దాదాపు ఒకే కథతో ఒకే టైమ్ పీరియడ్ లో రెండేసి సినిమాలు రావడం టాలీవుడ్ లో కొత్త కాదు. గతంలో ఆహా కల్యాణం, జబర్దస్త్ అనే సినిమాలొచ్చాయి. ఆ రెండు కథలూ ఒకటే. ఆ తర్వాత అజ్ఞాతవాసి, సాహో సినిమాలదీ ఇదే కథ. ఇలా ఒకే కథను తీసుకొని దానికి మార్పుచేర్పులు చేస్తూ సినిమాలొచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో 2 సినిమాలు చేరేలా ఉన్నాయి.
కొన్నాళ్ల కిందట స్టూవర్టుపురం దొంగ అనే సినిమాను ప్రకటించాడు నిర్మాత బెల్లంకొండ సురేష్. తనయుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా ఈ సినిమా ఎనౌన్స్ చేశాడు. కట్ చేస్తే, తాజాగా టైగర్ నాగేశ్వరరావు అనే మరో సినిమా ప్రకటన కూడా వచ్చింది. అభిషేక్ అగర్వాల్ నిర్మాతగా రవితేజ హీరోగా ప్రకటించారు ఈ సినిమాను.
మేటర్ ఏంటంటే.. ఈ రెండు సినిమాలది ఒకటే కథ. 1970 కాలంలో స్టూవర్టుపురం ప్రాంతానికి చెందిన ప్రముఖ గజదొంగ `టైగర్ నాగేశ్వర రావు` బయోపిక్ ఇది. రెండు సినిమా యూనిట్లు ఈ విషయాన్ని ప్రకటించాయి. అభిషేక్ అగర్వాల్ అయితే మరో అడుగు ముందుకేసి మూడేళ్లుగా ఈ కథపై తమ దర్శకుడు వంశీ వర్క్ చేస్తున్నట్టు ప్రకటించాడు.
అది నిజమే. వంశీకృష్ణ దాదాపు మూడేళ్లుగా ఈ కథపై వర్క్ చేస్తున్నాడు. కాకపోతే ముందుగా బెల్లంకొండకు ఆ కథ చెప్పాడు. అక్కడ్నుంచి డ్రాప్ అయి అభిషేక్ అగర్వాల్ వద్దకు చేరాడు. రవితేజతో సినిమా ఎనౌన్స్ చేశాడు. ఈ గ్యాప్ లో బెల్లంకొండ కూడా దాదాపు అదే కథతో కేఎస్ అనే దర్శకుడ్ని పరిచయం చేస్తూ సినిమా ఎనౌన్స్ చేశాడు.
నాగేశ్వరరావు జీవితం ఓపెన్ సబ్జెక్ట్. మరీ ముఖ్యంగా బయోపిక్ కాబట్టి ఎవరికి నచ్చినట్టు వాళ్లు తీసుకోవచ్చు. కానీ రవితేజ సినిమాలో ఉన్న సన్నివేశాలే బెల్లంకొండ సినిమాలో కూడా రిపీట్ అయితే మాత్రం జగడం తప్పదు. గతంలో ఓ బాలీవుడ్ మూవీని మక్కికిమక్కి కాపీ కొట్టి తీసిన జబర్దస్త్ అనే సినిమా నిర్మాత కూడా ఈ బెల్లంకొండ సురేషే.