బావ చంద్రబాబునాయుడిని బామ్మర్ది, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ బోనులో నిలిపారు. ఇందుకు ‘అన్‌స్టాప బుల్ విత్ ఎన్బీకే’ షో వేదికైంది. తొలిసారిగా బాలకృష్ణ హోస్ట్‌గా డిజిటల్ మీడియా తెరపైకి వచ్చారు. గత కొన్నిరోజులుగా బాలకృష్ణ షోకి సంబంధించి విడుదలైన ప్రోమో వైరల్ అవుతోంది. దీపావళి పండగ పురస్కరించుకుని విలక్షణ నటుడు మోహన్‌బాబును బాలకృష్ణ తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేశారు.
పేరుకు మోహన్‌బాబు అనే మాటే గానీ, ఆయన తనయుడు విష్ణు, తనయ లక్ష్మిప్రసన్న కూడా ఇంటర్వ్యూలో పాల్గొని అలరించారు. ఇంటర్వ్యూ కండీషన్లో భాగంగా మోహన్‌బాబు కూడా హోస్ట్ బాలకృష్ణకు ప్రశ్నలు సంధించి వ్యూయర్స్‌ను ఆకట్టుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో రాజకీయ పరమైన ప్రశ్నలు కూడా ప్రస్తావనకు వచ్చాయి.
ఎన్టీఆర్ తర్వాత మీరెందుకు టీడీపీ పగ్గాలు చేపట్టలేదు, చంద్రబాబుకి ఎందుకు ఇచ్చేశారని బాలయ్యను మోహన్‌బాబు నేరుగా ప్రశ్నించారు. దీనికి బాలయ్య కొంత సీరియస్ అయినట్టు కనిపించారు. ఆ తర్వాత తేరుకుని సమాధానం ఇచ్చారు. అప్పట్లో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ అంటూ ఇలా వారసత్వ రాజకీయాలు నడుస్తున్నాయన్నారు. దానికి వ్యతిరేకంగా టీడీపీ పోరాటం చేసిందని గుర్తు చేశారు.
వారసత్వ రాజకీయాలకి తన తండ్రి వ్యతిరేకమన్నారు. దీంతో ఆ సమయంలో వంశపారంపర్య రాజకీయాలు మనమే చేస్తే బాగుండదనే ఆలోచనతో టీడీపీ పగ్గాలు చేపట్టలేదని బాలకృష్ణ చెప్పడం గమనార్హం. పార్టీ అనేది ప్రజల కోసం నిలబడాలన్నారు. అందువల్లే తాను టీడీపీ పగ్గాలు చేపట్టలేదని వివరణ ఇచ్చారు.
అయితే చంద్రబాబు వారసుడిగా లోకేశ్‌ను తీసుకురావడాన్ని అంగీకరిస్తారా బాలయ్య అంటూ నెటిజన్లు తమ విమర్శలకు పదును పెట్టారు. అందులోనూ అసమర్థుడిగా అందరితో పిలిపించుకుంటున్న లోకేశ్ నాయకత్వాన్ని బలవంతంగా టీడీపీపై రుద్దడం వల్ల పార్టీ నష్టపోదా? అంటూ నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు.
ఎన్టీఆర్ ఆశయాలకు ఇది తూట్లు పొడవడం కాదంటారా? అని బాలయ్యను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నిలదీస్తున్నారు. అనవసరంగా బాలయ్య తేనెతుట్టెను కదిపారని టీడీపీ శ్రేణులు వాపోతున్నాయి.