మీడియా దిగ్గజం, ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావును వెనకేసుకొచ్చే క్రమంలోనే దిగంబరంగా నిలబెట్టిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈనాడు, టీడీపీకి మధ్య అనుబంధం దాస్తే దాగేది కాదని అందరికీ తెలుసు. మార్గదర్శి ఫైనాన్ష్, చిట్‌ఫండ్ ఆర్థిక వ్యవహారాల్లో రామోజీరావు సీనియర్ పొలిటీషియన్ ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు చిక్కారు. చివరికి ఏపీ సీఐడీ దర్యాప్తు అంటే… భయంతో రామోజీరావు మంచం పట్టాల్సిన దుస్థితిని ఉండవల్లి తీసుకొచ్చారు.
రామోజీరావును దోషిగా నిలబెట్టేందుకు ఉండవల్లి అలుపెరగని న్యాయపోరాటం చేస్తున్నారు. అయితే రామోజీరావు నిర్వహిస్తున్న మార్గదర్శిలో ఎలాంటి ఆర్థిక అవకతవకలు జరగలేదని టీడీపీ భావిస్తే, ఆ పార్టీ ప్రతినిధితో బహిరంగ చర్చకు సిద్ధమని ఉండవల్లి ఇటీవల సవాల్ విసిరారు. ఈ సవాల్‌ను టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి, యువనాయకుడు జీవీరెడ్డి స్వీకరించారు.
మే 14న హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో వాళ్లిద్దరి బహిరంగ చర్చ జరగనుంది. మరోవైపు రామోజీరావు ఎలాంటి తప్పు చేయలేదని, ఆయనంత సచ్ఛీలుడు ఈ భూప్రపంచంలోనే లేరన్న రీతిలో కొందరు మేధావులు, న్యాయ నిపుణుల ముసుగులో పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఉండవల్లి దెబ్బకు రామోజీనే కాదు, టీడీపీ కూడా గిలగిలలాడుతోందని తాజాగా ఆ పార్టీ అధికారిక ట్విటర్ ఖాతాలో పెట్టిన పోస్టే నిదర్శనం.
“జనానికి కీడు చేస్తున్న పాలన గురించి మాట్లాడంట. కనీసం తన స్నేహితుడి హత్య గురించి గానీ, ఆ స్నేహితుడి కూతురిపై చేస్తోన్న ఆరోపణల మీద కానీ స్పందించడంట. కేవలం తనకు గిట్టుబాటు అయ్యే అంశాల గురించి మాత్రమే మాట్లాడుతూ, జనాన్ని తప్పుదోవ పట్టించే ఇలాంటి వారిని ఏమనాలి?” అంటూ టీడీపీ ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా ఉండవల్లిని వెటకరిస్తూ ఓ ఫొటోను కూడా షేర్ చేయడం గమనార్హం.
వివేకా హత్యను బుద్ధి, జ్ఞానం వున్న ఏ ఒక్కరూ సమర్థించరు. మార్గదర్శిని వెంటాడుతున్న ఉండవల్లిని ఎందుకు నోరు తెరవవు అంటూ ఆయన నోటికి నల్లటి రిబ్బన్ వేసిన ఫొటోను టీడీపీ సోషల్ మీడియా క్యారీ చేయడం కొన్ని ప్రశ్నల్ని రేకెత్తి స్తోంది. టీడీపీ నిలదీత ఎలా వుందంటే… రామోజీరావు ఆర్థిక నేరాల్ని ప్రశ్నిస్తున్నావు సరే, మరి వివేకా హత్య కేసు గురించి ఎందుకు మాట్లాడవని నిలదీస్తున్నట్టుగా ఉంది.
రామోజీరావు చేసింది నేరమే, అలాగే వివేకాను హత్య చేయడం అంతకంటే పెద్ద నేరమని సమాజానికి టీడీపీ చెబుతున్నట్టుగా వుంది. కాకపోతే టీడీపీ ఆవేదనంతా ఏంటంటే… మీ నిలదీత కేవలం రామోజీ రావు ఆర్థిక నేరాల వరకే ఎందుకు పరిమితం చేస్తారు? వివేకా హత్య కేసు వైపు చూడాలని సూచించినట్టుగా వుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఉండవల్లి మాటకు ఎంత పవర్ వుందో టీడీపీ ట్వీట్ చెబుతోంది. ఉండవల్లి మాటలు వింటున్న జనం తప్పుదోవ పడుతున్నట్టు ఆ పార్టీ చెబుతోంది. అంటే రామోజీరావుపై ఉండవల్లి చెబుతున్న ప్రతిమాట నమ్ముతున్నారని టీడీపీ ఒప్పుకుంటోంది. తన రాతలతో ఈనాడు, మాటలతో టీడీపీ తెలుగు సమాజాన్ని మభ్య పెడుతున్నట్టు ఇంతకాలం సంబర పడుతోంది కదా! ఒక మామూలు రాజకీయ నాయకుడైన ఉండవల్లిని అడ్డుకోవడం ఈనాడు మీడియా, అలాగే తమ వల్ల కాలేదని టీడీపీ ఒప్పుకుంటోందా? మార్గదర్శి ద్వారా రామోజీరావు ఏ తప్పు చేయలేదని తాను నిరూపిస్తానని జీవీరెడ్డి ఉత్సాహం ప్రదర్శిస్తున్న తరుణంలో… టీడీపీ అనే కోయిల ముందే ఎందుకు అపశ్రుతి రాగం పలుకుతున్నదో అర్థం కావడం లేదు.