సమైక్యవాదం గురించి కిరణ్ పోరాడుతూంటే అదంతా సోనియా గాంధీ చెప్పినట్టు ఆడడమే అని చాలామంది ఆరోపించారు. రాజకీయాలలో చెప్పేదొకటీ, చేసేదొకటీ కావడంతో దేన్నయినా నమ్మే పరిస్థితి వచ్చింది. ఈ ఆరోపణ నిజమనీ, లేకపోతే కిరణ్‌ను పీకేయకుండా ఎందుకు వూరుకున్నారనీ కొందరు వాదించసాగారు. కిరణ్ దిగిపోయిన తర్వాత వేరెవరినీ ఎందుకు నియమించలేకపోయారో అర్థం చేసుకుంటే ఆ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఎన్నికలకు ముందు అధికారం చేతిలో వుండాలని ప్రతీ పార్టీ తపిస్తుంది. అయినా కాంగ్రెసు ఆ అవకాశాన్ని వదులుకుందంటే కారణం – సిఎం పదవికి ఎంతోమంది పోటీ పడడమే. పదవి దక్కని వారందరూ టిడిపికో, తెరాసకో వెళ్లిపోతారన్న భయంతోనే కాబోలు కాంగ్రెసు రాష్ట్రపతి పాలన విధించింది. లేకపోతే రెణ్నెళ్లలో ఎన్నికలు పెట్టుకుని అసెంబ్లీని సుప్తచేతనావస్థలో వుంచడమేమిటి !? అంటే కథ మరీ అడ్డం తిరిగితే ఎవరినైనా పోగేసి మళ్లీ గద్దె నెక్కుదామనా?
సోనియా ప్లాన్ ప్రకారమే కిరణ్ నడుచుకున్నారు అని వాదించేవారు చెప్పేదేమిటంటే – విభజన చేయాలని నిశ్చయించిన సోనియా సీమాంధ్రలో తనకు వ్యతిరేకత వస్తుందని ముందుగానే వూహించారు. ఆ వ్యతిరేకత టిడిపికి అనుకూలమవుతుందని గ్రహించి, తనే కిరణ్ చేత ఒక పార్టీ పెట్టించడానికి పూనుకున్నారు. తనకు వ్యతిరేకంగా ప్రజలతో గొంతు కలుపుతూ, కాంగ్రెసు నాయకులందరూ ఆ పార్టీలో చేరతారు. సోనియాయే వాళ్లను ఆ పార్టీలో చేరడానికి ప్రోత్సహిస్తారు. ఇది సోనియా వ్యతిరేక పార్టీ అనుకుని భ్రమపడిన ప్రజలు, టిడిపికి ఓటేయడం మానేసి వీళ్లకే వేస్తారు. ఎన్నికల తర్వాత కిరణ్ పార్టీని కాంగ్రెసులో విలీనం చేసేసుకుని తన బలం ఎటూ పోకుండా చూసుకోవచ్చు. ఆ విధంగా కిరణ్‌ను తాత్కాలిక ప్రత్యర్థిగా చూపిస్తూ ప్రజలను ఏమార్చవచ్చు. ఈ ప్లానులో భాగంగానే కిరణ్ విభజనకు అడ్డు తగులుతున్నట్టు నటిస్తూనే, విభజనకు సహకరించారు. సోనియాకు ఎంత వ్యతిరేకత చూపితే తను పెట్టబోయే పార్టీకి అంత లాభంకదా, అందుకే అలా వ్యవహరించారు.
ఈ వాదన నిజం కావచ్చు, కాకపోవచ్చు అనుకుంటూనే యిప్పటి పరిస్థితి సమీక్షిద్దాం. ఇవాళ కిరణ్ పార్టీలో చేరేందుకు సోనియా కాంగ్రెసువారిని పంపిస్తూన్నారని అనగలమా? చాలామంది కాంగ్రెసు నాయకులు కాంగ్రెసులోనే వున్నారు. కొందరు టిడిపిలో చేరారు. పురంధరేశ్వరి, భర్త బిజెపి అంటున్నారు. కిరణ్‌ను రాజీనామా చెయ్యమని, పార్టీ పెట్టమని ప్రోత్సహించిన నాయకులందరూ టిడిపిలోకి వెళ్లిపోయారు. వాళ్ల తరహాపై సందేహంతోనే కాబోలు కిరణ్ అంతకాలం తటపటాయించారు. ఎటు పోవలసినవాళ్లు అటుపోయాక తన వెనక్కాల అరడజను మంది మిగిలినా చాలనుకుని ఆగినట్టు తోస్తోంది. ఇప్పుడు కిరణ్‌పై నిప్పులు కురిపిస్తున్న వారెవరు? సోనియా విధేయులైన కాంగ్రెసు వారేగా! ఉదాహరణకి మెగాస్టార్‌ను తీసుకోండి. బిల్లు లోకసభలో పాస్ కాగానే విభజన పాపం మొత్తాన్ని కిరణ్‌పై నెట్టడానికి ప్రయత్నించారు. 'సమైక్యంగా వుంచుతానని కిరణ్ హామీ యివ్వడంతో అది నమ్మేసి మేం కాళ్లు బారజాపి కూర్చున్నాం. అందుకే విభజన జరిగిపోయింది.' అని ఒక స్టేటుమెంటు యిచ్చారు. ఆ తర్వాత రాజ్యసభలో చేసిన (చదివిన) తొలి ప్రసంగంలో 'మా పార్టీ హై కమాండ్ విభజన నిర్ణయం ముఖ్యమంత్రికి తప్ప వేరెవరికీ చెప్పలేదు' అన్నారు. సీమాంధ్ర కాంగ్రెసు మంత్రులకు ముందుగా చెప్పారని, ప్రజల్లో వ్యతిరేకత కానరానందున వారందరూ మిన్నకున్నారనీ యిప్పుడు అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఇప్పుడు చిరంజీవి ఆ పాపాన్ని కిరణ్‌పై నెట్టేద్దామని చూశారు. అదంతా ఆయన ప్రజ్ఞ అనుకోనక్కరలేదు. ఆయనకు ప్రసంగం రాసిచ్చిన జైరాం రమేశ్‌దో, మరొకరిదో కావచ్చు.
సమైక్యంగా వుంటుందని చివరిదాకా కిరణ్ తమను నమ్మించారని అంటున్న చిరంజీవి ఆ ప్రసంగంలో కూడా హైదరాబాదుకు యుటీ స్టేటస్ కోసం ఎందుకు డిమాండ్ చేశారో చెప్పలేకపోయారు. సమైక్యంగా వుండగానే యుటీ వస్తుందని అనుకున్నారా? లేకపోతే వి హనుమంతరావు వెక్కిరించినట్లు ఆయన యూటీకి, ఊటీకి కన్‌ఫ్యూజ్ అయ్యారేమో తెలియదు. హై కమాండ్ నిర్ణయాన్ని ధిక్కరిస్తూ చిరంజీవి రాజ్యసభలో చేసిన ప్రసంగం తమను బాధించిందని జైరాం రమేశ్ అన్నారు. చిరంజీవి పొరబాటు చేసి వుంటే, చర్య తీసుకోవచ్చుగా! ఈ రోజు కిరణ్‌ను ఢిల్లీ నాయకులందరూ ముక్తకంఠంతో తిడుతున్నారు కదా, చిరంజీవిని ఒక్కమాట ఎందుకనరు? ఎందుకంటే, వాళ్లు చెప్పినట్లే నడుచుకున్నది చిరంజీవి తప్ప కిరణ్ కాదు కాబట్టి! ఆ సేవకు ప్రతిఫలంగా ముఖ్యమంత్రి పదవి దక్కుతుందని చిరంజీవి ఆశపడి వుండవచ్చు, తప్పు లేదు. రాజకీయాల్లో వచ్చింది – ఏదో అలాటి పదవి కోసం తప్ప, ప్రచారానికి వెళ్లి రావడానికి కాదు కదా! 'అధిష్టానం ఏ బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యత తీసుకుంటాను' అనడం పడికట్టు మాట. వాళ్లు ఆ మాట లిటరల్‌గా తీసుకుని ముఖ్యమంత్రి పదవి కాదు కదా, పిసిసి అధ్యకక్షుడి పదవి కూడా యివ్వకుండా 'తెలుగువాళ్లు ఏయే రాష్ట్రాలలో వున్నారో వెతికిపట్టుకుని అక్కడికంతా వెళ్లి ఎన్నికలలో ప్రచారం చేయి' అని చెప్పారు. ఈ ముచ్చట గతంలో జరిగింది. వెళ్లిన ప్రతీచోటా కాంగ్రెసు అభ్యర్థులు ఓడిపోయారు. అప్పణ్నుంచి యిప్పటికి యుపిఏ ప్రతిష్ట మరింత దిగజారింది. పైగా మోదీ అనే రూపంలో ప్రత్యామ్నాయం వూరిస్తోంది. ఈయనకు త్రిప్పటే తప్ప, కాంగ్రెసుకు ఓట్లు రాలతాయో లేదో తెలియదు. రాలకపోతే నీ ప్రభావం ఉత్తుత్తిదే అనేస్తారేమో తెలియదు.
ముఖ్యమంత్రి పదవికి పోటీ పడినది – చిరంజీవి ఒకరే కాదు, బొత్స, కన్నా, ఆనం పేర్లు బయటకు వచ్చాయి. లోపాయికారీగా ఎందరు పైరవీలు చేసుకున్నారో తెలియదు. వీరందరూ కిరణ్ పక్షాన చేరలేదు కదా. చేరే ఛాన్సు లేదు కదా. బొత్స కిరణ్ స్ట్రాటజీపై విసుర్లతో సరిపెడితే, డొక్కా వగైరాలు అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. వీరందరినీ కిరణ్ వెంట పంపడానికి సోనియా ప్లాను వేశారంటే నమ్మగలమా? 'కిరణ్ పదివేల కోట్ల అవినీతికి పాల్పడివుంటే అదే కాబినెట్‌లో వున్న డొక్కా ఏం చేస్తూ వున్నారట? కిరణ్ కాంగ్రెసుపార్టీలో వుండి సోనియా చెప్పినదానికి తందానతాన అని వుంటే యీ ఆరోపణ వచ్చేదా?' అని మనం అడగకూడదు. రాజకీయాల్లో యిలాటివి ఎన్నో చూశాం. రేపు కిరణ్ పార్టీలోకి వెళ్లినవాళ్లు డొక్కాపై యిలాటి ఆరోపణలే చేయవచ్చు కూడా. ఈ రాజకీయ నాయకులను వదిలేయండి, గవర్నరుగారు చేస్తున్నదేమిటి? కిరణ్ పాలనలో ఏదో గోల్‌మాల్ జరిగిందని నిరూపించడానికి ప్రయత్నిస్తున్నారా లేదా? ఆఖరి రెండు నెలల ఫైళ్లు మాత్రమే తెప్పించడం దేనికి? అసెంబ్లీలో టి-బిల్లును ఓడించిన తర్వాత మాత్రమే కిరణ్ నీతి తప్పారా? ఆయన మూడేళ్ల పాలనలో సంతకం పెట్టిన ఫైళ్లన్నీ తిరగేయాలిగా! ఆయన ఒక్కడే ఫైళ్లన్నీ సంతకం పెట్టడుగా, ఆయన కాబినెట్‌లో మంత్రులూ పెట్టి వుంటారుగా, వాళ్లవీ విచారించాలిగా, లేక వాళ్లు కాంగ్రెసులో కొనసాగుతున్నారు కాబట్టి వాళ్లకు యిమ్యూనిటీ వుందా? కొందరు ఐయేయస్ ఆఫీసర్లను బదిలీ చేసి కిరణ్ ఏదో అఘాయిత్యానికి పాల్పడినట్లు బిల్డప్ యివ్వడమే ప్రస్తుతం గవర్నరు చేసిన పని. ఇంకో మూడు నెలల్లో కొత్త ప్రభుత్వం రాబోతోంది. ఈ లోపున ఆ అధికారులు కొత్త పోస్టుల్లో ఏపాటి అవినీతికి పాల్పడతారని యీయన భయం? పైగా తన పాలనలో!? ఐయేయస్‌లకు తరచుగా బదిలీలు జరుగుతూనే వుంటాయి. కొన్ని బదిలీలను రివర్స్ చేసినంత మాత్రాన కొంపేం మునగదు. చేయనంత మాత్రానా మునగదు. ఇక్కడ ఆయన ఉద్దేశం ఒక్కటే – 'కిరణ్ ఏదో తప్పుడు పని చేశారు' అనే సంకేతాన్ని ప్రజల్లోకి బలంగా పంపాలి. గవర్నరు కేంద్రప్రభుత్వపు తాబేదారన్న సంగతి అందరికీ తెలుసు. సోనియా ఆధ్వర్యంలోని యిదంతా జరుగుతోందని సులభంగా గ్రహించవచ్చు. కిరణ్ తన తరఫున ఏజంటుగా పని చేసుంటే సోనియా యిలాటి కలరింగ్ యిప్పిస్తుందా?
ఇది చూశాకైనా కిరణ్ సోనియా చెప్పినట్లు ఆడిన కీలుబొమ్మ కాదని అనిపిస్తుంది. మరి కిరణ్ ఏ ధైర్యంతో పార్టీ పెడుతున్నట్లు? దానికి సమాధానం ఆయనే చెప్పాలి. డియల్ విరాళం యిస్తానన్న పదిలక్షల విరాళం కోసమైతే నమ్మకూడదు. గతంలో ఆయన జగన్‌పై పోటీ చేసినప్పుడు పెద్ద పందెం కాసి ఓడిపోయాడు కానీ డబ్బు యివ్వలేదు. ప్రెస్‌మీట్లు పెట్టడమే తప్ప పార్టీ పెట్టడం రాదని వెక్కిరించిన డొక్కా మాటలతో ఉడుక్కునా? రేపు ఎన్నికల తర్వాత ఏ డొంకలో వుంటారో తెలియని డొక్కా మాటలకు అంత విలువ యివ్వడమూ పొరబాటే. లేటు చేయడం వలన నాయకులందరూ ఎక్కడికక్కడ సర్దేసుకుని, యీయన పార్టీలో చేరడానికి ఎవరూ మిగల్లేదంటున్నారు. లేటు చేయకపోయినా వాళ్లు చేరేవారు కారనుకోవచ్చు. కిరణ్ కిందనుండి ఎదిగిన లీడరు కాదు, ఢిల్లీ వాళ్లు పంపగా సిఎం అయినవాడు. ఎవరితోనూ పెద్దగా కలవకుండా పనిచేసుకుంటూ పోయిన రకం. తన జిల్లా ఎమ్మెల్యేలు కూడా తన వెంట లేరని ఆయనకు తెలుసు. ఇప్పుడు పార్టీ పెట్టినా యీ ఎన్నికలలోనే అద్భుతఫలితాలు ఆశించడానికి లేదు. జగన్, టిడిపి, ఎంతోకొంత మేరకు కాంగ్రెసు పట్టుకుపోగా యీయనకు మిగిలేది అతితక్కువే. ఇలాటి పరిస్థితుల్లో పార్టీ పెట్టడంలో వివేకం వుందా?
దూరదృష్టితో ఆలోచిస్తే… వుంది. ఎందుకంటే – ప్రస్తుతం సీమాంధ్రప్రజలు కాంగ్రెసు, బిజెపిల పట్ల సమాన ఆగ్రహంతో వున్నారు. జగన్ సోనియాకు సహకరించారని, అందుకనే తెరాస, వైకాపా పరస్పరం నిందించుకోవడం లేదన్న అనుమానమూ వుంది. జగన్ అంటే పడి చచ్చేవాళ్లు వున్నట్లే, చచ్చినా పడనివాళ్లూ వున్నారు. కొత్త రాష్ట్ర నిర్మాణనైపుణ్యం అనే యుఎస్‌పితో టిడిపికి కొంత లాభం వున్నమాట వాస్తవమే అయినా విభజనలో వాళ్ల పాత్రకూడా విస్మరించరానిది. మొదట్లో లేఖ యివ్వడం మాట సరే, రాజ్యసభలో బిజెపి సవరణలపై ఓటింగు జరిగి వుంటే, ఫైనల్‌గా టి-బిల్లు పాసయి వుండేది కాదు. ఆ ఓటింగు జరపకుండా చేసినది – కురియన్. వెంకయ్యనాయుడు ఓటింగుకై పట్టుబట్టినపుడు 'ఇదిగో వెల్‌లో వీళ్లు యిలా నిలబడివుండగా నేను చేయను' అని మొండికేశాడాయన. వెల్‌లో నిలబడినది ఎవరు? అధిష్టానంకు అత్యంత విధేయుడు, మొన్నే రాజ్యసభకు ఎంపికైన కెవిపి. ఆయన శిలావిగ్రహంలా బ్యానర్ పట్టుకుని నిలబడి ఏం సాధించాడో ఆయనే చెప్పాలి. అది కూడా కాంగ్రెసు ఆటలో భాగమని సులభంగానే గ్రహించవచ్చు. ఇక తృణమూల్ కాంగ్రెసు ఎంపీలు. వాళ్లు గోల చేసి సీమాంధ్రకు ఏం సాధించి పెట్టారో వాళ్లే చెప్పాలి. ఇక మిగిలినది – యిద్దరు టిడిపి రాజ్యసభ సభ్యులు – సిఎం రమేశ్, సుజనా చౌదరి. కురియన్ అలా అన్నతర్వాత వాళ్లిద్దరూ వెల్‌లోంచి కదిలి, తృణమూల్ వాళ్లకు నచ్చచెప్పి వుంటే రాజ్యసభ నుండి బిల్లు మళ్లీ లోకసభకు వెళ్లే అగత్యం పడేది. ఆ పరిస్థితి రాకుండా కాంగ్రెసు, బిజెపిలకు సహకరించినది – టిడిపి! అంతేకాదు, లోకసభలో టిడిపి ఎంపీ మోదుగులను కొట్టినవారిలో తెలంగాణ టిడిపి ఎంపీలు కూడా వున్నారు. ఇలాటి టిడిపిపై సీమాంధ్రులకు కోపం లేకుండా వుంటుందంటే నమ్మడం కష్టం. ఎన్నికల ప్రకటన వచ్చేసింది కాబట్టి పోలవరం ఆర్డినెన్సు, ప్రత్యేక ప్రతిపత్తి ఆర్డినెన్సు – అన్నీ ఆగిపోయాయి. సీమాంధ్రకు మిగిలినది – అన్నీ ఉత్తుత్తి హామీలే. ఈ పరిస్థితికి కారణభూతుల్లో టిడిపికి కాంగ్రెసు, బిజెపిలతో సమానస్థానం దక్కుతుంది.
ఇలాటి పరిస్థితుల్లో కసితో రగిలే సీమాంధ్ర ఓటర్లకు వున్న ఆప్షన్ – వైకాపా ! కానీ స్వతహాగా జగన్ అంటే పడనివాళ్లు, జగన్ సోనియా చెప్పినట్టు చేశాడని అనుమానం వున్నవాళ్లు ఎవరికి ఓటేయగలరు? ఈ శూన్యతను పూరించడానికి కిరణ్ పార్టీ ప్రయత్నించవచ్చు. పెడితే గిడితే పవన్ పార్టీ కూడా! ఈ పార్టీలకు తెలంగాణలో కూడా ఎన్నో కొన్ని ఓట్లు పడవచ్చు. విభజన జరిగిపోయాక సమైక్యనినాదం ఎందుకు పనికి వస్తుంది? కార్మికరాజ్యం ఏర్పడదని తెలిసినా, కమ్యూనిస్టులకు ఎందుకు ఓట్లు పడుతున్నాయి? సిద్ధాంతరీత్యా కిరణ్‌తో ఏకీభవించేవారు – ముఖ్యంగా సమైక్యవాదంతో మమేకమైన యువత, ఉద్యోగులు – దన్నుగా నిలవవచ్చు. ఈ దఫా ఎన్నికలలో కాకపోయినా, వచ్చేసారి దాకా నిలబడగలిగితే భవిష్యత్తులో బలపడవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం సమైక్యవాదులను జాతీయపార్టీలే కాదు, ప్రాంతీయపార్టీలూ మోసం చేశాయి. 1982 ఎన్టీయార్ రాజకీయాల్లోకి వచ్చినపుడు యిలాటి శూన్యతే వుండింది. ఎన్టీయార్‌కు గ్లామర్ వుంది కాబట్టి మొదటిసారి ఎన్నికలలోనే ఘనవిజయం సాధించారు. అలాటి గ్లామర్ కిరణ్‌కే కాదు, ఎవరికీ లేదు. కిరణ్ యిటుక యిటుకా పేర్చుకుంటూ వస్తేనే పార్టీ తయారవుతుంది. ఇప్పుడు అతని వెనుక ఎమ్మెల్యేలు లేకపోవడం ఒక విధంగా మంచిది. ఎందుకంటే వాళ్లు సంజాయిషీ చెప్పుకునే అగత్యం చాలా వుంది. ఎన్టీయార్ పార్టీ పెట్టినపుడూ యిదే జరిగింది. మొదట్లో వచ్చిన యిద్దరూ ఎమ్మెల్యేలు వెనక్కి వెళ్లిపోయారు. అందువలననే చదువుకున్నవారికీ, కొత్తవారికీ, యువతీయువకులకు ఛాన్సు యివ్వగలిగాడాయన. అలాటి అవకాశం యిప్పుడు కిరణ్‌కు వస్తోంది. చూదాం, ఎంతవరకు వినియోగించుకుంటారో!
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2014)