Advertisement

Advertisement


Home > Movies - Reviews

PS 2 Review: మూవీ రివ్యూ : పొన్నియన్ సెల్వన్ 2

PS 2 Review: మూవీ రివ్యూ : పొన్నియన్ సెల్వన్ 2

చిత్రం: పొన్నియన్ సెల్వన్ 2
రేటింగ్: 2.75/5
తారాగణం:
విక్రం, జయం రవి, కార్తి, ఐశ్వర్యారాయ్, త్రిష, ప్రకాష్ రాజ్, శరత్ కుమార్, కిషోర్, పార్తీబన్, శోభిత దూళిపాళ, ఐశ్వర్యా లక్ష్మి, విక్రమ్ ప్రభు, లాల్ తదితరులు
సంగీతం: ఏఆర్ రెహమాన్
ఛాయాగ్రహణం: రవివర్మన్
మాటలు: తనికెళ్ల భరణి
నిర్మాతలు: సుభాస్కరన్-మణిరత్నం
దర్శకత్వం: మణిరత్నం
విడుదల తేదీ: 28 ఏప్రిల్ 2023

అనుకున్న సమయానికి "పొన్నియన్ సెల్వన్-2" కూడా వచ్చేసింది. తొలిభాగంలో చరిత్రపాఠం సగం విన్న ప్రేక్షకులకి ఈ మలిభాగంతో లెసన్ పూర్తవుతుందన్నమాట. అసలు చరిత్ర కొంత, దానికి నాటకీయ కల్పన కొంత కలిపి కల్కి కృష్ణమూర్తి రాసిన నవలని మణిరత్నం సినిమాగా తీసాడు అని చెప్పుకుంటూనే ఉన్నాం. 

ఇంతకీ ఈ రెండవ భాగంలో ఉన్నదేంటంటే..పాండ్యుల దాడిలో దెబ్బతిని అరుళ్ మొళి (జయం రవి) సముద్రంలో మునిగిపోతే ఒక వృద్ధమహిళ అతనిని కాపాడుతుంది. అతనితో పాటూ వందియ దేవుడు (కార్తి) కూడా బతికి బట్టకడతాడు. అరుళ్ మొళికి ఒక బౌద్ధ విహారంలో చికిత్సలు, సేవలు జరగగడంతో అతను పూర్తిగా కోలుకుంటాడు. 

ఇదిలా ఉంటే, ఆదిత్య కరికాలుడిని (విక్రం), సుందర చోళుడిని (ప్రకాష్ రాజ్), కుందవి (త్రిష) ని ఒకేసారి అంతమొందించి చోళసామ్రాజ్యానికి తెర దించేయాలని పన్నాగాలు పన్నుతుంటుంది నందిని (ఐశ్వర్యా రాయ్). ఇంతకీ ఆమె కక్షకి గల కారణమేంటి? ఆమె ఎవరి కూతురు? ఆమె ఎత్తుగడలు ఎంతవరకు నెరవేరుతాయి? చివరకు ఆమె కథ ఏమౌతుంది? ఇదంతా ఒక పార్శ్వం. 

మరో పక్క అరుళ్ మొళి కి చిచాన్న (మధురాంతకుడు) చోళసామ్రాజ్యాధినేత అవ్వాలనుకుంటాడు. అతనికి ఆదిత్య కరికాలుడి చేతిలో దెబ్బతిన్న రాష్ట్రకూటులు, మరికొందరు శివభక్తులు దన్నుగా నిలుస్తారు. 

మధ్యలో పల్లవ రాజు ఒకడు అప్పటి వరకు ఆదిత్య కరికాలుడితో మిత్రుడిగా ఉన్నవాడు నందిని వైపు మొగ్గి పార్టీ మారి చోళ రాజ్యానికి శత్రువౌతాడు. 

ఇలా చోళ, పాండ్య, పల్లవ, రాష్ట్రకుట రాజ్యాల మధ్యన రకరకాల రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలు, హత్యల నడుమ సాగి చివరికి సుఖాంతమౌతుంది. 

తమిళ సాహిత్య చరిత్రలో ఎంతో గొప్పదని చెప్పబడే ఈ నవలలో అంత ఆశ్చర్యపోయే విషయమేముందో బోధపడదు. ఈ భవన కలగడానికి కారణం కల్కి కృష్ణమూర్తా లేక మణిరత్నమా అన్నది నవల చదివి సినిమా చూసిన వారికే తెలియాలి. 

ఆదిత్య కరికాలుడిని చంపిందెవరో పూర్తి క్లారిటీ ఇవ్వకుండా మణిరత్నం తికమకపెట్టాడా లేక నవలలోనే అలా ఉందా అనేది తెలియదు. 

నవలని సినిమాగా తీస్తున్నప్పుడు ట్విస్టులు, సర్ప్రైజులు, షాక్ ఎలిమెంట్స్, "వారెవా" అనిపించే సంభాషణలు వంటివి ఎన్నుంటే అంత గొప్ప చిత్రరాజమౌతుంది. ఇక్కడే రాజమౌళి ఎప్పుడూ టాప్ మార్క్స్ కొట్టేస్తాడు. మణిరత్నం మాత్రం వెనకబడ్డాడు. 

తనికెళ్ల భరణి సంభాషణలు తమిళంలోంచి తెలుగులోకి అరవవాసన లేకుండా రాసి మెప్పించారు. కానీ ఒరిజినల్లో ఏదుంటే అది నేటివిటీ చెడకుండా రాబట్టగలిగారు కానీ "ఔరా" అనిపించడానికి మూలంలో అంత పస ఉన్న డైలాగ్స్ లేవు మరి. 

అన్నేసి పాత్రల పేర్లు, మధ్యలో ఆ ఊళ్ల పేర్లు గుర్తు పెట్టుకోలేక సతమతమవ్వాల్సిన పరిస్థితి తప్పదు. మొదటి భాగాన్ని శ్రద్ధగా చరిత్ర పాఠం నేర్చుకుంటున్న విద్యార్ధిలాగ చూసిన వాళ్లకి రెండవ పార్ట్ ఎక్కొచ్చేమో కానీ లేకపోతే అర్ధంకాక నీరసమొస్తుంది. 

ఈ భాగంలో జయం రవి పాత్ర పెద్దది. ఈ కథ రిత్యా ఎక్కువమంది తెలుగువాళ్లకి తెలిసిన ఒకేఒక్క పేరు రాజరాజచోళుడు. అతని అసలు పేరే అరుళ్ మోళి. అతనే కావేరీనది పుత్రుడు..పొన్నియన్ సెల్వన్. "పొన్ని" అనేది కావేరీ నదికి స్థానిక నామం. చేసినంత వరకు బాగానే చేసి మెప్పించాడు. 

కరికాలుడిగా విక్రం కొన్ని చోట్ల బాగా నటించాడు. అంత బాధ్యతాయుతమైన వీరుడు తనని చంపేసుకోమని ప్రధేయపడడం దేనికో అర్ధం కాదు. ఈ పాత్ర ట్రీట్మెంట్ వీక్ గా ఉన్నట్టే. 

కార్తిది ఇందులో కూడా పూర్తి నిడివున్న పాత్రే. 

ఐశ్వార్యా రాయ్ నెగటివ్ షేడ్ మరింతగా చూడొచ్చు ఇందులో. అయితే ఆమె చేస్తున్న పనులకి కారణమేంటో బలమైన ఫ్లాష్ బ్యాక్ లేనే లేదు. ఏదో ఉందిలే అనుకుంటే అది సరిపోలేదు. 

వృద్ధ ఐశ్వర్యా రాయ్ పాత్ర శుద్ధ దండగయ్యింది. మొదటి భాగం ముగింపులో ఇచ్చిన బిల్డప్పుకి, రెండవ భాగంలో అతిధి పాత్రగా కనిపించిన తీరుకి అస్సలు బ్యాలెన్స్ అవ్వలేదు.  

పాటలు పెద్దగా గుర్తుంచుకునేలా లేవు. ఒక్క "వీర రాజ వీర" తప్ప మిగిలినవన్నీ అరవ పాటలు వింటున్నట్టే ఉన్నాయి. ఎక్కడా నేటివిటీ ధ్వనించలేదు. నేపథ్య సంగీతం కూడా ఉండాల్సిన స్థాయిలో లేదు. ఈ విషయంలో రెహ్మాన్ నిరుత్సాహ పరిచాడనే చెప్పాలి. 

కెమెరా, వీ.ఎఫ్.ఎక్స్, కాస్ట్యూంస్, ఆర్ట్ శాఖ, మేకప్ అన్నీ మొదటి భాగంలో లాగానే చాలా బాగున్నాయని చెప్పాలి. 

ఏది ఏమైనా "పొన్నియన్ సెల్వన్-2" అద్భుతమనిపించదు. బాహుబలి లాంటి సినిమాని చూసేసాక మేకింగులో కానీ, కంటెంట్ లో కానీ దానిని మించి ఉంటే తప్ప అద్భుతమనే పరిస్థితి కనిపించడంలేదు. కనీసం ఆ స్థాయిలో నిలబడ్డా మెచ్చుకోవచ్చు. 

మొత్తానికి మణిరత్నం ఇంత భారీ సినిమాని మీదేసుకుని చేయడం ప్రశంశార్హం. పడిన శ్రమ, చిత్తశుద్ధి అన్నీ ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఫలితం దక్కకపోయినా వ్రతం మాత్రం చెడినట్టు కాదు. ఈ సినిమా ఫలితం ఏమైనా మణిరత్నం తన గౌరవాన్ని మాత్రం నాలుగింతలు పెంచుకున్నారు. 

ఇష్టపడి చూస్తూ, కష్టపడి అర్ధం చేసుకునే వాళ్లకి ఈ సినిమా నచ్చవచ్చు. 

బాటం లైన్: బరువైన చరిత్ర పాఠం

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?