మళ్లీ టీచర్లను కెలుక్కోవడం అవసరమా జగన్..?

ఏపీలో ప్రభుత్వ టీచర్లకు గ్రేడ్లు ఇస్తామంటూ అధికారులు ప్రకటించారు. 10 నుంచి 15 అంశాలపై వారి పెర్ఫామెన్స్ రికార్డ్ చేస్తారు. దీనికి అకడమిక్ పర్ఫార్మెన్స్ అనే పేరు కూడా పెట్టారు. గ్రేడ్లు ఇస్తారు. మంచిదే,…

ఏపీలో ప్రభుత్వ టీచర్లకు గ్రేడ్లు ఇస్తామంటూ అధికారులు ప్రకటించారు. 10 నుంచి 15 అంశాలపై వారి పెర్ఫామెన్స్ రికార్డ్ చేస్తారు. దీనికి అకడమిక్ పర్ఫార్మెన్స్ అనే పేరు కూడా పెట్టారు. గ్రేడ్లు ఇస్తారు. మంచిదే, మరి ఈ గ్రేడ్లతో ఏం చేస్తారు. వారి ప్రమోషన్లలో దీన్ని పరిగణలోకి తీసుకుంటారా. లేక ఇంకేమైనా ప్రోత్సాహకాలుంటాయా.. ? ఇప్పటికే టీచర్లకు చదువు తప్ప మిగతా అన్ని పనులు చెబుతున్నారంటూ హైకోర్టు కూడా మొట్టికాయలు వేసింది. ఈ దశలో మళ్లీ ఇలా గ్రేడ్లు. 10 నుంచి 15 అంశాలు అంటే అనవసరంగా కెలుక్కోవడం కాక ఇంకేంటి..?

గతంలోనే గ్రేడ్ల ప్రస్తావన వచ్చినా.. దీనిపై అధికారులు ముందడుగు వేస్తారని ఎవరూ అనుకోలేదు. ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో కూడా పనే దైవంగా బావించేవారుంటారు, అదే సమయంలో కొందరు పనిదొంగలు కూడా ఉంటారు. స్కూల్ లో సంతకం పెట్టి బయట వడ్డీ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్లున్నారు. 

గ్రేడ్లు సిస్టమ్ పెట్టి, పాయింట్లు ఇచ్చి, లెక్కలు తీస్తే పనిదొంగలు కష్టపడి పనిచేస్తారని అనుకోలేం. ఇలాంటి గ్రేడ్లు, పాయింట్ల రాజకీయాలతో కష్టపడి పనిచేసే ఉపాధ్యాయులకి కూడా మనసు కష్టం వేసే సందర్భం వస్తుంది. పనితీరు మదింపుని ఎవరూ తప్పుబట్టరు కానీ, ఇలా ఉద్యోగాల్లో అవసరం లేని పర్ఫామెన్స్ రికార్డులంటే అది మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది.

ఇప్పటికే ఉద్యోగ, ఉపాధ్యాయ లోకం సీపీఎస్ రద్దుపై రగిలిపోతోంది. మరోవైపు పీఆర్సీ ప్రకటన వాయిదా పడుతూనే ఉంది. ఈ రెండు విషయాల్లో ఉద్యోగులు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఇదే సమయంలో నాడు-నేడు, విద్యా కానుక పంపిణీ, మధ్యాహ్న భోజనం పనులతో టీచర్లకు మరింత భారం పెరిగింది. దీంతో అకడమిక్ వ్యవహారాలు పక్కనపడిపోయి, కొసరు వ్యవహారాలకు ప్రాధాన్యం పెరిగింది. 

టీచర్లకు ఇతర పనులు అప్పజెప్పడంతో.. ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ దశలో గ్రేడ్లు ప్రకటిస్తామంటూ అధికారులు అత్యుత్సాహం చూపిస్తున్నారు.

కొన్ని కొన్ని నిర్ణయాలు మొదట్లోనే వాటి ఫలితాలను స్పష్టంగా చూపిస్తుంటాయి. నవరత్నాల వంటి మంచి పథకాలను పెట్టిన జగన్ ఇలాంటి చిన్న చిన్న సాహసాలు చేసి రిస్క్ కొని తెచ్చుకోవడం అవసరమా..? టీచర్లను గ్రేడ్లు ప్రకారం విభజిస్తే కచ్చితంగా వారిలో వ్యతిరేకత పెరిగే ప్రమాదం ఉంది. అసలీ గ్రేడ్లతో ఎంతవరకు ఉపయోగం అనేది ఓసారి ప్రభుత్వం పునరాలోచించుకుంటే మంచిది.