టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ను చంద్రబాబే చెడగొడుతున్నారా? అంటే ఔననే సమాధానం వస్తోంది. ఇప్పటికీ చిన్న పిల్లోడిగా భావిస్తూ, ఎలాంటి బాధ్యతలు అప్పగించకుండా పెంచుతుండడం వల్లే లోకేశ్ అసమర్థుడినే గుర్తింపు తెచ్చుకున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. తాజాగా మిగిలిపోయిన స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. నామినేషన్ల దాఖలుకు నేటితో ఆఖరి రోజు. మరో పది రోజుల్లో ఎన్నికలు.
కుప్పం మున్సిపాలిటీకి కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ క్రమంలో పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడికి బాధ్యతలు అప్పగించారు. మరి లోకేశ్‌కు ఏ బాధ్యతలు అప్పగించినట్టు? అనే ప్రశ్న తలెత్తుతోంది.
ఇది సొంత పార్టీ నుంచే పెద్ద ఎత్తున రావడం సీరియస్‌గా పరిగణించాల్సిన విషయం. లోకేశ్‌కు ఎన్నికల బాధ్యతలు అప్పగించి, అతనితో వ్యూహాలు రచించేలా చేసేందుకు వచ్చిన అవకాశాన్ని చంద్రబాబు చేజేతులా జారి విడుచు కుంటున్నారని టీడీపీ శ్రేణులు వాపోతున్నాయి.
టీడీపీ గెలుపు కోసం శ్రేణులు, నాయకులు శ్రమించడం, అధికారాన్ని, హోదాను మాత్రం లోకేశ్ అనుభవించడమా? ఇదెక్కడి న్యాయమని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. బాధ్యతలేంటో తెలియని అమాయకుడు లోకేశ్ అని చంద్రబాబు భావించడం వల్లే…అతని భవిష్యత్‌ను అతి ప్రేమతో నాశనం చేస్తున్నారన్న వాస్తవాన్ని గ్రహించలేదనే విమర్శలున్నాయి.
గెలుపోటములతో సంబంధం లేకుండా ఎన్నికల్లో ఎత్తుకు పైఎత్తులు ఎలా వేయాలో, ప్రత్యర్థులను ఎలా ఎదుర్కోవాలో లోకేశ్ విలువైన అనుభవాలు సంపాదించుకునే అవకాశాన్ని చంద్రబాబే పోగొట్టారనే వాదన వినిపిస్తోంది. ఇలాగైతే టీడీపీ భవిష్యత్ సారథిగా లోకేశ్ ఎలా అవతరిస్తారనే ప్రశ్నలొస్తున్నాయి. చిన్నచిన్న ఎన్నికల నిర్వహణ బాధ్యతల్ని లోకేశ్‌కు అప్పగిస్తూ అలవాటు చేయడం వల్ల ఆ అనుభవాలు సార్వత్రిక ఎన్నికల్లో ఉపయోగపడేవని అభిప్రాయపడుతున్నారు.
లోకేశ్‌కు ఏ బాధ్యతా అప్పగించకపోవడం వల్ల సోషల్ మీడియాలో కాలక్షేపం చేస్తూ ప్రజలతో సంబంధం లేని నాయకుడిగా గుర్తింపు పొందుతున్నాడని విమర్శిస్తున్నారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల బాధ్యతల్ని లోకేశ్ తనకు తానుగా తీసుకుని, విజయ పథాన నడిపించి వుంటే టీడీపీ శ్రేణులకు భరోసా, నమ్మకం కలిగేదని అంటున్నారు. అయినా లోకేశ్ భవిష్యత్‌పై తండ్రికి లేని బాధ పార్టీ శ్రేణులకు ఎందుకో!