వై నాట్ కుప్పం నినాదంతో వైసీపీ ముందుకొస్తున్న నేపథ్యంలో చంద్రబాబునాయుడు అప్రమత్తమయ్యారు. కుప్పం నుంచి చంద్రబాబునాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడూ లేని విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. ఈ ఉత్సాహంతో చంద్రబాబును కూడా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓడిస్తామని వైసీపీ నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఓటమితో చంద్రబాబుకు తత్వం బోధపడింది. ఇలాగైతే ఎమ్మెల్యే ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవని ఆయన గ్రహించి, మేల్కొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి ప్రతిమూడు రెండు నెలలకు ఒకసారి స్వయంగా ఆయనే కుప్పానికి వెళుతూ పార్టీ బలోపేతం దృష్టి సారించారు. కుప్పం టీడీపీలో ఏం జరుగుతున్నదో ఆయన గ్రహించారు. దిద్దుబాటు చర్యలు చేపట్టారు. టీడీపీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న తన పీఏ మనోహర్‌పై పెద్ద ఎత్తున ఆరోపణలు రావడాన్ని గ్రహించి, కాస్త పక్కన పెట్టారు. అయితే అది తాత్కాలికమే.
తాజాగా తూర్పురాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి గెలుపొందిన కంచర్ల శ్రీకాంత్‌కు కుప్పం టీడీపీ బాధ్యతలను చంద్రబాబు అప్పగించడం విశేషం. అలాగే 38 మంది టీడీపీ సభ్యులతో కూడిన కమిటీని కూడా ఏర్పాటు చేయడం చర్చనీ యాంశమైంది. కుప్పంలో చంద్రబాబుకు లక్ష ఓట్ల మెజార్టీ తీసుకొచ్చే బాధ్యతల్ని ఈ కమిటీపై పెట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల వైసీపీ చేతిలో గాయపడ్డ టీడీపీ కార్యకర్తల్ని కంచర్ల శ్రీకాంత్ పరామర్శించి ధైర్యం చెప్పారు.
కుప్పంలో తరచూ పర్యటిస్తూ పార్టీ శ్రేణుల్లో నైతిక స్థైర్యాన్ని నింపుతున్నారు. తాజాగా కుప్పం బాధ్యతల్ని అప్పగించడంతో అక్కడే తిష్ట వేయడానికి శ్రీకాంత్ సన్నద్ధం అయ్యారు. కుప్పంపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో ఓడించడానికి వైసీపీ ఎలాంటి వ్యూహాలను రచిస్తుందో అనే చర్చకు తెరలేచింది.