మోహన మకరందం: ఉగ్గుపాలగా గాడిదపాలు..

                                          అనుభవాలూ – జ్ఞాపకాలూ: డా.…

                                          అనుభవాలూ – జ్ఞాపకాలూ: డా. మోహన్‌ కందా 

ఉగ్గుపాలగా గాడిదపాలు.. ఆ పై ఆల్కహాలు 

గమనించారా, నా పేరూ గాంధీగారి పేరూ ఒకటే !  – మోహన్‌! దానికో స్టోరీ వుంది. ఏడో నెలలో పుట్టిన నేను వుంటానో వూడతానో అని పేరు కూడా పెట్టలేదు మావాళ్లు. అసలు మా వాళ్లలో ఈ బారసాలలూ, అన్నప్రాశనలూ, అక్షరభ్యాసాలూ.. మొదట్నించీ పెద్దగా అలవాటు లేవు. స్వాతంత్య్ర యోధురాలు, మహిళా ఉద్యమసారథి దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ గారున్నారు కదా, ఆవిడ అందరికీ దుర్గాబాయమ్మగారు కానీ నాకు దుర్గమ్మపిన్నే. తనూ మా అమ్మా కాకినాడలో క్లాస్‌మేట్స్‌. ప్రాణస్నేహితులు. ఉద్యమాల్లో కలిసి పనిచేశారు. మేం మద్రాసు వచ్చాక మళ్లీ స్నేహం బలపడింది. 

మద్రాసు వచ్చాక ఆవిడ ఆంధ్రమహిళా సభ పెట్టింది. సభకు అడయార్‌లో ఓ భవంతి కట్టి దాని శిలాఫలకాల ఆవిష్కరణకు గాంధీగారిని రప్పించింది. గాంధీగారు వచ్చినపుడు నన్ను తీసుకెళ్లి ఆయన చేతిలో పెట్టారు. ఆయన నన్ను ఆశీర్వదించారు. అంతే.. నాకు ఆయన పేరు – మోహనదాస్‌ అని పెట్టారు. రాను రాను 'దాసు' కాలగర్భంలో కలిసిపోయింది. కాలక్రమేణా అది మోహన్‌బాబుగా.. మోహన్‌గా మిగిలింది. ఇంకో విషయం ఏమిటంటే – నా పెళ్లి గాంధీ జయంతిన జరిగింది! ఇంకింకో విషయం చెప్పనా.. గాంధీగారు మేకపాలు తాగేవారు, నాకు చిన్నపుడు మేకపాలు పట్టేరు, గాడిదపాలతో పాటు! దానికోసం మేకను యింట్లో పెంచేవారు. అది చేసే కశ్మలం చూసి మా నాన్నగారు చికాకుతో గెంతులేసేవారు.
xxxxxxxx

అది 1945 వ సంవత్సరం.సెప్టెంబరు నెల 4 వ తారీకు. చెన్నపట్నంలో మైలాపూర్‌లో సి.పి.కోయిల్‌ వీధిలో 20 వ నెంబరు యింట్లో.. పడకటింట్లో … మా అమ్మ పురిటినొప్పులు పడుతోంది. పుట్టబోయేది మగబిడ్డా, ఆడబిడ్డా అని ఆతృత పడుతోంది. ఏ బిడ్డయినా సరే, బతికే బిడ్డా, అర్ధాయుష్షు బిడ్డా అని ఆందోళన చెందుతోంది. ఎందుకంటే అది ఆమె పదో ప్రసవం. అప్పటిదాకా బతికి బట్టకట్టినవాళ్లు యిద్దరే ! పదిహేనేళ్ల వయసున్న కొడుకు శ్రీరామచంద్రమూర్తి, పన్నెండేళ్ల వయసున్న కూతురు కల్పకం. తక్కినవాళ్లు కొందరు పురిట్లో పోతే, మరికొందరు కొద్దికాలం జీవించి పోయారు. 

గర్భంలో వున్న బిడ్డ (భవదీయుడు) సంగతి కూడా అనుమానంగానే వుంది. ఇంకా ఏడో నెలే! చూస్తే యిప్పుడో కాస్సేపట్లోనో పుట్టేసేట్టున్నాడు. నెలలు సక్రమంగా నిండి పుట్టినవాళ్ల గతే అలా వుంటే వీడి నుదుటిరాత ఎలా వుంటుందో! అయినా రాత రాయడానికి నుదుటిమీద చర్మమైనా ఏర్పడిందో లేదో!

ఇలా ఆవిడ కంగారు పడుతూంటే మా నాన్నగారు భీమశంకరం గారు మంత్రసాని కోసం కబురు పెట్టి వాకిట్లో కంగారుగా పచార్లు చేస్తున్నారు. మంత్రసాని వచ్చేలోపుగా పురుడు వచ్చేస్తుందేమోనని ఆదుర్దా పడు తున్నారు. అంతకు ముందు తొమ్మిదిసార్లూ అదే జరిగింది. ఈ సారైనా మంత్రసాని రావాలని వేయిదేవుళ్లకు దణ్ణాలు పెట్టుకుంటూ అడావుడి పడుతున్నారు.

ఇక్కడ మీకో సందేహం    రావచ్చు.  సిజేరియన్‌ చేసేలోపునే సహజప్రసవం జరిగితే నర్సింగ్‌ హోం వాళ్లు కంగారు పడతారని విని వుంటారు కానీ, యిలా మంత్రసాని రాకకీ సుఖప్రసవానికీ లింకు పెట్టి కంగారుపడడం వింతగా వుండవచ్చు. కానీ ఆయనంతే. అన్నీ లెక్కప్రకారం జరగాలి. సాధారణంగా మంత్రసాని వచ్చాకే ప్రసవం జరుగుతుంది కాబట్టి అలాగే జరగాలి. ఇంకోలా జరిగితే ఆయనకు కోపం, చికాకు, ఆదుర్దా. ఓ సారి కారులో మా అందరినీ  ఎగ్జిబిషన్‌కు తీసుకెళ్లారు. నేను ఐదారేళ్లవాణ్ని. నేను దిగుతూవుండగానే నా చేతిమీదే తలుపు వేసేశారు. కెవ్వుమన్న నన్ను చూసి జాలిపడకపోగా ఏం చేయాలో తెలియక విసుగూ, కోపం తెచ్చేసుకున్నారు. ఆయన లెక్కప్రకారం నా చేయి ఆ సమయంలో అక్కడ వుండకూడదు. కానీ వుంది. దాంతో చికాకు. ఆయన తరహాయే అంత.

మా నాన్నగారిది కోనసీమ. వారి తండ్రి విశ్వనాథం గారు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ స్కూల్స్‌ గా పనిచేసేవారు. మా నాన్నగారి విద్యాభ్యాసం రాజమండ్రి, మద్రాసులలో జరిగింది. ఎం.ఏ. ఎల్‌.ఎల్‌.బి. తర్వాత మద్రాసులో లాయరుగా ప్రాక్టీసు పెట్టారు. 1953లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్రరాష్ట్రం విడిపోయాక హైకోర్టు గుంటూరుకి, దరిమిలా హైదరాబాదుకి మారడంతో దానితో బాటు ఆయన తన మకాం మార్చారు. గుంటూరులో వుండగానే జడ్జి అయ్యారు.

 ఆ తర్వాత సుప్రీం కోర్టులో ప్రాక్టీసు చేద్దామనుకుని 1961 లో ఢిల్లీకి మకాం మార్చారు. కానీ ఢిల్లీ పద్ధతులు ఆయనకు నచ్చలేదు. హైదరాబాదు తిరిగి వచ్చేశారు. ఆయన స్నేహితుడు దామోదరం సంజీవయ్యగారి కోరిక మేరకు వేజ్‌ బోర్డు చైర్మన్‌గా 7 ఏళ్లు చేశారు. 1978 లో గతించారు. 1917 లో మా అమ్మగారిని పెళ్లి చేసుకున్నారు. మా అమ్మ చావలివారి ఆడపడుచు.   సంఘసేవికురాలు. 1997 లో గతించింది.

వాళ్ల తొలి సంతానమైన మా అన్నయ్య శ్రీరామచంద్రమూర్తి కెమికల్‌ ఇంజనీరింగ్‌ చేశారు.  పేపరు తయారీలో గణించిదగిన నిపుణుల్లో ఒకరు. భారతదేశంలో వున్న యించుమించు అన్ని పేపరు మిల్సులోను పనిచేశారు. 1955లో దొడ్డమ్మ మనవరాలు మహలక్ష్మిని పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం హైదరాబాదులో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. ముగ్గురు కొడుకులు.

రెండో సంతానం మా అక్క కల్పకం ఎం.ఏ. చదివింది. భరతనాట్యంలో నిష్ణాతురాలు. మా బావగారు ఏచూరి సోమయాజులు గారు ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌ చదివి, ఎపిఎస్‌ ఆర్టీసిలోను, కేంద్రప్రభుత్వంలోను ఉన్నతోద్యోగాలలో పనిచేశారు. యునైటెడ్‌ నేషన్స్‌ తరఫున విదేశాల్లో పనిచేసి, తర్వాత ఢిల్లీ వచ్చి 1999లో పోయారు. ఇద్దరు కొడుకులు. పెద్దవాడు సీతారాం ఏచూరి సిపిఎం పార్టీ పాలిట్‌ బ్యూరో సభ్యుడిగా జాతీయ రాజకీయాల్లో పేరు తెచ్చుకున్నాడు.

మా అన్నయ్యను కెమికల్‌ ఇంజనీరింగ్‌కు పంపిన మా నాన్నగారు నన్ను ఐయేయస్‌గా చూడాలని అనుకున్నారు. వేరే అవకాశాలు ఎన్ని వచ్చినా వద్దన్నారు. ఐయేయస్‌ పరీక్షలో ఏ యే సబ్జక్టులు తీసుకోవాలో కూడా ఆయనే నిర్ణయించారు. లోవర్‌ లెవెల్‌లో పొలిటికల్‌ సైన్సు, హైయ్యర్‌ లెవెల్‌లో పొలిటికల్‌ థాట్‌ ఆయనే నేర్పించారు. జనరల్‌ నాలెడ్జ్‌ అంతా నేర్పించారు. వచ్చిన ఇంగ్లీషంతా ఆయన ద్వారానే వచ్చింది.  

అంతా అయి నేను బాగా ప్రిపేర్‌ అవుతున్నాను అనుకుంటున్న సమయంలో ఆయనకి హార్ట్‌ ఎటాక్‌ వచ్చింది. ఇక చూడండి, ఎంత బెంగపడి పోయారో! ఎటాక్‌ వచ్చినపుడు నేనెక్కడో వున్నాను. వార్త తెలిసి ఇంటికి వచ్చాను. 'నాన్నా' అని వెళ్లి పలకరించబోతే ఆయన కళ్ల వెంట నీళ్లు వచ్చాయి. ప్రాణభీతితో కాదు, నా ఐయేయస్‌ గతి ఏమవుతుందోనని డీలా పడిపోయారు. 'ఇక నేను నీకు పాఠాలు చెప్పలేనురా అబ్బాయ్‌' అన్నారు. 

నన్ను ఐయేయస్‌గా చూడాలనుకున్నారు. ఈ ఎటాక్‌ కారణంగా అది సాధ్యపడదేమోనన్న దిగులు వచ్చేసింది ఆయనకు. నిజానికి నాకు ఐయేయస్‌పై ప్రత్యేకమైన మమకారం లేదు. మాథ్స్‌లో రిసెర్చి దగ్గర్నుంచి అనేకరకాలైన ఆప్షన్స్‌ వున్నాయి నా ఎదుట. కానీ నాన్నగారు చెప్పారు కదాని ఐయేయస్‌ ప్రిపరేషన్‌కు సరేనన్నా. కానీ ఆ లక్ష్యం ఆయనకు ప్రాణం కంటె ఎక్కువ అని నాకు అర్థమయ్యేసరికి ఏడుపు వచ్చింది. అప్పటికి యిరవై వొక్క ఏళ్ల వయసున్నా మా అమ్మ భుజంమీద పడి భోరున ఏడ్చాను. అప్పుడే నిశ్చయించుకున్నా – నాన్నగారి కోసమైనా బాగా చదవాలని. 

చెప్పవచ్చేదేమిటంటే తను అనుకున్నది అనుకున్నప్రకారం కాకపోతే నాన్నగారు చాలా చికాకు పడిపోయేవారు. 

కానీ మా నాన్నగారు ఎంత కంగారు పడినా లాభం లేకపోయింది. మంత్రసాని రాకుండానే నేను పుట్టేశాను. అదీ ఏడోనెలలో. మా అమ్మ భయపడ్డట్టే శరీరంమీద చర్మం కూడా ఏర్పడలేదు. మెదడుకూడా ఎక్స్‌పోజ్‌ అయివుండేదట. అప్పట్లో ఇన్‌క్యుబేటర్‌లు లేవు కదా. బయటకు తీశాక కూడా శరీరాన్ని దూదిలో పెట్టి వుంచేవారు. మాటిమాటికి ఒళ్ళంతా నీలంగా అయిపోయేదట. అప్పట్లో మా ఆఖరి మేనమామ మద్రాసు గవర్నమెంటు ఆసుపత్రిలో ఎంబీబీయస్‌ పూర్తి చేసి హౌస్‌సర్జన్సీ చేస్తూండేవాడు. 

జూలియర్‌ సీజర్‌ కూడా ఏడోనెలలోనే పుట్టాడట. మరి సీజర్‌కు మేనమామ వున్నాడో లేదో నాకు తెలియదు కానీ నా విషయంలో మాత్రం మా మామయ్యా, మా అమ్మా కలిసి నన్ను మరణానికి యివతలి గట్టునపడేసి బట్టకట్టించారు. మొత్తానికి మూడునెల్లదాకా జాగ్రత్తగా చూసుకునేటప్పటికి 'ఆ వీడు బతికేశాడురా' అనుకునే స్టేజి వచ్చి ఒక మామూలు పిల్లవాడిలా తయారయ్యానట. నార్మల్‌ అయ్యేదాకా నాకు కాస్త కాస్త బ్రాందీ, గాడిదపాలు పట్టేవారు. నారు పోసినవాడు నీరు పోయకపోతాడా? అని సామెత. నాకు పుట్టగానే బ్రాందీ పోశాడు. పోయడం అంటే గరాటా పెట్టి పోశారనుకోవద్దు. నాలిక్కి తాకించేవారు. అంతకంటె నోరు తెరుచుకునేది కాదు.

నా పేరు గురించి మొదటే చెప్పాను కదా. పెద్దాయన కదాని గాంధీగారి పేరు పెట్టారు కానీ, నిజానికి నాకు ప్రాణంపోసి బతికించిన మేనమామ పేరు పెట్టాలని మీ కనిపిస్తోందా? తమాషా చెప్పనా? ఆయన్ని అందరూ గాంధీ డాక్టరు గారనే అంటారు. అసలు పేరు పార్వతీశ్వర సోమయాజులు అని వున్నా…! తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రపురంలో హస్తవాసిగల డాక్టరుగా ఖ్యాతి గడించాడు. పేరు దేముంది కానీ, పేదవాళ్ల డాక్టరుగా పేరు బడ్డ మావయ్య తను చేసిన వైద్యానికి నా దగ్గర భారీ ఫీజే పుచ్చుకున్నాడు. నన్ను అల్లుడిగా క్లెయిమ్‌ చేశాడు. వాళ్ల పెద్దమ్మాయి ఉషనే నేను చేసుకున్నది! పసిపిల్లవాడిగా నా అర్భకత్వం చూసివున్నారు కదా. ఇంతకంటె అర్భకుడు యింకెవరూ దొరుకుతాడని అనుకుని వుంటాడు !

చిన్నప్పుడు పట్టించిన గాడిదపాల మహాత్మ్యమో ఏమో నేను గాడిద చాకిరీ చేసే సివిల్‌ సర్వీసెస్‌కు వెళ్లాను.. ఆ కథలేగా చెప్తున్నది!  

xxxxxxx

కొసమెరుపు – కాకినాడలో మా మాతామహుడు చావలి రామసోమయాజులుగారు పేరుమోసిన కాంగ్రెసువాది. ఆయన పేరుమీద వీధికూడా వుందక్కడ. మద్రాసు లెజిస్ల్రేటివ్‌ కౌన్సిల్‌లో మెంబర్‌. కాకినాడ మున్సిపాలిటికి పదహారేళ్లు నిర్విఘ్నంగా చైౖర్మన్‌గా చేసారు. ఆయనకు గుఱ్ఱపు బండి వుండేదట. అది సాయంకాలం ఇంటికెళ్ళే టైం అయిపోతే ఎవరు చెప్పక్కరలేకుండానే వెనక్కితిరిగి దానంతట అదే వచ్చేసేదట. తర్వాత గవర్నమెంటు సర్వీసులో చేరాక అటువంటి జీవాలను చాలా చూశాను. ఆఫీసుకి వచ్చే టైం మాట ఎలా వున్నా, వెళ్లే టైము కాగానే ఠంచన్‌గా వెళ్లిపోయేవారు. మొహం కడిగేసుకోవడం, బ్యాగ్‌ సర్దేసుకోవడం అన్నీ సాయంత్రం 5 గంటల లోపునే! అప్పుడు తెలిసింది – ఆ గుఱ్ఱం గత జన్మలో ప్రభుత్వోద్యోగి అయి వుంటుందని!

మీ సూచనలు [email protected] కి ఈమెయిల్‌ చేయండి.

excerpted from the forthcoming book Mohana Makarandam
print version distributed by Navodaya, e-version by kinige.com
please click here for audio version

Click here for Audio