టీయే. పార్టీ విధానానికి వ్యతిరేకంగా మాట్లాడితే చాలు, వారిని ఎలా సైడ్‌లైన్ చేస్తున్నారో ఆనం, శ్రీధరరెడ్డి కేసుల్లో చూస్తున్నాం. మరి ధర్మాన విషయంలో అలా చేయలేదేం? అంటే దానికి మీ ఆమోదం ఉందనేగా అర్థం?
బెదిరిస్తూ తమకు రాజధాని తెచ్చుకున్నాక యిలాటి నాయకులు అప్పుడేమంటారు? స్థానికులకు ఉద్యోగాలు యివ్వటం లేదంటూ ఆందోళన చేస్తారు. ఎక్కణ్నుంచో మా ప్రాంతానికి వచ్చి మా ఉద్యోగాలు దోచుకున్నారు, మా నగరాన్ని పాడుచేశారు అంటారు. హైదరాబాదు విషయంలో తెలంగాణ నాయకుల ప్రలాపాలు విన్నాం. పరిశ్రమలన్నీ హైదరాబాదుకే దక్కాయని తక్కిన జిల్లాలన్నీ గోలపెడితే, ‘మేమేం బావుకున్నాం? ఒకప్పుడు సుందరనగరం, యిప్పుడు కాలుష్యమయం, బయటివాళ్లంతా వచ్చి హైదరాబాద్ తహజీబ్ దగ్గర్నుంచి చెడగొట్టేశారు’ అంటూ అల్లరల్లరి చేశారు. తెలంగాణ ఏర్పడ్డాక హైదరాబాదుకి పరిశ్రమలు యింకా వచ్చిపడుతున్నాయి. అప్పుడు గగ్గోలు పెట్టిన వారెవరూ యిప్పుడు కిక్కురుమనటం లేదు. కాలుష్యం పెరుగుతోంది, మాకు పరిశ్రమలు వద్దు, పక్క రాష్ట్రానికి పొండి అనటం లేదు. కనీసం రాష్ట్రంలో యితర ప్రాంతాలకు కూడా పంపటం లేదు.
రేపు ధర్మాన కూడా ‘వైజాగ్‌లో ఒకప్పుడు ఊరికి యీ మూల నిల్చుంటే ఆ మూల స్పష్టంగా కనబడేది. ఇప్పుడు ఆకాశమంతా దుమ్మూధూళీ! మా ఉత్తరాంధ్ర రాష్ట్రం మాకిచ్చేసి మీరంతా పొండి’ అనవచ్చు. ఇలాటి ప్రేలాపనలను మొగ్గలోనే తుంచేయాలి. వైజాగ్‌కు రాజధాని తరలించకపోతే ఉత్తరాంధ్రవారు ఊరుకోరు. రాష్ట్రం చీలిపోయే ప్రమాదం ఉంది అనే వాదన బిల్డప్ చేయడానికి ధర్మాన చేత మీరే ఆ ప్రకటన చేయించారేమోననే అనుమానం వస్తోంది. కానీ ఒకటి మీరు గుర్తించాలి. కృష్ణా, గుంటూరు జిల్లాలలో ఉన్నంత రాజకీయ చైతన్యం, ప్రాంతీయాభిమానం ఉత్తరాంధ్రలో లేదు. రాష్ట్రంలో ఎక్కణ్నుంచైనా, ఎవర్నయినా సరే తెచ్చి ఉత్తరాంధ్రలో అభ్యర్థిగా నిలబెట్టండి, అక్కడివాళ్లు నోరెత్తరు. తమకు ఏం వచ్చినా, ఏం పోయినా పట్టించుకోరు. అలాటివాళ్లను రెచ్చగొట్టాలని చూడడం వ్యర్థం. రెచ్చిపోతున్నారని మమ్మల్ని కన్విన్స్ చేయాలని చూడడం వృథాప్రయాస.
ఎంతో రాజకీయచైతన్యం, ధనబలం, కలంబలం, వాగ్ధాటి, పోరాటపటిమ ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాల వాళ్లే అమరావతిని నీరుకారుస్తూంటే చూస్తూ ఊరుకున్నారు. అమరావతి రైతుల అరసవెల్లి యాత్ర అర్ధాంతరంగా ఆగిపోవడం చూశాం. అప్పటిదాకా టీవీ ఎపిసోడ్స్ సంఖ్యలా 389వ రోజు, 434వ రోజు అంటూ లెక్క పెట్టే టీవీ ఛానెళ్లు కూడా ఆ పని మానేశాయి. ర్యాలీలో పాల్గొనేవారు తమ ఐడెంటిటీ కార్డులు చూపించాలనే సరికి, నిర్వాహకుల గుండెలు గుభిల్లుమన్నాయి. నిరసనకారుల్లో అమరావతి రైతుల శాతం తెలిస్తే పరువు పోతుందనుకున్నారేమో తెలియదు, గుట్టుచప్పుడు కాకుండా దుకాణం కట్టేసి, యిళ్లకు వెళ్లిపోయారు. అమరావతిలో పెట్టుబడులు పెట్టిన కామందులు మద్దతుగా నిలిచినా ఆ ఉద్యమం అలా దీర్ఘవిరామం తీసుకుందంటే, యిక వైజాగ్ ఉద్యమమంటూ ఉంటే ఎలా సాగుతుందో ఊహించవచ్చు. మీ వైసిపి స్పాన్సర్ చేస్తున్నా సరే దీనికి ముందుకు సాగే లక్షణాలు లేవు. వైజాగ్‌ను రాజధానిని చేయకపోయినా స్థానికులు గుండెలు బాదుకోరనే అనుకోవాలి.
అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ మొదలుపెట్టి, పాలనా వికేంద్రీకరణలోకి వెళ్లిపోయి, రాజధానిని మూడు ముక్కలు చేయడంలో పడి, యిప్పుడు మళ్లీ రెండు ముక్కలను అతికిస్తున్నారు తమరు. సంక్షేమ వికేంద్రీకరణపై కూడా కాస్త మీతో మాట్లాడాలి. సంక్షేమం అనేది అన్ని వర్గాలలోని బడుగు ప్రజలకు అవసరం. కానీ మీరేమిటి, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీల కోసమే నేను ఉన్నానంటూ స్పీచి యిచ్చారు! తక్కిన కులాల మాటేమిటి? వర్గాల మాటేమిటి? వాళ్లెవరూ మనుష్యులు కారా? వారికి సంక్షేమం అక్కరలేదా? పై చెప్పిన కులాలలో పేదల గురించి నేనున్నానని అంటే ఓహో అనుకునేవాళ్లం. తమరు అలా అనలేదు. అన్ని కులాల్లో ధనికులున్నారు, పేదలున్నారు. కానీ ఎస్సీ, ఎస్టీలలో పేదలెక్కువ అనుకుని వారి కోసం సబ్‌ప్లాన్ ఏర్పాటు చేసి అమలు చేస్తూ వచ్చాయి పాత ప్రభుత్వాలు. మీరు వాటి ఫండ్స్ కూడా వాడేశారట.
అదేమంటే నవరత్న పథకాలున్నాయిగా, వాటి ద్వారా ఎస్సీ, ఎస్టీలకు కూడా లబ్ధి చేకూరుతోంది అని జవాబిచ్చారట. ఆ పథకాలలో వారు తక్కినవారితో కలిపి పంచుకోవలసి వస్తుంది. వారికి మాత్రమే చెందవలసిన నిధులను తక్కినవారితో కలిపి పంచుకోమంటే ఎలా? రేపు ఉద్యోగులు జీతాలు, పెన్షన్లు, ప్రావిడెంట్ ఫండ్స్ అన్నీ కూడా పథకాలకు మరలించేసి, అదేమంటే ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీలను కాపాడేంగా అంటారు కాబోలు. అయ్యా, సమాజంలో అనేక తరగతులుంటాయి, అనేక వర్గాలుంటాయి. అనేక ప్రాంతాలుంటాయి, అనేక కులాలుంటాయి. అవసరం బట్టి అందరికీ ఎక్కువగానో, తక్కువగానో ఫలాలందితే దాన్ని సర్వతోముఖాభివృద్ధి అంటారు. అబ్బే, వాళ్లంతా నాకెందుకు? ఈ ఎస్సీ..మైనారిటీలే ఓటు బ్యాంకే నాకు చాలు. నేను మళ్లీ అధికారంలోకి రావడానికి యిది సరిపోతుంది అనుకుంటే మీకో నమస్కారం.
చివరగా ఒక్క మాట, ఈ రాజధాని ప్రకటన ప్రజల దృష్టి మరల్చడానికి అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. దేని నుంచి మరల్చడానికట? కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నుంచిట, అవినాశ్ ఫోన్ నుంచి నవీన్‌కు కాల్ వెళ్లిన సంగతి నుంచిట. మీరు అంతకు ముందు ఏదో అంటే ‘అవినాశ్ రెడ్డిని సిబిఐ పిలిపించిన విషయంపై ప్రజల దృష్టి పోకుండా చేయడానికి’ అని వ్యాఖ్యానించారు వీళ్లు. ఇలాటివి నేను నమ్మను. ఈ రోజుల్లో దృష్టి మరల్చడం అయ్యే పనా? పది నిమిషాల కోసారి సెల్‌ఫోన్లో దాని తాలూకు న్యూస్ తనంతట తనే వచ్చేసి, తట్టి లేపుతూ ఉంటుంది. లేదా వాట్సాప్‌లో ఎవరో మీమ్‌తో సహా మెసేజి పంపుతారు. ఈ సిబిఐ పిలిచింది, అడిగింది, మళ్లీ రమ్మంది వంటి న్యూసులు మీ కేసుల నుంచి వినివిని అలసిపోయాను. అప్పుడన్నిసార్లు పిలిచింది, జైల్లో కూడా పెట్టించింది, యిప్పుడు విచారణ నత్తనడక నడుస్తోంది. వివేకా హత్య కేసూ యింతే. మీరు బిజెపితో అంటకాగుతున్నంత కాలం అది తేలదు. చివరకు ఆధారాలు సరిపోలేదంటూ ఏ పనివాడికో, కారు డ్రైవరుకో నాలుగేళ్ల శిక్ష పడుతుంది, సత్ప్రవర్తనతో అతను రెండేళ్లలో బయటకు వచ్చేస్తాడు.
ఇక కోటంరెడ్డి విషయమంటారా? ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ నీయకుండా పార్టీ నడుపుతున్న మీకు యిలాటి గొడవలు వస్తాయని ముందే తెలిసి ఉంటుంది. మీ నాన్నగారికీ యిలాటివి తప్పలేదని చూసే ఉంటారు. ఇంకా ఎంతమంది కోటంరెడ్లు ఉన్నారో అని లెక్క పెట్టుకుంటూనే ఉంటారు. అందుచేత యీ రాజధాని ప్రకటన డైవర్షన టాక్టిక్ అని నేను నమ్మటం లేదు. మీరు కావాలని చేసిందే! వికేంద్రీకరణ అంటే మీ ఉద్దేశం ఒక కేంద్రం నుంచి అన్నీ పట్టుకెళ్లి మరో కేంద్రంలో పెట్టడం అనే అర్థమౌతోంది. లేదా వి (శాఖ)- కేంద్రీకరణ అని తోస్తోంది. కాదంటే చెప్పండి, విని తరిస్తాం.
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2023)