రివ్యూ: తుఫాన్
రేటింగ్: 2/5
బ్యానర్: రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, ప్రకాష్ మెహ్రా ప్రొడక్షన్స్
తారాగణం: రామ్ చరణ్, ప్రియాంక చోప్రా, శ్రీహరి, ప్రకాష్‌రాజ్, తనికెళ్ల భరణి, మాహీ గిల్ తదితరులు
కూర్పు: చింటూ సింగ్
సంగీతం: మీత్ బ్రదర్స్, అంజన్, చిరంతన్ భట్
ఛాయాగ్రహణం: గురురాజ్ ఆర్. జోయస్
నిర్మాతలు: రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, పునీత్ ప్రకాష్ మెహ్రా, సుమీత్ ప్రకాష్ మెహ్రా
కథనం, దర్శకత్వం: అపూర్వ లాఖియా
విడుదల తేదీ: సెప్టెంబర్ 6, 2013
చిరంజీవి తనయుడిగా సినీ రంగ ప్రవేశం చేసి, అతి తక్కువ చిత్రాలతోనే మాస్ హీరోగా మంచి ఫాలోయింగ్ తెచ్చుకుని, వరుస విజయాలు అందుకుంటున్న రామ్ చరణ్… బాలీవుడ్‌లో తనని తాను నిరూపించుకోవడానికి ఏకంగా అమితాబ్‌బచ్చన్ సినిమా రీమేక్‌ని ఎంచుకున్నాడు. అమితాబ్‌కి ‘యాంగ్రీ యంగ్‌మ్యాన్’ ఇమేజ్ తెచ్చిపెట్టిన జంజీర్ రీమేక్‌ని చేయడమంటే ఎవరికైనా పెద్ద ఛాలెంజే. బాలీవుడ్‌తో ముఖ పరిచయం లేని చరణ్ ఈ ఛాలెంజ్ స్వీకరించడం పెను సాహసమే. అమితాబ్ చిత్రాల రీమేక్స్‌కి క్రిటిక్స్ అక్షింతలు వేసినా కానీ కమర్షియల్‌గా హిట్ అయిపోతున్నాయి. ఆ ధైర్యంతోనే అపూర్వ లాఖియా ఈ చిత్రానికి శ్రీకారం చుట్టి ఉండొచ్చు. హిందీలో జంజీర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో తుఫాన్‌గా తెరకెక్కించారు. తుఫాన్ వివరాల్లోకి వెళితే…
కథేంటి?
డ్యూటీ విషయంలో స్ట్రిక్ట్‌గా ఉంటూ ఎవరినీ లెక్క చేయని ఏసీపీ విజయ్ ఖన్నా (చరణ్) ఇరవై రెండు ట్రాన్స్‌ఫర్ల తర్వాత ముంబయికి ఏసీపీగా ట్రాన్స్‌ఫర్ అయి అక్కడ ఛార్జ్ తీసుకుంటాడు. ఒక డిప్యూటీ కలెక్టర్ హత్యని కళ్లారా చూసిన ఎన్నారై మాల (ప్రియాంక) ఇచ్చిన సాక్ష్యం ఆధారంగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన విజయ్‌కి ఆయిల్ మాఫియా నడిపే తేజ (ప్రకాష్‌రాజ్) అన్నిటికీ కారణమని తెలుస్తుంది. తేజ కారణంగా సస్పెండ్ అయిన విజయ్ ఆ తర్వాత ప్రతీకారం ఎలా తీర్చుకుని, తేజ పని ఎలా పడతాడనేది తుఫాన్ స్టోరీ.
కళాకారుల పనితీరు!
రామ్ చరణ్ యాక్షన్ సీన్స్‌లో రాణించాడు. ఈ చిత్రంలో అతని పాత్ర వన్ డైమెన్షనల్ కావడంతో సినిమా అంతటా సీరియస్‌గానే కనిపిస్తాడు. నటుడిగా తన పాత్రకి న్యాయం చేశాడు కానీ, ఈ క్యారెక్టర్‌ని తీర్చి దిద్దడంలో దర్శకుడు ఫెయిలయ్యాడు. హిందీ చిత్ర సీమలో ఎలాంటి ఇమేజ్ లేని చరణ్ ఈ పాత్ర అక్కడ చేయడం వల్ల ఎలాంటి సమస్య ఉండదు కానీ, తెలుగులో అతనికంటూ ఒక ఇమేజ్ ఉంది. దానికి అనుగుణంగా తెలుగు వెర్షన్‌లో మార్పు చేర్పులు చేసి ఉండాల్సింది.
ప్రియాంక చోప్రా క్యారెక్టర్‌ని అల్లరి పిల్లగా తీర్చి దిద్దాలనే ప్రయత్నం జరిగింది. కానీ క్యారెక్టరైజేషన్ బ్యాడ్‌గా ఉండడంతో పాటు, ఆమెపై తీసిన సన్నివేశాలు కూడా ఇరిటేట్ చేసేట్టుండడంతో ప్రియాంక ‘మాల’ పాత్రలో విపరీతంగా సహనాన్ని పరీక్షిస్తుంది.
షేర్ ఖాన్ పాత్రలో శ్రీహరి కొన్ని సన్నివేశాల్లో ఆకట్టుకున్నాడు. శ్రీహరి, చరణ్ మధ్య బాండ్ కూడా సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదు. దీని వల్ల ఈ పాత్ర చాలా సందర్భాల్లో తేలిపోయింది. ప్రకాష్‌రాజ్‌కి ఇలాంటి పాత్రలు అలవాటే. అసలు కామెడీనే లేని ఈ సినిమాలో ప్రకాష్‌రాజ్, మాహీ గిల్ మధ్య జరిగే ద్వందార్ధ సంభాషణలే కొంతలో కొంత రిలీఫ్. మాహీ గిల్ తన క్యారెక్టర్‌కి తగినట్టు సెక్సీగా కనిపించింది. తనికెళ్ల భరణి తన పాత్రకి న్యాయం చేశారు.
సాంకేతిక వర్గం పనితీరు:
ఈ చిత్రానికి పని చేసిన సాంకేతిక నిపుణులంతా కూడా ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశారు. కథ, కథనం, పాటలు, మాటలు, నేపథ్య సంగీతం, ఎడిటింగ్, డైరెక్షన్… వీటిలో ఏదీ బాలేదు. అందరూ బ్యాడ్ అవుట్ పుట్ ఇవ్వడంలో ఒకరితో ఒకరు పోటీ పడ్డారు. రామ్ చరణ్‌కి ఉన్న తెలుగు మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకుని అయినా ఈ చిత్రం పాటల విషయంలో అయినా శ్రద్ధ వహించాల్సింది. హిందీలోనే ఆడియో వీక్‌గా ఉంది. ఇక దాని అనువాద గీతాలెలా ఉంటాయి? నేపథ్య సంగీతం అయితే సన్నివేశంతో సంబంధం లేకుండా చెవులు చిల్లులు పెడుతుంది. డైలాగ్స్ కూడా చాలా బ్యాడ్‌గా ఉన్నాయి. చరణ్, ప్రకాష్‌రాజ్ రిటార్ట్స్ మినహా మిగతా సీన్స్‌లో ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది.
దర్శకుడిగా అపూర్వ లాఖియా పూర్తిగా ఫెయిలయ్యాడు. జంజీర్‌తో పోల్చి చూసినా, చూడకపోయినా కానీ ఇది చాలా బ్యాడ్ ఎటెంప్ట్. ఏ ఒక్క సన్నివేశంలో అయినా దర్శకుడి ముద్ర లేదు. ఈ సీన్ కోసం ఈ సినిమా చూడొచ్చునని చెప్పడానికి ఒక్కటంటే ఒక్క సీన్ కూడా లేదు. తెలుగులో కూడా విడుదల చేయాలనే ఆలోచన మొదట్నుంచీ ఉన్నప్పుడు ఇక్కడ చరణ్‌కి ఎలాంటి ఇమేజ్ ఉంది, అతడిని ఎలాంటి సినిమాల్లో చూడ్డానికి ఇష్టపడతారనేది అధ్యయనం చేసి, అందుకు అనుగుణంగా తెలుగు వెర్షన్ తీసి ఉండాల్సింది.
హైలైట్స్:
- యాక్షన్ సీన్స్‌లో రామ్ చరణ్ పర్‌ఫార్మెన్స్
డ్రాబ్యాక్స్:
- ప్రకాష్‌రాజ్ మినహా… ప్రియాంకతో సహా మిగతావన్నీ డ్రాబ్యాక్సే!
విశ్లేషణ:
జంజీర్ సినిమాని రీమేక్ చేయడం వల్ల రెండు లాభాలున్నాయి. ఏదైనా సినిమా పాత చింతకాయ పచ్చడిలా అనిపిస్తే… ‘సెవెంటీస్ సినిమాలా’ ఉందని కామెంట్ చేస్తుంటారు. తుఫాన్‌కి ఆ బాధ లేదు. ఎందుకంటే ఇది నిజంగా సెవెంటీస్ సినిమానే కదా మరి. అలాగే ఈ చిత్రం బాలేదని పెదవి విరిచేవారంతా ఒరిజినల్‌తో కంపేర్ చేసి చూస్తున్నారని చెప్పి తప్పించుకోవచ్చు. ఇంతకుమించి జంజీర్‌ని రీమేక్ చేయడం వల్ల వచ్చిన ప్రయోజనం ఏమీ లేదు.
‘జంజీర్’లో రామ్ చరణ్‌ని హీరోగా ఎందుకు ఎంచుకున్నారని అడిగితే… ఆ సినిమా చేసే టైమ్‌కి అమితాబ్‌కి ఎలాంటి ఇమేజ్ లేదని, ఈ సినిమా తర్వాతే ఆయనకో ఇమేజ్ వచ్చిందని అపూర్వ చెప్పాడు. అందుకే ఏ ఇమేజ్ లేని చరణ్‌ని హీరోగా ఎంచుకున్నానని అన్నాడు. హిందీ వెర్షన్ వరకు అతనిచ్చే సమాధానం సబబుగానే అనిపిస్తుంది. మరి తెలుగు సంగతేంటి? ఆల్రెడీ మగధీరతో తెలుగు సినిమా రికార్డులు తిరగరాసిన హీరోతో, యావరేజ్ కంటెంట్‌తోనే సూపర్‌హిట్స్ ఇస్తున్న స్టార్‌తో ఈ కథ ఎలా వర్కవుట్ అవుతుందని అనుకున్నాడు?
అసలు జంజీర్‌ని రీమేక్ చేయడానికి అంతగా ఎక్సయిట్ చేసిన అంశాలేమిటనేది అర్థం కాదు. ఎందుకంటే ఈ సినిమా చూస్తున్నప్పుడు ఈ తరం ప్రేక్షకులు ఏమాత్రం ఎక్సయిట్ కారు. పైగా ఈ చిత్రంలో వినోదానికి అస్సలు చోటే లేదు. ప్రథమార్థంలో ఉన్న మూడు పాటలు కూడా ఐటెమ్ సాంగ్సే అంటే సినిమా ఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. హీరోపై ఒకే ఒక్క పాట మాత్రమే చిత్రీకరించారు. ఆ పాటకి కూడా సందర్భం లేదు. ఒక్క పాట కూడా లేకపోతే బాగోదన్నట్టు దానిని బలవంతంగా ఇరికించారు.
సినిమాల్లో వినోదం లేకపోయినా, బిగి సడలని కథనం ఉంటే విసుగు లేకుండా చూడవచ్చు. కానీ కథ ముందుకి కదలడానికి ఏవో సన్నివేశాలు ఉండాలన్నట్టు అలా నడుపుకుంటూ పోయారు. హీరో హీరోయిన్ల ట్రాక్ కానీ, హీరో, శ్రీహరిల ట్రాక్ గానీ చాలా వీక్‌గా ఉన్నాయి. విలన్‌కీ, వ్యాంప్‌కీ మధ్య సీన్సే సినిమాలో బెటర్ అనిపిస్తాయంటే కథ, కథనాలపై ఏమాత్రం కసరత్తు జరిగిందో మీరే ఊహించుకోండి.
రామ్ చరణ్ ఉంటే చాలు, ఎలా ఉన్నా చూసేస్తామనే వీరాభిమానులు… సినిమాలో ఏమున్నా లేకపోయినా.. మూడు, నాలుగు ఫైట్లుంటే పైసా వసూల్ అనుకునే ప్రేక్షకులు మినహా ‘తుఫాన్’ అందర్నీ తీవ్ర నిరాశకి గురి చేస్తుంది. రామ్ చరణ్ బాలీవుడ్ డెబ్యూ అద్భుతాలు సృష్టించేస్తుందని ఆశించకపోయినా, కనీసం మినిమమ్ ఎంటర్‌టైన్ చేస్తుందని ఆశించినా కానీ ఇది నిరుత్సాహపరుస్తుంది. ఎంత లో ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్లినా కానీ కాస్త ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేసి వచ్చామేమో అనే భ్రమకి గురి చేసే తుఫాన్ ఇప్పుడు అననుకూల పరిస్థితులతో పాటు, ప్రేక్షకుల నిట్టూర్పులని కూడా జయిస్తే కానీ బాక్సాఫీస్ తీరం దాటడం కష్టం!
బోటమ్ లైన్: ఉరుములు, మెరుపులు లేవు… దుమ్ము, ధూళి తప్ప!
విహారి
feedback at