వైసీపీలో సీనియర్ మంత్రిగా బొత్స సత్యనారాయణ ఉన్నారు. చాలా మంది మంత్రులను మధ్యలో మాజీలను చేసిన జగన్ బొత్సకు మాత్రం అధిక ప్రాధాన్యత ఇస్తూ అయిదేళ్ల మంత్రిగా కొనసాగించారు. అయితే బొత్స మాత్రం తనకు ఉన్న హోదాతో సంతృప్తిగా ఉన్నారా అన్నదే ఒక లాజిక్ కి అందని ప్రశ్న. దానికి ఆయన అప్పుడప్పుడు చేసే కామెంట్స్ ఆయనలోని కొంత అసంతృప్తిని బయటపెడుతూ ఉంటాయి.
బొత్స ఉమ్మడి ఏపీకి పీసీసీ చీఫ్ గా పనిచేశారు. ఆయన ఒక దశలో సీఎం కావాల్సి ఉంది. అప్పట్లో వైఎస్సార్ తరువాత రోశయ్య సీఎం అయ్యారు. ఆయన పదకొండు నెలలకే పదవి నుంచి తప్పుకున్నారు. ఆ పోస్ట్ కోసం నాటి కాంగ్రెస్ లో పెద్ద ఎత్తున పోటీ జరిగింది. అనూహ్యంగా స్పీకర్ గా ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆ పదవిని అందుకున్నారు.
సీఎం పోస్ట్ కోసం ట్రై చేసిన వారిలో బొత్స కూడా ఒకరు అని నాడే ప్రచారం జరిగింది. బొత్సకు బలమైన సామాజిక వర్గం నేపధ్యం ఉంది. ఆయన కోసం లాబీయింగ్ చేసిన పెద్దలు నాడు కాంగ్రెస్ లో ఉన్నారు. అయితే ఆయనకు సీఎం పదవి ఎందుకు దక్కలేదు అంటే దానికి ఇన్నాళ్లకు బొత్స తానుగా చెప్పిన మాటలలోనే జవాబు దొరికింది.
ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ తనకు సీఎం పోస్ట్ దక్కకుండా చిరంజీవి అడ్డుకున్నారు అని సంచలన కామెంట్స్ చేశారు. చిరంజీవికి ఉన్న 18 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కి ఆనాడు ఆక్సిజన్. అలా చిరంజీవి మాట కాంగ్రెస్ లో నెగ్గింది అన్నది బొత్స మాట. చిరంజీవికి తాను గానీ తన కుటుంబం కానీ సీఎం కావాలన్నదే ఆలోచన అని బొత్స చెప్పారు.
కాపుల చిరకాల సీఎం కోరిక అన్నది తమ కుటుంబం మాత్రమే తీర్చాలని ఆయన కోరికగా ఉండడం వల్లనే తనకు బ్రేకులు వేశారు అని చెప్పారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇంతే కాదు విభజన జరిగినపుడు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ లో ఏమి జరిగింది అన్నది ఒక పుస్తకం రాస్తాను అని బొత్స అంటున్నారు. అందులో అందరి గురించి కూడా వివరంగా ఉంటుందని ఊరిస్తున్నారు.
బొత్స తాజా కామెంట్స్ ని చూస్తే కనుక ఆయనకు సీఎం పదవి మీద మోజు ఉందని అర్ధం అవుతోంది. సీనియర్ నేతగా ఉన్న తనకు ఆ పదవి అందని పండు అయింది అన్న బాధ ఆయనలో ఉంది. బొత్స వైసీపీలో కీలక స్థానంలో ఉన్నారు. మరోసారి ఆయనకు టికెట్ ఇచ్చారు. వైసీపీ గెలిస్తే మంత్రి అవుతారు. అంతకు మించి ఆయన సీఎం కాలేరు. మరి బొత్స కోరిక సంగతేంటి అంటే ఆలోచించాల్సిందే.