Advertisement

Advertisement


Home > Movies - Reviews

Rajadhani Files Review: మూవీ రివ్యూ: రాజధాని ఫైల్స్

Rajadhani Files Review: మూవీ రివ్యూ: రాజధాని ఫైల్స్

చిత్రం: రాజధాని ఫైల్స్
రేటింగ్: 1/5
తారాగణం:
వినోద్ కుమార్, వాణీ విశ్వనాథ్, పుష్పరాజ్ అఖిలన్, వీణ పంచపర్వాల, పవన్, షణ్ముఖ్, విశాల్ పట్ని
కెమెరా: రామలింగం రమేష్ బాబు 
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు 
సంగీతం: మణిశర్మ
నిర్మాత: కె.రవిశంకర్
దర్శకత్వం: భాను శంకర్ 
విడుదల: 15 ఫిబ్రవరి 2024

రాజకీయచిత్రాలు ఏ పక్షంగా అయినా ఉండొచ్చు. అన్నిటికీ ప్రేక్షకులుంటారు. ఒక పార్టీకి వ్యతిరేకంగా తీస్తున్న సినిమాపై అవతలి పార్టీవారికి ఆసక్తి సహజం. పైగా రూలింగ్ పార్టీ మీద తీసిన సినిమా అంటే దృష్టిపడడం కూడా అంతే సహజం. 

ఇప్పటికే "యాత్ర", "లక్ష్మీస్ ఎన్.టి.ఆర్", "అమ్మరాజ్యంలో కడప బిడ్డలు", "యాత్ర-2" వంటి సినిమాలు తెదేపాకి వ్యతిరేకంగా వచ్చిన చిత్రాలు. ఇప్పుడు రాబోతున్న "వ్యూహం", "శపథం" కూడా ఆ వర్గానికి చెందినవే. మొదటిసారిగా ఎన్నికల ముందు వైకాపా అధికారంలో ఉండగా ఆ పార్టీకి వ్యతిరేకంగా తీసిన సినిమా ఈ "రాజధాని ఫైల్స్". కనుక ఇందులో ఏముందో అన్న ఆసక్తి ప్రజల్లో కలగాలి. ఇంతకీ కంటెంట్ ఏంటో చూద్దాం. 

అయిరావతి (అమరావతికి పెట్టిన మారుపేరు) పరిసరప్రాంతాల్లోని ఒక పల్లెటూరిలో ఒక మోతుబరి (వినోద్ కుమార్), అతని భార్య (వాణీ విశ్వనాథ్). వాళ్లకి ఒక కొడుకు గౌతం (పుష్పరాజ్ అఖిలన్). చిన్నప్పటినుంచీ గౌతం కి జనంతో ఉండడం నచ్చదు. జనం బాధలు, కష్టాలు అసలే పట్టవు. తన స్వార్ధమేదో తనది అన్నట్టుండే వ్యక్తి. సైనిక్ స్కూల్లో చదువుకోవడానికి వెళ్లి పెద్దయ్యాక ఒకసారి ఇంటికొస్తాడు. ఇంచుమించు అదే సమయంలో రాజధాని నిర్మాణం కోసం భూసేకరణ మొదలుపెడుతుంది ప్రజాకిరణం పార్టీ ప్రభుత్వం. దానికి రైతులు నిరాకరిస్తారు. తల్లిలాంటి తమ పొలాన్ని, తరతరాలనుంచీ వస్తున్న మాగాణి భూమిని ఇవ్వమంటారు. కానీ ఇవ్వడం ఎంత అవసరమో, భవిష్యత్తుకి చేయాల్సిన ఈ త్యాగం ఎంత ముఖ్యమో ఆ ఊరి మోతుబరి చెప్పగానే రైతులంతా కన్విన్సయ్యి నవ్వుతూ పత్రాల మీద సంతకం పెట్టేసి తమ భూముల్ని ఇచ్చేస్తారు. తర్వాత ప్రభుత్వం మారుతుంది. కొత్తగా కత్తి గుర్తు గల కె.ఆర్.ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అయిరావతి ఒక్కటే రాజధాని కాదని రాష్ట్రానికి మొత్తం నాలుగు రాజధానులని ప్రకటన వస్తుంది. దాంతో రైతులు నిరసన మొదలుపెడతారు. వెనక్కొచ్చిన కొడుకు ముందు పెద్దగా కనెక్ట్ కాకపోయినా తన తల్లిని అధికారపార్టీ వారు వివస్త్రను చేయడం చూసి తాను కూడా ఆ ఉద్యమంలో భాగమవుతాడు. ఆ తర్వాత ఏమౌతుంది అనేది కథ. 

"ఈ చిత్రంలోని పాత్రలు, సన్నివేశాలు ఎవరినీ ఉద్దేశించినవి కావు..." అంటూ డిస్క్లైమర్ వేసినా అందులో ఎంత నిజముందో అందరికీ తెలుసు. సినిమాని 'సినిమాగా చూడండి, రియాలిటీకి సంబంధం లేదన్నాం కదా అనంటే..' సినిమాగానే ఇది అత్యంత పేలవంగా ఉంది. ఎందుకంటే ఏ సినిమాకైనా ముఖ్యం కాన్-ఫ్లిక్ట్ పాయింట్. రాజధాని కోసమని రైతుల పొలాలు తీసుకుని, తర్వాత అక్కడ మాత్రమే కాకుండా వేరే చోట కూడా రాజధానులుంటాయని చెప్పడం కాన్-ఫ్లిక్ట్ పాయింట్ ఏమిటో అర్ధం కాదు. 

ఉద్యమంలో కూడా "మా పొలాలు మాకిచ్చేయండి.. పనికి రాకుండా కాంక్రీటు పోసిన పొలాలకు ప్రత్యామ్నాయంగా మరో పొలం చూపండి" అని ఒక్క రైతు కూడా అడగడు. "మాకిక్కడే రాజధాని కావాలి. ఒక్క అయిరావతే రాజధాని కావాలి" అని అరుస్తుంటారు. దీంతో అసలా రైతుల మీద సింపతీయే కలగదు. "మేము ఇవ్వము అంటే ఎందుకు బలవంతపెట్టావు.. నీ వల్లే మాకీ దరిద్రం" అని ఆ మోతుబరిని ఒక్క రైతు కూడా ప్రశ్నించడు. 

మరో పక్క అయిరావతి ఉద్యమకారుల్ని పోలీసులు చితక్కోట్టేస్తూ ఉంటారు. ఆ రైతులకి అండగా వచ్చిన కాలేజీ విద్యార్థుల్ని కూడా చీకట్లో చితకబాది వాళ్లని డ్రగ్స్ కేసులో ఇరికిస్తారు పోలీసులు. ఈ సినిమాలో పోలీసులు కరడుకట్టిన రాక్షసుల్లాంటి విలన్లు. 

పోనీ ఈ భూములు తీసుకోవడం వల్ల ఏ రైతు కుటుంబం ఎంత అస్తవ్యస్తమయ్యిందో హత్తుకునేలా ఒక్క ఉపకథ కూడా చూపించలేదు. "మాకు కౌలు డబ్బులివ్వడం లేదు" అని మధ్యలో ఒక పాత్ర ఏడుస్తూ చెబుతుంది. కనీసం ఆ డబ్బుని సత్వరం విడుదల చేయమని కూడా ఉద్యమంలో ఎవ్వరూ అడగరు. అందరిదీ ఒకటే మాట..."మాకు అయిరావతి ఒక్కటే రాజధానిగా కావాలంతే". 

పైగా అయిరావతిని రాజధాని చేయమని 70 మంది రైతులు బలిదానం చేసేసుకుంటారు. వాళ్లందర్నీ గుట్టకింద పోసి అంత్యక్రియలు ఒక పండుగలా చేస్తారు అయిరావతి ప్రజలు. ఇదేం చోద్యమని అనుకునే లోపే ఒక పాత్ర హీరోతో అంటుంది- "రైతులకి రిటైర్మెంట్ లేదు. చావే వీళ్ళ రిటైర్మెంట్. అందుకే ఈ అంత్యక్రియల్ని ఇలా రిటైర్మెంట్ ఫంక్షన్ లాగ మంగళవాయిద్యాలతో జరుపుతున్నాం" అని చెబుతుంది. 

రియాక్షన్ కోసం పక్క ప్రేక్షకుడికేసి చూద్దామంటే సీట్లన్నీ ఖాళీ. 

గుట్టకింద శవాల్ని పోసి తగలపెట్టడం ఎందుకంటే.. ఒక రైతు పక్క రైతు పంట బాగా పండితే ఆనందిస్తాడట. కనుక రైతులంతా ఒకటేనట. అందుకే అలా గుట్టగా శవాల్ని ఒకరి మీద ఒకర్ని పొడుకోపెట్టి దహనమట! 

భారంగా నిట్టూర్చినా తీరనంత ఆయాసం వస్తుంది ఇలాంటి సీన్లు చూస్తే. 

రాజకీయ చిత్రాల్లో నేరుగా పాత్రల పేర్లు పెట్టి చూపించనప్పుడు హింట్ల కోసం వెతకడం, లుక్ చూసి ఫలానా వాళ్లతో పోల్చుకోవడం సహజం. 

ఇందులో ముఖ్యమంత్రి ఎప్పుడూ పబ్జీ ఆడుకుంటూ ఉంటాడు. ఆ ముఖ్యమంత్రి పక్కన ముగ్గురు వ్యక్తులుంటారు. వారిలో ఒకడు మెడలో శాలువాలాంటిది వేసుకుని కళ్లజోడు పెట్టుకుని కనిపించే వ్యూహకర్త. ఇంకొకడు జామకాయలు అమ్ముకుని నాయకుడయ్యాడట. మూడో వ్యక్తి తెల్ల గెడ్డంతో ఉండి వెయిస్ట్-కోట్ వేసుకుని కనిపిస్తాడు. ఇతను గతంలో ముఖ్యమంత్రి దగ్గర దొంగలెక్కలు రాసి ఎంపీ అయ్యాడట. ప్రధాన విలన్ ముఖ్యమంత్రి అయితే..ఈ ముగ్గురూ దుష్టచతుష్టయంలో భాగమన్నట్టు చూపించాడు దర్శకుడు. 

ఇంతకీ తెల్లగెడ్డం ఉన్న వ్యక్తి ఇందులో మహిళల చీరలు లాగేసి అర్ధనగ్నంగా అరటి తోపుల మధ్యలో పరుగెత్తిస్తాడు. పోలీసులు కూడా మా మహిళల్ని తరుముతూ కాల్పులు చేసి భయపెడుతూ ఉంటారు. అంతే కాదు అతను ఒక మహిళని కాళ్లు చేతులు నరికేసి హత్య కూడా చేస్తాడు. 

స్పాయిలర్ అంబడే అంత గొప్ప సీన్ కాదు కనుక ఒకటి చెప్పుకోవాలి- సినిమా క్లైమాక్స్ లో ముఖ్యమంత్రి ఈ తెల్లగెడ్డం ఎంపీని బాత్రూములోకి తన్ని గొడ్డలితో నరికేసి, "బాత్రూములో గుండాగి చచ్చాడని చానల్స్ లో స్క్రోలింగ్" వేయమని ఒక నాయకుడికి పురమాయిస్తాడు. 

కేవలం ఎవర్నో బదనాం చెయ్యాలన్న కసి మాత్రమే ఉండి, చెప్పడానికి సరైన పాయింట్ దొరక్క.. రైతుల ఆక్రోశం చుట్టూ కథ అల్లి, కథకు పనికొచ్చే విధంగా రియాలిటీలో జరిగిన అకృత్యాలు కనపడక.. ఏవేవో కల్పించి ముఖ్యమంత్రిని, అతని అనుచరుల్ని హంతకులుగా, రేపిస్టులుగా చూపించడమే లక్ష్యంగా తీసిన సినిమా ఇది. 

ఏ రాజకీయ చిత్రమైనా చూసినప్పుడు టార్గెట్ చేసిన పార్టీ సానుభూతిపరులకైనా కోపం తెప్పించాలి, లేదా ఇవతలి పార్టీ సానుభూతిపరులకైనా అద్భుతంగా తీసాడనిపించాలి. ఇక్కడ రెండూ జరిగేలా లేవు. అధికారపార్టీ సానుభూతిపరులు దర్శకుడి ఆలోచనకి నవ్వుతూ జాలిపడేలాగ ఉంది. 

వార్తల్లో ఐదేళ్ళుగా అమరావతి రైతుల ఆక్రందన అంటూ సీరియల్లా చూపించినా ఆ నాలుగు చానల్స్, రెండు పేపర్లు చూసేవాళ్లకి తప్ప ఇంకెవ్వరికీ అదొక సమస్యలా కూడా అనిపించలేదు. పోనీ ఈ సినిమా ద్వారా ఏదైనా గట్టిగా హత్తుకుంటుందా అంటే అది లేకపోగా ఇందులో పెద్ద సమస్య ఉన్నట్టే అనిపించకుండా తీసారు. 

"ప్రజలకి దూరమైన "ఆశల"కోసం పోరాడుతున్నవాడిని" అంటాడు హీరో. అవసరాల కోసం పోరాడడానికి, ఆశల కోసం పోరాడడానికి చాలా తేడా ఉంది. అయిరావతి రైతు ఉద్యమం అవసరం కాదు ఆశ మాత్రమే అన్నట్టు తేల్చేసాడు. 

అంతే కాదు, "రాష్ట్రాభివృద్ధికి రాజధాని నిర్మాణం ఒక్కతే మార్గం" అని కూడా అసెంబ్లీలోకి చొరబడి మరీ చెప్తాడు హీరో. ఎవరి అభివృద్ధికి అంటే...ఈ సినిమా చూస్తున్నంతసేపూ ఆ అయిరావతి రైతుల అభివృద్ధికి మాత్రమే అన్నట్టు చూపించారు. 

ఇందులో ఒక మహిళ తనను వివస్త్రను చేసినప్పుడు తన కొడుకుతో, "వివస్త్రను చేసింది నీ తల్లిని కాదు..ఈ రాజధానిని..ఇకపై నీ పిలుపైనా అరుపైనా అయిరావతే" అంటుంది. 

చివర్లో ప్రాణం పోతున్నప్పుడు కూడా, "నన్ను వీళ్లు అవిటిదానిగా మార్చినా రాజధానిని అవిటిది కానివ్వకు. నా ఊపిరి ఆగినా ఈ రాష్ట్రం ఊపిరి ఆగనివ్వకు" లాంటి ఏకపాత్రాభినయం తరహా డైలాగులు చెబుతుంది. 

అన్నట్టు ఈ సినిమాలో కొన్ని సీన్లు స్వాతంత్రోద్యమం నాటి సీన్లు తలపించేలా తీయాలనుకున్నారు. హీరోని పోలీసులు బోర్లా పడుకోబెట్టి లాఠీలతో చితక్కొడుతుంటారు. అతను దెబ్బదెబ్బకీ "జై అయిరావతి" అని వందేమాతరం స్టైల్లో అరుస్తుంటాడు. "డౌన్ డౌన్ అయిరావతి" అని చెప్పే దాకా కొట్టమని బ్రిటీష్ దొరలాగ ఆర్డరేసి అక్కడే కూర్చుంటాడు అధికారపార్టీ నాయకుడు. 

ఇవన్నీ ఒక ఎత్తైతే ఇందులో కొడాలి నానిని పోలిన పాత్రని ఒక పాటలోనూ, ఒకటిరెండు సీన్లలోనూ పెట్టారు. వాడే భాషని బట్టే సంస్కారం తెలుస్తుందని... ఆ సంస్కారాన్ని బట్టే ప్రభుత్వం పోకడ అర్ధమవుతుందని ఆ పాత్రని చూపిస్తూ హీరో చేత ఒక డైలాగ్ చెప్పించాడు దర్శకుడు. 

ఆ తర్వాత కొంతసేపటికి ఒక ఐటం సాంగ్ వస్తుంది. అందులో ఒక లైన్, "నాలోని డాష్ ని.. నీలోని జోష్ ని.. గుడివాడ క్యాసినోలో వాడుకో.." అంటూ వినిపించి తనలోని సంస్కారాన్ని చాటుకున్నాడు దర్శకుడు. ఆ సంస్కారాన్ని బట్టే ఈ సినిమా పోకడ కూడా ఉందనుకోవాలేమో!

సినిమా నడిచే కొద్దీ వెర్రి వెయ్యితలలు వేసినట్టుగా పోతుంటుంది స్క్రీన్ ప్లే. హీరోగారి ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ప్రజ్ఞ చూసాక దర్శకుడి ఇంటిలిజెన్స్ ఏవిటో అర్ధమవుతుంది. 

ముఖ్యమంత్రి తన ఫేవరెట్ హీరో సీన్ చూస్తాడు ఒక సన్నివేశంలో... అది బాలకృష్ణ "అఖండ" లోని సీన్. ఇది కమర్షియల్ గా మంచి ఐడియా. హాల్లో జనం ఉండుంటే స్పందన బాగుండేది. కానీ పాపం అడవికాచిన వెన్నెల్లా ఖాళీ హాలు వల్ల నిశ్శబ్దంగా వెళ్లిపోయింది ఆ సీన్ కూడా. 

ఇలా సాగిన ఈ చిత్రం ఏ వర్గం వారినీ మెప్పించేలా లేదు. దీని నిడివి రెండు గంటల నలభై నిమిషాలు. సంగీతం మణిశర్మ అయినా కూడా ఆ స్థాయిలో లేనేలేదు. ప్రధాన తారాగణం  పనితనం మాత్రం బాగుందనే చెప్పాలి. 

వినోద్ కుమార్ చాలా కాలం తర్వాత కనిపించాడు. వాణీవిశ్వనాథ్ తల్లిపాత్రలో సరిపోయింది. హీరో హీరోయిన్లు ఓకే. ప్రారంభంలో కనిపించిన బాలనటుడు కూడా చక్కగానే చేసాడు. 

ఈ సినిమాలో ఒక్క ముఖ్యమంత్రి, అతని అనుచరులు తప్ప ప్రజలతో సహా అందరూ మంచివాళ్లే. ఎంత మంచివాళ్లంటే ఓట్లేయడానికి పుచ్చుకున్న డబ్బుని పోలింగ్ రోజు పోలింగ్-బూత్ ల ముందు ఒక డబ్బాలో వేస్తారు. ఓట్ల లెక్కింపుకంటే ముందు ఎలక్షన్ కమీషన్ ఆ డబ్బుని డబ్బాల్లో పెట్టి లెక్క చెబుతుంది. అదంతా లక్షకోట్లుంటుంది. అంత డబ్బు ఎక్కడిది, ఎలా వచ్చింది, దానిని ఏం చేయొచ్చు అంటూ హీరో ఒక చిన్నసైజు స్పీచిస్తాడు.

సినిమా అంతా అయ్యాక "కొన్నేళ్ల తర్వాత" అని కార్డ్ పడుతుంది. ముఖ్యమంత్రి సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ కారులో సింగపూరుని తలదన్నే రేంజులో ఉన్న అయిరావతిని చూస్తూ బిక్కమొహం వేసుకుని వెళ్తుంటాడు. ఒక శిలాఫలకం దగ్గర దగ్గర ఆగుతాడు. దాని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి నారా రాంబాబు నాయుడు అని ఉంటుంది. ఆ శిలాఫలకానికి జారిపడి కూర్చుని ఓటమితో పశ్చాత్తాప పడుతున్నట్టుగా క్లోజప్పేసి ఎండ్ చేసాడు దర్శకుడు. 

వినోదమో, విశేషమో ఆశించి వెళితే మాత్రం భంగపాటు తప్పదు. ప్రస్తుత ప్రతిపక్షపార్టీల సానుభూతిపరులు కూడా నమ్మే విధంగా లేవు ఇందులోని సన్నివేశాలు. 

బాటం లైన్: రాజధాని "ఫెయిల్స్"

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?