పవన్ పార్టీ ఖాయం అవుతున్న కొద్దీ.. రాజకీయ నేతల సంగతేమో గానీ, చిరు కుటుంబంలోనే గుబులు మొదలవుతోంది. రేపటి నుంచి తమ పరిస్థితి ఏమిటన్నది వారికే అర్థం కావడం లేదు. ముఖ్యంగా చరణ్, బన్నీల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యే. నాది నాన్న పార్టీనే.. కాకపోతే వ్యక్తిగతంగా బాబాయ్‌కి సపోర్ట్ చేస్తా – అంటూ అర్థం కాని స్టేట్‌మెంట్ ఇచ్చాడు చరణ్.
వాళ్లెంత కన్‌ఫ్యూజ్ అవుతున్నారో.. ఈ స్టేట్‌మెంట్ వింటే సరిపోతుంది. చిరు ప్రజారాజ్యం స్థాపించినప్పుడు.. అందులో పవన్ కూడా కీలక సభ్యుడు. చరణ్, బన్నీలు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. కానీ ఇప్పుడు పవన్ ఒంటరి. చిరు ఇంటి నుంచి ఎవరి మద్దతు ఉంటుందో ఇంకా స్పష్టంగా తేలలేదు. రేపటి నుంచి బన్నీ, చరణ్‌ల నోటి నుంచి పవన్ కల్యాణ్ మాట రావడం కూడా గగనమే కావచ్చు.
ఇప్పుడిప్పుడే ఎదగాలనుకొంటున్న సాయిధరమ్‌తేజ్, వరుణ్ తేజ్‌ల పరిస్థితీ ఇంతే. విడమమంటే పాముకి కోపం, కరవమంటే కప్పకు కోపం అన్న చందాన తయారవుతుంది. వీళ్లకే కాదు.. ఇండస్ట్రీలో హీరోల పరిస్థితి కూడా అంతే. కొంతమంది మెగా ఫ్యామిలీకి వీర విధేయులు ఉన్నారు. వాళ్లంతా ఎవరిని వకాల్తాపుచ్చుకొంటారో తెలియని పరిస్థితి. పవన్ కూడా ఎవరినీ ఇబ్బంది పెట్టదలచుకోలేదట. నాతో ఉండేవాళ్ల ఉండండి.. లేదంటే లేదు. ఎవరి ఇష్టం వాళ్లది.. అని అందరికీ ముందే చెప్పేశాడట. కానీ.. అందరిలో ఒకటే సంశయం. అటు అన్నయ్య – ఇటు తమ్ముడు! ఎటువైపు వెళ్తారో ఏంటో..?