Advertisement

Advertisement


Home > Movies - Reviews

రివ్యూ: నవాబ్‌

రివ్యూ: నవాబ్‌

రివ్యూ: నవాబ్‌
రేటింగ్‌: 3/5
బ్యానర్‌:
మద్రాస్‌ టాకీస్‌, లైకా ప్రొడక్షన్స్‌
తారాగణం: అరవింద్‌ స్వామి, శింబు, అరుణ్‌ విజయ్‌, విజయ్‌ సేతుపతి, ప్రకాష్‌రాజ్‌, జ్యోతిక, జయసుధ, అదితిరావు హైదరి, ఐశ్వర్య రాజేష్‌, డయానా ఎర్రప్ప, త్యాగరాజన్‌, మన్సూర్‌ అలీ ఖాన్‌ తదితరులు
సంగీతం: ఏ.ఆర్‌. రహమాన్‌
కూర్పు: శ్రీకర్‌ ప్రసాద్‌
ఛాయాగ్రహణం: సంతోష్‌ శివన్‌
నిర్మాతలు: మణిరత్నం, సుబాస్కరన్‌
రచన: మణిరత్నం, శివ అనంత్‌
దర్శకత్వం: మణిరత్నం
విడుదల తేదీ: సెప్టెంబర్‌ 27, 2018

వివిధ జోనర్స్‌లో సినిమాలు తీసి అన్నిటిపైన తనదైన ముద్ర వేసిన మణిరత్నంకి గ్యాంగ్‌స్టర్‌ డ్రామా కొత్తేమీ కాదు. ఈ జోనర్‌లో 'నాయకుడు' కంటే ఉత్తమ చిత్రం ఇంతవరకు రాలేదు. చాలా కాలం తర్వాత మళ్లీ మణిరత్నం గ్యాంగ్‌స్టర్‌ డ్రామాని 'నవాబ్‌' రూపంలో తెరకెక్కించారు. సామాన్యుడు నాయకుడిగా ఎదిగే తరహా గ్యాంగ్‌స్టర్‌ కథ కాదిది. గ్యాంగ్‌స్టర్‌ ఫ్యామిలీలో వుండేవాళ్ల మనస్తత్వాలు, స్వార్ధాలు, సొంత అన్నదమ్ముల సాగే పవర్‌ గేమ్‌లు హైలైట్‌ చేసే చిత్రమిది. 

సమయం వృధా చేయకుండా భూపతిపై (ప్రకాష్‌రాజ్‌) జరిగే హత్యాప్రయత్నంతో 'యాక్షన్‌'లోకి వెళ్లే కథ అక్కడ్నుంచి ముఖ్య పాత్రలు ఒక్కోటిగా పరిచయం చేస్తుంది. భూపతికి ముగ్గురు కొడుకులు... మొదటి వాడు తండ్రి కిందే వుంటూ వ్యవహారాలు చక్కబెట్టే వరద (అరవింద్‌ స్వామి), దుబాయ్‌లో బిజినెస్‌ చేసే త్యాగు (అరుణ్‌ విజయ్‌), సెర్బియాలో అక్రమ ఆయుధ రవాణా చేసే రుద్ర (శింబు). తండ్రిపై హత్యాప్రయత్నం జరగడంతో ముగ్గురు కొడుకులు వస్తారు. అది ఎవరు చేసారనేది తెలుసుకునే ప్రయత్నాలు జరుగుతాయి. కొంతమంది హతమవుతారు కానీ అసలు వాడు బయటపడడు. ఆ అటెంప్ట్‌ చేసింది తన కొడుకుల్లో ఒకడేనంటాడు భూపతి. కొన్ని సంఘటనల తర్వాత అన్నదమ్ముల మధ్య యుద్ధానికి తెర లేస్తుంది. ఈ క్రమంలో ఎవరు మంచి, ఎవరు చెడు... అసలు ఎవరి ప్లాన్‌లో ఎవరు పావులు అనేది మణిరత్నం తనదైన శైలిలో చూపిస్తారు. 

దాదాపుగా తొంభై శాతం క్యారెక్టర్స్‌కి గ్రే షేడ్‌ వుండడం ఈ చిత్రం ప్రత్యేకత. అందుకే ఈ కథలో హీరోలు, విలన్లు అంటూ ఎవరూ వుండరు. పరిస్థితులే ఆ పాత్ర పోషిస్తూ ఒక్కో సంఘటనలో ఒక్కొక్కరు హీరో లేదా విలన్‌ అవుతుంటారు. తల్లితండ్రులపై ఎటాక్‌ జరిగింది, క్రిటికల్‌ కండిషన్‌ అని ఫోన్‌ వస్తే... 'నేను రావాలా?' అని అడుగుతాడు కొడుకు. తనని చూడ్డానికి వచ్చిన కొడుకుతో 'ఆ అటెంప్ట్‌ నువ్వే చేయించావా' అని అడుగుతాడు తండ్రి. ఎలాంటి ఫ్యామిలీ ఎమోషన్స్‌, బాండింగ్స్‌ లేని మెటీరియలిస్టిక్‌ క్యారెక్టర్స్‌ని మణిరత్నం తీర్చిదిద్దారు. ఫిమేల్‌ క్యారెక్టర్స్‌ కూడా రొటీన్‌కి భిన్నంగా వుంటాయి. భర్త తనని చీట్‌ చేస్తున్నాడని స్వయంగా తెలుసుకున్నా, ఎన్ని తప్పులు చేస్తున్నా అతని వెన్నంటే వుండే జ్యోతిక పాత్రచిత్రణ ఆశ్చర్య పరుస్తుంది. వేరొకరి భర్తతో ఇల్లీగల్‌ అఫైర్‌ పెట్టుకున్న అదితి రావు అతని వైఫ్‌ని కలవాల్సిన సిట్యువేషన్‌ ఎదురైనపుడు ప్రవర్తించే విధానం రెగ్యులర్‌ సీన్స్‌కంటే ఎంతో విభిన్నంగా వుంటుంది. 

'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌' తరహా సెటప్‌తో మణిరత్నం తీర్చిదిద్దిన ఈ గ్యాంగ్‌స్టర్‌ డ్రామాకి సంబంధించిన ట్రెయిలర్సే పెద్ద స్పాయిలర్స్‌ అయ్యాయి. దాదాపుగా కథ అంతటినీ రెండు ట్రెయిలర్స్‌లో చూపించేయడం వల్ల షాక్‌ వేల్యూ బాగా ఎఫెక్ట్‌ అయింది. అయితే విషయం తెలిసిపోయినా కానీ దానిని నడిపించిన విధానం మాత్రం ఆసక్తిగొలుపుతుంది. ప్రథమార్ధం కేవలం పాత్రల పరిచయం, భూపతిపై జరిగిన ఎటాక్‌ని పరిశోధించడం మినహా చెప్పుకోతగ్గ డ్రామా ఏమీ వుండదు కానీ ద్వితియార్ధంలో మాత్రం అనుక్షణం 'యాక్షన్‌' జరుగుతూనే వుంటుంది. తక్కువ లెంగ్త్‌ వున్న సీన్స్‌తోనే ఉత్కంఠ కలిగిస్తూ స్క్రీన్‌ప్లే సెకండ్‌ హాఫ్‌లో ఉరకలు వేస్తుంది. మామూలుగా డ్రామాపై ఫోకస్‌ పెట్టే మణిరత్నం ఈసారి డ్రామా కంటే యాక్షన్‌కే ఎక్కువ వెయిట్‌ ఇవ్వడంతో 'నవాబ్‌' ప్రత్యేకంగా అనిపిస్తుంది.

మణిరత్నం ఖచ్చితంగా ఒకప్పటి ఫామ్‌లో లేరు కానీ ఇంకా ఆయనలో ఆ మెరుపులు అయితే పోలేదు. కొడుకుల్లో ఒకడే తనపై ఎటాక్‌ చేసాడని భర్త చెప్పిన అనంతరం తల్లి వారిని అద్దాల వెనక నుంచి దూరంగా వీక్షించే దృశ్యం వింటేజ్‌ మణిరత్నంని గుర్తు చేస్తుంది. అలాగే సాంకేతికత పరంగా ఆయన ఎంత అప్‌డేట్‌ అవుతారనే దానికి ఇందులోని స్టయిలిష్‌ షాట్‌ మేకింగ్‌, విజువల్స్‌ ఉదాహరణగా నిలుస్తాయి. ఆయనలోని అద్భుతమైన స్టోరీ టెల్లర్‌, ప్రేక్షకులని హిప్నటైజ్‌ చేసి తన సినిమాలకి సరెండర్‌ అయిపోయేలా చేసే గ్రేట్‌ డైరెక్టర్‌కి వయసు పైబడిన మాట వాస్తవమే అయినా కానీ ఈ చిత్రంతో మాత్రం తనలో చేవ ఇంకా వుందని, ఆకట్టుకునేలా క్రైమ్‌ కథలు తీయగలనని ఈ చిత్రం స్పష్టం చేస్తుంది. 

ఆయా పాత్రలకి ఎంచుకున్న నటీనటవర్గం ఈ చిత్రానికి ప్రధానాకర్షణ అయింది. వరదగా అరవింద్‌ స్వామి ఆహార్యం, నటన మెప్పిస్తాయి. ఎమోషన్‌లెస్‌ బ్రదర్‌గా శింబు, స్టయిలిష్‌గా కనిపించిన అరుణ్‌ విజయ్‌ కూడా తమ పాత్రలకి పర్‌ఫెక్ట్‌గా సూటయ్యారు. బ్యాక్‌గ్రౌండ్‌లో వున్నట్టే వున్నా కీలక సందర్భాల్లో కథ నడిపించే విజయ్‌ సేతుపతి ఈ చిత్రానికి అతి పెద్ద ఎస్సెట్‌గా నిలిచాడు. మేల్‌ సెంట్రిక్‌ మూవీ అయినా కానీ జ్యోతికకి చాలా మంచి పాత్ర దక్కింది. ఆమె నటన కూడా చాలా ఆకట్టుకుంటుంది. జయసుధ, ప్రకాష్‌రాజ్‌, అదితిరావు... ముఖ్య తారాగణంలో చాలా మందికి గుర్తుండిపోయే కొన్ని మూమెంట్స్‌ దక్కాయి. 

పాటలు అందంగా చిత్రీకరించడంలో సిద్ధ హస్తుడైన మణిరత్నం ఒక్క పాటని కూడా ప్రత్యేకించి చిత్రీకరించకుండా నెరేటివ్‌లో భాగం చేసేసారు. పాటలు అంత గొప్పగా లేకపోయినా రహమాన్‌ నేపథ్య సంగీతం చాలా సన్నివేశాలని బాగా ఎలివేట్‌ చేసింది. ఎడిటింగ్‌ చాలా బాగుంది. సాంకేతికంగా ఏనాడూ వీక్‌ సినిమా తీయని మణిరత్నం ఈ చిత్రాన్ని కూడా సాంకేతికంగా వంక పెట్టలేని రీతిన తెరకెక్కించారు. సంతోష్‌ శివన్‌ సినిమాటోగ్రఫీ ఫ్రేమ్స్‌ని అందంగా చూపించడమే కాకుండా డ్రామాని ఎలివేట్‌ చేసే లైటింగ్‌, షాట్‌ డివిజన్‌తో విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రొడక్షన్‌ డిజైన్‌ కూడా పాత్రల స్వభావానికి తగ్గట్టు భలేగా కుదిరింది. 

మణిరత్నం తీసిన క్లాసిక్స్‌ సరసన నిలబడే అర్హత, యోగ్యత 'నవాబ్‌'కి లేకపోయినా ఈమధ్య కాలంలో ఆయన తీసిన చాలా సినిమాల కంటే ఉత్తమంగా, ఉన్నతంగా వుంది. వన్‌ డైమెన్షనల్‌గా, సీరియస్‌ టోన్‌లో సాగే ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకీ నచ్చకపోవచ్చు కానీ గ్యాంగ్‌స్టర్‌ డ్రామాలు ఇష్టపడే వారిని ఇందులోని పాత్రలు, సంఘటనలు, ప్రవర్తనలు ఆకట్టుకుంటాయి. కమర్షియల్‌గా లిమిటేషన్స్‌ వున్నప్పటికీ మణిరత్నం అభిమానులు, రొటీన్‌కి భిన్నమైన యాక్షన్‌ డ్రామాలని ఇష్టపడేవారు చూడదగ్గ చిత్రమే ఇది. 

బాటమ్‌ లైన్‌: మణిరత్నం మెరుపులు!

గణేష్‌ రావూరి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?