ప్రపంచ క్రికెట్‌లో అభిమానులు ఎక్కువగా వున్నది మన దేశంలోనే. అందుకే అంతర్జాతీయ క్రికెట్‌కీ మన దేశం నుంచే ఎక్కువ ఆదాయం లభిస్తోంది. కానీ, మన ఆటగాళ్ళ విషయంలో మాత్రం ఐసీసీ ఎప్పుడూ చిన్నచూపే ప్రదర్శిస్తోందన్న విమర్శలు మాత్రం ఎప్పుడూ విన్పిస్తూనే వున్నాయి. ఐసీసీ తీరు కూడా అలానే వుంటోంది.
ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న టెస్ట్ సిరీస్ సందర్భంగా భారత క్రికెటర్ రవీంద్ర జడేజా, ఇంగ్లాండ్ క్రికెటర్ అండర్సన్‌ల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఒకర్ని ఒకరు దూషించుకున్నారు. తొలుత అండర్సన్, జడేజాని దూషించడంతో, జడేజా ఎదురు తిరగాల్సి వచ్చింది. ఈ వ్యవహారమంతా మ్యాచ్‌ని లైవ్‌లో చూసిన ప్రేక్షకులకు అర్థమయ్యింది.
కానీ ఈ వ్యవహారంపై విచారణ జరిపిన ఐసీసీ మాత్రం తొలుత రవీంద్రజడేజాని దోషిగా తేల్చేసింది. పెద్ద శిక్షేమీ కాకపోయినా, మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించడం ద్వారా ‘తప్పు చేశాడు’ అన్న ముద్రని జడేజా మీద పడేసింది ఐసీసీ. ఇంగ్లాండ్ ఆటగాడు అండర్సన్‌పై విచారణ ఆగస్ట్ 1న జరుగుతుంది. జడేజా లెవెల్ 1 నేరానికి పాల్పడ్డాడని ఐసీసీ ప్రకటించింది. అండర్సన్ లెవెల్ 3 నేరాభియోగాన్ని ఎదుర్కొంటున్నాడు. మరి ఆ విచారణలో అండర్సన్‌కీ ‘శిక్ష’ పడుతుందా.? వేచి చూడాల్సిందే.