అమ్మో స్కూలు బస్సు.?

ఓ దుర్ఘటన జరిగాక, అదే పేటర్న్‌లో మరికొన్ని ఘటనలు చోటుచేసుకుంటుంటాయి. కొన్ని ప్రాణాపాయం లేకుండా జరుగుతాయి, కొన్ని ప్రాణాల్ని బలికొంటాయి. పెద్ద ఘటన తాలూకు ‘ట్రెమర్స్‌’ అనుకోవాలో, ఇంకేమన్నా అనుకోవాలో తెలియదుగానీ, రైల్వే ట్రాక్‌పై…

ఓ దుర్ఘటన జరిగాక, అదే పేటర్న్‌లో మరికొన్ని ఘటనలు చోటుచేసుకుంటుంటాయి. కొన్ని ప్రాణాపాయం లేకుండా జరుగుతాయి, కొన్ని ప్రాణాల్ని బలికొంటాయి. పెద్ద ఘటన తాలూకు ‘ట్రెమర్స్‌’ అనుకోవాలో, ఇంకేమన్నా అనుకోవాలో తెలియదుగానీ, రైల్వే ట్రాక్‌పై బస్సును రైలు ఢీకొన్న ఘటనను మరువకముందే ఇంకో స్కూలు బస్సు తృటిలో ఘోర ప్రమాదం తప్పించుకుందన్నవార్త ఒక్కసారిగా తెలుగు ప్రజలకి షాకిచ్చింది.

కృష్ణా జిల్లాలో 48 మంది స్కూలు విద్యార్థుల్ని తీసుకెళ్తోన్న స్కూల్‌ బస్‌ వెనుక చక్రాలు ఊడిపోయాయి. డ్రైవర్‌ ఇక్కడే చాకచక్యంగా వ్యవహరించాడు. సడెన్‌ బ్రేక్‌ వేసి బస్సుని ఆపేయడం.. అదే సమయంలో బస్సు కాస్త నెమ్మదిగా వెళ్తుండడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. కాస్త వేగంగా వెళుతున్నా, ఎదురుగా ఇంకో వాహనమేదన్నా దూసుకొచ్చినా జరిగే ప్రమాదం తీవ్రత ఎలా వుండేదో ఊహించుకోవడమే కష్టం.

వాస్తవానికి స్కూలు బస్సులు ఫిట్‌నెస్‌ విషయంలో ప్రమాణాలు చాలావరకు పాటించడంలేదు. ఎక్కడో కొన్ని స్కూళ్ళు నిబంధనల్ని పాటిస్తున్నా, చాలావరకు డొక్కు బస్సులతోనే కాలం వెళ్ళదీస్తున్నాయి. అధికారులు చోద్యం చేస్తున్నారనే విమర్శలు ఇప్పుడు కొత్తగా విన్పిస్తున్నవి కావు. అధికారులు దాడులు చేస్తారు, బస్సుల్ని సీజ్‌ చేస్తారు.. ఆ తర్వాత కొన్నాళ్ళకు అవి మళ్ళీ రోడ్డెక్కుతాయి.

తల్లిదండ్రులు నిలదీసినా ఉపయోగముండదు.. అధికారులు దాడులు చేసినా ఫలితముండదు.. ఆ స్థాయికి ప్రైవేటు విద్యా సంస్థలు తోలుమందంతో వ్యవహరిస్తున్నాయన్నమాట.