టీడీపీ అధినేత చంద్రబాబు చివరికి బీజేపీ నినాదం ఎత్తుకున్నారు. మున్సిపల్ ఎన్నికల ముంగిట బీజేపీ కూడా ప్రస్తావించని మతం కోణాన్ని ఆయన స్పృశించడం గమనార్హం. బీజేపీ మతం అస్త్రాన్ని చంద్రబాబు చేతికి తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఇంతకూ బాబుకు ఏమైందని అనుమానించేలా ఏది పడితే అది ఆయన మాట్లాడుతున్నారనే విమర్శ లొస్తున్నాయి. బహుశా ఎన్నికలంటేనే ఓటమి అని ఆయన మానసికంగా సిద్ధమైనట్టున్నారు.
అమరావతిలో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్ఈసీ, జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. హిందువులు దీపావళి పండగ చేసుకోకుండా పైశాచికంగా ప్రవర్తిస్తున్నారని ఆక్షేపించారు. మిగిలిపోయిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను నేటి నుంచి ప్రారంభించడం ఏంటని ఆయన నిలదీశారు. దీన్ని బట్టి సీఎం ఉద్దేశాన్ని అర్థం చేసుకోవచ్చన్నారు.
ఇదే ఇతర మతాల పండగలు ఉంటే ఎన్నికల ప్రక్రియ చేపట్టేవారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) స్వతంత్రంగా వ్యవహరిస్తోందా అని ప్రశ్నించారు.
కేబినెట్ సమావేశంలో సీఎం చెబితే.. దానికి తానా తందానా అన్నట్టుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు. దీపావళి అయ్యాక ప్రక్రియ మొదలు పెడితే కొంపలు కూలిపోతాయా? అని బాబు ప్రశ్నించారు. ఒక మతం మనోభావాలు దెబ్బతీసేలా కనీసం దీపావళి జరుపుకోనీయకుండా అదేరోజున నామినేషన్లు వేసేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఈసీ స్వతంత్రంగా పని చేస్తుందా? లేదంటే ఎవరైనా ఒత్తిడి తెచ్చారా? అని ఆయన ప్రశ్నలు సంధించారు.
నామినేషన్ల విషయంలో ఆర్వోలు పద్ధతిగా వ్యవహరించాలని కోరారు. నాటకాలాడితే వదిలిపెట్టమని హెచ్చరించారు. ఏ మాత్రం అన్యాయం చేసినా వెంటాడతామని తీవ్రస్థాయిలో హెచ్చరించారు.మతం సెంటిమెంట్‌ను చంద్రబాబు తెరపైకి తేవడం ఆసక్తికర పరిణామంగా చెప్పొచ్చు.
సాధారణంగా ఇలాంటి మతం సెంటిమెంట్‌ను బీజేపీ రగుల్చుతుంటుంది. ఈ దఫా బీజేపీ పాత్రను టీడీపీ పోషిస్తుండడం సరికొత్త పరిణామంగా చెప్పొచ్చు. గతంలో తన ఆదేశాలకు అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికలే నిర్వహించని నిమ్మగడ్డ రమేశ్‌ను మరిచిపోయినట్టున్నారని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.