సినిమా రివ్యూ: గీతాంజలి

రివ్యూ: గీతాంజలి రేటింగ్‌: 2.5/5 బ్యానర్‌: ఎంవివి సినిమా తారాగణం: అంజలి, శ్రీనివాసరెడ్డి, బ్రహ్మానందం, రావు రమేష్‌, హర్షవర్ధన్‌ రాణె, రాజేష్‌, శంకర్‌ తదితరులు సంగీతం: ప్రవీణ్‌ లక్కరాజు కూర్పు: ఉపేంద్ర ఛాయాగ్రహణం: సాయి…

రివ్యూ: గీతాంజలి
రేటింగ్‌: 2.5/5

బ్యానర్‌: ఎంవివి సినిమా
తారాగణం: అంజలి, శ్రీనివాసరెడ్డి, బ్రహ్మానందం, రావు రమేష్‌, హర్షవర్ధన్‌ రాణె, రాజేష్‌, శంకర్‌ తదితరులు
సంగీతం: ప్రవీణ్‌ లక్కరాజు
కూర్పు: ఉపేంద్ర
ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్‌
కథనం, మాటలు, సమర్పకుడు: కోన వెంకట్‌
నిర్మాత: ఎంవివి సత్యనారాయణ
కథ, దర్శకత్వం: రాజా కిరణ్‌
విడుదల తేదీ: ఆగస్ట్‌ 9, 2014

అంజలి ప్రధాన పాత్రలో కోన వెంకట్‌ సమర్పణలో రూపొందిన హారర్‌-కామెడీ ‘గీతాంజలి’ విశేషాల్లోకి వెళితే…

కథేంటి?

డైరెక్టర్‌ అయిపోవాలనే ఆశతో హైదరాబాద్‌కి వచ్చిన శ్రీనివాస్‌ (శ్రీనివాసరెడ్డి) తన స్నేహితుడితో కలిసి ఒక ఫ్లాట్‌ అద్దెకి తీసుకుంటాడు. తనకి బస్‌లో పరిచయం అయిన అంజలి (అంజలి) ప్రతి రోజు వచ్చి ఆ ఫ్లాట్‌లో కాసేపు ఉండి వెళుతుంటుంది. శ్రీనివాస్‌తో పాటు తన స్నేహితులు తెచ్చుకున్న ఫుడ్‌ మొత్తం మాయమైపోతూ ఉంటుంది. ఆ ఫ్లాట్‌లో ఏదో దెయ్యం ఉందని వారు కన్విన్స్‌ అయిపోతారు. రోజూ వచ్చిపోతున్న అంజలి మూడు నెలల క్రితమే ఇదే ఫ్లాట్‌లో ఉరి వేసుకుని చనిపోయిందని శ్రీనివాస్‌కి వాచ్‌మ్యాన్‌ చెప్తాడు. అంటే అంజలి దెయ్యమై ఆ ఫ్లాట్‌లో తిరుగుతోందా? ఆమె ఆత్మహత్య వెనుక మిస్టరీ ఏంటి?

కళాకారుల పనితీరు:

హీరోయిన్‌ ప్రధాన చిత్రాల్లో సాధారణంగా అభినయానికి ఎక్కువ అవకాశమున్న పాత్రలు రూపొందిస్తారు. కానీ అంజలి ఇందులో చాలా క్యాజువల్‌ రోల్‌ చేసింది. నటన పరంగా గుర్తుండిపోయే సన్నివేశాలు ఏమీ లేవు… క్లయిమాక్స్‌ సీన్‌తో సహా. శ్రీనివాసరెడ్డికి ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌ దక్కింది. బాగానే చేసాడు. రాజేష్‌, శంకర్‌ కాసేపు నవ్వులు పంచారు. బ్రహ్మానందం పూర్తిగా వేస్ట్‌ అయ్యాడు. రావు రమేష్‌ విలన్‌గా ఆకట్టుకుంటాడు. హర్షవర్ధన్‌ రాణె గురించి చెప్పుకోడానికి ఏమీ లేదు. 

సాంకేతిక వర్గం పనితీరు:

కథాపరంగా ఇందులో చెప్పుకోతగ్గ విశేషాలు ఏమీ లేవు. చాలా సాధారణ కథ. అసలు సస్పెన్స్‌ ఏంటనేది తెలిసాక కథ మరింత తేలిపోయింది. మ్యూజిక్‌ యావరేజ్‌గా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. లో బడ్జెట్‌లో, లిమిటెడ్‌ లొకేషన్స్‌లో తీసినా కానీ క్వాలిటీ ప్రోడక్ట్‌ తెరకెక్కించారు. స్టార్లు లేని సినిమా అని చీప్‌గా చుట్టి పారేయకుండా అవసరం మేరకు నిర్మాతలు ఖర్చు పెట్టారు. ఆరంభ సన్నివేశాలని, ఫ్లాట్‌లోకి శ్రీనివాసరెడ్డి అండ్‌ కో ఎంటర్‌ అయిన తర్వాత సీన్స్‌ని బాగానే తెరకెక్కించిన దర్శకుడు అటుపై అదే ఇంట్రెస్ట్‌ని సస్టెయిన్‌ చేయలేకపోయాడు. హారర్‌ కంటే కామెడీపై ఎక్కువ ఫోకస్‌ పెట్టినా కానీ నవ్వించిన దాని కంటే విసిగించిన కామెడీనే ఎక్కువ. 

హైలైట్స్‌:

  • నటీనటుల అభినయం
  • మొదట్లో వచ్చే కొన్ని కామెడీ సన్నివేశాలు

డ్రాబ్యాక్స్‌:

  • విషయం లేని కథ, కథనాలు
  • బ్రహ్మానందం కామెడీ ట్రాక్‌

విశ్లేషణ:

హారర్‌/కామెడీ జోనర్‌లో లో బడ్జెట్‌లో ఎంత ఎఫెక్టివ్‌గా సినిమా తీయవచ్చో, దాంతో ఎంత పెద్ద విజయాన్ని సాధించవచ్చో కొంత కాలం క్రితమే వచ్చిన ‘ప్రేమకథాచిత్రమ్‌’తో చూసాం. హారర్‌కి కామెడీ టచ్‌ ఇస్తే నవ్వించడం చాలా ఈజీ అయిపోతుంది. అయితే అందుకోసం తెలివిగా సన్నివేశాలు రాసుకోవాలి. అవే సీన్లని తిప్పి తిప్పి తీస్తే కాసేపటి తర్వాత అవి నవ్వించలేవు. ఈ విషయాన్ని ‘గీతాంజలి’లో విస్మరించారు. ఒకటే సీన్‌ని అదే పనిగా అటు తిప్పి, ఇటు తిప్పి తీస్తూ చాలా టైమ్‌ వేస్ట్‌ చేసారు. 

ఇక హారర్‌ సీన్స్‌తో భయపెట్టడానికి కూడా ప్రయత్నం జరగలేదు. ప్రధానంగా దృష్టి మొత్తం నవ్వించడం మీదే పెట్టారు. ఆ కామెడీ ఏమో సినిమా మొదలైన పావుగంటకే బోరు కొట్టేస్తుంది. ఇక గీతాంజలిని ఆసక్తికరంగా మార్చే భారం మొత్తం ‘అంజలి’ గురించిన మిస్టీరియస్‌ ఫ్లాష్‌బ్యాక్‌పై పడుతుంది. అదేమో రొటీన్‌ తంతుగా మారింది. ఎలాంటి కొత్తదనం లేని ఒక మామూలు సినిమా అనే సంగతి ఆ ఫ్లాష్‌బ్యాక్‌తో తేలిపోతుంది. క్లయిమాక్స్‌ని ‘ఓం శాంతి ఓం’ తరహాలో కానిచ్చేసి మమ అనిపించేసారు. 

కామెడీ, హారర్‌ ఏదీ సరిగా పండని ఈ చిత్రంలో ఆకట్టుకునే అంశాలు చాలా చాలా తక్కువ. కాసేపు కాలక్షేపమైనా కానీ కేవలం రెండు గంటలే ఉన్న ఈ చిత్రాన్ని ఆసాంతం విసుక్కోకుండా చూడడం అసాధ్యం. నటీనటుల అభినయం, కొన్ని కామెడీ దృశ్యాలు మినహా గీతాంజలికి సంబంధించి స్కోర్‌ చేసినవి ఏమీ లేవు. బ్రహ్మానందం ట్రాక్‌ అయితే బొత్తిగా దండగ అనిపిస్తుంది. విషయం లేని పాత్రలో, అవసరం లేని సన్నివేశాల్లో తన ముద్ర వేయాలని బ్రహ్మానందం విఫలయత్నం చేసాడు. ప్రేమకథా చిత్రమ్‌ లాంటి భయపెట్టే కామెడీ ఇందులో ఉంటుందని వెళితే మాత్రం నిరాశ తప్పదు. అతి తక్కువ బడ్జెట్‌లో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సేఫ్‌ జోన్‌లోకి రావడానికి ఆ తక్కువ ఖర్చే కారణమవ్వాలి. బ్రహ్మానందం తెరపై కనిపిస్తే ఇకిలించేసే వారిని ఈ కామెడీ నవ్వించాలి. కరెంటు పోగానే చీకట్లో ఒక్క క్షణం గడపడానికి గడగడలాడిపోయే వాళ్లే ఈ హారర్‌కి వణికిపోవాలి. గీతాంజలి చూస్తూ కితకితలు పెట్టుకుని నవ్వుకోవాలి.. భూతాలని తలచుకుని భయపడాలి.

బోటమ్‌ లైన్‌: అసలు తక్కువ.. నస ఎక్కువ!

-జి.కె.