సినిమా రివ్యూ: అత్తారింటికి దారేది

రివ్యూ: అత్తారింటికి దారేది Advertisement రేటింగ్‌: 3.5/5 బ్యానర్‌: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర తారాగణం: పవన్‌కళ్యాణ్‌, నదియా, సమంత, ప్రణీత, రావు రమేష్‌, బోమన్‌ ఇరానీ, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్‌ నారాయణ తదితరులు…

రివ్యూ: అత్తారింటికి దారేది

రేటింగ్‌: 3.5/5

బ్యానర్‌: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర

తారాగణం: పవన్‌కళ్యాణ్‌, నదియా, సమంత, ప్రణీత, రావు రమేష్‌, బోమన్‌ ఇరానీ, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్‌ నారాయణ తదితరులు

సంగీతం: దేవిశ్రీప్రసాద్‌

కూర్పు: ప్రవీణ్‌ పుడి

ఛాయాగ్రహణం: ప్రసాద్‌ మురెళ్ల

నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌. ప్రసాద్‌

రచన, దర్శకత్వం: త్రివిక్రమ్‌

విడుదల తేదీ: సెప్టెంబర్‌ 27, 2013

‘‘వంద రూపాయలకి కక్కుర్తి పడి ల్యాప్‌టాప్‌లోనో, మొబైల్‌లోనో చూసేద్దామనుకుంటే… వందల్లో ఒక్క సినిమా ఇచ్చే అనుభూతిని, అదిచ్చే సంతృప్తిని మిస్‌ అవుతారు’’ 

‘‘కామెడీ కిచిడీలు, మాస్‌ మసాలా పులిహోరలూ తరచుగా రుచి చూపిస్తూనే ఉంటారు… కానీ షడ్రసోపేత విందులా అనిపించే ‘కంప్లీట్‌ సినిమాలు’ ఎప్పుడో కానీ వడ్డించరు’’

అత్తారింటికి దారేది ఒక కంప్లీట్‌ ఫిల్మ్‌ మాత్రమే కాదు… ఇదొక ఎక్స్‌పీరియన్స్‌! అగ్ర హీరోని అడ్డు పెట్టుకుని నాలుగు పాటలు, మూడు ఫైట్లతో కానిచ్చేసే ఎస్కేపిస్ట్‌ మూవీ అసలే కాదు. ద్వేషాలతో బంధాలు తెంచేసుకుని, జీవితకాలం క్షోభ పడేవారికి ద్వేషించే దారిని కాకుండా,  ‘ప్రేమించే దారి’ని ఎంచుకుంటే జీవితమంతా ఆనందమే ఉంటుందని సున్నితంగా, హాస్యభరితంగా, హృద్యంగా చెప్పే చిత్రమిది. 

కథేంటి?

తను ప్రేమించిన వాడిని కాదన్నాడనే కోపంతో తండ్రిని (బోమన్‌ ఇరానీ) వదిలి వెళ్లిపోతుంది సునంద (నదియా). పాతికేళ్లుగా దూరమైన కూతుర్ని, ఆమె కూతుళ్లని తన దగ్గరకి చేర్చమని మనవడు గౌతమ్‌ నందాని (పవన్‌కళ్యాణ్‌) కోరతాడు తాత. తమని వదిలిపోయిన అత్త దగ్గరకి వెళ్లి ఆమె మనసు మార్చి తీసుకురావడానికి ఆమె ఇంట్లో కార్‌ డ్రైవర్‌ సిద్ధార్థ్‌గా చేరతాడు గౌతమ్‌. 

కళాకారుల పనితీరు!

పవన్‌కళ్యాణ్‌లోని ఎంటర్‌టైనర్‌కి ఒక కోణాన్ని ‘గబ్బర్‌సింగ్‌’లో ఆవిష్కరిస్తే, అతనిలోని అన్ని కోణాల్నీ ఈ చిత్రంలో ఆవిష్కరించాడు త్రివిక్రమ్‌. అభిమానులకి తిరిగి ‘తమ్ముడు’, ‘ఖుషీ’ రోజుల్ని గుర్తు చేస్తాడు పవన్‌కళ్యాణ్‌. ఎనర్జీకి డెఫినిషన్‌ ఏమిటనేది ఈ చిత్రంలో చూడొచ్చు. కేవలం యాక్షన్‌, రొమాన్స్‌, కామెడీలే కాదు సెంటిమెంట్‌ సీన్స్‌లో కూడా పవన్‌కళ్యాణ్‌ అద్భుతమైన అభినయాన్ని ప్రదర్శించాడు. క్లయిమాక్స్‌ సీన్‌లో కళ్ల నీళ్లు పెట్టుకుంటూ అత్తని అర్ధించినా, ఆపై ఒకేసారి ఆనందాన్ని, దుఃఖాన్ని ఒకేసారి అభినయిస్తూ మెప్పించినా, ‘నా వాళ్లంతా చచ్చిపోయారని సునంద అన్నప్పుడు’ కంట్లో చిరు చెమ్మతోనే మనసు తట్టినా… పవన్‌ కళ్యాణ్‌ తనలోని నటుడ్ని పూర్తి స్థాయిలో చూపించాడు. నటుడిగా అతను సాధించిన పరిణితిని ఈ చిత్రంలో చూడొచ్చు. బ్రహ్మానందం కాంబినేషన్‌లో చెలరేగిపోయిన పవన్‌, యాక్షన్‌ సీన్స్‌లో తన ట్రేడ్‌ మార్క్‌ స్టయిల్స్‌తో ఫాన్స్‌ని ఉర్రూతలూగించాడు. పవన్‌ చేసే చిన్న చిన్న డాన్స్‌ మూమెంట్స్‌కే ఫాన్స్‌ పరవశులైపోతుంటారు. అతని మేనరిజమ్స్‌ని, డాన్స్‌ మూమెంట్స్‌ని, ఎక్స్‌ప్రెషన్స్‌ని మిక్స్‌ చేసి వదిలిన ‘నిన్ను చూడగానే’ సాంగ్‌కి కామ్‌గా కుర్చీల్లో కూర్చుని చూడ్డానికి ఏ అభిమాని అయినా చాలా కష్టపడాలి. 

అత్తయ్య పాత్రలో సీనియర్‌ నటి నదియా వంక పెట్టలేని విధంగా నటించింది. సినిమాలో పవన్‌ తర్వాత ఎక్కువ ప్రాధాన్యమున్న పాత్ర ఈమెదే… నదియాని ఎంచుకుని ఆ క్యారెక్టర్‌ని హిట్‌ చేశారు. సమంతకి ఎక్కువ సీన్‌ లేదు. ఉన్నంతలో బాగానే చేసింది. ప్రణీత ‘బాపుగారి బొమ్మ’గా ఆ సాంగ్‌లో చాలా అందంగా కనిపించింది. రావు రమేష్‌ కీలక పాత్రలో ఎక్కడా ఓవర్‌బోర్డ్‌ వెళ్లకుండా కంట్రోల్డ్‌ పర్‌ఫార్మెన్స్‌ ఇచ్చాడు. 

బ్రహ్మానందం పాత్రని కామెడీ కోసం ఇరికించినా… బ్రహ్మీ లేకపోతే ఈ సినిమాలో వెలితి ఉండిపోయేది అనిపించేంతలా ఆయన మరోసారి కడుపుబ్బ నవ్వించారు. కెవ్వుకేక బాబా.., అహల్య అమాయకురాలు ఎపిసోడ్స్‌ గురించి ఎంత రాసినా తక్కువే. చూసి పొట్ట చెక్కలు చేసుకోవాల్సిందే. అలీ, ఎమ్మెస్‌ నారాయణ కూడా నవ్వుల విందులో భాగం పంచుకున్నారు. బోమన్‌ ఇరానీ తన క్యారెక్టర్‌కి అతికినట్టు సరిపోయారు. మిగిలిన నటీనటులంతా తమ వంతు సహకారం అందించారు. 

సాంకేతిక వర్గం పనితీరు:

ఆడియో విన్నప్పుడే దృశ్యపరంగా ఈ పాటలు ఇంకా బాగుంటాయనే భావన కలిగింది. వీనుల విందైన పాటలకి పూర్తి న్యాయం చేశారు చిత్రీకరణతో. ‘నిన్ను చూడగానే’ సాంగ్‌ పిక్చరైజేషన్‌ హైలైట్‌గా నిలుస్తుంది. నేపథ్య సంగీతం కూడా బాగుంది. ఎక్కడా సీన్‌ని డామినేట్‌ చేయకుండా మంచి బ్యాక్‌గ్రౌడ్‌ స్కోర్‌ ఇచ్చాడు దేవి. ప్రసాద్‌ మురెళ్ల సినిమాటోగ్రఫీ మరో ఎస్సెట్‌. సినిమా ఎంతో రిచ్‌గా, ప్రతి ఫ్రేమ్‌ కలర్‌ఫుల్‌గా ఉంది. పవన్‌కళ్యాణ్‌ ఈమధ్య కాలంలో ఇంత అందంగా కనిపించిన సినిమా ఇదేనని చెప్పాలి. ఎడిటింగ్‌ ఓకే. ప్రొడక్షన్‌ వేల్యూస్‌ చాలా బాగున్నాయి. పెట్టిన ఖర్చు తెరపై కనిపించింది. 

త్రివిక్రమ్‌ అంటే ముందుగా సంభాషణల రచయితే గుర్తుకొస్తాడు. అయితే త్రివిక్రమ్‌ ఈచిత్రంలో తనలోని డైలాగ్‌ రైటర్‌ని పొదుపుగా వాడుకున్నాడు. కొన్ని సందర్భాల్లో ప్రాస కోసం ఎక్కువ ప్రయత్నించినట్టు అనిపిస్తుంది. అయితే త్రివిక్రమ్‌ మాత్రమే రాయగలడు అనిపించే డైలాగ్స్‌ కూడా ఇందులో ఉన్నాయి. వాటితో త్రివిక్రమ్‌ డైలాగ్స్‌కి ఎక్స్‌క్లూజివ్‌ ఫాన్స్‌ ఉంటే వాళ్లు శాటిస్‌ఫై అవుతారు. ఈ చిత్రంలో రచయితగా కంటే దర్శకుడిగా త్రివిక్రమ్‌ రాణించాడు. దర్శకత్వం మొదలుపెట్టాక ఎక్కువగా అసంపూర్ణమైన సినిమాలు తీసిన త్రివిక్రమ్‌ ఈసారి కంప్లీట్‌ మూవీ అందించడానికి కృషి చేశాడు. ఇలాంటి కథని ఎంచుకుని, పవన్‌కళ్యాణ్‌లాంటి హీరోతో తెరకెక్కించడానికి గట్స్‌ కావాలి. త్రివిక్రమ్‌ అలాంటి గట్స్‌ ప్రదర్శించి, దర్శకుడిగా తనకి తానే పరీక్ష పెట్టుకున్నాడు. అందులో విజయం సాధించి ఈ చిత్రం ఇంత బాగా తెరకెక్కడానికి వెన్నెముకగా నిలిచాడు. 

హైలైట్స్‌:

  •      పవన్‌కళ్యాణ్‌
  •     పవన్‌, బ్రహ్మానందం కామెడీ ఎపిసోడ్స్‌
  •      సాంగ్స్‌
  •      స్క్రీన్‌ప్లే
  •      డైరెక్షన్‌

డ్రాబ్యాక్స్‌:

  •      మూవీ టేకాఫ్‌ బ్యాడ్‌గా ఉంది
  •      డైలాగ్స్‌లో ప్రాస డామినేట్‌ చేసింది

విశ్లేషణ:

‘జల్సా’ సినిమాలో పవన్‌కళ్యాణ్‌ స్టయిల్‌కి, మేనరిజమ్స్‌కి తగ్గ పాత్రని డిజైన్‌ చేసి… పవన్‌ చుట్టూ కథ అల్లిన త్రివిక్రమ్‌ ఈసారి తన స్టయిల్లో కథ రాసుకుని దానిని పవన్‌కి సూట్‌ అయ్యేలా మలచుకున్నాడు. జల్సాలో పవన్‌ ప్లస్‌ త్రివిక్రమ్‌ కలిస్తే ఎక్స్‌పెక్ట్‌ చేసే పంచ్‌ మిస్‌ అయిందంటే అందులో త్రివిక్రమ్‌ స్టాంప్‌ మిస్‌ అవడం వల్లనే. ఈసారి మాత్రం ఈక్వేషన్‌ పర్‌ఫెక్ట్‌గా సెట్‌ అయింది. దాంతో ఎండ్‌ ప్రోడక్ట్‌ ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగ్గట్టు తయారైంది. 

స్టార్‌ హీరో, ఫ్యామిలీ స్టోరీ… ఈ రెండూ ఒకే లైన్‌లో కనిపిస్తే ఏ నిర్మాతకి అయినా గుండె గుభేల్‌మంటుంది. అంత ప్రమాదకర కాంబినేషన్‌ అది. అందుకే తెలుగు సినిమాల్లో అగ్ర హీరోలు నటించే వాటిలో మాస్‌ మసాలాలు ఎక్కువైపోయి కుటుంబ కథా చిత్రాల సౌరభాలు దాదాపు మాయమైపోయాయి. కానీ త్రివిక్రమ్‌లాంటి దర్శకుడుంటే ఈ కాంబినేషన్‌ ఎంత లీథల్‌గా మార్చవచ్చుననేది ఈ చిత్రం చూస్తే తెలుస్తుంది. 

పవన్‌కళ్యాణ్‌ ఇమేజ్‌ని, అతని స్టయిల్‌ని ఈ సినిమా కోసం కాంప్రమైజ్‌ చేసుకోవాల్సిందిగా త్రివిక్రమ్‌ ఎక్కడా కండిషన్లు పెట్టలేదు. అలాగే పవన్‌ ఉన్నాడు కదా అని తాను కూడా రాజీ పడిపోలేదు. రెండు కత్తులు ఒకే ఒరలో ఇమడవు అంటుంటారు కదా… అవి ఇమిడితే ఎలాగుంటుందనేది చూపించాడు. పవన్‌లోని ఎనర్జీ మొత్తం వాడేసుకుంటూనే అతనిలోని కొత్త కోణాల్ని కూడా ఆవిష్కరిస్తూ త్రివిక్రమ్‌ చేసిన సవారీ వెండితెరపై వీక్షించి తీరాల్సిందే. 

ఆరంభంలో ఒడిదుడుకులు కనిపిస్తాయి. ఆరడుగుల బుల్లెట్టు పాట వరకు కథాగమనంలో కాసింత మందకొడితనం, ఒకింత అలసత్వం దర్శనమిస్తాయి. అయితే ఒక్కసారి సునంద నిలయంలోకి సిద్ధూ ఎంటర్‌ కాగానే ‘దారి’ సాఫీ అయిపోతుంది. ఎక్కడా హడావుడి పడకుండా పద్ధతిగా ఆ దారిలో సినిమాని నడుపుతూ ఇంటర్వెల్‌ తర్వాత ఒక్కసారిగా వేగం పెంచేసరికి ఇక అక్కడ్నుంచీ నాన్‌స్టాప్‌ ఫన్‌ రైడే. నిన్ను చూడగానే సాంగ్‌, తర్వాతో ఛేజ్‌, ఆపై సిద్ధప్ప నాయుడి గ్యాంగ్‌తో ఫైట్‌, అదవ్వగానే ‘రేడియేటర్‌’ బద్దం భాస్కర్‌గా బ్రహ్మానందం ఎంట్రీ, కెవ్వు కేక బాబా ఎపిసోడ్‌, అహల్య కామెడీ పురాణం, కాటమరాయుడా… ఊపిరి ఆడనివ్వకుండా అలా అలా సినిమా ఉరుకుల పరుగుల మీద వెళ్లి… క్లయిమాక్స్‌లో కామెడీతో నిండిన ఒక యాక్షన్‌ ఎపిసోడ్‌ తర్వాత పది నిముషాల ఎమోషనల్‌ సీన్‌! పైసా వసూల్‌ అయిపోవడం కాదు… ఇంకోసారి మళ్లీ టికెట్‌ డబ్బులిస్తే తప్ప ఈ ఎంటర్‌టైన్‌మెంట్‌కి తగ్గ పైకం చెల్లించినట్టు కాదని అనిపించేట్టు!

సాధారణంగా ఫాన్స్‌ రిపీటెడ్‌గా సినిమాలు చూస్తుంటారు. ఫ్యామిలీస్‌ కూడా రిపీట్స్‌ చూసే రేర్‌ మూవీ ఇది. ముందే చెప్పుకున్నట్టు ఇదొక కంప్లీట్‌ మూవీ. మరీ ఫ్యాక్షన్‌ సినిమాలు తప్ప ఇంకో రకం సినిమాలేవీ సినిమాల్లా అనిపించని వారికి తప్ప అందర్నీ సంతృప్తి పరిచే చిత్రమిది. కంటెంట్‌ పరంగా పవన్‌ కళ్యాణ్‌కి గత పదేళ్లలో వచ్చిన బెస్ట్‌ ఫిలిం ‘అత్తారింటికి దారేది’. 

బోటమ్‌ లైన్‌:    అదిరింది!

విహారి