ఫేస్ బుక్ కి ప్రత్యామ్నాయంగా సోషల్ మీడియా యాప్ లు చాలానే వస్తున్నా భారతీయులకు మాత్రం ఎందుకో అదంటేనే చాలా ఇష్టం. అవును, ఫేస్ బుక్ వాడకంలో భారతీయుల తర్వాతే ఎవరైనా. పలు ఇతర దేశాల్లో కొత్త యాప్ ల మోజులో పడి ఫేస్ బుక్ కి గుడ్ బై చెప్పేస్తున్నారు చాలామంది. దీంతో అక్కడ యాక్టివ్ యూజర్స్ సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది.
కానీ భారత్ లో మాత్రం ఫేస్ బుక్ కి యమా క్రేజ్ ఉంది. ఫేస్ బుక్ యాక్టివ్ యూజర్స్ సంఖ్య పెరుగుతూ వస్తున్న 3 దేశాల్లో భారత్ కూడా ఒకటి కావడం విశేషం.
2021 డిసెంబర్ లో ప్రపంచవ్యాప్తంగా ఫేస్ బుక్ యాక్టివ్ యూజర్స్ సంఖ్య 193 కోట్లు కాగా, 2022 డిసెంబర్ లో ఆ సంఖ్య 200కోట్లకు చేరింది. అంటే 4 శాతం యూజర్ల సంఖ్య పెరిగిందనమాట. వీరిలో మూడు దేశాలవారే అత్యథికం. ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్, భారత్ లోని ఫేస్ బుక్ యూజర్లు 2022 డిసెంబర్ లో యాక్టివ్ యూజర్స్ గా ఉండటంతో ఫేస్ బుక్ యాప్ ఈ ఘనత సాధించినట్టు దాని మాతృ సంస్థ మెటా ప్రకటించింది.
ఇక 2021, 2022 మధ్య ఫేస్ బుక్ యాక్టివ్ యూజర్స్ సంఖ్యను పోల్చి చూస్తే నైజీరియా, బంగ్లాదేశ్, భారత్ లో యాక్టివ్ యూజర్స్ పెరిగారు. నెలవారీ లెక్కలు తీసినా అందులో కూడా భారత్ ఉంది. ఒకరకంగా ఫేస్ బుక్ యాక్టివ్ యూజర్స్ సంఖ్య పెరగడానికి భారత్ ప్రధాన కారణం అయింది.
ఇక ఫేస్ బుక్ కంటెంట్ విషయంలో భారత్, జర్మనీ చట్టాలు కాస్త కఠినంగా ఉంటాయని మెటా తెలిపింది. భారత్, జర్మనీలో ఫేస్ బుక్ కంటెంట్ పై ఆంక్షలుంచుతున్నామని, చట్టపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని మెటా తెలిపింది. జరిమానాలు, ఇతర పెనాల్టీలు తమవైపు రాకుండా కంటెంట్ విషయంలోజాగ్రత్తలు తీసుకుంటున్నామని స్పష్టం చేసింది.