రివ్యూ: అల్లుడు శీను
రేటింగ్: 2.75/5
బ్యానర్: శ్రీ లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్
తారాగణం: బెల్లంకొండ శ్రీనివాస్, సమంత, ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, రఘుబాబు, రవిబాబు, తమన్నా తదితరులు
రచన: గోపీమోహన్
మాటలు: కోన వెంకట్
సంగీతం: దేవిశ్రీప్రసాద్
కూర్పు: గౌతంరాజు
ఛాయాగ్రహణం: చోటా కె. నాయుడు
సమర్పణ: బెల్లంకొండ సురేష్
నిర్మాత: బెల్లంకొండ గణేష్ బాబు
కథనం, దర్శకత్వం: వి.వి. వినాయక్
విడుదల తేదీ: జులై 25, 2014
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్‌ని హీరోగా పరిచయం చేస్తూ వి.వి. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అల్లుడు శీను’ కొంతకాలంగా ఇండస్ట్రీ వర్గాలని, సినీ ప్రియులని ఆకర్షిస్తోంది. నటుల బ్యాక్‌గ్రౌండ్ లేని ఫ్యామిలీ నుంచి వస్తోన్న హీరోకి ఇంతటి భారీ చిత్రంతో పరిచయం అనేసరికి అల్లుడు శీనుపై ఆసక్తి నెలకొంది. ‘దిల్’ ఒక్కటి మినహాయిస్తే ఇంతవరకు తాను చేసినవన్నీ స్టార్ హీరోలతోనే చేసిన వి.వి. వినాయక్ ఈ కొత్త హీరోని ఎలా చూపించబోతున్నాడు, ఏ విధంగా ప్రెజెంట్ చేయబోతున్నాడనేది ఇంట్రెస్ట్ కలిగించింది. ‘అల్లుడు శీను’ని వినాయక్ ఎలా తీర్చిదిద్దాడో చూడండిక.
కథేంటి?
శీను (శ్రీనివాస్) ఊరినిండా అప్పులు చేసి తన మావయ్య నరసింహంతో (ప్రకాష్‌రాజ్) కలిసి హైదరాబాద్‌కి వచ్చేస్తాడు. అచ్చంగా తన మావయ్య రూపురేఖలతోనే ఉన్న భాయ్ (ప్రకాష్‌రాజ్ ద్విపాత్రాభినయం) అనే పెద్ద దాదాని చూసి శీనుకో ఐడియా వస్తుంది. తన మావయ్యకి భాయ్ గెటప్ వేసి దందాలు చేయడం మొదలుపెడతాడు. అయితే ఈ విషయం భాయ్‌కి తెలుస్తుంది. నరసింహం బ్రతికే ఉన్నాడనే నిజం తెలిసి షాకవుతాడు. అసలు ఈ నరసింహం, భాయ్ మధ్య సంబంధం ఏమిటి? తన పేరు వాడుకున్న శీనుని భాయ్ ఏం చేస్తాడు?
కళాకారుల పనితీరు:
నటుల నేపథ్యం లేకపోయినా కానీ బెల్లంకొండ శ్రీనివాస్ మొదటి సినిమాలో బాగానే మెప్పించాడు. మంచి డాన్సర్ అయిన శ్రీనివాస్ తొలి సినిమాలోనే తనకిచ్చిన భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌ని కూడా రక్తి కట్టించాడు. అయితే హావభావాల విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవాలి. కెమెరా కాన్షియస్ లేకుండా ఫ్రీగా నటించినా కానీ ఎక్స్‌ప్రెషన్స్ పరంగా వీక్ అనిపిస్తాడు. సమంత మునుపు ఏ చిత్రంలోను కనిపించనంత గ్లామరస్‌గా ఇందులో కనిపించింది. స్టార్ హీరోల పక్కన ఎలాగో ఇలాంటి పాత్రలే చేస్తోంది కనుక కనీసం కొత్త హీరో పక్కనైనా ఆమెకి కథలో ప్రధానమైన పాత్ర ఇచ్చి ఉండాల్సింది. ప్రకాష్‌రాజ్ ద్విపాత్రాభినయం చేసాడు. రెండు పాత్రలు తనకు ఇంతకుముందు అతను చేయనివి అయితే కాదనుకోండి. హీరో చేత ‘వాడబడే’ పాత్రలో బ్రహ్మానందం మరోసారి కనిపించాడు. ఇప్పటికే పలు వినాయక్, వైట్ల, త్రివిక్రమ్ చిత్రాల్లో బ్రహ్మానందం ఇలాంటి పాత్రలు చేసినా మరోసారి నవ్వించగలిగాడు. ద్వితీయార్థంలో రవిబాబు, బ్రహ్మానందం మధ్య సీన్లు నవ్విస్తాయి. తమన్నా ఐటెమ్ సాంగ్ చేసింది. కాస్త ఆలస్యంగా థియేటర్లోకి ఎంటరైతే తమన్నా సాంగ్ మిస్ అయిపోయే అవకాశముంది.
సాంకేతిక వర్గం పనితీరు:
ఎన్నెన్నో సినిమాల్లో చూసేసిన రొటీన్ కథ. ఎప్పుడో పది పదిహేనేళ్లు వెనక్కి వెళ్లాల్సిన అవసరం లేకుండా రీసెంట్‌గా రిలీజ్ అయిన సినిమాల్లోనే దీనికి పోలికలు వెతుక్కోవచ్చు. మాటలు ఫర్వాలేదనిపిస్తాయి. పాటలు బాగున్నాయి. ఓరి దేవుడో, అల్లుడు శీను పాటలు మాస్‌ని అలరిస్తాయి. పాటల చిత్రీకరణ కూడా బాగుంది. ప్రతి ఫ్రేమ్‌లోను నిర్మాత పెట్టిన ఖర్చు కనిపించింది. తనయుడిని గ్రాండ్‌గా లాంఛ్ చేయడానికి బిజినెస్ పరమైన రిస్కులని బెల్లంకొండ సురేష్ లెక్క చేయలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది.
స్టార్ హీరోలతో చేసినపుడు కమర్షియల్ ఎలిమెంట్స్ మీదే డిపెండ్ అయ్యే వినాయక్ కొత్త హీరో విషయంలో కూడా అదే చేసాడు. కొత్తదనం కోసం ప్రయత్నించకుండా ఏది చేస్తే సేఫ్ కావచ్చుననేది లెక్క వేసుకుని అవన్నీ ఇందులో ఉండేట్టు చూసుకున్నాడు. అయితే ఈ ప్రయత్నంలో ఆయా సన్నివేశాల్లో కూడా కొత్తదనం లేకుండా పోయింది. ప్రతి సన్నివేశం ఎక్కడో చూసినట్టే అనిపిస్తుంది. కొత్త హీరోతో ఒక కమర్షియల్ సినిమా తీయడం అంత ఈజీ వ్యవహారం కాదు. ఈ బ్యాలెన్స్‌ని వినాయక్ బాగా మెయింటైన్ చేసాడు.
హైలైట్స్:
- సాంగ్స్
- ప్రొడక్షన్ వేల్యూస్
డ్రాబ్యాక్స్:
- రొటీన్ స్క్రిప్ట్
- ఓవర్ ది టాప్ యాక్షన్
విశ్లేషణ:
కొత్త హీరోతో కమర్షియల్ సినిమా తీయడం వల్ల లాభాలున్నాయి, అలాగే నష్టాలు కూడా ఉంటాయి. కమర్షియల్ సినిమాతో ఒక కొత్త హీరోని మాస్ ఆడియన్స్‌కి దగ్గర చేయడం ఈజీ అవుతుంది. అయితే అదే సమయంలో రొటీన్ సినిమా అనే ముద్ర వేయించుకునే అవకాశముంది. ఇది తెలిసినా కూడా ‘అల్లుడు శీను’తో శ్రీనివాస్‌ని మాస్‌కి వీలయినంత చేరువ చేసే ప్రయత్నం జరిగింది. అయితే ఈ ప్రయత్నంలో కాస్తయినా వైవిధ్యానికి చోటిచ్చి, ఇతర వర్గాల ప్రేక్షకుల్ని కూడా దృష్టిలో ఉంచుకోవాల్సింది. నటుల బ్యాక్‌గ్రౌండ్ లేదు కనుక బెల్లంకొండ శ్రీనివాస్‌పై ఎలాంటి అంచనాలుండవు. దీని వల్ల దర్శకులకి ఒక ఇమేజ్‌కో, ఇక ఫార్ములాకో కట్టుబడి స్క్రిప్టు సిద్ధం చేయాల్సిన అవసరం ఉండదు. ఎంత కమర్షియల్‌గా సేఫ్ అయ్యే ప్రాజెక్ట్ తలపెట్టినా కానీ కాసింత కొత్తదనానికి చోటిచ్చే అవకాశం అయితే ఉంది. కానీ వినాయక్ అలాంటి వాటి జోలికి పోలేదు.
వినాయక్ గతంలో తీసిన దిల్ సినిమాలాంటిది ట్రై చేసి ఉంటే శ్రీనివాస్ లాంఛ్‌కి పర్‌ఫెక్ట్‌గా సెట్ అయ్యేది. ఎస్టాబ్లిష్డ్ స్టార్స్ కోసం తయారు చేసే తరహా స్క్రిప్టుతో కొత్త కుర్రాడి మీద తలకి మించిన భారాన్ని పెట్టారు. స్క్రిప్ట్ వీక్ అయినపుడు అక్కరకి వచ్చే హీరోల ఇమేజ్ ఈ చిత్రానికి లేకుండా పోయింది. గతంలో ఇలాంటి బలహీనతలున్న సినిమాలు చేసినా కానీ హీరోల్ని అడ్డు పెట్టుకుని వినాయక్ పాస్ అయిపోయాడు. కానీ ఈసారి అతనికి ఆ సౌలభ్యం లేకపోయినా కానీ తనకి కలిసి వచ్చిన ఫార్ములాని దాటి బయటకి వచ్చేందుకు వినాయక్ ధైర్యం చేయలేదు. పైగా ఈ తరహా సినిమాలు వినాయక్ ఒక్కడే కాకుండా చాలా మంది చేసేస్తూ ఉండడంతో కనీసం కామెడీ అయినా పొట్ట చెక్కలు చేసేట్టు ఉండేలా చూసుకోవాలి. కామెడీ సీన్లు కూడా అరువు తెచ్చుకున్నవే కావడంతో ‘అల్లుడు శీను’ యావరేజ్ గీత దాటి పైకి రాలేకపోయింది.
కమర్షియల్ ఎలిమెంట్స్ పరంగా ఈ సినిమాలో లోటే లేదు. ఒక మాస్ ఎంటర్‌టైనర్‌లో ఏమేమి ఉండాలో అన్నిటినీ కొలతలేసి మరీ పెట్టుకున్నారు. అయితే ముందే చెప్పుకున్నట్టు ఫ్రెష్‌నెస్‌కి మాత్రం కాసింత ప్లేస్ కూడా ఇవ్వలేదు. రొటీన్‌గా ఉన్నా టైమ్ పాస్ అయిపోతే చాలనుకునే ప్రేక్షకుల చేత టిక్ మార్కు పెట్టించుకున్నా కానీ కొత్త హీరో నుంచి వెరైటీ ఆశించే వారు మాత్రం డిజప్పాయింట్ అవుతారు. స్టార్ట్ టు ఎండ్ సేఫ్ గేమ్‌కే ఇంపార్టెన్స్ ఇచ్చిన అల్లుడు శీను.. దాని వల్ల ఎంత బెనిఫిట్ అవుతాడనేది చూడాలిక.
బోటమ్ లైన్: అ అ అ అ… అదే సీను!
-జి.కె.