cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: బంగారు కోడిపెట్ట

సినిమా రివ్యూ: బంగారు కోడిపెట్ట

రివ్యూ: బంగారు కోడిపెట్ట
రేటింగ్‌: 2.25/5

బ్యానర్‌: గురు ఫిలింస్‌
తారాగణం: నవదీప్‌, స్వాతి, రామ్‌-లక్ష్మణ్‌, సంతోష్‌, హర్షవర్ధన్‌, తదితరులు
మాటలు: ప్రసాద్‌ వర్మ
సంగీతం: మహేష్‌ శంకర్‌
కూర్పు: ధర్మేంద్ర కాకర్ల, చంద్రశేఖర్‌ జి.వి.
ఛాయాగ్రహణం: సాహిర్‌ రాజా
నిర్మాత: సునీత తాటి
కథ, కథనం, దర్శకత్వం: రాజ్‌ పిప్పళ్ల
విడుదల తేదీ: మార్చి 7, 2014

స్వాతి, నవదీప్‌ల ‘బంగారు కోడిపెట్ట’ కొత్తదనం నిండిన వినోదాన్ని అందిస్తుందనే నమ్మకం ఈ సినిమా ట్రెయిలర్స్‌ చూస్తే కలిగింది. ‘బోణి’తోనే బోర్‌ కొట్టించిన దర్శకుడు రాజ్‌ పిప్పళ్ల ద్వితీయ ప్రయత్నంలో అయినా సక్సెస్‌ అవుతాడేమో అనిపించింది. ఇంతకీ ట్రెయిలర్స్‌తో బానే ఆకర్షించిన ‘బంగారు కోడిపెట్ట’ థియేటర్లో రెండు గంటల పాటు కూర్చోపెట్టగలిగిందా? రాజ్‌ పిప్పళ్లకి బోణి జరిగిందా? 

కథేంటి?

ఒక ఎనర్జీ డ్రిరక్‌ సేల్స్‌ డిపార్ట్‌మెంట్‌లో పని చేసే భానుమతి (స్వాతి) ఉద్యోగం పోగొట్టుకుంటుంది. తన అవసరాలకి కావాల్సిన డబ్బు కావాలంటే... తన కంపెనీ పెట్టిన లక్కీ డ్రా ప్రైజ్‌ అయిన ‘బంగారం’ కొట్టేయడమే దారి అనుకుంటుంది. తనతో పని చేసే వంశీతో (నవదీప్‌) కలిసి బంగారం కొట్టేయడానికి స్కెచ్‌ వేస్తుంది. ఈ గోల్డ్‌ రాబరీ ప్లాట్‌కి మరో రెండు సబ్‌ ప్లాట్స్‌ కూడా కనెక్ట్‌ అవుతాయి. వాటన్నిటికీ ఏ ముగింపు ఉంటుందనేదే ‘బంగారు కోడిపెట్ట’. 

కళాకారుల పనితీరు!

నవదీప్‌ మంచి యాక్టర్‌ అయినా కానీ అతనికి అదృష్టం కలిసి రావడం లేదు. నటుడిగా ఈ చిత్రంలోను నవదీప్‌ మెప్పించాడు. స్వాతి తన సహజ సిద్ధమైన అల్లరి క్యారెక్టర్స్‌కి భిన్నంగా ఇందులో కామ్‌గా కనిపించింది. తన పాత్రకి ఆమె పూర్తి న్యాయం చేసింది. పిజ్జా బోయ్‌ క్యారెక్టర్‌లో సంతోష్‌ అంతగా ఆకట్టుకోలేదు. ఈ చిత్రంలో ఇది కీలక పాత్ర కనుక ఇంకాస్త బెటర్‌ యాక్టర్‌ని ఎంచుకుని ఉండాల్సింది. రామ్‌ లక్ష్మణ్‌ గురించి చెప్పడానికేమీ లేదు. ఇద్దరి పోలికలూ ఒకటే... వారికొచ్చిన ఎక్స్‌ప్రెషన్‌ కూడా ఒకటే! హర్షవర్ధన్‌ బాగా చేసాడు. క్లయిమాక్స్‌ సీన్‌లో అతని టైమింగ్‌, ఎక్స్‌ప్రెషన్స్‌ బాగా నవ్విస్తాయి. 

సాంకేతిక వర్గం పనితీరు:

మహేష్‌ శంకర్‌ కంపోజ్‌ చేసిన సాంగ్స్‌ అంతగా ఆకట్టుకోవు. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ కూడా యావరేజ్‌గా ఉంది. డైలాగ్స్‌ ఫర్వాలేదు. ఎడిటింగ్‌ వీక్‌. సినిమాలో అవసరం లేని సన్నివేశాలు ఎక్కువున్నాయి. చాలా సీన్స్‌ లెంగ్త్‌ కూడా బాగా ఎక్కువైంది. టెక్నికల్‌ టీమ్‌లో సినిమాటోగ్రఫీకి ఎక్కువ స్కోర్‌ దక్కుతుంది. అలా అని అదేమీ అంత గొప్పగా లేదు. 

రాజ్‌ పిప్పళ్ల మొదటి సినిమా కంటే ఇది బెటర్‌ ప్రోడక్ట్‌ అయినా కానీ ఈ చిత్రంలో కూడా అతని బలహీనతలు బాగా కనిపించాయి. ఒక ఇంట్రెస్టింగ్‌ ప్లాట్‌ని, స్క్రీన్‌ప్లే ఫార్మేట్‌ని ఎంచుకున్న రాజ్‌ పిప్పళ్ల దానిని ఆకట్టుకునేలా తెరకెక్కించలేకపోయాడు. పతాక సన్నివేశాల్లో చూపించిన షార్ప్‌నెస్‌ సినిమా అంతటా మెయింటైన్‌ చేసి ఉంటే బాగుండేది. 

హైలైట్స్‌:

  • లాస్ట్‌ యాక్ట్‌
  • నవదీప్‌ పర్‌ఫార్మెన్స్‌

డ్రాబ్యాక్స్‌:

  •  డైరెక్షన్‌
  •  వీక్‌ ఫస్టాఫ్‌

విశ్లేషణ:

ఈ సినిమా కథాంశం మనకి తెలియనిదేమీ కాదు. లీడ్‌ క్యారెక్టర్స్‌ రాబరీ ప్లాన్‌ చేయడం, దానిని అమలు చేయడంలో వారికి అడ్డంకులు ఎదురు కావడం, వాటిని దాటుకుని అనుకున్నది సాధించడం... ఇదంతా కొన్ని సినిమాల్లో ఆల్రెడీ చూసాం. దర్శకుడు రాజ్‌ పిప్పళ్ల ఈ కథని కొత్త ఫార్మేట్‌లో చూపించడానికి ట్రై చేశాడు. 

మూడు కథల్ని ప్యారలల్‌గా నడుపుతూ అవన్నీ ఒక పాయింట్‌ దగ్గర ఎలా కనెక్ట్‌ అయ్యాయనేది, అవన్నీ ఎలా రియలైజ్‌ అయి, ఏ విధంగా సెటిల్‌ అయ్యాయనేది దర్శకుడు కొత్తగా చెప్పే ప్రయత్నం చేసాడు. ఈ స్క్రీన్‌ప్లే ఫార్మేట్‌ని కూడా పలు విదేశీ చిత్రాల్లోను (అమొరోస్‌ పెర్రోస్‌, క్రాష్‌), మణిరత్నం ‘యువ’లోను కొందరు చూసే ఉంటారు. డైరెక్టర్‌ ఎటెంప్ట్‌ని అప్రీషియేట్‌ని చేయవచ్చు కానీ అతని అప్రోచ్‌ని, సినిమాని నడిపిన తీరుని మాత్రం మెచ్చుకోలేం. 

ఇలాంటి సినిమాలు ఎంత వేగంగా, ఎంత వినోదాత్మకంగా ఉంటే అంతగా ఆకట్టుకుంటాయి. ఉదాహరణకి గత ఏడాదిలో వచ్చిన స్వామిరారాని చెప్పుకోవచ్చు. అందులో ఉన్న టెక్నికల్‌ బ్రిలియన్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ కోషెంట్‌, రేసీ స్క్రీన్‌ప్లే... అన్నీ కూడా బంగారు కోడిపెట్టలో మిస్‌ అయ్యాయి. ఉపకథలుగా తీసుకున్న పిజ్జా డెలివరీ కుర్రాడి కథ, రామ్‌ లక్ష్మణ్‌ల కథ ఆకట్టుకోవు. ఆ క్యారెక్టర్స్‌పై చిత్రీకరించిన సీన్స్‌ అన్నీ బోర్‌ కొట్టిస్తాయి... ఒక్క క్లయిమాక్స్‌లో ఆ పిజ్జా కుర్రాడి ఫైట్‌ సీన్‌ తప్ప. 

హీరో హీరోయిన్ల ట్రాక్‌ బాగానే ఉంది కానీ అది కూడా ద్వితీయార్థం చివర్లోకి వచ్చాక గానీ స్పీడందుకోదు. దర్శకుడు అనవసర విషయాల మీద టైమ్‌ వేస్ట్‌ చేసే కంటే ఈ చిత్రాన్ని బిగి సడలని స్క్రీన్‌ప్లేతో నడిపి థ్రిల్‌ చేస్తూ, అలాగే వీలయినంత వినోదాన్ని జోడించి నవ్విస్తూ తీసినట్టయితే ‘బంగారు కోడిపెట్ట’ నిజంగానే బంగారు గుడ్లు పెట్టుండేది. ఒక మంచి క్రైమ్‌ కామెడీ కావాల్సిన సినిమా కాస్తా చివరకు డివిడి మూవీగా మిగిలింది. 

బోటమ్‌ లైన్‌: ఈ కోడిపెట్ట గుడ్లు పెట్టలేదు... గుడ్లు తేలేసింది!!

-జి.కె.

లవ్ స్టొరీ లకు ఇక గుడ్ బై

వైఎస్సార్ కారు నడిపాను

 


×