టైటిల్: పెద్దన్న
రేటింగ్: 1.5/5
తారాగణం: రజినీకాంత్, నయనతార, కీర్తి సురేష్, సూరి, మీనా, ఖుష్బూ, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, అభిమన్యు సింగ్ తదితరులు
కెమెరా: వెట్రి
ఎడిటింగ్: రూబెన్
సంగీతం: డి. ఇమ్మాన్
నిర్మాత: కళానిధి మారన్
దర్శకత్వం: శివ
విడుదల తేదీ: 4 నవంబర్ 2021
ఎంత మంది పెద్ద నటులతో సినిమాలు తీసినా రజినికాంత్ తో సినిమా అనగానే కొందరు దర్శకులకి కళ్లూ చేతులూ ఆడకపోవచ్చు. ఎప్పటినుంచో తీరని కోరికలాంటిది తీరబోతోందనే సరికి ఏం రాస్తున్నామో, ఏం తీస్తున్నామో తెలియకుండా తీసేసే పరిస్థితి రావొచ్చు. ఈ సినిమా చూసాక దర్శకుడు శివ ఈ మానసిక స్థితిని ఎదుర్కొన్నాడేమో అనిపిస్తుంది.
తెలుగులో గోపీచంద్ తో శౌర్యం, శంఖం; తమిళంలో అజిత్ తో వీరం, వేదాళం, వివేగం, విశ్వాసం తీసిన దర్శకుడు శివ మొదటిసారిగా రజినీకాంత్ తో “పెద్దన్న” తీసాడు.
గత ముప్పై ఏళ్లుగా ఎన్నో సినిమాల్లో రసం పిండేయగా మిగిలిన పిప్పితో కథ రాసుకుని, తాను తీసిన వేదాళాన్నే ఇంకో పద్ధతిలో తిరిగి తీసుకుని, రజినీకాంత్ సినిమా అంటే ఈ దినుసులుంటే సరిపోతుందనుకుని డిసైడైపోయి తీసిన సినిమా ఈ “పెద్దన్న”.
నలభైఏళ్లు పైబడ్డ అన్నగారు, ఆయనకొక చెల్లెలు..అమెకి ఎదురయ్యే కష్టాలు…కనపడని దైవంలాగ అన్నగారు వెన్నంటి ఉండి కష్టాలు తీర్చడం. అది కూడా కలకత్తా బ్యాక్ డ్రాపులో- ఇదీ పాయింట్ అని చెబితే ఎవ్వరైనా ఇది “వేదాళం” కథ కదా అంటారు.
అసలు మూడేళ్ల క్రితం వేదాళం వచ్చిననాటికే ఇది మాడిపోయిన మసాలాదోసెలాంటి కథ. కానీ సీనియర్ హీరోలకి చెల్లుబాటయ్యే బి,సి సెంటర్ల కథ అని సరిపెట్టుకోవచ్చు. ఆ మాడిపోయిన దోసె మీదే కాసిన్ని నీళ్లు, నూనె జల్లి మళ్లీ కాల్చి ఇంకాస్త మాడ్చి వడ్డించినట్టుంది ఈ “పెద్దన్న”.
ఏ మాత్రం కొత్తదనం లేని ఈ చిత్రకథలో క్యారెక్టర్స్ మాత్రం గంభీరంగా ప్రవేశిస్తుంటాయి. ప్రధమార్థంలో ప్రకాష్ రాజ్ ఎంటరవ్వగానే ఏదో సీరియస్ కథ మొదలవ్వబోతోందనే అభిప్రాయం కలుగుతుంది.
కానీ కంగాళీ సీన్సుతోటి, వెన్నెముకలేని పాత్రచిత్రణతోటీ ఆ ప్రకాష్ రాజ్ పాత్ర ఫస్టాఫులోనే ఫుల్ స్టాప్ పెట్టేసుకుంటుంది. మరొక చోట ఒక కార్లోంచి ఖుష్బూ, ఇంకో కార్లోంచి మీనా దిగి రజినీకాంత్ ని “బావా” అని పిలుస్తూ వంకర్లుపోతుంటారు.
1990ల్లో రజినీకాంత్ తో అలనాటి ఈ హీరోయిన్స్ చేసిన సినిమాలని గుర్తుచేసుకుంటూ నోస్టాల్జియాలోకి వెళ్లిపోయిన ప్రేక్షకులు తాదాత్మ్యంతో సినిమాలో లీనమైపోయి చూసేస్తారని దర్శకుడి అంచనా కాబోలు.
ద్వితీయార్థంలో బిల్డప్ మ్యూజిక్ తో అభిమన్యు సింగ్, మరి కాసేపటికి కౄరమైన లుక్ తో జగపతి బాబు ఎంట్రీ ఇస్తారు. ఎంట్రీలే తప్ప తాడూబొంగరం లేని పాత్రలవి. జగపతిబాబు పాత్ర అరవిందసమేతలో బసిరెడ్డి పాత్రకి కొనసాగింపులాగ ఉంది.
రజినీకాంత్ సినిమా కాబట్టి 'ఇదింతే' అనుకుని చూడాల్సిన సీన్స్ చాలానే ఉన్నాయిందులో. ఈ వయసులో కూడా రజినీకాంత్ ఇలాంటి సినిమాలు చేయడం ఆశ్చర్యమే. కానీ ప్రజాదరణ ఏమాత్రం ఉండట్లేదనేది గ్రహించాలి.
కబాలి వరకు రజినీకాంత్ సినిమా విడుదల అంటే పండుగ వాతావరణం ఉండేది. కాలా, పేట్ట, దర్బార్ లు బాక్సాఫీసువద్ద దారుణంగా బోల్తా కొట్టాయి. పెద్దన్న కి అసలు ఏ మాత్రం హైపు లేదు.
ఇక ఆయన ఈ తరహా సినిమాలు మానుకుని ఓటీటీలో “జైభీం” లాంటి సినిమాల్లో నటిస్తే ఆయనకి, అభిమానులకి కూడా ప్రశాంతంగా ఉంటుంది.
కీర్తి సురేష్ నటన నాలుగు నవ్వులకి, నలభై ఏడుపులకి పరిమితమయ్యింది. అంతకుమించి ఆమెకు స్కోప్ లేదు. నయనతార వల్ల సినిమాకి ఒనగూడిన ఉపయోగమేమీ కనపడలేదు. రజినీ పక్కన జంటగా ఉండాలి కాబట్టి ఉందంతే. పైన చెప్పుకున్నట్టుగా ప్రకాష్ రాజ్, అభిమన్యు, జగపతిబాబు ముగ్గురూ వేష్టయ్యారు.
ఇమ్మాన్ సంగీతం ఏమాత్రం ఆకట్టుకోదు. ఒక్క పాట కూడా వినసొంపుగా లేదు. కెమెరా వర్క్ బాగానే ఉంది. నిర్మాణ విలువలు ఘనగానే ఉన్నాయి.
బీపీకి, షుగరుకి ల్యాబులో పరీక్షలుంటాయి కానీ సహనానికి ఉండవు. సహనాన్ని పరీక్షించుకోవాలంటే ఈ సినిమా చూస్తే సరిపోతుంది. ఇంటర్వెల్లో పారిపోకుండా ఉంటే సహనం ఉన్నట్టే లెక్క.
ఈ సినిమాకి రెండు స్టార్స్ కూడా ఇవ్వడం కష్టం. చివరిదాకా కూర్చున్న ఆడియన్స్ కి మాత్రం ఫైవ్ స్టార్స్ ఇవ్వొచ్చు.
బాటం లైన్: వద్దన్న!