సినిమా రివ్యూ: బస్తీ

రివ్యూ: బస్తీ రేటింగ్‌: 1/5 బ్యానర్‌: వజ్మన్‌ ప్రొడక్షన్స్‌ తారాగణం: శ్రేయాన్‌, ప్రగతి, అభిమన్యుసింగ్‌, ముఖేష్‌ రుషి, కోట శ్రీనివాసరావు, స్నిగ్ధ, సత్య తదితరులు మాటలు: వడ్డాలపు ప్రభాకర్‌ సంగీతం: ప్రవీణ్‌ ఇమ్మడి కూర్పు:…

రివ్యూ: బస్తీ
రేటింగ్‌: 1/5

బ్యానర్‌: వజ్మన్‌ ప్రొడక్షన్స్‌
తారాగణం: శ్రేయాన్‌, ప్రగతి, అభిమన్యుసింగ్‌, ముఖేష్‌ రుషి, కోట శ్రీనివాసరావు, స్నిగ్ధ, సత్య తదితరులు
మాటలు: వడ్డాలపు ప్రభాకర్‌
సంగీతం: ప్రవీణ్‌ ఇమ్మడి
కూర్పు: గౌతంరాజు
ఛాయాగ్రహణం: వి.కె. గుణశేఖర్‌
నిర్మాణం: వజ్మన్‌ ప్రొడక్షన్స్‌
కథ, కథనం, దర్శకత్వం: వాసు మంతెన
విడుదల తేదీ: జులై 3, 2015

జయసుధ తనయుడు ఎలా వున్నాడు, ఎలా చేశాడు అనేవి తప్పిస్తే ‘బస్తీ’ చూడ్డానికి మరే రీజన్‌ లేదు. ఇంకా చెప్పాలంటే ఈవారం వెలుగు చూసిన సినిమాల్లో ముందుగా చూసేందుకు ఇంతకుమించి ఆప్షన్‌ కనిపించలేదు. వాసు మంతెన ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ ప్రాసెస్‌లో ఆయన తన కథని నమ్మి వేరే నిర్మాత డబ్బులు పెట్టాల్సిన అవసరాన్ని ఎలిమినేట్‌ చేశారు. సెకండ్‌ ఒపీనియన్‌ కోసమైనా నిర్మాత కోసం ప్రయత్నించి ఉండాల్సింది. క్రియేటివ్‌ ఫీల్డ్‌లో సెల్ఫ్‌ రియలైజేషన్‌ కష్టం కాబట్టి తన కథకి సినిమాగా తెరకెక్కే సత్తా ఉందో లేదో పరీక్షించుకోవాల్సింది. ఇటీవల వచ్చిన సినిమాల్లో దీనికంటే బ్యాడ్‌ మూవీస్‌ ఒక పది ఉన్నాయంటే మాత్రం ఇక ఈ జాబ్‌కి గుడ్‌బై చెప్పవచ్చు. బస్తీ చిత్రం గురించి చెబుతూ ఇదో అందమైన ప్రేమకథ అంటూ దర్శకుడు చెప్పుకొచ్చారు. ఇలాంటి ప్రేమకథని సినిమాలో చూడ్డం అటుంచి, మన స్నేహితుల్లో ఎవరికైనా ఉంటే వాళ్లిద్దరూ విడిపోవాలని మనసారా కోరుకుంటాం. 

ప్రేమించడమంటే ఏంటో తెలియని వారు కూడా ‘ఇలాక్కూడా ప్రేమించుకుంటారా?’ అని క్వశ్చన్‌ చేసేలా ఉన్న ఈ ప్రేమకథ మొత్తంలో సెన్సిబులిటీస్‌ అటుంచి సెన్స్‌ ఉందనిపిస్తే అద్భుతమే! ఒక సిటీలో రెండు గ్రూపులుంటాయి. ఒక గ్రూపుకి చెందిన అమ్మిరాజు (ముఖేష్‌) గొడవలు మానేసి వ్యాపారం చూసుకుంటూ ఉంటాడు. మరో గ్రూపుకి లీడర్‌ అయిన భిక్షపతి (కోట) కూడా సాదు జీవితం గడుపుతుంటాడు. కానీ భిక్షపతి కొడుకు భవాని (అభిమన్యు) ఓ యువతిపై అత్యాచారం చేసి చంపేస్తాడు. తన వర్గానికి చెందిన వ్యక్తి కూతురిని భవాని చంపడంతో, అతడి చెల్లెలు స్రవంతిని (ప్రగతి) కిడ్నాప్‌ చేయిస్తాడు అమ్మిరాజు. అతని తమ్ముడు విజయ్‌ (శ్రేయాన్‌) ఆమెని స్టోర్‌ రూమ్‌లోంచి తెచ్చి తన రూమ్‌లో ఉంచుతాడు. ఆమెకి అన్నం పెట్టి, మర్నాడు ఒక జత బట్టలు కొనిస్తాడు. ఇంకో రోజు రాత్రంతా కబుర్లు చెప్పి, వచ్చీ రాని గిటార్‌ వాయిస్తూ పాట పాడతాడు. కట్‌ చేస్తే స్రవంతి అతడిని పీకల్లోతు ప్రేమించేస్తుంది. విజయ్‌ కూడా ప్రేమించేసి పెళ్లి చేసుకుంటానంటాడు. కిడ్నాప్‌ చేసి తెచ్చిన అమ్మాయినే కోడలిగా చేసుకుంటామంటూ భిక్షపతిని కలుస్తాడు అమ్మిరాజు. భవానీ ఊరుకుంటాడా? భిక్షపతిని, అమ్మిరాజుని కాల్చేస్తాడు. పనిలో పనిగా ఆ ప్రేమ జంట పని కూడా కానిచ్చేస్తే ఇంటర్వెల్‌కే బస్తీకి శుభం కార్డేసుకునేవాళ్లు. అటు నిర్మాతకి సెకండ్‌ హాఫ్‌ ఖర్చులు మిగిలేవి. ఇటు టికెట్‌ కొన్న వారికి ఒక గంట ముందే విముక్తి దొరికేది.

ఇంటర్వెల్‌ వరకు ఇంట్లోనే కానిచ్చేసిన సిన్మా కనీసం ఆ తర్వాత అయినా ఏవైనా ఛేజింగులు వగైరాతో ఆసక్తికరంగా మారుతుందనే ఆశని కూడా ఆవిరి చేస్తూ సదరు ప్రేమజంట ఒక గెస్ట్‌హౌస్‌లాంటి దాంట్లో రెస్ట్‌ తీసుకోడానికి వెళతారు. కేవలం లవ్‌ స్టోరీ మాత్రమే చూపిస్తే ఆ గాఢమైన ప్రేమానుభూతుల వల్ల హార్ట్‌ ఎటాక్‌ వచ్చే ప్రమాదం ఉందని భావించారో ఏమో ఉపశమనం కోసం కామెడీ పెట్టారు. మగరాయడి వేషంలో కనిపించే కామెడీ నటి స్నిగ్ధ తన నట విశ్వరూపంతో ప్రత్యక్ష నరకం చూపించింది. ఈ సంగతి డైరెక్టర్‌కీ, డైలాగ్‌ రైటర్‌కీ కూడా తెలిసినట్టుంది. అందుకే ఆమె నరకం చూపించిందంటూ ఒక డైలాగ్‌ కూడా పెట్టారు. ఆమెకి సత్య జత కలిసినా, ఒక సీన్లో సప్తగిరి వచ్చినా టార్చర్‌లో ఎలాంటి డిస్కౌంట్‌ లేకుండా కేర్‌ తీసుకున్నారు. అలీ చేసిన బ్రహ్మ క్యారెక్టరు, ఆ సీను కూడా కామెడీగానే తీసుకోవాలి. మామూలుగా అయితే.. అలీకి ఇచ్చిన కాల్షీట్‌ డబ్బులు పోతే పోయాయని ఆ సీన్‌ని ఎడిట్‌ చేసేస్తారు. కానీ అలా పనికిరానివి ఎడిట్‌ చేసుకోవాల్సి వస్తే బస్తీలో మిగిలేది ఏమీ ఉండదు కాబట్టి దానిని ఉంచేసారు. 

క్లయిమాక్స్‌ అధాటున వచ్చి పడిపోతుంది. సెకండ్‌ హాఫ్‌లో అభిమన్యుసింగ్‌కి డబ్బులివ్వాల్సిన పని లేకుండా కనిపించకుండా చేసి, చివర్లో అతను ఎక్కువ సేపు ఫైట్‌ చేయలేకుండా ఒక యాక్సిడెంట్‌ సీన్‌ పెట్టేసారు. ‘ప్రేమికులతో పెట్టుకుంటే ఎవరికైనా ఇదే గతి’ అంటూ శ్రేయాన్‌.. అతడిని రాడ్‌తో కొడుతుంటే, తను హెచ్చరిస్తున్నది అభిమన్యుసింగ్‌నో, చూస్తున్న మనల్నో అర్థం కాదు. రెండు గంటల సమయం గడపడం కోసమని అవసరం లేని పాటలు పెట్టారు. ఏదీ బాగోని ఈ సినిమాలో తన మ్యూజిక్‌ మాత్రం ఎందుకు బాగుండాలని అనుకున్నాడో ఏమో సంగీత దర్శకుడు కూడా ‘వాయించి’ వదిలాడు. కాస్తో కూస్తో చెప్పుకోతగ్గ ప్లస్‌ పాయింట్‌ అంటూ ఉంటే హీరోయిన్‌ ప్రగతి మాత్రమే. చూడ్డానికి క్యూట్‌గా ఉంది, నటన కూడా ఫర్వాలేదనిపించింది. సహజనటి తనయుడు శ్రేయాన్‌ సహజంగా కాకపోయినా కనీసం ఆర్టిఫిషియల్‌గా నటించడానికి అయినా ప్రయత్నించాలి. బొత్తిగా ఎక్స్‌ప్రెషన్‌ లేకుండా.. ఈసారికి తన టాలెంట్‌ గురించి చూడకుండా, తన హైటెంతో కొలుచుకోండి అన్నట్టు నిలబడిపోయాడు. 

టైటిల్స్‌ దగ్గర్నుంచి చివరి వరకు సహనాన్ని పరీక్షించే బస్తీలో.. అభిమన్యు సింగ్‌ కాలుస్తున్నప్పుడు వేస్ట్‌ అయిపోతున్న ప్రతి తూటాకి మనం దొరికిపోతే బాగుండని ఫీలవుతాం. ఇది జనాలకి నచ్చుతుందనే నమ్మకంతో ఈ సిన్మా తీసి, విడుదల చేసిన దర్శక`నిర్మాత సెల్ఫ్‌ కాన్ఫిడెన్స్‌ చూసి ఈర్ష్య పడతాం. బాహుబలి వచ్చే ముందు సినిమా లవర్స్‌కి అప్రకటిత హాలిడే ఇవ్వడానికన్నట్టు ఈ వారాన్ని వాడుకున్నారనిపించింది. కానీ ఆ మెసేజ్‌ అర్థం చేసుకునేలోగా బస్తీ సందర్శించడం జరిగిపోయింది. కొత్త సినిమా చూడాలనే కుతూహలాన్ని ఒక రెండ్రోజులు అదుపు చేసుకుంటే ఆ తర్వాత చూద్దామన్నా దీని జాడ దొరక్కపోవచ్చు కనుక అందాకా జాగ్రత్త పడాలి. 

బోటమ్‌ లైన్‌:  బస్తీ, ఎంటర్‌ ఎట్‌ యువర్‌ ఓన్‌ రిస్క్‌!

-గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri