రివ్యూ: కిస్
రేటింగ్: 1.5/5
బ్యానర్: మై డ్రీమ్ సినిమా ప్రై.లి.
తారాగణం: అడివి శేష్, ప్రియా బెనర్జీ, భరత్ రెడ్డి, షఫి తదితరులు
రచన: సాయికిరణ్ అడివి, అడివి శేష్
సంగీతం: శ్రీచరణ్ పాకాల, పీట్ వండర్
ఛాయాగ్రహణం: షెనీల్ దియో
నిర్మాత: సాయికిరణ్ అడివి
దర్శకత్వం: అడివి శేష్
విడుదల తేదీ: సెప్టెంబర్ 13, 2013
పంజా చిత్రంలో నెగెటివ్ రోల్ చేసి గుర్తింపు పొందిన శేష్ అడివి దాని కంటే ముందు ‘కర్మ’ అనే చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు ‘కిస్’ పేరుతో మరోసారి దర్శకుడిగా, హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అయితే తనకి తాను పెట్టుకున్న పరీక్ష కాస్తా ప్రేక్షకుల సహనానికి పరీక్షగా మారింది. వేరే హీరోల సినిమాల్లో విలన్ వేషాలేస్తున్న శేష్… తనే హీరోగా నటించిన సినిమాకి దర్శకుడిగా, రచయితగా విలన్ అయ్యాడు.
కథేంటి?
ప్రియ (ప్రియా బెనర్జీ) ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో సీట్ సంపాదిస్తుంది. అయితే ఆమెకి రవితో (భరత్ రెడ్డి) పెళ్లి ఫిక్స్ చేసేస్తాడు ఆమె తండ్రి. రవి క్యారెక్టర్ నచ్చక, తన ఆశలు చంపుకోలేక ఆత్మహత్య చేసుకుందామని వెళ్లిన ప్రియకి సన్నీ అనే దొంగ (శేష్) తారసపడతాడు. చనిపోయే ముందు జీవితాన్ని ఎంజాయ్ చేసి చనిపోమని చెప్పిన సన్నీ మాటల్ని విని ఆత్మహత్య వాయిదా వేసుకున్న ప్రియ తన నిర్ణయాన్ని మార్చుకుందా లేదా అనేది కథ.
కళాకారుల పనితీరు!
అడివి శేష్‌కి స్క్రీన్ ప్రెజన్స్ ఉంది, కాన్ఫిడెన్స్ కూడా బాగానే ఉంది. ఎంటర్‌టైనింగ్ సీన్స్‌లో ఫర్వాలేదనిపించినా కానీ ఎమోషనల్ సీన్స్‌లో మాత్రం శేష్ తేలిపోయాడు. ప్రియా బెనర్జీ చూడ్డానికి బాగానే ఉంది కానీ నటన మాత్రం అస్సలు రాదు. అందంగా ఉన్నా అభినయ పరంగా అస్సలు ఆకట్టుకోని హీరోయిన్ల కోవలోకి వచ్చే ప్రియ ఆల్రెడీ యాక్టింగ్ కోర్స్ చేసిందట. బహుశా ఆ కోర్స్ కనీసం ఇంకో నాలుగైదు సార్లు చేస్తే తప్ప ఈమెకి ఎక్స్‌ప్రెషన్స్ పలకవేమో!
భరత్ రెడ్డి నెగెటివ్ రోల్‌లో ఓకే అనిపించాడు. షఫీ కామెడీ చేయడానికి శాయశక్తులా కష్టపడ్డాడు. ఇక సపోర్టింగ్ రోల్స్ చేసిన నటీనటుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఒక సినిమాకి హీరో హీరోయిన్లు మాత్రమే కాకుండా సపోర్టింగ్ యాక్టర్స్ కూడా ఎంత ఇంపార్టెంట్ అనేది తెలియజెప్పడానికి ఈ చిత్రమొక చక్కని ఉదాహరణ. వారిలో ఎవరికీ నటన రాకపోవడం ఒకెత్తు అయితే, అసలే చిరాకు పెడుతున్న సినిమాని మరింత ఇబ్బందికరంగా మార్చడంలో వీళ్ల సపోర్ట్ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది.
సాంకేతిక వర్గం పనితీరు:
అమెరికాలో (శాన్ ఫ్రాన్సిస్కో) చిత్రీకరించిన ఈ సినిమాకి ఆ విజువల్స్ ఒక్కటే ఆకర్షణ. ఖర్చుకి వెనుకాడనందుకు నిర్మాతని ప్రశంసించాలి. పాటలేమీ ఆకట్టుకునేలా లేవు. నేపథ్య సంగీతం ఫర్వాలేదు. సంభాషణల్లో పస లేదు. ఛాయాగ్రహణ పరంగా ప్రత్యేకతలేం లేవు. సాంకేతిక వర్గంలో ఎవరూ అద్భుతమైన పనితీరు కనబరచకపోవడం వల్ల సినిమాని నిలబెట్టే భారం పూర్తిగా దర్శకుడు అడివి శేష్ మీదే పడిరది.
రచనలో తన సోదరుడు అడివి సాయికిరణ్ (వినాయకుడు ఫేమ్) సహకారం తీసుకున్నా కానీ ఆకట్టుకునే కథ, కథనాలు సిద్ధం చేసుకోలేకపోయాడు. కథలో ఒక సినిమా తీయడానికి సరిపడా ‘విషయం’ లేకపోవడం వల్ల కథనం గాడి తప్పింది. స్టోరీ, స్క్రీన్‌ప్లే వీక్ అయినప్పుడు ఎంత గొప్ప డైరెక్టర్ అయినా సరే తడబడక తప్పదు. ఇక అంతగా అనుభవం లేని శేష్ ఏమి చేయగలడు?
హైలైట్స్:
- పేజ్ కెనాట్ బీ డిస్‌ప్లేడ్!
డ్రాబ్యాక్స్:
- లోడిరగ్.. లోడిరగ్… ‘నాట్ ఇనఫ్ స్పేస్ ఆన్ ది డిస్క్’!
విశ్లేషణ:
ఒక సినిమా తీయడం వల్ల ఏదో ఒక ప్రయోజనం అంటూ ఉండాలి. ఒకటి వినోదం పంచాలి, లేదా ప్రయోగం అయి ఉండాలి, లేదంటే సందేశం ఇవ్వాలి… ఇవన్నీ కాదంటే కనీసం కాలక్షేపానికైనా పనికి రావాలి! ‘కిస్’ వీటిలో ఏదీ చేయకపోగా… పదే పదే ‘ఈ సినిమా ఎందుకు తీసినట్టు?’ అనే ప్రశ్నని గుర్తు చేస్తుంటుంది. దానికి సమాధానం ఏమిటనేది స్పష్టంగా తెలియకపోయినా కానీ… బహుశా ఇదే వినోదం అనుకుని ఈ చిత్ర దర్శకుడికి అనిపించి ఉండొచ్చు. తన కథలో గొప్ప సందేశం ఉందని భావించి ఉండొచ్చు. ఈ సినిమా చూస్తే ఆడియన్స్‌కి ఈజీగా టైమ్‌పాస్ అయిపోతుందనే భ్రమకి గురై ఉండొచ్చు.
కానీ మనకి జోక్ అనిపిస్తే సరిపోదు… ఎదుటివారు కూడా నవ్వాలి. మనకి కాలక్షేపం అయిపోతే చాలదు… టిక్కెట్ కొనుక్కున్న వాళ్లు కూడా సంతృప్తి చెందాలి. చిన్న సినిమాలు క్లిక్ అవ్వాలంటే రెండు మార్గాలు. ఒకటి కొత్త తరహా కథ, కథనాలతో.. ఊహించని మలుపులతో ప్రేక్షకులని మంత్రముగ్ధుల్ని చేయాలి. లేదంటే… చక్కని కామెడీతో ‘పైసా వసూల్’ అనిపించే భావన కలిగించాలి. కానీ ‘కిస్’ సినిమాకి పైసా వసూల్ కాకపోవడం పోగా, ‘ఎక్స్‌ట్రా పైసల్’ అవసరమౌతాయి… తలనొప్పులకీ, టాబ్లెట్టులకీ!
కట్టె, కొట్టె, తెచ్చె… అని మూడు ముక్కల్లో చెప్పేసే కథతో రెండు గంటలకి పైగా కథ చెప్పాలంటే ఎన్నో మంచి సన్నివేశాలుండాలి. ఎంతో చక్కని కామెడీ పండాలి. కానీ ‘కిస్’ సినిమాలో అలాంటివేమీ లేకపోగా, విషయం లేకుండా రీళ్ల పాకంలా సాగే సన్నివేశాలు… గమనం ఎటో తెలియకుండా సాగిపోయే పాత్రలు, పాత్రధారులు కలగలిసి ‘బయటకు దారి’ వెతుక్కునేలా… ‘శుభం’ కార్డు కోసం పడిగాపులు పడేలా చేస్తాయి.
ఈ చిత్రంలో ఎక్కువగా దర్శక, నిర్మాతల బంధుగణమే నటించినట్టున్నారు. దాంతో ఇందులో వంకలు చూపించడానికి, సవరణలు సూచించడానికి కూడా ఆట్టే ఆస్కారం చిక్కినట్టు లేదు. మనం అటెండ్ అయిన పెళ్లి తాలూకు ఆల్బమ్ చేతిలో పెడితే మన ఫోటో ఎక్కడుందో వెతుక్కోడంతోనే సరిపోతుంది… ఇక ఆల్బమ్ ఎక్కడ చూస్తాం? ఈ సినిమాలో నటీనటవర్గం కూడా తమ, తమ రూపాల్ని తెరపై చూసుకుని సంబరపడిపోయుంటారు… ఇక తప్పొప్పులు ఏమి చెప్తారు? పోనీ ఇందులో నటించిన వారు ఏమైౖనా వేరే వృత్తుల్లో ఉండిపోవడం వల్ల వెండితెర మిస్ అయిపోయిన ఆర్టిస్టులా అంటే… అదేం కాదు. అందరూ కూడా తెరపై కనిపించాలనే ‘సరదా’నే తప్ప నటనలో ఏబీసీడీలు రాని బాపతు!
ఓవైపు ‘రాత’ బాగోక ఈ సినిమా సహనాన్ని సంహరిస్తుంటే, మరోవైపు ఈ కొత్త ఆర్టిస్టుల నట విధ్వంసకాండ ఓ చిన్న సైజు మారణహోమాన్నే సృష్టించి ‘సినిమాలు ఆరోగ్యానికి హానికరం’ అనే చేదు నిజాన్ని కళ్లకి కడుతుంది. ఇలాంటి సృజనాత్మక దాడుల నుంచి తప్పించుకోడానికి చట్టబద్ధమైన హెచ్చరికలేమీ ఉండకపోయినా, సమీక్షలైతే అందుబాటులో ఉంటాయి. అదృష్టవంతులు రివ్యూ చదివి రియలైజ్ అవుతారు… ఉత్సాహవంతులు మూవీ చూసి కళ్లు తెరుస్తారు!
బోటమ్ లైన్: వద్దు బాబోయ్ ఈ ‘ముద్దు’!
విహారి
Feedback at