Mr Bachchan Review: రివ్యూ: మిస్టర్ బచ్చన్

ప్రధమార్ధంలో కొంతైనా హత్తుకున్న వినోదం ఇంటర్వల్ తర్వాత వెతుక్కున్నా కనపడదు.

చిత్రం: మిస్టర్ బచ్చన్
రేటింగ్: 2.25/5
తారాగణం: రవితేజ, భాగ్యశ్రీ బోర్సే, జగపతి బాబు, తనికెళ్ల భరణి, గౌతమి, శరత్ ఖేదేకర్, సత్య, చమ్మక్ చంద్ర, ప్రభాస్ శీను, అన్నపూర్ణ, శుభలేఖ సుధాకర్, సిద్ధు జొన్నలగడ్డ (కేమియో) తదితరులు
ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి
కెమెరా: అయనంక బోస్
సంగీతం: మిక్కీ జె మేయర్
నిర్మాత: టి జి విశ్వప్రసాద్
దర్శకత్వం: హరీష్ శంకర్
విడుదల: 15 ఆగష్ట్ 2024

“మిరపకాయ్” హిట్ తర్వాత రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్లో చిత్రం ఇదే. “రైడ్” అనే హిందీ రీమేకుగా వచ్చిన ఈ “మిస్టర్ బచ్చన్” ఎలా ఉందో చూద్దం.

కథలోకి వెళ్తే బచ్చన్ (రవితేజ) ఒక నిఖార్సైన ఆదాయపు పన్ను శాఖ అధికారి. అయితే వృత్తిలో భాగంగా బచ్చన్ సస్పెన్షన్ కి గురౌతాడు. తన ఊరొచ్చి కుమార్ శాను పాటలు పాడుకుంటూ ఆర్కెష్ట్రా నడుపుతుంటాడు. అక్కడే ఒక మార్వాడి-తెలుగు అమ్మాయి (జిక్కి) ప్రేమలో పడతాడు. రెండు కుటుంబాలు ఒప్పుకుని పెళ్ళికి సిద్ధమైన సమయంలో బచ్చన్ మీద సస్పెన్షన్ ఎత్తేసి డ్యూటీలో అర్జెంటుగా చేరమంటుంది డిపార్ట్మెంట్. కారణం ముత్యం జగ్గయ్య (జగపతి బాబు) అనే ఎంపీ ఇంటిపై రైడ్ చెయ్యాలి. ఇంతకీ ఆ రైడ్ పూర్తి చేసి, సరైన సమయంలో వెనక్కొచ్చి జిక్కి మెడలో తాళి ఎలా కడతాడనేది తక్కిన కథ.

2019లో “గద్దలకొండ గణేష్” తర్వాత హరీష్ శంకర్ మళ్లీ ఇదే రావడం. ఐదేళ్ల గ్యాప్ వచ్చినా అతని పట్ల యూత్ లో అంచనాలు తగ్గలేదు. తాను తీసిన సినిమాలో పూర్తి కమర్షియల్ విలువలతో కూడిన వినోదం ఉంటుందని యువప్రేక్షకుల నమ్మకం. అయితే ఈ సినిమా చూసాక అతని ఐదేళ్ల గ్యాప్ కెరీర్ కే కాదు, అతని రైటింగ్ లోని డెప్త్ కి కూడా వచ్చిందని అర్ధమవుతుంది. ఐదేళ్లల్లో సినిమాల తీరూ తెన్నూ చాలా మారిపోయింది. కానీ హరీష్ శంకర్ అక్కడే ఉండిపోయాడా అనే అనుమానాలొస్తాయి.

ఎందుకంటే హిందీ సినిమాని తీసుకుని రీమేక్ చేసే క్రమంలో, మంచి ఫేస్ వేల్యూ ఉన్న నటులని పెట్టుకుని కామెడీ అనబడే సీన్లు నాలుగు రాసేసుకుంటే తెర మీద వినోదం పండిచ్చేయవచ్చనే ఓవర్ కాంఫిడెన్సుతో తీసిన సినిమాలా ఉంది. అసలు కథేంటో చెప్పమంటే సింగిల్ లైన్లో చెప్పొచ్చు. పెద్దగా విషయం లేని కథని కథనంతో కట్టిపారేయడం చాలా కష్టం. అలా కట్టిపారేయనప్పుడు చూసిన వాళ్లు కొట్టిపారేస్తారు. అది సహజం.

ఈ చిత్రంలో పాత్రలన్నీ మ్యూజిక్ లవర్సే. ఒకరు కిషోర్ కుమార్ ఫ్యాన్, ఇంకొకరు కుమార్ శాను అభిమాని. ఇంకో పాత్రకి అమితాబ్ పాటల పిచ్చి, మరొకరికి ఘంటశాల పాటల అభిమానం..ఇలా ప్రతీ పాత్ర పాటలు వింటూనో, పాడుతోనో కనిపిస్తుంటారు. అదంతా వినోదంలో భాగంగా తీసుకోవచ్చు. కానీ ట్రైలర్లో అత్యంత ఫెరోషియస్ గా కనిపించిన జగపతిబాబు పాత్ర కూడా “తాయారమ్మా..” అంటూ ఏవో పాటలు పాడుతూ ఇంట్రడ్యూస్ అవుతాడు.

ప్రధమార్ధమంతా వినోదాత్మకంగా తీసి, ద్వితీయార్ధంలో సీరియస్ డ్రామా నింపి హీరోయిజాన్ని తారాస్థాయికి తీసుకెళ్తాడనుకుంటే ఆ భాగాన్నంతా జంక్ తో నింపేసాడు దర్శకుడు. కథ ముందుకు కదలదు. రెండో సగమంతా రైడ్ ఎపిసోడే.

హీరోయిజం శక్తి తెలిసేది విలన్ బలంగా ఉన్నప్పుడే. కానీ ఇక్కడ విలన్ పాత్ర పరమ వీక్. రంగస్థలంలో ఫణీంద్ర భూపతిగా, అరవింద సమేత లో బసిరెడ్డిగా వైవిధ్యమైన సీరియస్ విలనీని పండించిన జగపతిబాబు ఇందులో ముత్యం జగ్గయ్యగా తుస్సుమనిపించాడు. తప్పు ఆయనది కాదు. రాసుకున్న పాత్రది.

మరో విషయం ఏంటంటే, ఆదాయపుపన్ను శాఖ అధికారుల్ని ఇండియన్ ఆర్మీతో పోలుస్తూ నిజాయితీ పరుడైన హీరో చేత ఘనమైన డైలాగ్ చెప్పించాడు దర్శకుడు. కానీ అదే సమయంలో అతని వెంట వచ్చిన అదే శాఖకు చెందిన తక్కిన అధికారులు లంచాల ఎరకి పడిపోయేవారిగా చూపించాడు. అంటే ఇందులో హీరోలాగ ఏ ఒక్కరో తప్ప తక్కిన శాఖంతా అలా లంచగొండులుగా ఉన్నారని చెప్పకనే చెప్పాడా? ఏమో మరి! పైగా వాళ్లల్లో లేడీ ఆఫీసర్స్ ని మరీ నగలు కోసం కొట్టుకునే ఆశాపరులుగా చూపించాడు. సరే అది కూడా కామెడీలో భాగమే అనుకోవాలేమో.

ఇక సినిమాలో సీరియస్ డ్రాప్ ఎక్కడంటే చమ్మక్ చంద్ర పాత్ర వచ్చినప్పటినుంచీ. “శుభలగ్నం” సినిమాలో ఆలీ స్టైల్లో బిహేవ్ చేసే క్యారక్టర్ అది. అంటే సుమారు మూడు దశాబ్దాల క్రితం నాటి కామెడీ ట్రాక్. ఇక్కడ మేటర్ ఆ ట్రాక్ ఎంత పాతది అని కాదు..దాని ప్లేస్మెంట్ కుదరలేదు!

అలా అనుకుంటే 63 ఏళ్ల క్రితం నాటి ఒక సీన్ ని కూడా స్ఫూర్తి పొంది ఇందులో పెట్టాడు దర్శకుడు. అదే 1961 లో వచ్చిన “వాగ్దానం”లోని హరికథ పాటలోని ఒక సన్నివేశం. గుర్రపుబండి చక్రం గోతిలో పడితే హీరోయిన్ కృష్ణకుమారిని పక్కన పెట్టుకుని దానిని బయటికి లాగలేక ఇబ్బంది పడుతుంటాడు చలం. అదే సమయంలో అటుగా వస్తున్న నాగేశ్వరరావు దానిని ఆ గోతిలోంచి బయటికి తోస్తాడు. సరిగ్గా అప్పుడే “ఫెళ్లు మని విల్లు..గుండెలు జల్లుమనే..” అనే లైన్ వినిపిస్తుంది. అనుకరణే అయినా అది బాగుంది. స్క్రీన్ ప్లేలో చక్కగా కూర్చుంది.

మైనస్సులు పక్కన పెట్టి ప్లస్సులు మాట్లాడుకుంటే సంగీతం బాగుంది. పాటలు, నేపథ్య సంగీతం చక్కగా వినిపించాడు మిక్కీ జే మేయర్. కానీ ఒక పాటలో దేవీశ్రీప్రసాద్ ఎందుకు కనిపించాడో అర్థం కాదు.

రవితేజ డ్యాన్సులు అద్భుతంగా చేసాడు. ఎనెర్జీ ఏ మాత్రం తగ్గలేదు. తన పాత్రకు తాను పూర్తి న్యాయం చేసినా పైన చెప్పుకున్నట్టు విలన్ వీక్ గా ఉండడం వల్ల తన హీరోయిజం పాటలకి ,హీరోయిన్ తో రొమాన్స్ కే సరిపోయింది.

భాగ్యశ్రీ బోర్సే తెరకింపుగా ఉంది. నిజానికి ఈ చిత్రంపై యువతలో ఆసక్తి పెరగడానికి ఆమె కూడా ఒక ప్రధానమైన కారణం. అందంతో, డ్యాన్సులతో మార్కులేయించుకున్నా అభినయంలో ఇంకా పరిణతి చూపాలి. ప్రస్తుతమున్న కాంపిటీషన్లో కేవలం అందంతో నెట్టుకొచ్చేయడం కష్టం.

జగపతిబాబు పాత్ర ప్రారంభంలో చాలా సీరియస్ గా కనపడి తర్వాత కమెడియన్ గా మిగిలాడు. మధ్యలో హీరోయిన్ వచ్చి దండం పెడితే “దీర్ఘ సుమంగళీభవ” అని దీవిస్తాడు. విలనా, కమెడియనా, క్యారెక్టరా అనేది అర్ధం కాకుండా గందరగోళపరచిన పాత్ర ఇది.

సిద్ధు జొన్నలగడ్డ అతిధి పాత్రలో వచ్చి వెళ్లాడు. అతని ఇంట్రోకి ఇచ్చిన బిల్డప్పుకి, ఆ తర్వాత వచ్చిన సాదా సీదా ఫైట్ సీన్ తేలిపోయింది.

తనికెళ్ల భరణి అమితాబ్ అభిమానిగా కామెడీ టచ్ ఉన్న సెంటిమెంట్ క్యారెక్టర్లో ఓకే. హీరోయిన్ తండ్రిగా శరత్ ఖేదేకర్ ప్యాడింగ్ ఆర్టిష్టుగా సరిపోయారు. అన్నపూర్ణ చేత కామెడీలాంటిది చేయించారు. సీనియర్ నటుడు నారాయణరావు ఒక సీన్లో కనిపించారు. ఝాన్సి ప్రారంభ సన్నివేశాల్లో వచ్చి మాయమైంది.

కథతోనో, కథనంతోనో కాకుండా స్టార్ వేల్యూతోటి, నిర్మాణ విలువలతోటి, పూర్తి లైటర్ వీన్ ట్రీట్మెంట్ తోటి తీయాలనే ఫార్ములా వేసుకుని తీసిన చిత్రమిది. ఎందుకంటే ప్రధమార్ధంలో కొంతైనా హత్తుకున్న వినోదం ఇంటర్వల్ తర్వాత వెతుక్కున్నా కనపడదు. అలాగని యాక్షన్ పార్ట్ ఆకట్టుకుంటుందా అంటే అదీ లేదు.

ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి నేరుగా ఫోన్ చేసినా కూడా “డోంట్ కేర్” అని వాళ్లకే పంచ్ డైలాగులు కొట్టే హీరోలని చూసి అభిమానులు చొక్కాలు చింపుకునే రోజులు పోయాయి. వాళ్లల్లో విద్యావంతులు, పరిణతి ఉన్నవారు పెరిగారు. అందుకే హీరోయిజాన్ని ఎంతవరకు నడపాలో, ఎలాంటి తూకంలో సీన్లు రాసుకోవాలో ఆలోచించాలి. ప్రాక్టికాలిటీకి దగ్గరగా సంభాషణలు రాసుకోవాలి.

హరీష్ శంకర్ మీద చాలా అంచనాలున్నాయి. జనాలకి “నచ్చెన్”, అభిమానులు “మెచ్చెన్” అనేట్టుగా తీయాలంటే కథా కథనాల్లో ఆత్మ లేకుండా ఎన్ని కమర్షియల్ రంగులద్దినా సరిపోదు. ఇప్పటికి మాత్రం అభిమానుల అంచనాలనే బుడగలని సూదితో “గుచ్చెన్” అని చెప్పుకోవాలి.

బాటం లైన్: గుచ్చెన్

20 Replies to “Mr Bachchan Review: రివ్యూ: మిస్టర్ బచ్చన్”

  1. అన్నియా, రైడ్ కి రెయిడ్ కి తేడా తెలుసుకొని రాయండి బాబయ్య . రైడ్ అంటే బండి తోలడం సినిమా దాని గురించి కాదు కదా

  2. For the last 5-6 years his definition of entertainment is make audience see him groping young heroines. What grandpa. what type of movies are these?

  3. ఇతని వయసుకు రమ్యకృష్ణ , సితార, నదియా లాంటి వాళ్ళు సూటవుతారు. చిన్న వయసు హీరోయిన్లు ఇతని కూతుర్లు/ మనవరాళ్ల లాగా పనికొస్తారు

    1. రమ్యకృష్ణ హీరోయిన్ గా ఉన్నపుడు సపోర్టింగ్ రోల్స్ వేసేవాడు, బడ్జెట్ పద్మనాభం సినిమా ఉదాహరణ!

  4. (జిక్కి) అని బ్రాకెట్ లో రాసారు ఏమిటి అది పాత్ర పేరు అయితే, రవితేజ ని బ్రాకెట్ లో రాసినట్లు హీరోయిన్ పేరు రాయాలి కదా!

  5. బాబూ రవితేజ నీ వయసుకు తగ్గ పాత్రలు చెయ్యి. ఈ వయసులో అలాంటి హీరోయిన్స్ తో తైతక్కలు, రొమాన్స్ ఎబ్బెట్టుగా ఉంటోంది. జగపతిబాబు లాగా సపోర్టింగ్ రోల్స్ కి షిఫ్ట్ అయ్యితే మంచిది.

  6. రవితేజ మాస్ మహారాజ్.. దేనికైనా సూట్ అవుతాడు… అయినా మీకు ఎమ్ తెలుసు..

  7. ముసలి మొహం రవితేజ హీరో వేషాలకి సరిపోడు. జీన్ ప్యాంట్స్ వేసుకుని ఎగరడం కంటే ఇంక వృద్ధ పాత్రలు చూసుకోడం మేలు..

    అమితాబ్ బచ్చన్ అనుకరణలు…నడుం వంగే నాట్యాలు చూసి..చూసి జనానికి బోర్ కొట్టింది..

    ఎప్పుడు చూసినా చూయింగ్ గమ్ నమలడం కంటే …దంతాలు క్లీనింగ్ చేయించుకుని నోరు కంపు లేకుండా చూసుకోడం బెటర్.

  8. అదే చిరంజీవి యంగ్ హీరోయిన్ ల తో చిందులు వేస్తే మీకు ఓకే నా సిర్ pandaurinadh గారు అంతకు ముందు సినిమా లు అన్నీ చూసావా రవితేజ వి సూపర్ హిట్ మూవీ EAGLE ade action ni chiru ni cheyyamani cheppu చూద్దాం bad కామెంట్ లు ఆపి ముందు నీది సరిచేసుకో ఆ తర్వాత రవితేజ ది సరిచెయ్య్ ఓకే నీకు నచ్చితే చుడు నచ్చకపోతే మూసుకొని కూర్చో ఇంట్లో

Comments are closed.